మా క్వార్టర్స్ లో, పక్కనే ఉన్న రేడియో స్టేషన్ ఆవరణలోనూ మావిడి చెట్లు ఉండేవి. ఉగాది సమయానికి ఆ చెట్ల నిండా మావిడి పిందెలు కళకళలాడుతూ ఉండేవి. కాస్త ఎక్కువ గాలి వీస్తే కొన్ని పిందెలు రాలిపడిపోతూ ఉండేవి. మా క్వార్టర్స్ లో అందరికీ పనులు చేసిపెట్టే ప్యూన్ ఒకతను ఉండేవాడు. అతను బుజ్జి బుజ్జి మావిడి పిందెలు రాలినప్పుడల్లా ఏరుకొచ్చి అడిగినవాళ్లందరికీ ఇస్తుండేవాడు. అలా మార్కెట్లో పెద్ద మావిడికాయలు వచ్చేదాకా మా ఇంట్లో చిన్న చిన్న మావిడి పిందెలతో ఆవబద్దలు, మెంతిబద్దలు పెడుతూండేది అమ్మ.
మాకు క్రితం వారం మా సంతలో దొరికాయి మావిడి పిందెలు. కొనేసి ఆవబద్దలు పెట్టేసా.
మామూలు టేంపరరీ ఆవబద్దలు పెట్టుకున్నట్లే ఇదీ పెట్టేసుకోవటం --
* మావిడి పిందెలు లోపల జీడి తీసేసి, చిన్నగా తరిగేసుకుని ,
* ఉప్పు, ఆవపొడి, కారం 1:1:1 పాళ్ళలో తీసుకుని,
* నూనె వేసి కలిపేసుకుని,
*అందులో తరిగిన బుల్లి బుల్లి మావిడిపిందెల ముక్కలు కలిపేసుకోవటమే !
*వగరుగా, పుల్లగా, కారంగా ఈ ఆవబద్దల రుచి చాలా బావుంటుంది.