(పైన ఫోటో లోనిది అల్లం చారు. క్రింద వరుసలో ఎనిమిదో రకం.)
అప్పుడెప్పుడో "బ్లాగాడిస్తా" రవిగారు చారు మీద ఒక అద్భుతమైన టపా రాసారు. ఆసక్తిగల బ్లాగ్మిత్రులు "ఇక్కడ"ఓ లుక్కేయండి. అందులో మొదట్లో చారు మీద ఆయన రాసిన శ్లోకం మా నాన్నగారికి ఆయన నాన్నమ్మగారు చెప్పేవారట. నాన్న మాకు చెప్తూ ఉండేవారు. మా ఇంట్లో(పుట్టింట్లో + అత్తవారింట్లో కూడా ) అందరూ సాంబారు ఇష్టంగా తింటారు కానీ ఎక్కువ చారుప్రియులే. ఏపూట కాపూటే వంట. మళ్ళీ రాత్రి భోజనానికి చారు కొత్తగా పెట్టల్సిందే. బొంబాయిలో ఉన్నప్పుడు మా వింగ్ లో అందరూ పొద్దున్నే రెండు పూటలకీ వండేసి, ఇక రాత్రి అన్నం ఒక్కటే వండుకుంటారని తెలిసినప్పుడూ ఆశ్చర్యం వేసేది అలా ఎలా తింటారబ్బా అని. అక్కడ అందరివీ ఉరుకులు పరుగుల జీవితాలు. కొన్ని రాజీలు తప్పవు మరి.
సరే ఇక చారులు.. రకాల్లోకి వచ్చేస్తే ....
నీళ్ళు, చింతపండు, ఉప్పు, చిటికెడు పసుపు, కొత్తిమీర కామన్ పదార్ధాలు. ఇవి కాక చారులో అదనంగా వేసే పదార్ధాలను బట్టి "చారు" రుచి మారుతుంది. గిన్నె నిండా నీళ్ళు పోసి ముప్పావు భాగం ఇంకా కావాలంటే సగ భాగం నీరు ఇగిరేవరకూ ఉంచటమే చారులోని రుచి రహస్యం. నాకు తెలిసిన చారు రకాలు రాస్తున్నాను.
1) చారుపొడి తో చారు :
చారు పొడికి: కందిపప్పు(1 cup), పెసర పప్పు (1/2 cup), ధనియాలు (3/4 cup), జీలకర్ర1 spoon, మిరియాలు1 spoon ఎండలో కాసేపు ఎండబెట్టి మెత్తగా పొడికొట్టుకోవాలి. నీళ్ళు, చింతపండు, ఉప్పు, చిటికెడు పసుపు, కొత్తిమీర మొదలైన కామన్ పదార్ధాలు వేసాకా ఈ చారు పొడి కూడా రెండు చెంచాలు వేసి బాగా మరిగించుకోవాలి.
2)టమాటా చారు : రెండు మూడు టమాటాలు బాగా మెత్తగా గ్రైండ్ చేసేసి జూస్ లాగ నీళ్ళు, ఉప్పు, చిటికెడు పసుపు, కొత్తిమీర మొదలైనవి వేయాలి. టమాటాలు పుల్లగా ఉంటాయి కాబట్టి చింతపండు కొద్దిగానే వేసుకోవాలి. మా అమ్మ అయితే అసలు టమాటా చారు లోకి చింతపండు వేసేది కాదు.
3)మామూలు చారు: అన్నింటిలోకీ ఇది నాకు ఇది ఇష్టం. నీళ్ళు, చింతపండు, ఉప్పు, చిటికెడు పసుపు, కాస్త ధనియాల పొడి, కొత్తిమీర,సగం పచ్చిమెరపకాయ ముక్క,(కావాలంటే ఒక టమాటా) వేసి బాగా మరిగిస్తే ఆ రుచే అద్భుతం. ఏ చారుపొడులో అఖ్ఖర్లేదు. నేనసలు చారు పొడి చెయ్యటం చాలా తక్కువ. నేను ఎక్కువగా ఈ మామూలు చారే పెడతాను. చారులో దండిగా వేసిన కొత్తిమీర అంతా నాక్కావాలి అంటే నాక్కావాలి అని దెబ్బలాడుకునేవాళ్ళం నేనూ మా తమ్ముడూ. ఇప్పుడిక పోటీ లేదు కాబట్టి కొత్తిమీరంతా నాకే. కానీ " ఆకులూ, కాడలూ మనుషులు తినరు" అనే దెప్పుడు మాత్రం వినాల్సివస్తుంది. అంతే..:)
4) మిరియాల చారు: ఫ్రెష్ గా అప్పటికప్పుడు మిరియాలు కొట్టి చేసుకునే మిరియాల చారు(దీని గురించి "పాకవేదం" బ్లాగ్లో కౌటిల్యగారు రాసారు)
5) కందికట్టు: కస్త ఎక్కువ నీళ్ళతో కందిపప్పుని ఓ గిన్నెలో ఉడికించి పైన తేరిన నీళ్లతో పెట్టే చారుని కందికట్టు అంటారు. కుక్కర్లో పెట్టిన కందిపప్పు అయినా గిన్నెలో పైన తేరిన నీటితో చారు కాచవచ్చు. దీనిలో కాస్త ముద్దపప్పు మెత్తగా చేసి కలపుతారు కూడా.
6)పెసరకట్టు: కందిపప్పు బదులు పెసరపప్పు ఉడికిన నీటితో పెట్టే చారు. దీనిలో చింతపండు బదులు నిమ్మకాయ వాడుతూంటారు.
7) ములక్కాడ చారు: దీనిలో మామూలు చారులో వేసే అన్ని పదార్ధాలు వేసి, ఒకటి లేక రెండు ములక్కాడ ముక్కలు కట్ చేసి వేసి ఉడికించే చారు. ములక్కడ ఉడకటానికి టైం పడుతుంది కాబట్టి నేనైతే బుల్లి కుక్కర్లో ఒక్క విజిల్ రాగానే తీసేసి చారులో వేస్తాను. ఒకటి కంటే ఎక్కువ విజిల్స్ రానిస్తే ములక్కాడ ముక్కలు రూపాన్ని కోల్పోయి ముద్దయిపోతాయి...:)
ముఖ్య గమనిక: ఈ చారులన్నింటికీ పోపు చాలా ముఖ్యమైనది. అది కూడా నేతి పోపు పెట్టుకుంటే ఆ రుచే వేరు. చెంచాడు నెయ్యిలో ఆవాలు, జీలకర్ర, మెంతులు వేగాకా ఇంగువ ,కర్వేపాకు వేసుకుని అది మరిగే చారులో వేసేయాలి. అమ్మయితే గరిట కూడా చారులో ముంచేసేది. చూయ్.. మని భలే శబ్దం వచ్చేది. పోపు ముందర పెట్టి తరువాత నీళ్ళు పోసి చారు కాచితే పోపు మెత్తబడిపోయి ఫ్రెష్నెస్ పోతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా చారు బాగా మరిగాకానే పోపు పెట్టుకొనవలెను.
8) ఇక చింతపండు వెయ్యని మరో రకం చారు "అల్లం చారు". పైన ఫోటో లోనిది. దీనినే "నిమ్మకాయ చారు" అని కూడా అంటాము. నాన్నవాళ్ళు చదువుకునే రోజుల్లో మద్రాసు హాస్టల్లో "ఇంజి(అల్లం) రసం" అని చేసేవారట. ఆ రెసిపీ చెప్పి అమ్మకి నేర్పించారు. నేను ఎక్కువగా చేసే ఈ అల్లం చారు ఎలా చెయ్యాలంటే:
* ముందుగా రెండు అంగుళాల అల్లాన్ని తొక్కు తీసి, సన్నగా పొడుగ్గా ముక్కలు తరుక్కోవాలి.
* తరువాత ఒక మీడియం కప్పు పెసరపప్పు కడిగి రెండు కప్పుల నీరు పోసి,చిటికెడు పసుపు వేసి కుక్కర్లో ఉడుకించాలి. అందులోనే మరీ చిన్న గిన్నెలో ఈ అల్లం ముక్కలు వేసి కాసిని నీళ్ళు పొయ్యాలి. పప్పులో కలిపి పెట్టినా, విడిగా పెట్టినప్పుడు ఎక్కువ నీరు పోసినా అల్లం ముక్కలు పేస్ట్ అయిపోతాయి. (అలా కాకూడదంటే విడిగా గిన్నెలో ఉడికించుకోవటమే.)
* కుక్కర్లోంచి తీసాకా పెసరపప్పు ని పప్పు కనబడకుండా మెత్తగా మేష్ చేసుకోవాలి. కుక్కర్లో పెట్టేప్పుడు పసుపు వేసాం కాబట్టి ఉడికిన పప్పు మంచి రంగులో చూడ్డానికి బాగుంటుంది.
* మెత్తగా చేసిన పెసరపప్పుకి ఒక అర లీటర్ గానీ మరికొన్ని ఎక్కువగానీ నీళ్ళు పోసి, ఉడికిన అల్లం ముక్కలు, ఉప్పు వేసి బాగా మరిగించాలి. తరువాత ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంగువ, కర్వేపాకు వేసి పోపు పెట్టాలి. స్టౌ ఆపేసాకా ఒక అరచెక్క నిమ్మరసం పిండాలి. ఇది సూప్ లాగ తాగేయచ్చు కూడా. మధ్య మధ్య ఉడికిన అల్లం ముక్కలు తగుల్తూంటే భలే ఉంటుంది. అల్లం ఇష్టమైనవాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది.
9) ఉలవ చారు: ఇది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. కానీ నేనెప్పుడూ తినలేదు. చెయ్యలేదు...:) (ఎవరికైనా తెలిస్తే చెప్పండి)
ఉలవలు నానబెట్టి, ఉడికించి,fresh కొబ్బరికోరు వేసి , పోపు వేసి చాట్ లాగ తినొచ్చు. అప్పుడప్పుడు ఇదైతే చేస్తూంటాను.
10)పప్పు చారు: ఇది చాలా ఫేమస్సు. మామూలు చారులో(item.no.3)నే కొంచెం ఎక్కువ మోతాదులో పప్పు వేసి చేసేదాన్ని పప్పు చారు అంటారు. పొద్దున్న మిగిలిన పప్పుతో రాత్రికి అమ్మ పప్పుచారు పెట్టేసిన సందర్భాలెన్నో...ఇప్పుడు నేను చేసేదీ అదే మరి...:)
కొసమెరుపు:ఇక ఈ చారుల్లో తీపి సంగతి: మా అమ్మ అయితే చారులో పంచదార వేసేది. అలవాటు ప్రకారం పెళ్ళయ్యాకా అత్తవారింట్లో మొదటిరోజు వంటచేసినప్పుడు చారు తిని మా మరిది ఇది చారా పానకమా? అని అడిగాడు. వాళ్ళసలు చారులొ తీపి వేసుకోరని తెలిసి నేను అవాక్కయ్యాను...ఇప్పుడిక అలవాటైపోయింది...:) కానీ అప్పుడప్పుడు కాస్త బెల్లం ముక్క వేస్తూంటాను తెలిసీ తెలియకుండా.
ఇవండీ నాకు తెలిసిన చారులు. మీకింకేమైనా రకాలు తెలిస్తే చెప్పగలరు.