skip to main | skip to sidebar

Pages

  • Home

రుచి...the temptation

"The best way to a man's heart is through his stomach."
Showing posts with label tiffins. Show all posts
Showing posts with label tiffins. Show all posts

Veg.Hakka Noodles

3:10 PM | Publish by తృష్ణ


మ్యాగీ మంచిది కాదు, వద్దు... అని వింటున్నా అప్పుడప్పుడు నెలకొకసారి తినేలా ఒక పేకెట్ కొనేదాన్ని మా పాప కోసం. వెజ్ ఆటా నూడుల్స్, ఓట్స్ నూడుల్స్ అంటూ ఏ రకం కొన్నా అవన్నీ కూడా మంచివి కాదనే ఆర్టికల్ ఒకటి చదివాకా, రెండేళ్ళుగా మ్యాగీ అనేది పూర్తిగా కొనడం మానేసి ప్లైన్(ఎగ్ లెస్)  నూడుల్స్ కొని పాపకు చేసి పెడుతున్నాను. మ్యాగీ కన్నా బెటర్ అయినా అది కూడా నెలకు ఓ రెండు సార్లు చేస్తాను. ఆ మధ్యన ఓ సూపర్ మార్కెట్లో ప్లైన్ న్మూడుల్స్ అడిగితే Veg.Hakka Noodles పేకెట్ ఇచ్చారు అదే ఉందని. 


ఈ నూడుల్స్ ప్లైన్ వాటి కంటే కాస్త లావుగా ఉంటాయంతే. టేస్ట్ కూడా వాటికన్నా ఇంకొంచెం బావున్నాయి. ప్లైన్ నుడుల్స్ తో కూడా తయారీకి క్రింద రాసిన సేం ప్రొసీజర్ ఫాలో అయిపోవచ్చు..

తయారీ:
* ముందు నూడుల్స్ మూడు రెట్లు నీళ్లలో తగినంత ఉప్పు వేసి ఉడకపెట్టి, స్ట్రైనర్ లో వార్చేసి, ఒక చెంచా నూనె వేసి కలిపి పక్కన ఉంచాలి.




* తర్వాత కూర ముక్కలు తరుక్కోవాలి. (ఇలాగని కాదు ఏ ఆకారంలో అయినా తరుక్కోవచ్చు :))



* ఫ్రైయింగ్ పేన్ లో ఒక చెంచా నూనె వేసి కూర ముక్కలు, తగినంత ఉప్పు వేసి మూత పెట్టేస్తే, ఐదు నిమిషాల్లో మగ్గిపోతాయి. (ఉప్పువల్ల ముక్కలు మెత్తబడి త్వరగా మగ్గుతాయి..i.e ఉడుకుతాయి)
* తర్వాత కూర ముక్కల్లో అరచెంచా వైట్ పెప్పర్(white pepper), ఒక చెంచా(medium spoon) సోయా సాస్ (soya sauce) వేసి రెండు, మూడు నిమిషాల తర్వాత ఉడికించి ఉంచిన నూడుల్స్ అందులో వేసి, నూడుల్స్ బ్రేక్ అవకుండా చెక్క గరిటెతో బాగా కలపాలి. 
* ఫ్రైయింగ్ పేన్ హేండిల్ పట్టుకుని కదిపినప్పుడు స్టిక్కీగా కాకుండా నూడుల్స్ పైకీ కిందకీ కదిలేలా ఉంటే బాగా కుదిరినట్లు.


* అన్నీ బాగా కలిసాయి అనిపించాకా, ఉప్పు చెక్ చేసి స్టౌ ఆపేయాలి.
* చివర్లో తినేవాళ్ల ఇష్టాన్ని బట్టి కాస్త టమాటో సాస్ వేసి సర్వ్ చెయ్యడమే.

Labels: snacks n sweets, tiffins

జొన్న మొలకల ఉప్మా (Upma with Sprouted jowar)

8:49 AM | Publish by తృష్ణ



నిన్న రాత్రి మొదటిసారి చేసిన ఈ ప్రయోగానికి ఏం పేరు పేట్టాలో అని ఆలోచిస్తే.. 'జొన్న మొలకల ఉప్మా' అనచ్చేమో అనిపించింది.
జొన్నలని(Jowar) ఒకపూటంతా(6,7hrs) నానబెట్టి, నీళ్ళు తీసేసి, రాత్రికి పల్చటి కాటన్ బట్టలో మూట కట్టచ్చు.. లేదా బాగా డ్రైగా చేసేసి ఏదైనా గిన్నె/బాక్స్ లో వేసి మూత పెడితే పొద్దుటికి మొలకలు వచ్చేస్తాయి. పెసలైనా, బొబ్బర్లైనా మొలకెత్తించడానికి ఇదే పధ్ధతి. ఒకవేళ రాత్రికి నానబెడితే పొద్దున్నే డ్రైగా మూట కట్టేస్తే సాయంత్రానికి స్ప్రౌట్స్ వచ్చేస్తాయి. మరనాటిదాకా ఉంచితే ఇంకా ఎక్కువ మొలకలు వస్తాయి.

ఇదివరకూ సజ్జలు(Bajra), రాగులు(ragi) మొలకెత్తించి వాడాను కానీ జొన్నలు ఇదే మొలకెత్తించడం. ఏదో ఒక టిఫిన్ + రాగి మజ్జిగ నా రాత్రి భోజనం మెనూ. ఇడ్లీ, దోశలాంటి రొటీన్ టిఫిన్స్ వరుస అయిపోయాకా, రకరకాల కొత్త టిఫిన్ ప్రయోగాలు చేసుకుంటూ ఉంటాను. జొన్నలతో సరదాగా కొత్త రకం ఏదైనా చెద్దామని మనసై మొన్న రాత్రి జొన్నలు నానబెట్టాను. నిన్న పొద్దున్నే నీళ్ళు తీసేసి ఓ గిన్నెలో వేసి మూతపెట్టాను. రాత్రికి మొలకలు వచ్చాయి. 


జొన్న మొలకల ఉప్మా తయారీ:
* ముందర జొన్నలు కుక్కర్లో ఐదారు విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి. (జొన్నన్నం ఇలానే వండుతారేమో!) వీటితో సంతోషకరమైనదేమిటంటే ఎక్కువ విజిల్స్ వచ్చినా పేస్ట్ అవ్వవు ఇవి :) సుమారు 100gms జొన్నలకి  300ml నీళ్ళు + తగినంత ఉప్పు వేసి ఉడికించాలి. కుక్కర్ ఓపెన్ చేసాకా జొన్నలతో పాటూ మిగిలి ఉన్న నీళ్ళు పారబొయ్యకుండా ఉంచాలి.

* ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు తరిగి, ఉప్మా కి లానే మినపప్పు,శనగపప్పు,ఆవాలు, జీలకర్ర, మిర్చి, కర్వేపాకు పోపు వేయించి, అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఐదు నిమిషాలు వేయించాలి. 

*ఎదురుగా అప్పుడే మార్కెట్ నుండి తెచ్చిన fresh green peas కనిపిస్తే అవి ఓ నాలుగు వలిచి ఉల్లిపాయ ముక్కల్లో పడేసా. ఓ కేరెట్ కూడా తరిగి వేసా.(కేరెట్ గ్రేట్ చేసేసుకోవచ్చు.వేయించకపోయినా పర్వాలేదు)

* ఇప్పుడూ ఉడికిన జొన్న మొలకలను ఈ ఉల్లిపాయముక్కల పోపులో పడేయాలి, నీళ్ళతో సహా. ఉప్పు చెక్ చేసి కావాలిస్తే కలిపి, చిటికెడు పసుపు వెయ్యాలి. కాసేపటికి నీళ్ళు ఇగిరిపోతాయి. 

* ఉప్మా దగ్గర పడ్డాకా దింపేసుకుని నాలుగు కొత్తిమీర ఆకులు అలంకరించి, ఒక అరచెక్క నిమ్మరసం పిండేసి తినేయడమే..!


ఈ రెసిపీ కాస్త పళ్ళకి పెద్ద పనే కానీ టేస్టీగా ఉంది.
ఇవాళ పొద్దున్నకి నేను బానే ఉన్నా కాబట్టీ.. కొత్తరకాలు ఇష్టపడేవారు ట్రై చేయచ్చు..:)

టిప్:
ఉప్మాలోకి ఉల్లిపాయలతో పాటూ టమాటా ముక్కలు వాడితే నిమ్మరసం అక్కర్లేదేమో! నే టమాటా వాడలేదు. నెక్స్ట్ టైం ట్రై చేస్తా.

Labels: experiments, pulses, tiffins 2 comments

మసాలా గారె with సంబార్!

9:08 AM | Publish by తృష్ణ




వీకెండ్స్ లో గానీ, కాస్త తీరుబడిగా ఉన్నప్పుడు గానీ హెవీ టిఫెన్స్ ట్రై చేస్తూ ఉంటాం కదా.. సాంబార్ ఇడ్లీ బదులు సాంబార్ గారె చేస్తే ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. ఏమంటారు?

 గారెలు వేసే మినప్పిండిలో కాస్త అల్లం,పచ్చిమిరపకాయలు కలిపితే మసాలా గారెలు అయిపోతాయి కదా!

* ఎంత క్వాంటిటీకి అంటే 250gms మినపప్పుకి పది పన్నెండు పచ్చిమిరపకాయలు, రెండంగుళాల అల్లం సరిపోతుంది.

* అందులో తోటకూర ఇష్టం ఉంటే, కడిగి, సన్నగా తరిగిన రెండు కట్టలు తోటకూర తరుగు కూడా కలపచ్చు.

* మినపప్పు ఒక గంట,గంటన్నర నానితే చాలు గారెలు నూనె పీల్చుకోవు.

* సాంబార్ మామూలుగా చేసేసి అందులో వేడి వేడి గారెలు వేసేస్తే మసాలా గారె with సంబార్ రెడీ :)


టిప్:
* మినపప్పు రుబ్బేప్పుడు పొరపాటున ఎక్కువ నీళ్ళు తగిలి పిండి పల్చన అయిపోతే గారెలు నూనె పీల్చేస్తాయి + రౌండ్ గా రావు. అలాంటప్పుడు పిండిలో కాస్త bajra flour అంటే సజ్జ పిండి కలిపితే పిండి గట్టిపడుతుంది.


* ఇంట్లో సాంబార్ పొడి చేసుకునే విధానం రాసిన పోస్ట్ లింక్:
http://ruchi-thetemptation.blogspot.in/2011/03/blog-post_23.html

Labels: tiffins 2 comments

అడై దోశ (Adai dosa)

5:12 PM | Publish by తృష్ణ





'అడై' తమిళనాట బాగా ఫేమస్సు! ఊతప్పం లాగనే 'అడై' కూడా కాస్త మందంగా ఉంటుంది కానీ అడై పిండితో దోశ కూడా వేయచ్చు. మందంగా కాకుండా మామూలు దోశలా ఉండి. టేస్ట్ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.

కావాల్సినవి:

మామూలు బియ్యం లేదా ఉప్పుడు బియ్యం: 11/2 cup
మినపప్పు :1/2 cup (వెయ్యకపోయినా పర్లేదు. ఇది నా సొంత ఆప్షన్ :))
పెసరపప్పు: 1/2 cup
శనగపప్పు: 1/2 cup
కందిపప్పు: 1/2 cup
రెండు మూడు ఎండు మిరపకాయలు లేదా పచ్చిమిరపకాయలు
పావు చెంచా ఇంగువ
అర చెంచా మెంతులు
రెండు కేరెట్లు: తురిమినవి
రెండు ఉల్లిపాయలు: సన్నగా తరిగినవి
అంగుళం అల్లం ముక్క
చిన్న కట్ట కొత్తిమీర


తయారీ: 
* ముందుగా బియ్యం, పప్పులన్నీ + మెంతులు ఓమాటు కడిగి, రెండు మూడు గంటలు నానబెట్టాలి.

* నానిన పప్పులన్నీ మెత్తగా రుబ్బుకోవాలి. 

* ఎండుమిర్చి వేయాలంటే పప్పులతో పాటే నానబెట్టేసి రుబ్బేయాలి. పచ్చిమిరపకాయలైతే డైరెక్ట్ గా నానిన పప్పులతో కలిపి రుబ్బచ్చు. (నేను పచ్చిమిరపకాయలు వేసాను)

* రుబ్బిన పిండిలో ఉప్పు , ఇంగువ, కేరెట్ తురుము, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలపాలి.

* పెనం కాలాకా దోశలాగ వేసి బాగా కాలనిచ్చి రెండో వైపుకి తిప్పాలి. మామూలు దోశ కన్నా కాస్త ఎక్కువ సేపు కాలాలి ఇది. అడై దోశ ఎంత రో్స్ట్ అయితే అంత రుచి. బటర్ తో కాలిస్తే ఇంకా రుచిగా ఉంటాయి ఈ దోశలు :)







* ఉల్లిపాయ ముక్కలు కూడా కలిపేసి ఊతప్పం లాగ మందంగా వేసుకోవచ్చు. ఇలా..



* ఉల్లిపాయ ముక్కలు కేరెట్ కోరులాగ దోశ పిండిలో కలపేయకుండా దోశ వేసాకా పైన చల్లాలి. అలా అయితే దోశ సన్నగా వస్తుంది. ఉల్లిపాయముక్కలు వేసేస్తే పిండి రౌండ్ గా స్ప్రెడ్ చేసేప్పుడు అవి ఆడ్డం వచ్చేస్తాయి. 

* ఇందులోకి అల్లం, కొబ్బరి, పచ్చిటమాటా మొదలైన చట్నీలు బావుంటాయి. పైన ఫోటోలోది పల్లీలు+కొత్తిమీర కలిపి చేసిన చట్నీ.

Labels: chutneys n పచ్చడ్స్, tiffins, దోశలు రకాలు 11 comments

రవ్వ దోశ ! కొంచెం మార్పుతో..

5:15 PM | Publish by తృష్ణ


with wheat atta

మామూలుగా రవ్వదోశ బొంబాయి రవ్వ, బియ్యప్పిండి, మైదాపిండి కలిపి చేస్తాం కదా. కానీ 'మైదా' వాడకం మంచిది కాదంటున్నారని దానికి alternative ఏం వేస్తే బాగుంటుందా... అని ఆలోచించి మైదా బదులుగా జొన్న పిండి ఒకసారి, గోధుమపిండి ఒకసారి కలిపాను. రెండు ప్రయత్నాలు బాగున్నాయి. ఇంక రెసిపీ అలానే ఫాలో అయిపోతున్నాను. మైదా మానెయ్యదలుచుకున్నవాళ్ళు ఇది కూడా ప్రయత్నించి చూడండి..

మామూలుగా రవ్వదోశకి కావల్సినవి:
బియ్యప్పిండి : ఒక గ్లాసు
మైదా : 3/4 గ్లాసు
బొంబాయి రవ్వ : ఒక గ్లాసు
కాస్త పుల్ల మజ్జిగ : రెండు గ్లాసులు
అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు,
తురిమిన కేరెట్
జీలకర్ర ఒక చెంచా, 1/4 spoon ఇంగువ



తయారీ:
* బియ్యప్పిండి, మైదా, రవ్వ మూడూ చిలికిన మజ్జిగలో కలిపేసి, జీలకర్ర, 1/4 spoon ఇంగువ, తగినంత ఉప్పువేసి ఓ అరగంట అయినా నాననివ్వాలి. 

* దోశలు వేసే ముందర పిండి గట్టిగా అనిపిస్తే మరిన్ని నీళ్ళు పోసి పిండి బాగా జారుగా చేసుకోవాలి.

* పల్చగా ఉన్న పిండి, పెనం మీద దోశ వేసాకా ఇంక కదపలేము కాబట్టీ వేసేప్పుడే జాగ్రత్తగా వేసుకోవాలి.

* మామూలు దోశ మధ్యలో పిండి వేసి గరిటతో గుండ్రంగా తిప్పుతూ వస్తాము కదా, ఇదేమో పెన మంచుల నుండి గుండ్రంగా పిండి పోసుకుంటూ మధ్యకు రావాలి.







with maida


జొన్నపిండి కలిపిన రవ్వదోశ:
పై పాళ్ళన్నీ అలానే మైదా బదులు జొన్నపిండి కలపడం .అంతే!
 with jowar atta


గోధుమపిండీ కలిపిన రవ్వదోశ: 
మైదా బదులు గోధుమపిండి.. కానీ కాస్త పాళ్ళు తేడా.
 ఇక్కడ: బొంబాయి రవ్వ : 3/4 గ్లాసు 
గోధుమ పిండి : 3/4 గ్లాసు 
బియ్యప్పిండి : ఒక గ్లాసు 
మిగిలినవన్ని పైన చెప్పినవే. 

with wheat atta


టిప్స్: 

* రవ్వ దోశలు వేసే ముందర ఓ గుప్పెడి బొంబాయి రవ్వ పిండిలో కలిపితే దోశలు క్రిస్పీగా వస్తాయి.
* దోశ వేసే ముందర పెనం మీద ఉల్లిపాయ ముక్కలు, అల్లం, మిర్చి వేసేసుకుంటే వెనకవైపు తిప్పి కాల్చినప్పుడు  ఉల్లిపాయ ముక్కలు మాడవు.
* అల్లo తురిమి పిండిలో కలిపేసుకోవచ్చు.
* కేరెట్ అట్టు తీసే ముందర పైన చల్లుకుంటే తురుము మాడకుండా ఉంటుంది.

* మజ్జిగ ఇష్టం లేకపోతే నీళ్ళతో కూడా రవ్వదోశలపిండి కలుపుకోవచ్చు కానీ అర కప్పు మజ్జిగ అయినా కలిపితే రుచి బాగుంటుంది.

Labels: tiffins, దోశలు రకాలు 3 comments

దిబ్బ రొట్టె

7:36 PM | Publish by తృష్ణ




పై ఫొటో లోది సన్నగా పెనంపై ఎక్కువ నూనె వెయ్యకుండా కాల్చాను కానీ అసలు దిబ్బరొట్టె అంటే మూకుడులో గానీ మందపాటి ఇత్తడి గిన్నెలో గానీ మందంగా పిండి వేసి రొట్టె ఇంత లావున వచ్చేలా రెందువైపులా ఎర్రగా కాలుస్తారు. మామూలుగా మినపట్టులో మినపప్పు, ఇడ్లీ రవ్వ వేసి కాలుస్తాం కదా, దిబ్బరొట్టె లో ఇడ్లి రవ్వకు బదులుగా బియ్యం రవ్వ వాడతారు. ఉండ్రాళ్ళకు వాడే బియ్యం రవ్వ అన్నమాట. అందువల్ల రొట్టె బాగా పెచ్చుకట్టి కరకరలాడుతూ ఉంటుంది. దీనిలో ఎంత నూనె పోస్తే అంత రుచి..:)


చిన్నప్పుడు మా ఇంట్లో పెద్ద ఇనప ముకుడు ఒకటి ఉండేది అందులో ఇంత లావున మందంగా దిబ్బ రొట్టే వేసి అది నాలుగు ముక్కలు చెసి నలుగురికీ పెట్టేది అమ్మ. అంటే చిన్న చిన్నది నాలుగైదు కాకుండా ఒకే ఒక్కటన్నమాట! ఎర్రగా కాలిన ఆ పెచ్చు నాక్కావాలంటే నాక్కావాలి అని దెబ్బలాడుకుంటూ పెచ్చు తినేసి మధ్యలో ఉన్న భాగాన్ని వదిలేసేవాళ్లం..:)

దిబ్బరొట్టె కు కావాల్సినవి:
* ఒక గ్లాసు మినపప్పు
* రెండు గ్లాసులు బియ్యం రవ్వ(rice rawa)
* తగినంత ఉప్పు
* రొట్టె కాల్చటానికి మూడు నాలుగు చెంచాల నూనె

తయారీ:
* మినపప్పు ఇడ్లీ కి లాగానే మూడు నాలుగు గంటలు నానబెట్టుకుని మెత్తగా గ్రైండ్ చెయ్యాలి.
*  బియ్యం రవ్వ కూడా అలానే నానబెట్టి, గ్రైండ్ చేసిన మినప్పిండిలో ఇడ్లీ పిండి లాగ కలిపేసుకోవాలి.
* మూకుడులో రెండు చెంచాల నూనె వేసి నాలుగైదు గరిటెల పిండి వేసి మూత పెట్టేయాలి.
* మాడకుండా మధ్య మధ్య చూసుకుంటూ ఒక వైపు వేగాకా మరో వైపు తిప్పుకుని మరో చెంచా నూనె వెయ్యాలి.
* రెండు వైపులా ఎర్రగా కాలాగా దింపేసుకోవాలి.
* ఇది చల్లారిపోతే మెత్తబదిపోతుంది. వేడి మీద కరకరలాడుతుంటే రుచి అద్భుతంగా ఉంటుంది.
* కొబ్బరి పచ్చడి, టమాటా చట్నీ దేనితోనైనా దిబ్బరొట్టె తినచ్చు. కొందరు తేనె వేసుకుని కూడా తింటారు.

* మినపప్పు రుబ్బేప్పుడు కొంతమంది మిరియాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి గ్రైండ్ చేస్తారు. కారమని నేనెప్పుడూ ట్రై చెయ్యలే..:)

Labels: tiffins, అట్లు - రకాలు 7 comments

జొన్నదోశలు (jowar dosa)

10:52 AM | Publish by తృష్ణ





బియ్యం లేకుండా ఎన్ని రకాల దోశలు చేయచ్చా అన్ని రకాలూ ప్రయోగాలు చేస్తున్నా నేను. మొన్నొకరోజున సజ్జలతో దోశలు  చెప్పా కదా.. ఇవాళ జొన్న దోశల రెసిపీ చెప్పుకుందాం. సజ్జ దోశల కన్నా ఈ జొన్నదోశలు నాకు బాగా నచ్చాయి. బజార్లో జొన్నపిండి కాక జొన్నలు కూడా దొరుకుతాయి. ఇవి కాస్త కాస్త చప్పునే కొనుక్కోవాలి. (మాక్సిమం కేజీ) ఎక్కువగా కొనుక్కుంటే పురుగుపట్టి పాడయిపోతాయి.(అనుభవసారం:))

కావాల్సినవి:
జొన్నలు : ఒక పెద్ద గ్లాసు
మినప గుళ్ళు: అర గ్లాసు (పైన చెప్పిన క్వాంటిటీలో సగం)
చెంచా మెంతులు

తయారీ:
* వేడిచేసిన రెండుగ్లాసుల నీటిలో జొన్నలు నానబెట్టాలి.

* విడిగా మినపప్పు, మెంతులు పెద్ద గ్లాసుడు నీళ్లలో నానబెట్టాలి.

* 5 గంటల పాటు జొన్నలు,మినపప్పు నానాకా మెత్తగా రుబ్బుకోవాలి. పైన చెప్పిన క్వాంటిటి అయితే వెట్ గ్రైండర్ లో తిరుగుతాయి.

* జొన్నలు బాగా నలగటానికి మామూలు దోశ పిండి కన్నా కాస్త ఎక్కువసేపు పడుతుంది. అందుకే వెచ్చని నీటిలో నానబెట్టడం.

* రుబ్బిన పిండిలో తగినంత ఉప్పు కలుపుకుని కావాలంటే అరగ్లాసు నీళ్ళు కలిపి బాగా కలుపుకోవాలి.

* ఈ పిండితో ఫ్రెష్ గా అప్పటికప్పుడు దోశలు వేసుకోవచ్చు. లేదా రాత్రంతా బయట ఉంచేసి(ఫ్రిజ్ లో పెట్టకుండా) పొద్దున్నే దోశలు వేసుకోవచ్చు.


 ** పిండిలోబియ్యం కలపము కాబట్టి డైటింగ్ చేసేవాళ్ళు ఓ దోశ ఎక్కువ కూడా తినచ్చు.



Labels: tiffins, దోశలు రకాలు 6 comments

సజ్జలతో(bajra / Pearl millet) ఇడ్లీ + దోశ

11:13 AM | Publish by తృష్ణ



 ఇడ్లీ, దోశ ఈ రెండింటిలో మనకి బియ్యం ఎక్కువగా ఉంటుంది. బియ్యం ఎంత తక్కువ తింటే అంత మంచిది అని అంటున్నారు కదా డాక్టర్లు. మరి బియ్యానికి ప్రత్నామ్యాయం ఏమిటి? అంటే - చిరుధాన్యాలు. చిరుధాన్యాల గురించి గతంలో చెప్పుకున్నాం కదా. కొన్ని రెసిపిలు కూడా చెప్పాను. జొన్న రవ్వ ఉప్మా , రాగి పూరీలు  , మిక్స్డ్ రవ్వ ఉప్మా, రాగి సేమ్యాతో ఉప్మా  మొదలైనవి.

ఇవాళ సజ్జలతో ఇడ్లీ, దోశ ఎలానో చెపుకుందామేం. ఇప్పుడు చెప్పబోయే సజ్జపిండిలో ప్రత్యేకత ఏంటంటే ఒకే పిండితో మనం ఇడ్లీ, దోశ కూడా చేసుకోవచ్చు. ముందర ఈ సజ్జపిండి గురించి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం:

సజ్జ పిండికి కావాల్సినవి:


* ఒక గ్లాసుడు సజ్జలు/సజ్జ రవ్వ
* పావు గ్లాసు మినపగుళ్ళు
* పావు గ్లాసు అటుకులు

1) ఒక గిన్నెలో గ్లాసుడు శుభ్రంగా ఏరిన సజ్జలు లేదా సజ్జరవ్వ (ఇది కూడా జొన్న రవ్వలాగ దొరుకుతుంది) రెండుగ్లాసులు మంచినీళ్లలో నానబెట్టాలి. సజ్జలు నానబెట్టే నీళ్ళు కాస్త వేడి చేస్తే త్వరగా నానతాయి.
2) మరో గిన్నెలో పావు గ్లాసు మినపగుళ్ళు అరగ్లాసు మంచినీళ్లలో నానబెట్టాలి.
౩)ఈ రెండూ కూడా ఒక నాలుగైదు గంటలు నానాలి.
4) గ్రైండ్ చెయ్యటానికి పది నిమిషాల ముందు పావు గ్లాసు అటుకులు పావు గ్లాసు నీటిలో నానబెట్టాలి.
5) మొత్తం కలిపి గ్రైండర్ లో మెత్తగా రుబ్బుకోవాలి. ఇంక నీళ్ళు ఎక్కువ పొయ్యకూడదు.

గట్టిగా కాక ,మరీ మెత్తగా కాక సజ్జ పిండి రెడీ అవుతుంది. అప్పుడు ఉప్పు కలుపుకోవాలి.



సజ్జదోశలు:


* దోశ కావాలంటే అప్పటికప్పుడు వేసుకోవచ్చు.  లేదా పిండి రాత్రంతా బయటే ఉంచి ఫెర్మెంట్ అయ్యాకా పొద్దుటే వేసుకోవచ్చు.

* పెనంపై దోశ సన్నగా పోస్తే కాస్త క్రిస్పి గానే ఉంటాయీ దోశలు.






* పెనంపై కాస్త మందంగా వేసుకుని, నూనె వెయ్యకుండా మూత పెట్టి, స్టీం దోశ లాగ కూడా వేసుకోవచ్చు ఈ పిండితో.



సజ్జ ఇడ్లీ:

* ఇడ్లీకయితే రాత్రి పిండి రుబ్బుకుని పొద్దుటిదాకా ఫెర్మెంట్ అవ్వటానికి అట్టేబెట్టి పొద్దుటే వేసుకుంటే బాగుంటాయి ఇడ్లీలు. నేను పిండి రుబ్బగానే దోశతో పాటే ఒక ప్లేట్ ఇడ్లీ కూడా వేసి చూసాను. బానే వచ్చాయి.

* రవ్వ ఉండదు కాబట్టి ఈ ఇడ్లీలు బాగా మెత్తగా ఉంటాయి. వేడిగా తింటే రుచి బాగుంటుంది.



టిప్స్:

* ఏ రకమైన ఇడ్లి అయినా ఇడ్లీ వేసేప్పుడు ప్లేట్ మీద నెయ్యి గానీ నూనె గానీ రాసి వేస్తే ఇడ్లీలు తీసేప్పుడు ఇడ్లీప్లేట్ కి అంటుకోకుండా వస్తాయి.

* పిండి రాత్రంతా బయటే ఉంచేప్పుడు ఓ పెద్ద గిన్నెలో నీళ్ళు పోసి, అందులో ఈ పిండి ఉన్న గిన్నె పెడితే  పిండి మరీ పులియకుండా ఉంటుంది.


Labels: tiffins, దోశలు రకాలు 2 comments

Upmas..

10:30 AM | Publish by తృష్ణ




"ఉప్మా" అంటే సులువుగా చేసి పడేసే టిఫిన్ అని చాలామందికి లోకువ. "అబ్బా ఉప్మా..నా.." అని మొహం చిట్లించుకునేదాన్ని చిన్నప్పుడు అమ్మ పెడితే. వంటగది ఆధీనంలోకొచ్చాకా అన్నింటికన్నా త్వరగా చేసేయచ్చని "ఉప్మా చేసేయనా.." అని నేనే అడుగుతానిప్పుడు :) అందులోనూ ఇన్ని రకాలు చెసుకోవచ్చని తెలిసాకా!


ముందు సరదాగా కొన్ని ఉప్మా ఫోటోలు..


బొంబాయిరవ్వ ఉప్మా
 నేను మామూలు బొంబాయిరవ్వ ఉప్మా కన్నా గోధుమరవ్వ ఉప్మా ఎక్కువ చేస్తాను. పోపు వేసేసి, రవ్వ, కాసిని కూరముక్కలు పడేసి,ఉప్పు, నీళ్ళు పోసేసి చిన్నకుక్కర్ మూతపెట్టేస్తే చాలు. ఐదు నిమిషాల్లో అయిపోతుంది. చక్కగా.


గోధుమరవ్వ ఉప్మా

సగ్గుబియ్యం నానబెట్టి చేసే ఉప్మా అప్పుడప్పుడు చేస్తూంటా.. అది కూడా సులువే!




oats ఉపయోగాలు, ఓట్స్ ఉప్మా ఈ టపాలో:
(Oats ఉప్మా చేయటమెలానో కామెంట్లలో ఉంది)
http://ruchi-thetemptation.blogspot.in/2011/04/blog-post_3843.html


సేమ్యా ఉప్మా తెలిసినదే కదా!





మరొకటి రైస్ సేమ్యా ఉప్మా: "రైస్ సేమ్యా" అని దొరుకుతుంది. దాన్ని వేడినీళ్లతో వడబోసేసి, పోపు వేసుకుంటే రుచికరమైన మరో ఉప్మా రెడీ !


రైస్ సేమ్యా ఉప్మా



తర్వాత "జొన్నరవ్వ " ని కనుక్కున్నాకా జొన్న రవ్వతో కూడా ఉప్మా చేస్తున్నా.



 
బ్రెడ్ ఉప్మా గురించి కూడా ఇదివరకు రాసా..



ఇవి  కాక, మరో రెండు రకాల ఉప్మాలు కనుక్కున్నా ఈమధ్యన.. రాగి సేమ్యాతో, మల్టీ గ్రైన్ రవ్వతో.. రెండు ఉప్మాలు ! వెరైటీలు ఇష్తపడేవారు ట్రై చేయచ్చు. "ఒక  హెల్త్ డ్రింక్"  అని అదివరకు నేను రాసిన మల్టీగ్రైన్ పిండి తయారు చేసిన మన్నా బ్రాండ్ నుంచి రకరకాల ఆరోగ్యకరమైన మాల్టేడ్ రాగి పౌడర్, ఇతర పిండిలు, రవ్వలు వస్తున్నాయి. వాళ్లదే "రాగిసేమ్యా" కూడా మార్కెట్లో దొరుకుతోందిట. నాకు మొన్న మిలెట్ ఫెస్ట్ లో దొరికింది. రాగి ఉపయోగాల గురించి గతంలో చెప్పుకున్నాం కదా, అంతమంచిది కాబట్టి మరి రాగిసేమ్యా కొనేసా. ఉప్మా చేసా.. బాగానే ఉంది. నెలకోసారి తినచ్చు..


తయారీ:

మామూలు ఉప్మా లోలాగే పోపు వేసేసి, నీళ్ళు పోసి,ఉప్పు వేసి,  నీళ్ళు మరుగుతూండగా రాగిసేమ్యా వేసేయటమే. పాళ్ళు: ఒక గ్లాస్ రాగిసేమ్యాకి ఒక గ్లాస్ నీళ్ళు. ఎక్కువ పోస్తే ముద్దయిపోతుంది.

అల్లం, పచ్చిమిర్చి, కాక కేరెట్, ఉల్లిపాయ, వేరుశనగపప్పు లాంటి అదనపు అలంకారాలు ఎన్ని వేసుకోగలిగితే అంత రుచి :)






ఇక రెండో రకం మల్టీ గ్రైన్ రవ్వ. ఇది కూడా మిలెట్ ఫెస్ట్ లో దొరికింది. ఇది బజార్లో కొన్ని సూపర్మార్కెట్లలో అదివరకు చూసాను నేను. ఈ మల్టీ గ్రైన్ రవ్వఉప్మా కూడా కూడా రుచి బాగానే ఉంది. ఒకవేళ దొరక్కపోతే మనమే గోధుమ,జొన్న రవ్వ,సజ్జ రవ్వ,రైస్ రవ్వ(ఇవన్నీ విడివిడిగా మార్కెట్లో దొరుకుతాయి) అన్ని కలిపి మిక్స్ చేసేసుకుంటే మల్టీగ్రైన్ రవ్వ అయిపోతుంది :)

తయారీ:
గోధుమరవ్వ ఉప్మా చేసుకున్నట్లే. పైన రాసినట్లు పోపు, కూరముక్కలు,ఉప్పు వేసేసి, బుల్లి కుక్కర్లో పెట్టేస్తే రెండు విజిల్స్ వచ్చాకా ఆపేయటమే.






ఇవండీ ఉప్మా కబుర్స్... మరి వీటిల్లో మీరేది ట్రై చేస్తారు?

Labels: tiffins 6 comments

పావ్ భాజీ

3:37 PM | Publish by తృష్ణ







తయారు చేసే విధానం ఇక్కడ చదవవచ్చు..
http://trishnaventa.blogspot.in/2009/11/blog-post.html




సర్వ్ చేసేప్పుడు అలంకరించటానికి కేరెట్, ఉల్లిపాయ,కొత్తిమీర ఇలా తురుముకుంటే బావుంటుంది. ఫోటోలో కర్రిలో బఠాణీ బదులు స్వీట్ కార్న్ గింజలు వేసాను..




Labels: snacks n sweets, tiffins 0 comments

ఉప్పుడు బియ్యంతో మసాలా దోశ

11:47 PM | Publish by తృష్ణ




అసలు నాకూ చిన్నప్పటి నుండీ ఒక డౌటు.. హోటల్లొ కూడా మసాలా దోశలో మసాలా ఏమీ ఉండదు కదా..మరి దాన్ని మసాలా దోశ అని ఎందుకు అంటారు? అని !

అమ్మా "మసాలా దోశ " కావాలి అని పిల్ల రోజూ అడుగుతోంది.. ఇడ్లీ పిండి అయ్యాకా చేస్తాలే అని చెప్పా. నిన్న రాత్రి పప్పు నానబెట్టి ఇవాళ వేసిపెట్టా.  ఈసారి మామూలుబియ్యం లేదా దంపుడు బియ్యం కాకుండా ఉప్పుడు బియ్యం నానబెట్టా.

ఈ దోశ కి కావాల్సినవి:

* గ్లాసుంపావు మినపప్పు ,

* రెండు గ్లాసులు ఉప్పుడు బియ్యం,
* అర గ్లాసు ఓట్స్,
* చెంచాడు శనగపప్పు లేదా చెంచాడు మెంతులు
(దోశ క్రిస్ప్ గా కావాలంటే శనగపప్పు, మెత్తగా కావాలంటే మెంతులు వేసుకోవాలి)


* పైన చెప్పిన ఐటెమ్స్ అన్నీ ముందురోజు రాత్రి నానబెట్టేసుకుని పొద్దున్నే మెత్తగా రుబ్బుకోవాలి. తగినంత ఉప్పు వేసి బాగా కలిపి అట్లు వేసుకోవటమే.

కూరకి: బఠాణీ, కేరెట్, బంగాళాదుంప ఉడకపెట్టి, పోపులో ఉల్లిపాయ వేసి వేగాకా, ఉడికిన కూరముక్కలు వేసి బాగా కలిపేసుకుంటే కూర రెడి అవుతుంది.



అది అట్టు మీద ఇలా వేసి తినిపెట్టమని ఇంట్లోవాళ్లకి ఇచ్చేయటమే :-)






Labels: tiffins, దోశలు రకాలు 2 comments

సోయాబీన్ ఇడ్లీ + వెజిటబుల్ ఇడ్లీ

5:32 PM | Publish by తృష్ణ







సోయాబీన్ ఇడ్లీకి  కావాల్సినవి:

ఒక గ్లాసు సోయాబీన్ గింజలు
రెండు గ్లాసులు ఇడ్లీ రవ్వ

తయారీ:
* మినపప్పు నానబెట్టినట్లు సోయాబీన్ గింజల్ని రాత్రి నానబెట్టుకోవాలి. పగలైతే గింజలు ఓ ఎనిమిది గంటలు నానేలా చూసుకోవాలి.

* ఇడ్లీ రవ్వ మూడు నాలుగు గంతలు నానితే చాలు.

* నానిన సోయాబీన్ గింజల్ని ఇడ్లీలకి మినపప్పు రుబ్బినట్లే మెత్తగా రుబ్బుకొవాలి.

* నానిన ఇడ్లీ రవ్వ గట్టిగా పిండుతూ రుబ్బిన సోయాబీన్ పిండిలో కలపాలి.

* మామూలు ఇడ్లీలు వేసినట్లే ఇడ్లీ ప్లేట్లలో సోయాబీన్ పిండి వేసి అవిరిపై ఉడికించుకోవటమే. 

* పదిహేను ఇరవై నిమిషాల్లో మెత్తని ఇడ్లీలు రెడీ అవుతాయి.

* సోయాబీన్ ఇడ్లీలను టమాటో గానీ మరే ఇతర చెట్నీతో గానీ వడ్డించవచ్చు.

note:ఈ పిండి నిలవ ఉంచలేదు నేను. ఉండకపోవచ్చు కూడా.. కాబట్టి ఎప్పటికప్పుడు కాస్త చేసుకోవటమే మంచిదేమో.

*** 

వెజిటబుల్ ఇడ్లీ:



మామూలు మినప్పిండి ఇడ్లీలు ప్లేట్ లో వేసేప్పుడు అందులో కాసిని కేరెట్,బీన్స్ ముక్కలు చిన్న చిన్నగ తరిగి వెయ్యటమే..:)



అవి ఉడికాకా ఇలా ఉంటాయి..:-)



Labels: tiffins 4 comments

జొన్నరవ్వతో ఉప్మా

5:52 PM | Publish by తృష్ణ

జొన్నరవ్వఉప్మా-అరటి దూట పెరుగుపచ్చడి



గోధుమల కంటే ఎక్కువ ఆరోగ్యకరమైన ఉపయోగాలు "చిరుధాన్యాలకు (millets)" ఉన్నాయి. అన్ని చిరుధాన్యాలలోకీ జొన్నలు ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం. జొన్న రొట్టెలు, జొన్న పేలాలు చేసి వాటితో లడ్డులు, జొన్న సూప్ మొదలైనవి మనం చేసుకుంటూ ఉంటాము. గోధుమ రవ్వ లాగానే "జొన్న రవ్వ" బజార్లో దొరుకుతుంది. ఆ రవ్వతో ఉప్మా ఎలా ఉంటుందా అని ప్రయత్నించాను. బాగా వచ్చింది. మీరూ ప్రయత్నించి చూడండి...

కావాల్సినవి:

* ఒక కప్పు జొన్న రవ్వ (జొన్న రవ్వ దొరకకపోతే, జొన్నలు పొడి మూకుట్లో కాసేపు వేయించి బరగ్గా గ్రైండ్ చేసుకుని, జల్లించుకుంటే, జొన్న రవ్వ తయారవుతుంది)
* మూడు కప్పుల నీళ్ళు
* ఒక కేరెట్(తరిగినది)
* పది బీన్స్(తరిగినవి)
* ఒక ఉల్లిపాయ
* ఒక అంగుళం అల్లం ముక్క
* రెండు పచ్చిమిరపకాయలు
* ఒక ఎండు మిరపకాయ
* పోపు లోకి: ఒకటి రెండు చెంచాల నూనె, ఆవాలు,శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, చిటికెడు ఇంగువ, కాస్త కర్వేపాకు
*తగినంత ఉప్పు
* పైన అలంకరించటానికి కాస్తంత కొత్తిమీర తరుగు

విధానం:

* ముందుగా చిన్న కుక్కర్లో పోపు వేయించుకుని, అందులో అల్లం,మిర్చి వేసాకా కూరముక్కలు కూడా వెయ్యాలి.

* తర్వాత అందులో జొన్నరవ్వ వేసేసి రెండు నిమిషాలు కలపాలి.




* తర్వాత నీళ్ళు పోసేసి, తగినంత ఉప్పు వేసి, కుక్కర్ మూత పెట్టేసి మూడు విజిల్స్ వచ్చాకా ఆపేయటమే.

*జొన్నరవ్వ ఉప్మా రెడీ అయిపోతుంది.

* పైన ఫోటోలో జొన్నరవ్వఉప్మాతో పాటూ పెట్టినది అరటి దూట పెరుగుపచ్చడి. కాంబినేషన్ బానే ఉంది. కారం తినేవాళ్ళు దీనికి సైడ్ డిష్ గా ఏదైనా పచ్చడి కూడా చేసుకోవచ్చు.



జొన్నలు గురించిన వివరాలు, ఉపయోగాలు ఇక్కడ చూడవచ్చు:

http://te.wikipedia.org/wiki/%E0%B0%9C%E0%B1%8A%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%B2%E0%B1%81



Labels: tiffins 3 comments
Older Posts »
"Health is Wealth."

ఇక్కడ వెతకండి..

'రుచి' చూసినవారు

పంచుకున్న రుచులు

  • ▼  2015 (3)
    • ▼  March (3)
      • సలాడ్ ప్రసాదం :-)
      • బుడిదగుమ్మడి కాయ పప్పు (ash gourd/winter melon dal )
      • Veg.Hakka Noodles
  • ►  2014 (24)
    • ►  December (2)
    • ►  November (2)
    • ►  September (1)
    • ►  July (2)
    • ►  June (4)
    • ►  May (3)
    • ►  April (2)
    • ►  March (7)
    • ►  January (1)
  • ►  2013 (32)
    • ►  December (3)
    • ►  September (4)
    • ►  August (2)
    • ►  July (3)
    • ►  May (1)
    • ►  April (8)
    • ►  March (3)
    • ►  February (1)
    • ►  January (7)
  • ►  2012 (26)
    • ►  December (1)
    • ►  November (3)
    • ►  October (5)
    • ►  June (4)
    • ►  May (5)
    • ►  April (1)
    • ►  March (1)
    • ►  February (4)
    • ►  January (2)
  • ►  2011 (35)
    • ►  December (3)
    • ►  November (6)
    • ►  September (3)
    • ►  August (4)
    • ►  June (2)
    • ►  May (4)
    • ►  April (6)
    • ►  March (5)
    • ►  February (2)
  • ►  2010 (14)
    • ►  December (6)
    • ►  September (4)
    • ►  August (1)
    • ►  June (3)

About

ఇవి కూడా నావే

  • తృష్ణ...
    'Krishnavataram Part 1: The Heart
    3 months ago
  • మనోనేత్రం
    Millet fest - 2015
    11 years ago
Powered by Blogger.

రుచులు - రకాలు

  • chutneys n పచ్చడ్స్ (19)
  • cooking tips (1)
  • experiments (10)
  • Kitchen Essentials (1)
  • pulses (3)
  • quick & easy (4)
  • recipe links (1)
  • rotis (2)
  • salads (7)
  • snacks n sweets (19)
  • soups and appetizers (2)
  • tiffins (24)
  • అట్లు - రకాలు (6)
  • ఊరగాయలు-రకాలు (12)
  • ఒడియాలు (3)
  • కూరలు (25)
  • చారులు రకాలు (1)
  • టీలు - రకాలు (1)
  • దోశలు రకాలు (7)
  • పప్పులు (4)
  • పులిహోర (4)
  • పులుసులు (2)
  • పెరుగు పచ్చడి (2)
  • మన పిండివంటలు (2)
  • రకరకాల పొడులు (2)
  • రైస్ వెరైటీస్ (6)
  • వేసవి పానీయాలు (7)

'రుచి' ఇష్టపడేవారు

Copyright (c) 2010 రుచి...the temptation. Design by Template Lite
Download Blogger Templates And Directory Submission.