చాలా కాలం నాకు జీరా రైస్ పెద్దగా నచ్చేది కాదు. ఒట్టి అన్నంలో జీలకర్ర వేసుకుని ఏం తింటాం? అదేమన్నా బిరియానీనా? అని తేలిగ్గా తీసిపారేసేదాన్ని. కానీ జీలకర్ర ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసుకున్నాకా ఈ మధ్యన ఎక్కువగా వండుతున్నా.
జీలకర్రలో కొన్ని ముఖ్య గుణాలు: అరుగుదలకి మంచిది, అజీర్ణాన్ని తగ్గిస్తుంది, ఆకలిని పెంచుతుంది, రక్తాన్ని శుధ్ధి చెయ్యగలదు, పాలిచ్చే తల్లులకి మంచిది. ఇవన్నీ తెలిసాకా రోజూ వండే కూరల్లో కూడా ఓ అరచెంచా జీలకర్ర పొడి వెయ్యడం మొదలెట్టా. పోపు కూరల్లో ఎలానూ జీలకర్ర వేస్తాం కదా, అదేమో క్వాంటిటీ కాస్త ఎక్కువ చేసా :-)
నేను చేసే జీరా రైస్ విధానం:
* పావుకేజీ బాస్మతీ రైస్(మామూలు అన్నంతో కూడా వండుకోవచ్చు) కుక్కర్లో ఉడికించాలి. ఒక గ్లాసు బాస్మతీ బియ్యం అయితే గ్లాసున్నర నీళ్ళు పోసి కుక్కర్లో పెట్టచ్చు. బియ్యం ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండేట్లయితే సమానం లేదా గ్లాసుంపావు నీళ్ళు సరిపోతాయి.
* అన్నం అయ్యాకా మూత తీసి కాసేపు బయట పెడితే చల్లరి పొడిగా అవుతుంది.
* మూకుడులో రెండు చెంచాల నెయ్యి వేసి రెండుచెంచాల జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, రెండు చితక్కొట్టిన వెల్లుల్లి, ఐదారు బరగ్గా పొడికొట్టిన మిరియాలు, ఐదారు జీడిపప్పు పలుకులు, కావాలంటే రెండు పచ్చిమిరపకాయలు వేసి పోపు వేయించాలి.
* ఉల్లిపాయలు కాస్త వేగాకా ఉడికిన బాస్మతీ రైస్ తెచ్చి వేగిన జీలకర్ర మిశ్రమంలో వేసి, బాగా కలపాలి.
* చెంచాన్నర లేదా తగినంత ఉప్పు వేసి మరో రెండు నిమిషాలు ఉంచి స్టౌ ఆపేయాలి.
* ఇందులోకి సైడ్ డిష్ క్రింద కూరలు చెసేకన్నా టమాటా పప్పు లేదా ఏదైనా వేరే ఏదైనా పప్పు కాస్ట స్పైసీగా చేసి జీరా రైస్ తో పాటూ సర్వ్ చేస్తే బావుంటుంది. క్రింద ఫోటో లోది టమాటా పప్పు.
* కొందరు జీలకర్ర బదులు 'షాజీరా' వాడతారు. షాజీరా కి సువాసన ఎక్కువగా ఉంటుంది కానీ మామూలు జీలకర్రతో చేస్తేనే రుచి బావుంటుంది అనిపిస్తుంది నాకు.
* కొంతమంది ఉల్లిపాయ,వెల్లుల్లి వెయ్యరు. జీలకర్ర తో పాటూ బిరియాని ఆకు లేదా దాల్చిన చెక్క కలిపి వేయిస్తారు. మసాలా ఐటెంస్ ఆప్షనల్ కానీ జీరా రైస్ ఎంత ప్లైన్ గా ఉంటే అంత రుచిగా ఉంటుంది.
* కొంతమంది ఉల్లిపాయ,వెల్లుల్లి వెయ్యరు. జీలకర్ర తో పాటూ బిరియాని ఆకు లేదా దాల్చిన చెక్క కలిపి వేయిస్తారు. మసాలా ఐటెంస్ ఆప్షనల్ కానీ జీరా రైస్ ఎంత ప్లైన్ గా ఉంటే అంత రుచిగా ఉంటుంది.
* నెయ్య వద్దనుకుంటే 1 sp.నూనె కూడా వేయచ్చు. అప్పుడు సర్వ్ చేసే ముందు రైస్ ప్లేట్ లో అరచెంచా నెయ్యి కలిపి ఇస్తే బావుంటుంది.