skip to main | skip to sidebar

Pages

  • Home

రుచి...the temptation

"The best way to a man's heart is through his stomach."
Showing posts with label ఊరగాయలు-రకాలు. Show all posts
Showing posts with label ఊరగాయలు-రకాలు. Show all posts

కొత్తావకాయ + మెంతికాయ!

1:43 PM | Publish by తృష్ణ





ఊరగాయలు తినడమే మానేసామని ఈసారి అసలు ఆవకాయలూ అవీ వద్దనుకుంటూనే మొత్తానికి అనుకోకుండా పెట్టేసాను. ఏదో పని మీద బజారుకి వెళ్ళి అక్కడ ముక్కలు కొడుతుంటే చూసి ఉత్సాహం వచ్చేసి, గబగబా ఓ నాలుగు కాయల్ కొనేసి, ముక్కలు  కొట్టించేసి, పక్కనే వలిచిన వెల్లుల్లి అమ్ముతుంటే అవి కూడా కొనేసి, ఇంటికొచ్చేద్దారిలో పప్పు నూనె కూడా కొని,  ఇంటికొచ్చాకా రాత్రి పదకొండున్నరకి కూచుని ఆవకాయ పెట్టా :-)

ఇదివరకూ మూడురకాల ఆవకాయలు చెప్పా కానీ మామూలు వెల్లిల్లి ఆవకాయ రెసిపీ చెప్పలేదు. ఆ రెసిపీ కూడా అవసరం ఉన్నవాళ్ళకి ఉపయోగిస్తుందని ఇక్కడ ఇస్తున్నా.

ఈ రెసిపీ  ఓ నాలుగు పెద్ద మామిడి కాయలకి:


* salt, కారం 1:1 పాళ్ళు.
* ఆవపొడి మాత్రం అంతకు మరో అరగ్లాసు ఎక్కువ. 
(హైద్రాబాద్ లో ఉంటే నల్లకుంటలో దొరికే కారమైతే బెస్ట్! లేదా పెద్ద మిర్చి(లావుగా ఉండేది) కారం కొనుక్కోవాలి. అదైతే రంగు ఉంటుంది, కమ్మగా ఉంటుంది.
 ఈసారికి నేను నాలుగు కాయలే పెట్టాను. సో, త్రీ మేంగోస్ కారంతో సరిపెట్టేసా :))
* నూపప్పు నూనె 1/2 కేజీ తీసుకోవాలి. 
* powders అన్నీ బాగా కలిపేసి, అందులో పావు కేజీ నూనె వేసి, తొక్క తీసిన వెల్లుల్లిపాయలు(ఇవి కూడా రెడీగా దొరికేసాయి ఈసారి), వంద గ్రాములు మెంతులు వేసి మూత పెట్టేసి, మూడో రోజు మూత తీసి మిగిలిన పావు కేజీ నూపప్పునూనె కలిపేసి సీసాలోకెక్కించెయ్యడమే.


మెంతికాయ:

ఆవకాయ పెట్టిన తర్వాత కనీసం మెంతికాయ అయినా పెడదాం అనిపించి, ఓ మూడు కాయలతో మెంతికాయ కూడా పెట్టేసా. ఆ రెసిపీ ఇదివరకూ ఇక్కడ రాసా కాబట్టి ఇంక మళ్ళీ రాయట్లే. కొత్త మొంతికాయ ఫోటో మాత్రం పెడుతున్నా..:-)

* ఒక టిప్ ఏమిటంటే మెంతులు ఎంత దోరగా వేగితే, అంత కమ్మగా ఉంటుంది మెంతికాయ.






Labels: ఊరగాయలు-రకాలు 1 comments

దోసావకాయ + దోసావకాయ

4:59 PM | Publish by తృష్ణ





1.రెగులర్ దోసావకాయ:

పెళ్ళిళ్ళలో, ఫంక్షన్స్ లో అన్ని సీజన్స్ లో ఎక్కువగా కనబడే ఇంస్టంట్ ఆవకాయ..దోసావకాయ! అప్పటికప్పుడు అతిథులు వస్తున్నారంటే గబగబా వంట చేసేస్తాం కదా.. అలాంటప్పుడు చటుక్కున ఫ్రెష్ ఆవకాయ పెట్టడానికి మామిడికాయలు దొరకని సీజన్ లో అయితే మిగతావాటికన్నా దోసావకాయ అయితే చాలా బావుంటుంది. ఓ గంట, రెండు గంటల్లో రెడీ అయిపోతుంది!
చేయడం కూడా ఈజీనే.. 

* ఒక అరకేజీ దోసకాయ ఉంటే, గింజలు తీసేసి తొక్కతో పాటూ సన్నగా పచ్చడికి తరిగినట్లు ముక్కలు తరిగేసుకోవాలి. ముక్క చేదు ఉందేమో చెక్ చేసుకోవాలి.

* 1/2 టీ గ్లాసు కారం, ఉప్పు, ఈ రెండీటికీ కాస్త ఎక్కువగా(సుమారు రెండు చెంచాలు) పచ్చి ఆవపొడి కలిపి, ముప్పావు టీ గ్లాసుడు నూనె వేసి మొత్తం బాగా కలపాలి.

* తరిగిన దోసకాయ ముక్కలని కలిపిన పిండిలో వేసేసి మళ్ళీ బాగా కలపాలి.

*దోసకాయ పులుపు కాబట్టి మిగతా కూరలతో చ్ఃఏసిన ఆవకయల్లోలాగ నిమ్మకాయ పిండక్కర్లేదు.

* దోసావకాయకి దోసకాయ గట్టిగా ఉండాలి, కాయ పులుపు ఉండాలి. అప్పుడు రుచి ఇంకా బావుంటుంది. 


2.పచ్చిమిరపకాయలతో దోసావకాయ:

దోసావకాయ అంటే చాలామందికి పైన రాసినదే తెలుసు. అదికాక పచ్చిమిర్చితో చేసుకునేది మరొకటి ఉంది. ఎర్ర దోసావకాయ కన్నా ఇది చాలా బావుంటుంది. ఇదివరకూ తృష్ణ లో రాసానీ రెసిపీ. ఒకచోట ఉంటాయని మళ్ళీ ఇక్కడ రాస్తున్నా!


తయారీకి కావాల్సినవి:
* ఒక మీడియం దొసకాయ ఇలా తరిగినది.

* మేము కారం తక్కువ కాబట్టి ఆ దోసకాయకి నేను 8,9 పచ్చి మిర్చి తీసుకుంటాను.

* ముందు మిక్సీలో పచ్చిమిరపకాయలన్నీ పేస్ట్ చేసి ఉంచాలి.

* దీనిలోకి 2,3 చెంచాల పచ్చి ఆవ పొడి వేసి,(మార్కెట్లో దొరుకుతుంది. లేకపోతే ఇంట్లో గ్రైండ్ చేసుకోవచ్చు.) 4,5 చెంచాల నూనె, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. పేస్ట్ బాగా మిక్స్ అయినట్లు కనబడ్డాకా,

* అందులో తరిగిన దోసకాయ ముక్కలు వేసి బాగా కలపాలి.


"ఆవ" వేడి చేస్తుంది కాబట్టి ఇది తిన్న రోజు మజ్జిగ ఎక్కువ తాగాలి.










Labels: ఊరగాయలు-రకాలు 2 comments

ఉసిరి ఆవకాయ, ఉసిరి పచ్చడి

3:35 PM | Publish by తృష్ణ




ఉసిరి దొరికే సీజన్ అయిపోతూంటే ఇప్పటికి కుదిరింది రాయడానికి..! రుచి సంగతి ఎలా ఉన్నా ఔషధగుణాలు పుష్కలంగా ఉన్న ఉసిరికాయను ఏడాది పొడువునా తినగలిగేలా నిలవచేసి పచ్చడి చేసుకునే పధ్ధతి మన పెద్దవాళ్ళు మనకు చెప్పారు. ఆవకాయ కన్నా ఉసిరిపచ్చడి శ్రేష్ఠం. ఉరిసితొక్కు నిలవ ఉంచి, అప్పుడప్పుడూ అంత తొక్కుతో పచ్చడి చేసుకు రోజూ భోజనంలో మొదటి ముద్దలో తింటే ఎంతో మంచిదిట. కనీసం మనం మొదట తినే పప్పులో అయినా నంచుకుంటే ఆరోగ్యానికి మేలు. 


ఉసిరి కొనేప్పుడు కూడా కార్తీకమాసంలో దొరికే ఉసిరికాయలు కొనాలిట. వాటిల్లో ఔషధగుణాలు ఇంకా ఎక్కువగా ఉంటాయిట. పచ్చడి తర్వాత చేసుకున్నా కార్తీకమాసం అయ్యేలోపూ ఉసిరికాయలు కొని ఫ్రిజ్ లో పెట్టేస్తుంటాను నేను. సరే, ఇప్పుడు ముందు ఉసిరి తొక్కు నిలువ ఉంచేదెలాగో చెప్తానేం...

ఉసిరి తొక్కు నిలువ చేయడం:
* ముందర ఉసిరికాయలు కడిగి, తుడిచి, తడి ళేకుందా ఆరబెట్టాలి.
* తర్వాత చిన్న చిన్న ముక్కలు చెయ్యాలి. ఇలా..


* ముక్కలు గ్రైండర్ లో వేసి ఊరగాయలకు వాడే రాళ్ల ఉప్పు, పసుపు వేసి మెత్తగా తిప్పుకోవాలి. పావుకేజీ ఉసిరికాయలకు రెండు గుప్పెళ్ళు ఉప్పు, రెండు చెంచాల పసుపు వేయచ్చు.
అలా గ్రైండ్ చేసిన ఉసిరి తొక్కు ఇలా ఉంటుంది..


* ఇది ఒక సీసాలో కానీ పింగాణీ జాడీలో కానీ వేసి తడి తగలకుండా మూత పెట్టాలి. కావాల్సినప్పుడల్లా కాస్త కాస్త తీసి పచ్చడి చేసుకోవచ్చు.


ఉసిరి పచ్చడి:

* సుమారు టీ గ్లాసుడు ఉసిరి తొక్కును పచ్చడికి తీసుకుంటే నాలుగు ఎండు మిరపకాయలు, నాలుగు పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజు కట్ట కొత్తిమీర తీసుకోవాలి.

* ఒక చెంచా నూనెలో మినపప్పు, ఆవాలు, ఇంగువ, ఎండు మిర్చి వేసి వేగాకా ఒక చెంచా మెంతిపొడి వేసి, మెంతిపొడి బాగా ఎర్రగా వేగాకా స్టౌ ఆపేయాలి. అప్పుడు కడిగి, తరిగిన కొత్తిమీర ఆ వేడి పోపులో వెయ్యాలి. కాస్త మగ్గినట్లు అవుతుంది.

*  వేగిన ఎండు మిర్చి, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు గ్రైండర్ లో వేసి ఒకసారి తిప్పాకా , ఉసిరి తొక్కు కూడా అందులో వేసి మొత్తం కలిసేలా మిక్సీ మరోసారి తిప్పాలి.

* నిలవ ఉంచేప్పుడు ఉప్పు వేస్తాం కాబట్టి, ఇంకా ఉప్పు అవసరం అనుకుంటే రుచి చూసి తగినంత కలుపుకోవాలి.

* ఇలా చేసుకున్న పచ్చడి కూడా నాలుగైదు నెలలు పాడవకుండా ఉంటుంది.

---------------------------
ఉసిరి ఆవకాయ:



* ఉసిరికాయలు ముక్కలు చెయ్యకుండా కాయలకు మధ్య మధ్య చాకుతో గాట్లు పెట్టి, మూకుడులో రెండు చెంచాల నూనె వేసి కాస్త మగ్గించాలి. కాయలు కాస్త మెత్తబడ్డాయి అనుకున్నాకా ఆపేయాలి. ఇలా చేస్తే ముక్కలు త్వరగా ఊరతాయి. 


* ఆవకాయ పాళ్ళలో ఆవపొడి, కారం, ఉప్పు (౧:౧:౧) తీసుకుని ఊరగాయ పెట్టేసుకొవడమే.



రెండవరకం:



* ఇందులో కాస్త మెంతిపిండి కలుపుతారు. ప్రొసిజర్ ఇదివరకూ దబ్బకాయ ఊరగాయ  చెప్పాను.. అలానే..! దబ్బకాయ ముక్కలకు బదులు మగ్గించిన ఉసిరికాయలు చల్లారాకా, అవి పిండిలో కలుపుతాం. అంతే!

* ముక్కలుగా కోసి అవకాయ పెట్టుకున్నా ముక్కలు చెంచాడు నూనెలో మగ్గిస్తే బావుంటుంది.

Labels: chutneys n పచ్చడ్స్, ఊరగాయలు-రకాలు 4 comments

పనసపొట్టు ఆవకాయ

2:42 PM | Publish by తృష్ణ



ఇవాళ ఇంట్లో అక్షయమైపోయిన పనస పొట్టు గురించి ఇక్కడ రాసాను కదా.. కాస్త మా మరిది వాళ్ళింటికి పంపించాను.. మిగిలినది ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుంటే మా వదినవాళ్ల అమ్మాగారు అప్పుడెప్పుడో ఇచ్చిన "పనసపొట్టు ఆవకాయ" గుర్తుకొచ్చింది. వెంఠనే ప్రయోగమ్ మొదలుపెట్టేసాను.. బాగా కుదిరింది.

ఎలా చెయ్యాలంటే:

* ఒక కప్పు పనసపొట్టు (పచ్చిదే)
* ఆవ పొడి, ఉప్పు, కారం సమపాళ్ళలో 1/2 కప్పు
* అర కప్పు నూనె
* పది వెల్లుల్లి రేకలు
* పులిహోర పోపు 
* ఒక పెద్ద నిమ్మకాయ రసం







తయారీ:

* పచ్చిఆవ పొడి, కారం, ఉప్పు సమపాళ్ళలో తీసుకుని బాగా కలిపి పనసపొట్టులో కలపాలి.

* కాస్త నూనెలో ఆవాలు, మినపప్పు, శనగపప్పు, పసుపు,కర్వేపాకు,వేరుసనగపప్పు, ఇంగువ కలిపి పులిహోరకి పెట్టుకున్నట్లు పోపు పెట్టుకోవాలి.

* అది తెచ్చి పనసపొట్టు,కారం మిశ్రమంలో కలపాలి.

* ఓ పది వెల్లుల్లిపాయలు కాస్తంత చిట్లేలా దంచి తొక్క వలిచి ఆవకాయలో వెయ్యాలి.

* తర్వాత నూనె వేసి అంతా బాగా కలపాలి.

* చివరిగా నిమ్మరసం వేసి మరోసారి బాగా కలిపి సీసాలో దాచటమే.

* ఈ పనసపొట్టుఆవకాయ ఎక్కువ నిలవ ఉండదు. కాస్త కాస్త చేసుకోవాలి. ఫ్రిజ్ లో పెట్టుకుంటే వారం, పదిరోజులు పాడవ్వకుండా ఉంటుంది.

ఒక సలహా: ఆవపొడి, ఉప్పు, కారం, పనసపొట్టు అన్నీ బాగా పొడిగానే కలిపి ఒక సీసాలో వేసి ఫ్రిజ్ లో దాచుకోవచ్చు. కావాల్సినప్పుడు తీసి నూనె వేసి, పులిహోర పోపు,నిమ్మరసం పిండుకుని తినచ్చు.ఇలా నూనే,నిమ్మరసమ్ కలపని పొడిగా ఉన్న పొడి అయితే ఒక నెల రోజులు ఉంటుంది ఫ్రిజ్ లో.






Labels: experiments, ఊరగాయలు-రకాలు 7 comments

టమటా నిలవ పచ్చడి

4:56 PM | Publish by తృష్ణ





ఎండాకాలంలో మామూలు ఊరగాయలతో పాటూ ముక్కలు బాగ ఎండుతాయని నిమ్మకాయ, దబ్బకాయ, టమాటా మొదలైన ఊరగాయలు పెట్టుకుంటాము కదా, ఎండ లేకపోయినా కూడా స్టౌ మీద మగ్గించి టమాటా నిలవ పచ్చడి చేసుకోవచ్చు. ఎండబెట్టి పెట్టిన ఊరగాయంత నిలవ ఉండకపోయినా, ఇదీ నెలా రెండునెలలు నిలవ ఉంటుంది.

కావాల్సినవి:
కేజీ టమాటాలు
వంద గ్రాములు నూనె
వంద గ్రాములు చింతపండు
వంద గ్రాములు కారం
ఏభై గ్రాములు మెంతిపొడి(కొన్నది లేక పొడిగా మెంతులు వేయించి గ్రైండ్ చేసినది)
తగినంత ఉప్పు (సుమారు 75-100 gms మధ్య)
చెంచా ఇంగువ
చెంచా పసుపు
పోపుకి  చెంచా ఆవాలు

తయారీ:
* టమాటాలు కడిగి పొడిగా ఉండేలా తుడిచి, ముక్కలు చేసి ఏభైగ్రాములు నూనె వేసి వేయించాలి.  పైన మూతపెడితే త్వరగా మగ్గుతాయి ముక్కలు.




* ఆ ముక్కలు కాస్త మగ్గాకా, చింతపండు చిన్నచిన్న ముక్కలు చేసి టమాటా ముక్కల్లో వెయ్యాలి. ముక్కలు మెత్తపడి దగ్గర పడుతుండగా మూత తీసేసి, రసం అంతా ఇగరనివ్వాలి.

*  రసం అంతా ఇగిరి టమాటా ముక్కలు బాగా దగ్గరపడ్డాకా స్టౌ ఆపేయాలి.

* ఈ మిశ్రమం చల్లారాకా తగినంత ఉప్పు కలిపి గ్రైండర్ లో మెత్తగా గ్రైండ్ చెయ్యాలి. మెత్తబడిపోతాయి కాబట్టి ఒక్క తిప్పు చాలు.

* మూకుడులో నాలుగైదు చెంచాల నూనె వేసి అందులో ఆవాలు, ఇంగువ పోపు వేయించాలి.

* తర్వాత మెంతిపొడి వేసి బాగా ఎర్రగా వేగనివ్వాలి.

* తర్వాత కారం కూడా వేసి మిగిలిన నూనె కూడా పోసి స్టౌ ఆపేయాలి.  కారం వేగటానికి ఆ వేడి చాలు.

* తర్వాత గ్రైండ్ చేసిన టమాటా ముద్ద అందులో కలిపేయాలి. వేడి మీద అదే మూకుడులో కలిపేయచ్చు.

* చల్లారాకా తడి తగలకుండా సీసాలో దాచుకుంటే నెలా, రెండునెలలు నిలవ ఉంటుంది.

రెండో రకం టమాటా పచ్చడి:
* పైన చెప్పినట్లుగా మెంతిపొడి, కారం వేగిన మూకుడిలో టమటా ముద్ద కలిపేసాకా, అది చల్లార్చి, అందులో ఓ డభ్భై గ్రాములు పచ్చి ఆవపిండి కలపాలి.
ఊరగాయలాగ అన్నమాట.

* ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. టమాటా ముక్కలు వేగేప్పుడే వెల్లుల్లి కలిపి వేయించేసి, గ్రైండ్ చెసేస్తే రుచి బావుంటుంది.

* ఇది కూడా తడి తగలకుండా ఉంచితే నెలా, రెండునెలలు నిలవ ఉంటుంది.

Labels: chutneys n పచ్చడ్స్, ఊరగాయలు-రకాలు 4 comments

ఆవకాయలు మాగాయలు - 2

6:16 PM | Publish by తృష్ణ



నిన్న కొన్నిరకాల ఆవకాయలు గురించి రాసాను కదా.. ఇవాళ మూడు మాగాయ రకాలు చెప్పుకుందాం. చిన్న సలహా ఏంటంటే ఆవకాయకు, మాగాయకు కూడా కాయ కొనేప్పుడు పీచు ఉన్న మావిడికాయలు ఎన్నుకోవాలి. అప్పుడవి ఏడాదంతా నిలవ ఉంటాయి.
తురుముమాగాయ:



మామిడికాయ తురిమేసుకుని ఒక ఎండలో పెట్టాలి. పొద్దున్న పెట్టి సాయంత్రం తెచ్చేసుకోవచ్చు.



మామిడికాయలు ౩
100gms మెంతులు,
75gms ఆవాలు
150gms కారం
150gms ఉప్పు
1/4kg నూపప్పు నూనె



తయారీ:



* 1/4kg నునె కాగాకా అందులో చింతగింజంత ఇంగువ వేసి కాచి ఉంచాలి. ఇంగువ వెయ్యగానే బుడగలు వస్తాయి. అప్పుడు దింపెయ్యాలి.
* ఆవాలు,మెంతులు రెండూ విడివిడిగా పొడిమూకుడులో వేయించుకోవాలి. ఆవాలు నొక్కితే పొడుం అయ్యేలా వేయించాలి. మెంతులు ఎర్రగా వేగి కమ్మటి వాసన రావాలి. వీటిని విడివిడిగా గ్రైండ్ చేసుకుని ఉంచుకోవాలి.



* తురిమిన కోరు తెచ్చుకున్నాకా ముందుగా టీ గ్లాస్ ఉప్పు వేసి కలుపుకోవాలి.
* తర్వాత అందులో కారం, ఆ తరువాత వేయించి పొడి చేసుకున్న మెంతిపొడి ఆవ పొడి, ఇంగువ నూనె వేసి బాగా కలపాలి.
* మూడోరోజు మరి కాస్త (తగినంత) నూనె వేసి మళ్ళీ బాగా కలిపి జాడీలో దాచుకోవటమే.
---------------------------------------
మెంతికాయ:

మామిడికాయలు 6
ఉప్పు 1/4kg
కారం 1/4kg
100gms మెంతులు
40gms ఆవాలు
1/2kg నూపప్పు నూనె
ఒక చెంచా పసుపు

తయారీ:

* మావిడి ముక్కలు సన్నగా పొడుగ్గా తరిగి ఒకరోజు లేక ఒక పూట ఎండబెట్టాలి.
* 1/4kg నునె కాగాకా అందులో చింతగింజంత ఇంగువ వేసి కాచి ఉంచాలి. ఇంగువ వెయ్యగానే బుడగలు వస్తాయి. అప్పుడు దింపెయ్యాలి.
* ఆవాలు,మెంతులు రెండూ విడివిడిగా పొడిమూకుడులో వేయించుకోవాలి. ఆవాలు నొక్కితే పొడుం అయ్యేలా వేయించాలి. మెంతులు ఎర్రగా వేగి కమ్మటి వాసన రావాలి. వీటిని విడివిడిగా గ్రైండ్ చేసుకుని ఉంచుకోవాలి.
* కారంలో కాగిన నూనె కాస్త వేసి కలిపి తర్వాత ఉప్పు వేసి కలపాలి. నూనె చల్లారిన తర్వాత ఆవపిండి, మెంతిపిండి కలపాలి.
* తర్వాత ఎండిన ముక్కలు వేసి కలపాలి. తర్వాత పసుపు కూడా అందులో కలపాలి.
* మూడవ రోజున ఊట రాకపోతే కాస్త ఇంగువ నూనె కాచి చల్లార్చి ఊరగాయలో కలపాలి.
---------------------------------------
ఎండు మాగాయ:

మామిడికాయలు 4
ఉప్పు 1/4kg
కారం 1/4kg
150gms మెంతులు
150gms ఆవాలు
1 spoon పసుపు
450/500gms నూపప్పు నూనె

తయారీ:

* మామిడికాయలను తొక్కు తీసి సన్నగా పల్చగా ఉండేలా ముక్కలు పీలర్ తో పీల్ చేయాలి.
* ముక్కల్లో 1/4kg ఉప్పు, ఒక చెంచా పసుపు కలిపి జాడీలో పెట్టాలి.
* రెండవరోజు బాగా కలపాలి. మూడవరోజు జాడీలో కాస్త ఊట కనిపిస్తుంది.
* మూడవరోజు ముక్కలు మాత్రం తీసి ఎండలో పెట్టాలి. సాయంత్రం మళ్ళీ జాడిలో ఉన్న ఊటలో ముక్కలు వేసేయాలి.
* అలా ముక్కలని రెండు మూడు రోజులపాటు ముక్క విరిగేలా ఎండేదాకా ఎండబెట్టాలి. చివరిరోజు ఊట కూడా ముక్కలతో పాటూ విడిగా ఎండలో పెట్టాలి.
* ఎండబెట్టడానికి మూడురోజులు సరిపోతాయి.
* మూడవరోజు 1/4kg కారం వేసి ముక్కలు, ఊట అన్నీ కలిపాలి.
* తర్వాత ఆవాలు,మెంతులు విడివిడిగా వేయించి , విడివిడిగానే పొడి చేసుకుని ఊరగాయలో కలపాలి.
* చింతగింజంత ఇంగువ వేసి 1/4kg పప్పు నూనె కాచి, చల్లార్చి ఊరగాయలో వెయ్యాలి.
* జాడీలో పెట్టిన మూడవరోజు కాస్త ఇంగువ వేసి 200gms నూనె కాచి చల్లార్చి ఊరగాయలో కలపాలి.



Labels: ఊరగాయలు-రకాలు 4 comments

ఆవకాయలు మాగాయలు - 1

4:41 PM | Publish by తృష్ణ




రకరకాల ఆవకాయలు మాగాయల list గతంలో "మామ్మయ్య - ఊరగాయలు !" టపాలో రాసాను. తర్వాత క్రితం ఏడాది ఊరగాయలు పెట్టాకా "ఊరగాయ వైరాగ్యం" అని కూడా రాసానా... పది కాయలకే నేనిలా అనుకుంటే వందల లెఖ్ఖలో ఆవకాయలు, మాగాయలు పెట్టిన అమ్మమ్మలూ, నాన్నమ్మలూ ఎలా పెట్టేవారో, పెట్టాకా ఏం అనుకునేవారో అనుకుంటూ ఉంటాను ! నేనైతే ఈసారి మూడే మూడు రకాలు పెట్టాను. వెల్లుల్లి ఆవకాయ, తురుము మాగాయ, మెంతికాయ.



ఈసారి కొన్ని రకాల ఆవకాయలు, మాగాయలు రకాలు ఈ బ్లాగులో రాద్దామని. ఈ టపా అయితే ప్రత్యేకంగా బ్లాగ్మిత్రులు సునీత గారి కోసం ! ఇంకా ఊరగాయలు పెట్టుకోనివాళ్లెవరన్నా ఉంటే ఈ రకాలు ట్రైచేయండి..


1) పెసర ఆవకాయ:

పచ్చిపెసరపప్పు గ్రైండ్ చేసి, జల్లించాకా వచ్చిన మెత్తటి పచ్చి పెసరపిండితో ఈ ఆవకాయ పెడతారు. ఇందులో ఆవపిండి కలపరు. పెసరపిండి ఉంటుంది కాబట్టి కమ్మగా ఉంటుందీ ఆవకాయ.

పాళ్ళు:
5 మావిడికాయలు (మామూలు ఆవకాయకు లాగానే కొట్టించుకోవాలి)
1/4kg కారం
1/4kg ఉప్పు (రాళ్ళ ఉప్పు మెత్తగా పౌడర్ చేసినది అమ్ముతారు. అది వాడితే మంచిది)
300gms జల్లించిన పచ్చి పెసరపిండి
అరచెంచా పసుపు
1/2 kg నూపప్పు నూనె
తయారీ:

* పచ్చిపెసరపప్పు గ్రైండ్ చేసి, జల్లించాకా వచ్చిన మెత్తటి పెసరపిండి కొలిచి పక్కన పెట్టుకోవాలి.
* ఉప్పు ఉండలు లేకుండా చూసుకుంటూ ముందు పొడులన్నీ బాగా కలపాలి.
* తర్వాత పసుపు, 1/4kgనూనె వేసి కలిపి, ముక్కలు కూడా వేసి కలపాలి.
* ఆవకాయ కలిపిన మూడవ రోజు ఊరగాయ మళ్ళీ బాగా కలిపి మిగిలిన 1/4kg నూనె వేసి కలిపి జాడీలోనో సీసాలోనో పెట్టేసుకోవటమే.

***********************************************
2)అల్లం ఆవకాయ:
ఇందులో కూడా ఆవ బదులు అల్లంవెల్లుల్లి ముద్ద కలుపుకోవాలి.






పాళ్ళు:
5 మావిడికాయలు (మామూలు ఆవకాయకు లాగానే కొట్టించుకోవాలి)
1/4kg కారం
(రాళ్ళ ఉప్పు మెత్తగా పౌడర్ చేసినది అమ్ముతారు. అది వాడితే మంచిది)
1/4kg అల్లంవెల్లుల్లి ముద్ద ( ఫ్రెష్ గా ఇంట్లోనే గ్రైండ్ చేసుకుంటే మంచిది)
అరచెంచా పసుపు
1/2 kg నూపప్పు నూనె


తయారీ:

* ముందుగా అల్లం,వెల్లుల్లి పొట్టు తీసుకుని, మెత్తగా ముద్దలా గ్రైండ్ చేసుకోవాలి.
* పావుకేజీ నూనె మూకుడులో పోసి, అది వేగాకా ఓ చెంచాడు ఆవాలు వేసి వెగనివ్వాలి.
*తర్వాత గ్రైండ్ చేసిన అల్లంవెల్లుల్లి ముద్ద వేసి మాడకుండా వేగనివ్వాలి.
* అల్లంవెల్లుల్లి ముద్ద వేగాకా స్టౌ ఆపేసి అందులో 1/4kg కారం, 1/4kg ఉప్పు, అర చెంచా పసుపు అందులో కలపాలి.
* చల్లారాకా మామిడి ముక్కలు వేసి బాగాకలుపుకోవాలి.
* ఆవకాయ కలిపిన మూడవ రోజు ఊరగాయ మళ్ళీ బాగా కలిపి మిగిలిన 1/4kg నూనె వేసి కలిపి జాడీలోనో సీసాలోనో పెట్టేసుకోవాలి.
**********************************

3)పులిహోర ఆవకాయ:

కావాల్సినవి:

ఐదు మావిడికాయలు ఆవకాయ కోసం కొట్టినట్లుగా కాకుండా బాగా చిన్నగా కొట్టించుకోవాలి.
1/4kg కారం
1/4kg ఉప్పు (రాళ్ళ ఉప్పు మెత్తగా పౌడర్ చేసినది అమ్ముతారు. అది వాడితే మంచిది)
1/4kg ఆవపిండి
అరచెంచా పసుపు
1/2 kg నూపప్పు నూనె
తయారీ:

* ఆవకాయకు కలుపుకున్నట్లే ముందుగా పొడులన్నీ కలిపేసి, తర్వాత 1/4kg నూనె, ముక్కలు వేసి కలిపేయాలి.
* మూడవ రోజున యధాప్రకారం మిగిలిన 1/4kg నూనె వేసి కలిపేసి జాడిలో పెట్టేయాలి.

తర్వాత "పులిహోర ఆవకాయ" తినాలనిపించినప్పుడు ఏం చెయ్యాలంటే:

* ఓ 100gms ఆవకాయ బయటకు తీసుకోవాలి.
* 100gms నూపప్పు పొడిగా దోరగా వేయించి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
* ముకుడులో ఆవాలు,శనగపప్పు, కర్వేపాకు, చిటికెడు ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి.
* గ్రైండ్ చేసిన మెత్తటి నూపప్పు, పోపు తీసిపెట్టుకున్న ఆవకాయలో బాగా కలిపేస్తే పులిహోర ఆవకాయ రెడీ.

పెసరావకాయ పెట్టుకున్నట్లు నూపప్పు పొడెం ఆవకాయ కలిపేసుకోవచ్చు. కానీ అప్పటికప్పుడు పోపు పెట్టుకున్న ఫ్రెష్నెస్ దానికి ఉండదు. అందుకని పులిహోర ఆవకాయ అంటే ఇలా అప్పటికప్పుడూ చేసుకోవటమే ఉత్తమం.


ఈవాళ్టికి ఇవి చాలు. మళ్ళీ రేపు మరికొన్ని రకాల ఊరగాయలతో వస్తానేం !!



Labels: ఊరగాయలు-రకాలు 3 comments

మావిడి పిందెలతో ఆవబద్దలు

6:07 PM | Publish by తృష్ణ






చిన్న చిన్న మావిడి పిందెలతో ఆవబద్దలు పెట్టేది అమ్మ. మామూలు టేంపరరీ ఆవబద్దల్లా కాక చిన్న చిన్న పిందెలతో పెట్టడం వల్ల దీనికి ’వగరు రుచి అదనం. ఈ ఆవబద్దల వెనుక ఒక కమ్మటి జ్ఞాపకం ఉంది..


మా క్వార్టర్స్ లో, పక్కనే ఉన్న రేడియో స్టేషన్ ఆవరణలోనూ మావిడి చెట్లు ఉండేవి. ఉగాది సమయానికి ఆ చెట్ల నిండా మావిడి పిందెలు కళకళలాడుతూ ఉండేవి. కాస్త ఎక్కువ గాలి వీస్తే కొన్ని పిందెలు రాలిపడిపోతూ ఉండేవి. మా క్వార్టర్స్ లో అందరికీ పనులు చేసిపెట్టే ప్యూన్ ఒకతను ఉండేవాడు. అతను బుజ్జి బుజ్జి మావిడి పిందెలు రాలినప్పుడల్లా ఏరుకొచ్చి అడిగినవాళ్లందరికీ ఇస్తుండేవాడు. అలా మార్కెట్లో పెద్ద మావిడికాయలు వచ్చేదాకా మా ఇంట్లో చిన్న చిన్న మావిడి పిందెలతో ఆవబద్దలు, మెంతిబద్దలు పెడుతూండేది అమ్మ.


మాకు క్రితం వారం మా సంతలో దొరికాయి మావిడి పిందెలు. కొనేసి ఆవబద్దలు పెట్టేసా.





మామూలు టేంపరరీ ఆవబద్దలు పెట్టుకున్నట్లే ఇదీ పెట్టేసుకోవటం --
* మావిడి పిందెలు లోపల జీడి తీసేసి, చిన్నగా తరిగేసుకుని ,
* ఉప్పు, ఆవపొడి, కారం 1:1:1 పాళ్ళలో తీసుకుని,

* నూనె వేసి కలిపేసుకుని,

*అందులో తరిగిన బుల్లి బుల్లి మావిడిపిందెల ముక్కలు కలిపేసుకోవటమే !

*వగరుగా, పుల్లగా, కారంగా ఈ ఆవబద్దల రుచి చాలా బావుంటుంది.

Labels: ఊరగాయలు-రకాలు 5 comments

నారింజకాయ కారం

5:50 PM | Publish by తృష్ణ





నారింజకాయ
నిన్నుచూడగానే
నోరూరుతుంది
తొక్కతీసి తింటే
అబ్బబ్బ పులుపు
తిననే తినను...

అంటూ చిన్నప్పుడు పాడుకునేవాళ్ళం కదా..! 
నారింజకాయ చాలా పుల్లగా ఉంటుంది. బాగా పండితే తియ్యగా మారితుంది. సిటీల్లో అరుదుగా దొరికే ఈ నారింజకాయ చెట్టు ఒకటి అన్నయ్య వాళ్ల ఫ్రెండ్ ఇంట్లో ఉందిట. ఏవో మాటల్లో "ఆ కాయలేమిటో తెలీవు. ఏంచేసుకోవాలో తెలీక పడేస్తూ ఉంటాం" అన్నాడట అతను.. అయ్యో మేం వాడతాం..చెట్టుకెన్నుంటే అన్నీ పట్టుకురా అని అన్నయ్య నారింజకాయలు తెప్పించి నాకూ ఇచ్చాడు.

నారింజకాయతో చేసే "నారింజకాయ కారం" చాలా బావుంటుంది. రెండు రకాలుగా దీనిని చేయచ్చు..

మొదటిరకం:


* ఒక నారింజకాయ ఉంటే రెండు పెద్ద చెంచాలు నూనె వేడి చేసుకోవాలి.

* కాగిన నూనెలో పావుచెంచా ఇంగువ వేసి కాగాకా, మూడు చెంచాలు మెంతిపిండి వెయ్యాలి. తర్వాత మూడు చెంచాల కారం కూడా వేసి స్టౌ ఆపేయాలి. ఆ వేడికి కారం కూడా వేగుతుంది. ఇది చల్లర్చాలి.

* విడిగా ఒక గిన్నెలో నారింజకాయలు రసం తీసి,(రసం తీసేప్పుడు చెయ్యి తగలకుండా చూసుకోవాలి.లేకపోతే రసం చేదు వచ్చేస్తుంది) అందులో తగినంత ఉప్పు(కారానికి సమానంగా), ఒక చెంచా పచ్చి ఆవ పొడి(పచ్చిదే) వేసి బాగా కలిపిన తర్వాత కాచి చల్లార్చిన మెంతిపిండి మిశ్రమం అందులో కలపాలి.





రెండవరకం:
* రెండు చెంచాలు మినపప్పు
* రెండు చెంచాలు ఆవాలు
* నాలుగు చెంచాలు మెంతులు
* పది పన్నెండు ఎండు మెరపకాయలు
-- ఇవన్నీ కలిపి కాస్త నూనెలో వేయించి, చివరలో పావుచెంచా ఇంగువ కూడా వెయ్యాలి. చల్లారాకా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

తర్వాత నారింజకాయ రసం తీసుకుని, అందులో ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమం వేసి, తగినంత ఉప్పు వేసుకుని మొత్తం బాగా కలుపుకోవాలి.

ఇదేవిధంగా నిమ్మకాయ కారం కూడా చేసుకోవచ్చు.

వేడి వేడి అన్నంలో ఈ నారింజకాయ కారం కలుపుకుని, కాస్తంత నెయ్యి వేసుకుని తింటే... అమృతం అంటే ఇదేనేమో అనిపించకమానదు !!

Labels: ఊరగాయలు-రకాలు 13 comments

దబ్బకాయ ఊరగాయ

2:31 PM | Publish by తృష్ణ



దబ్బకాయ !! పేరులోనే గొప్ప ఫీల్ ఉంది కదా. మంచి పసుపు రంగులో చూడముచ్చటగా ఉంటుంది దబ్బకాయ. అందుకే మనుషుల రంగును చెప్పేప్పుడు "పచ్చగా దబ్బపండు ఛాయలో.." అని అంటూంటారు. దబ్బకాయతో పప్పు, పులిహోర, ఊరగాయ మొదలైనవి చేసుకుంటారు. అన్నీ బాగుంటాయి. జ్వరం వచ్చి తగ్గాకా ఆ చప్ప నోటికి అంత దబ్బకాయ అన్నం రుచి చూపిస్తే...లాలాజలం ఊరుతుంది. దబ్బ ఆకులు వేసవికాలం మజ్జిగలో వేసుకుని తాగితే ఆ మజ్జిగ రుచి అద్భుతం. మా కాకినాడ ఇంట్లో పనసచెట్టు తో పాటూ దబ్బచెట్టు కూడా ఉండేది. బోలెడు కాయలు కాసేది. పనసకాయలతో పాటూ దబ్బకాయలు, దబ్బ ఆకులు కూడా మాతో విజయవాడ వస్తూండేవి. చాలా మంది ముళ్ళ చెట్టు ఇంట్లో ఉండకూడదు కొట్టించెయ్యమని అనేవారు కాని మేము కొట్టించలేదు. ఎందువల్లో మేం స్కూల్లో ఉన్న రోజుల్లోనే ఆ దబ్బచెట్టు చచ్చిపోయింది..:((

సిటీల్లో దబ్బకాయలు అరుదుగా దొరుకుతాయి. ఆంధ్రాకి వచ్చాకా ఎక్కడా దొరకలేదు కానీ బొంబాయిలో ఓ షాపులో ప్రియా పచ్చళ్ళ వారి "Citron pickle"(దబ్బకాయఊరగాయ) దొరికేది మాకు. ఇప్పుడు వాటి సీజన్ అనుకుంటా క్రితం వారం మర్కెట్లో దొరికాయి. కాస్త రంగు తేలేదాకా ఆగి ఒక కాయతో పులిహోర, పప్పు చేసి, మరో కాయతో మొన్న ఊరగాయ పెట్టాను. ఇదే మొదటిసారి నేను పెట్టడం. ముక్కలింకా ఊరకపొయినా నిన్ననే వచ్చిన గెస్ట్ లకి భోజనంలో వడ్డించి బాగుందనిపించుకున్నా...:))




ఊరగాయ చేసే పధ్ధతి:

* ముందుగా ముక్కలు తరిగి ఉప్పు, కాస్త పసుపు వేసి కలిపి ఓ పూట ఎండలో పెట్టాలి. ఇలా



* తర్వాత ఒక మీడియం సైజు దబ్బకాయకు 100gms మెంతులు, 50gms ఆవాలు విడి విడిగా ఎర్రగా వేయించుకోవాలి. ఆవాలు నొక్కితే పొడి అవ్వాలి.అలా వేగాలి. అవి రెండూ కూడా చల్లారాకా విడి విడిగా మిక్సీ లో పొడి చేసి ఉంచుకోవాలి.

* తర్వాత ఒక చిన్న గ్లాసుడు (సుమారు వంద గ్రాములు) నూనె మూకుడులో పోసి పొయ్యిమీద కాగనివ్వలి. కాగిన నూనెలో పావు చెంచా ఇంగువ వేసి ఇంగువ నూనె కాగ నివ్వాలి.



* కాగిన ఇంగువ నూనెలో 125 gms ఎండు మిరపకాయ కారం వేసి నల్లబడకుండా వేగగానే స్టౌ ఆపేయాలి.


* మిక్సీ చేసుకున్న మెంతి పిండి, ఆవ పిండి, 125 gms ఉప్పు, ఒక పెద్ద చెంచా పసుపు పొయ్యి మీది కరమ్ ఉన్న మూకుడులో వేసి బాగా కలపాలి.



* ముక్కలు తరిగేప్పుడు బాగా పండిన దబ్బకాయలైతే రసం కారుతుంది. అది కూడా ఓ గిన్నెలో పోసి అట్టేపెట్టుకోవాలి. ఈ రసాన్ని ఇప్పుడు ఊరగాయ కలిపేప్పుడు అందులో పోసేయాలి.



* ఎండలో పెట్టిన దబ్బకాయ ముక్కలు (పొద్దుట ఎండలో పెట్టి సాయంత్రమో, మధ్యాన్నమో తీసేయచ్చు) పైన చేసుకున్న పిండిలో వేసి మళ్ళి స్టౌ వెలిగించి ఓ ఐదు నిమిషాలు కలుపుతు ఉంచాలి. దీన్ని మా ఇంట్లో పొక్కించటం అంటారు. (వేరే పేర్లు ఉన్నాయేమో తెలీదు).




* మరో పధ్ధతిలో ముక్కలు పొయ్యి మీద పెట్టకుండా రెండు రోజుల పాటు ఎండబెట్టి మాగాయకులాగ కూడా ఈ ఊరగాయ చేసుకోవచ్చు.



* మర్నాడు ఊరగాయలో ఊట ఎక్కువ రాకపోతే కాస్తంత నూనె పోసుకోవచ్చు. ఓ వారమైతే ముక్కలు బాగా ఊరి తినటానికి బాగుంటాయి. ఊరగాయ పెట్టిన మర్నాడు ముక్కలు రాకుండా పిండి వేసుకుని తినేయచ్చు. రుచి.... తిని చూడాల్సిందే !!

Labels: ఊరగాయలు-రకాలు 8 comments

మిక్స్డ్ వెజిటెబుల్ ఆవకాయ

7:20 PM | Publish by తృష్ణ






మావిడికాయతో పెట్టుకునే పర్మెనెన్ట్ ఆవకాయ కాకుండా టెంపరరీగా కేరెట్, కాకరకాయ, ములక్కడ, పచ్చిమెరప, కాలీప్లవర్, టమాటా మొదలైన కూరలతో కూడా టెంపరరీ ఆవకాయ పెట్టుకుంటాం కదా. అలానే కొన్ని కూరలు కలిపి కూడా మిక్స్డ్ వెజ్ ఆవకాయ పెట్టుకోవచ్చు. ఎలాగో చూసేస్తారా మరి..

కావాల్సిన కూరలు, పదార్ధాలు:

* కాలీప్లవర్
* బీన్స్
* కేరెట్
* బంగాళా దుంప(పచ్చిదే)
* బఠాణీ(నానబెట్టినవి)
* టమాటా (కొంచెం గట్టిగా ఉన్నది చిన్న ముక్కలు తరుక్కోవాలి)
పైన రాసిన కూరలన్నీ ఓ 250gms దాకా ఉండేలా చిన్నముక్కలు తరుగుకోవాలి. (అన్నీ పచ్చివే.)
* 1 inch కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు, 1 inch కట్ చేసిన పచ్చిమిరప ముక్కలు ఒక అర కప్పు తీసుకోవాలి.
మొత్తం కూరముక్కలన్నీ కలిపి ఒక గిన్నెలో అరచెంచా పసుపు వేసి ఉంచాలి. ముక్కల్లో తడి ఉండకూడదు.

* అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 20gms (బజార్లో అమ్మేది కొనుక్కున్నా సరే, ఇంట్లో తడి తగలకుండా గ్రైండ్ చేసుకున్న సరే)
* ఆవపిండి - 30gms
* కారం - 30gms
* ఉప్పు - 30gms
* నిమ్మరసం - 1/2 cup
* పసుపు - 1/2 sp
* oil - 1 cup

తయారీ:


* ముందుగా అల్లం-వెల్లుల్లి పేస్ట్ మాడకుండా వేయించుకోవాలి. పచ్చివాసన పోతే చాలు.

* ఆవ,కారం ,ఉప్పు బాగా కలుపుకోవాలి. ఇందులో కూరముక్కలు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి.

* చివరిలో నిమ్మరసం వేసి కలుపుకోవాలి.




కొన్ని టిప్స్:

* ఓపిక ఉంటే ఒక ఉల్లిపాయ గ్రైండ్ చేసి, ఆ ముద్దను మచ్చివాసన పోయేలా కాస్త నూనెలో బాగా వేయించి ఈ ఆవకాయలో కలిపితే కూడా రుచి బావుంటుంది.

* చేసిన  రెండ్రోజుల  తరువాత  తింటే  కూర ముక్కలు  ఊరతాయి. 

* ముక్కలు ఎక్కువగా ఉంటే దోశల్లోకి ,చాపాతిల్లోకి కుడా బావుంటుందని నేను పిండి తక్కువ కలుపుతాను. పిండి ఎక్కువ కావాలనుకునేవాళ్ళు ఆవ,కారం,ఉప్పులను మరో పది గ్రాములు ఎక్కువగా కలుపుకోవచ్చు.


* నిమ్మరసం వెయ్యకపోతే ఈ ఆవకాయ రెండ్రోజుల కన్నా నిలవ ఉండదు. పాడయిపోతుంది.

* ఈ ఆవకాయ ఒక నెల రోజులు నిలవ ఉంటుంది కానీ  ముక్కలు మెత్తబడిపోతే రుచి తగ్గిపోతుంది. అందుకని కొద్దిగా పెట్టుకుంటేనే బావుంటుంది. 

Labels: ఊరగాయలు-రకాలు 2 comments

కాలీఫ్లవర్ ఆవకాయ

5:27 PM | Publish by తృష్ణ


నా ఫేవరేట్ వెజిటబుల్ "కాలీఫ్లవర్". నాకు బోలెడంత ఇష్టం. పచ్చి కాలీఫ్లవర్ కూడా తినేంత. (అసలు నాకు నచ్చని కూరంటూ ఏదీ లేదు పాపం ఏమిటో..!) కాలీఫ్లవర్ తో రకరకాల కూరలు ప్రయోగాలూ చేస్తూందేదాన్ని. ఈ చలికాలంలో బాగా దొరికే కాలీఫ్లవర్ దొరికినంత కాలం మా ఇంట్లో ఎక్కువగా కొంటూండేవాళ్ళం. మా ఇంట్లో అమ్మ ఎప్పుడూ ఈ కాలీఫ్లవర్ దొరికితే కూరతో పాటూ కాసిని కాలీఫ్లవర్ ముక్కలతో టెంపరరీ ఆవకాయ కూడా పెడుతూ ఉండేది. నేను వంటింట్లో ప్రయోగాలు మొదలెట్టాకా రకరకాల కూరలతో ఈ టెంపరరీ ఆవకాయ ప్రయోగం చేసేదాన్ని. కేరెట్, బంగాళాదుంప, కాకరకాయ, బజ్జీ మిరపకాయలు, నాలుగైదు కూరలు కలిపి మిక్స్డ్ వెజిటబుల్ ఆవకాయ, చిన్న చిన్న మావిడికాయ పిందెలతో ఆవబద్దలు మొదలైనవి సక్సెస్ఫుల్ గా పెట్టేదాన్ని.


నిన్ననే నా కోసం కాలీఫ్లవర్ కూర చేసుకుంటూ కాసిని ముక్కలు పక్కన పెట్టాను నా మటుకు కాస్తంత ఆవకాయ చేసుకుందామని. ఇంట్లో ఎవరూ కాలీప్లవర్ గానీ, కాలీప్లవర్ ఆవకాయ గానీ తినరు మరి. ఇప్పుడిప్పుడే శ్రీవారికి, పాపకూ అలవాటు చేస్తున్నా. ఇంతకీ నోరూరించే బుల్లి డబ్బాడు కాలీఫ్లవర్ ఆవకాయ రెడీ చేసేసాను.




చాలామందికి తెలిసే ఉంటుంది. తెలీనివాళ్ళకు ఎలాగో చెప్పనా మరి..


(పదార్ధాల పాళ్ళు వేసే ముక్కలను బట్టి ఉంటుంది. అందుకని కొలత రాయటం లేదు.)
చిన్నగా తరిగిన కాలీఫ్లవర్ ముక్కలు
ఆవ పొడి, పచ్చికారం : సమానంగా
ఉప్పు పైవాటికి కాస్త తక్కువగా
నూనె తగినంత( మామూలుగా నేను వంటలోకి ఏ నూనె వాడినా టెంపరరీఆవకాయకు మాత్రం పప్పు నూనె వాడతాను. టేస్ట్ బాగుంటుంది అని)
ఒకటి, రెండు చెంచాల నిమ్మరసం(సగం పువ్వుకి ఒక నిమ్మకాయ చాలు)


ముందు ఆవ,కారం, ఉప్పు పొడివే బాగా కలుపుకోవాలి. తరువాత నూనె వేసి పిండి కలిసేలా కలుపుకోవాలి. తరువాత కాలీఫ్లవర్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. నిలవ ఉండటానికి నిమ్మరసం వాడతాం అన్నమాట. కొంతమంది కూర ముక్కలను ఆవకాయ కలిపే ముందు కొద్దిగా వేయిస్తారు. కానీ నాకు అలా నచ్చదు. త్వరగా ముక్కలు మెత్తగా అయిపోతాయి. నేనయితే పచ్చి ముక్కలతోనే ఆవకాయ పెడతాను. ఇది ఓ వారం రోజులకు సరిపడా అయితే బాగుంటుంది. అంతకన్నా ఎక్కువ నిలవ ఉంటే ముక్కలు బాగా మెత్తగా అయిపోయి టేస్ట్ కూడా మారిపోతుంది.



Labels: ఊరగాయలు-రకాలు 2 comments
Older Posts »
"Health is Wealth."

ఇక్కడ వెతకండి..

'రుచి' చూసినవారు

పంచుకున్న రుచులు

  • ▼  2015 (3)
    • ▼  March (3)
      • సలాడ్ ప్రసాదం :-)
      • బుడిదగుమ్మడి కాయ పప్పు (ash gourd/winter melon dal )
      • Veg.Hakka Noodles
  • ►  2014 (24)
    • ►  December (2)
    • ►  November (2)
    • ►  September (1)
    • ►  July (2)
    • ►  June (4)
    • ►  May (3)
    • ►  April (2)
    • ►  March (7)
    • ►  January (1)
  • ►  2013 (32)
    • ►  December (3)
    • ►  September (4)
    • ►  August (2)
    • ►  July (3)
    • ►  May (1)
    • ►  April (8)
    • ►  March (3)
    • ►  February (1)
    • ►  January (7)
  • ►  2012 (26)
    • ►  December (1)
    • ►  November (3)
    • ►  October (5)
    • ►  June (4)
    • ►  May (5)
    • ►  April (1)
    • ►  March (1)
    • ►  February (4)
    • ►  January (2)
  • ►  2011 (35)
    • ►  December (3)
    • ►  November (6)
    • ►  September (3)
    • ►  August (4)
    • ►  June (2)
    • ►  May (4)
    • ►  April (6)
    • ►  March (5)
    • ►  February (2)
  • ►  2010 (14)
    • ►  December (6)
    • ►  September (4)
    • ►  August (1)
    • ►  June (3)

About

ఇవి కూడా నావే

  • తృష్ణ...
    38వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శన
    1 month ago
  • మనోనేత్రం
    Millet fest - 2015
    10 years ago
Powered by Blogger.

రుచులు - రకాలు

  • chutneys n పచ్చడ్స్ (19)
  • cooking tips (1)
  • experiments (10)
  • Kitchen Essentials (1)
  • pulses (3)
  • quick & easy (4)
  • recipe links (1)
  • rotis (2)
  • salads (7)
  • snacks n sweets (19)
  • soups and appetizers (2)
  • tiffins (24)
  • అట్లు - రకాలు (6)
  • ఊరగాయలు-రకాలు (12)
  • ఒడియాలు (3)
  • కూరలు (25)
  • చారులు రకాలు (1)
  • టీలు - రకాలు (1)
  • దోశలు రకాలు (7)
  • పప్పులు (4)
  • పులిహోర (4)
  • పులుసులు (2)
  • పెరుగు పచ్చడి (2)
  • మన పిండివంటలు (2)
  • రకరకాల పొడులు (2)
  • రైస్ వెరైటీస్ (6)
  • వేసవి పానీయాలు (7)

'రుచి' ఇష్టపడేవారు

Copyright (c) 2010 రుచి...the temptation. Design by Template Lite
Download Blogger Templates And Directory Submission.