skip to main | skip to sidebar

Pages

  • Home

రుచి...the temptation

"The best way to a man's heart is through his stomach."
Showing posts with label కూరలు. Show all posts
Showing posts with label కూరలు. Show all posts

quick & easy : దొండకాయ(Tendli/Ivy gourd) మొత్తుకూర!

3:50 PM | Publish by తృష్ణ



"మొత్తుకూర..?" ఇదేం పేరని నవ్వుకోకండి. దొండకాయల్ని మొత్తి చేసే కూర కాబట్టి మేం దీనిని మొత్తుకూర అంటాం. ఈజీగా, త్వరగా అయిపోయే కూర ఇది. 

ఎలా చెయ్యాలంటే:
* ముందర దొండకాయల్ని కడిగి రెండువైపులా కొసలు కట్ చేసేసుకోవాలి. (లేతవైతే చేతితో గిల్లేసినా చాలు. ఒకోసారి అదీ చెయ్యను నేను :))


* పచ్చిమిర్చి, అల్లం తొక్కే రాయి/కల్వం తీసుకుని ఎవరిమీద కోపం ఉందో వాళ్లని తల్చుకుంటూ దొండకాయల్ని ఒక మొత్తుమొత్తండి. కోపం అన్నానని మరీ దొండకాయల్ని పచ్చడి చేసేయకండి. కాయ కాస్త చిట్లేలా(స్లిట్ అయ్యేలా) జస్ట్ అలా ఒక చిన్న దెబ్బ వెయ్యండి చాలు. ఇలా..



* తర్వాత చిన్న కుక్కర్(2 or 3 ltrs) తీసుకుని అందులో ఒక చెంచా ఆయిల్ వేసి, మొత్తి ఉంచిన దొండకాయ ముక్కలు, తగినంత ఉప్పు, కారం, తొక్కిన వెల్లుల్లి రేకలు నాలుగు, పావు చెంచా పసుపు, పావు చెంచా జీలకర్ర పొడి, అర గ్లాసు నీళ్ళు(ఈ కొలతలు ఓ పావుకేజీ దొండకాయలకి) పోసి విజిల్ పెట్టేసి, రెండు  విజిల్స్ రాగానే స్టౌ ఆపేయాలి. 
ఒకవేళ చిన్న కుక్కర్ లేకపోతే మూకుడులోనే ఇవన్నీ వేసి మూత పెట్టాలి. మూకుడైతే మరో అర గ్లాస్ ఎక్కువ నీళ్ళు పోయాలి.

* కుక్కర్ మూత తీసి నీళ్ళేమైనా మిగిలి ఉంటే ఇగిరేదాకా ఐదు నిమిషాలు కూరని పొయ్యిపై ఉంచాలి.

* ఉప్పుకారాలు చెక్ చేసుకుని అవసరమైతే కలిపాలి. ఒకవేళ ఎక్కువైతే కూరలో అరగ్లాస్ నీళ్ళు పోసి అటుఇటు కదిపి ఓ గిన్నెలోకి వంపేసుకోవాలి. అవి కూర ఉడికిన నీళ్ళు కాబట్టి తర్వాత ఏ చారులోకో వాడుకోవచ్చు.


 కూర అలానే తినేయచ్చు కానీ కూర ముక్కలు బాగా వేగినట్లు అవ్వాలి అనుకుంటే కుక్కర్లోంచి ఏదైనా పేన్/మూకుడు లోకి షిఫ్ట్ చేసి, ఒక చెంచా ఆయిల్ వేసి మధ్య మధ్య కదుపుతూ ఐదు నిమిషాల తర్వాత స్టౌ ఆపేయాలి.


* మూకుడులోనే ఉడకపెడితే నీళ్ళు ఇగిరిపోయాకా చెంచా ఆయిల్ వేసి, ముక్కలు బాగా వేగినట్లయ్యాకా ఆపేయాలి.


* అన్నం లేదా చపాతీల్లోకి ఈ కూర బావుంటుంది.

***   ***   ***

* దొండకాయ కారం పెట్టి చేసిన కూర రెసిపీ క్రింద లింక్ లో:
http://ruchi-thetemptation.blogspot.in/2012/06/blog-post_04.html

***    ***

టిప్:

దొండకాయలు ఫ్రై చేసేప్పుడు కూడా ఇలా కాసిని నీళ్ళు పోసి చిన్న కుక్కర్లో పెట్టి, ఒకటి లేదా రెండు విజిల్స్ వచ్చాకా ఆపేసి, తర్వాత మూకుట్లో ఫ్రై చేసుకుంటే త్వరగా అవుతుంది కూర + ఎక్కువ నూనె వాడక్కర్లేదు . ముక్కల్ని బట్టి కాసిని నీళ్ళు పోతే కాబట్టి కుక్కర్లో పెట్టినా కూర ముక్కలు పేస్ట్ అవ్వవు.

Labels: quick & easy, కూరలు 4 comments

వంకాయ-కొత్తిమీరకారం

1:12 PM | Publish by తృష్ణ






వంకాయ-కొత్తిమీరకారం చక్కగా నవనవలాడే లేత వంకాయలు మార్కెట్లో దొరికినప్పుడు నాకు గబుక్కున తట్టేది ఒకటే కూర "వంకాయ-కొత్తిమీరకారం". గుత్తి వంకాయలైనా, మామూలు వంకాయలైనా ఫ్రెషా కాదా అనేది వాటి ముచికను బట్టి తేల్చచ్చు. ఫ్రెష్ అయితే ముచిక ఆకుపచ్చగా ఉంటుంది. లేకపోతే కాస్త వాడినట్లు ఉండి రంగు మారిపోయి అసలు ఆకుపచ్చగానే ఉండవు.


ఇప్పుడు కొత్తిమీర కారం గురించి చెప్పుకుందాం. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు కలిపి గ్రైండ్ చేసి కొన్ని కూరల్లో వేసుకోవచ్చు. వంకాయల్లో వేస్తే రుచి అమోఘంగా ఉంటుంది. నాకీ కొత్తిమీర అన్నది ఫేవొరేట్ కాబట్టీ దొండకాయ, బీరకాయ, ఆనపకాయ కూరల్లో కూడా ఈ కొత్తిమీర కారం వేస్తూంటాను. మా అన్నయ్య నాకన్నా ఒక మెట్టు పైకెక్కి కాకరకాయలో కూడా కొత్తిమీర కారం వేసి ఓరోజు వండాడు. (తినడానికి బాగానే ఉందిలెండి :))



వంకాయ-కొత్తిమీర కారం కూర తయారీ:
* పావుకేజీ వంకాయలు తోచిన విధంగా ఉప్పు వేసిన నీళ్ళల్లోకి తరుక్కోవాలి. ఇలా అయితే ముక్కలు నల్లబడకుండా ఉంటాయి.

* రెండు మీడియం సైజు కొత్తిమీర కట్టలు కడిగి చటుక్కున ఎండు మూడు భాగాలుగా తెంపి పెట్టుకోవాలి. (తెంపమనడం ఎందుకంటే దానికి చాకు అక్కర్లేదని అర్థం)

* మూడు, నాలుగు మీడియం సైజు పచ్చిమిరపకాయలు (ఇది ఎవరి కారాన్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు) కొత్తిమీర కలిపి గ్రైండ్ చేసుకోవాలి లేదా తొక్కుకున్నా సరే.

* మూకుట్లో కూరముక్కలు వేసి, ఆ ముక్కలకి సగం కొలతన నీళ్ళు పోసి, తగినంత(అరచెంచా) ఉప్పు వేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి. (వంకాయల్లో తక్కువ ఉప్పు పడుతుంది. కాస్త ఎక్కువైనా కూరంతా ఉప్పు కషాయం అయిపోతుంది.)

* వంకాయముక్కలు సగం ఉడికిన తర్వాత రెండు చెంచాల నూనె వేసి గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర కారాన్ని అందులో వేసేయాలి. (నూనె తినగలిగినవాళ్ళు మరో రెండు చెంచాలు నూనె వేసుకుంటే రుచి ఇంకా అద్భుతంగా ఉంటుంది.)


* కూర మాడకుండా మధ్య మధ్య కలుపుతూ దగ్గర పడ్డాకా స్టౌ ఆపేయడమే. 




ఆయుర్వేదం మందుకి వంకాయ తినకూడదు. అందుకని మందు వాడనప్పుడు మాత్రమే ఈ కూర వండడం అవుతుంది. సహజంగా మనిషికి ఏది లభ్యం కాదో దాని మీదే మోజు ఎక్కువ కదా.. అందుకని నా ఫేవరేట్ కూరల జాబితాలో ఈ కూర చేరిపోయింది :)

Labels: కూరలు 4 comments

బెండకాయలు-శనగపప్పు కారం

7:19 PM | Publish by తృష్ణ





బెండకాయలు మామూలుగా చిన్న చిన్న ముక్కలుగా కాకుండా పై ఫొటోలో లాగ మధ్యకు చీరి, సన్నగా పొడుగ్గా ఉండేలా తరిగి కూర చేస్తే తినడానికీ, చూడటానికీ కూడా వెరైటీగా ఉంటుంది :) 
శనగపప్పు కారం ఎలా చెయ్యాలో క్రింద రెసిపీలో రాసాను. అక్కడ ఓసారి చూసి వచ్చేయండి..:)
http://ruchi-thetemptation.blogspot.in/2012/06/blog-post_04.html

* ఈ శనగపప్పు కారం బీరకాయ, దొండకాయ, వంకాయ, కాకరకాయ మొదలైన కూరల్లో వేసుకోవచ్చు.

* శనగపప్పు తినకూడనివాళ్ళు, పడనివాళ్ళూ అది లేకుండా మిగతా ఐటెంస్ తో పొడి గ్రైండ్ చేసుకోవచ్చు. కాస్త మినపప్పే ఎక్కువ వేసుకుంటే సరి.


తయారీ:
* మూకుడులో  రెండు చెంచాలనూనె వేసి,  మధ్యకు చీరి సన్నగా తరిగిన బెండకాయ ముక్కలు వేసి, కాస్త వేగాకా క్రైండ్ చేసి ఉంచుకున్న శనగపప్పు కారం, తగినంత ఉప్పు వేసి మూతపెట్టి, మూతలో అర గ్లాసుడు నీళ్ళు పోయాలి. నాన్స్టిక్ పేన్ అయితే పైన క్లోజ్డ్ లిడ్ ఉంటుంది కదా అది పెట్టేస్తే సరిపోతుంది.

* కూర అయ్యేదాకా స్టౌ సిమ్ లోనే పెట్టాలి. అప్పుడే బాగా వేగుతుంది కూర.

*  ఐదు పదినిమిషాల తర్వాత ముక్కలు మెత్త బడ్డాయి అనిపించాకా మూత తీసేసి, మధ్య మధ్య కలుపుతూ ఓపెన్ గా వేయించాలి కూర. అప్పుడు బెండకాయలు జిగురువల్ల ముద్దగా అయిపోకుండా పొడిపొడిగా వస్తుంది కూర.



టిప్:
ఈ కూరలో సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. శనగపప్పు కారం వేసేప్పుడే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేయచ్చు.


Labels: కూరలు 2 comments

బుజ్జి పొటాటోస్ + మెంతి ఆకుల కూర (baby aloos + methi leaves curry)

10:04 AM | Publish by తృష్ణ




మార్కెట్లో రాసిగా పోసిన బుజ్జి బుజ్జి బంగాళాదుంపలను చూస్తే వాటితో రకరకాల కూరలు చేసేయాలని సరదా పుడుతుంది నాకు. బంగాళాదుంపలు నా కిచెన్ లో మోస్ట్లీ నిషిధ్ధం! అయినా ఓసారికి ఆ నిషేధాన్ని ఎత్తివేసి బేబి ఆలూస్ దొరికినంతకాలం ఓ కేజి కొనేస్తూ ఉంటాను. వన్స్ ఇన్ ఎ వైల్ ఆలూస్ తినచ్చు పర్లేదు అనేస్కుని :)

మా పాప కూడా మెంతికూరతో పప్పు చేస్తే తినడానికి తిప్పలు పెడుతుంది కానీ ఈ కూర చేస్తే ఇష్టంగా తింటోంది. ఈ కూర నేనే చేసే పధ్ధతి ఎలాగంటే..

కావాల్సినవి:
అరకేజీ బేబీ పొటాటోస్
ఒక పెద్ద ఉల్లిపాయ లేదా రెండు మీడియం ఉల్లిపాయ ముక్కలు
మూడు కట్టలు మెంతి ఆకు లేదా ఐదు కట్టలు చిన్న మెంతుకూర
మూడు నాలుగు చెంచాల నూనె
అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అరచెంచా(ఫ్రెష్ గ తొక్కుకుంటె బావుంటుంది)
అర చెంచా ధనియాల పొడి
అర చెంచా ఆమ్చూర్ పౌడర్(dry mango powder)
అర చెంచా జీరా పౌడర్
అర చెంచా పసుపు
పోపులోకి: ఆవాలు, జీలకర్ర, మినపప్పు, చిటికెడు ఇంగువ

తయారీ:
* ముందు ఓ అరకేజీ బిజ్జి పొటాటోస్ రాళ్లఉప్పు(కూరలు,దుంపలు, పల్లీలు తొక్కతో ఉడకబెట్టేప్పుడు రాళ్ల ఉప్పు వాడతాను) వేసి మూడు విజిల్స్ వచ్చేదాకా ప్రెషర్ కుక్ చెయ్యాలి.
* తర్వాత తొక్క తీసి, (కొన్ని ఆలూస్ మరీ పెద్దగా ఉంటే మధ్యకు కోసి) ఓ రెండు చెంచాల నూనెలో కాసేపు వేగనివ్వాలి. ఓ చెంచా కారం వెయ్యాలి. 



* మెంతి ఆకులు బాగా కడిగి చిన్నగా కట్ చేసుకోవాలి.
* మూకుడులో రెండు చెంచాల నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, చిటికెడు ఇంగువ పోపు వేయించిన తర్వాత, ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేగుతుండగా మెంతి ఆకు వేసి, ఆకు అడుగంటకుండా మధ్య మధ్య కలుపుతూ బాగా వేగనివ్వాలి. ఇలా..


* తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆమ్చూర్ పౌడర్, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలిపాకా,
* ముందుగా వేయించుకున్న బేబి ఆలూస్ అందులో కలిపెయ్యాలి.
* ఒక్క అర గ్లాస్ నీళ్ళు పోసి,  ఉప్పు కాస్త వేసుకుని మూత పెట్టేయాలి.
* నీళ్ళు ఇగిరిపోయి కూర డ్రై గా అవుతుండగా స్టౌ ఆపేసుకోవడమే.
* చపాతీ, పూరీ, రైస్ మూడింటిలోకీ ఈ కూర బాగుంటుంది.

Labels: కూరలు 2 comments

పండిన దొండకాయలతో తీపి కూర

10:39 AM | Publish by తృష్ణ




మార్కెట్ నుండి కూరలు తెచ్చాకా ముందర త్వరగా పాడయిపోయేవీ, పండిపోయే కూరలనీ వండేసుకుంటాం కదా! ఎంత జాగ్రత్తగా ఏరి తెచ్చుకున్నా దొండకాయలు త్వరగా పండిపోతూంటాయి. అలాంటివాటిని పడేయకుండా తీపి కూర వండేసుకోవచ్చు. పండిపోవడం అంటే మరీ ఎర్రగా, మెత్తగా అయిపోయినవి కాక ఆకుపచ్చదనం పోయి కాస్తఎరుపెక్కిన దొండకాయలు ఉంటాయి కదా..అవన్నమాట!! వాటితో కారంపెట్టి కూర  చేసినా పుల్లగా ఉంటాయి ముక్కలు. అందుకని మా చిన్నప్పుడు అమ్మ ఇలా తీపి వేసి వండేసేది. 'తియ్యగా' ఉంటే చాలు.. వదలకుండా తినేసేవాళ్ళం..:)


* ముందర తరిగేప్పుడే కాస్త పండిపోయినట్లున్న దొండకాయ ముక్కలు వేరే గున్నెలో వేసుకోవాలి.
* అవి కప్పుడు ముక్కలు ఉంటే అర కప్పు నీళ్ళు, పావు చెంచా ఉప్పు; 
రెండు కప్పులు ముక్కలు ఉంటే ఒక కప్పు నీళ్ళు, అర చెంచా ఉప్పు రెండు విజిల్స్ వచ్చేదాకా ప్రెషర్ కుక్ చెయ్యాలి.

సుమారు పావుకేజీ కూరకి:

* మూకుడులో ఒక చెంచా నూనె వేసి అర చెంచా శనగపప్పు, మినపప్పు, పావు చెంచా ఆవాలు, జీలకర్ర వేసి, రెండు ఎండు మిరపకాయలు, రెండు రొబ్బలు కర్వేపాకు, చిటికెడు ఇంగువ,పసుపు వేసి పోపు వేయించాలి.

* ఉడికిన ముక్కలు (నీళ్ళు ఉంటే వాటితో పాటే) పోపులో వేసేయాలి. చిన్న నిమ్మకాయంత బెల్లం తరుగు(తీపి బాగా ఇష్టమతే ఇంకాస్త వేసుకోవచ్చు) అందులో వెయ్యాలి. ఉప్పు మరికాస్త కావలిస్తే కలుపుకోవాలి.

* బెల్లం కరిగి, కూర ముక్కల్లో నీళ్ళు పూర్తిగా ఇగిరే వరకూ మధ్య మధ్య కూర కలుపుతూ ఉండాలి.

* కూరంతా దగ్గరపడి,ఉడికింది అనిపించాకా చివర్లో ఫ్రెష్ కొబ్బరి(ఫ్రెష్ అయితే బెటర్) కానీ, ఎండు కొబ్బరి పొడి గానీ రెండు చెంచాలు వేసి స్టౌ ఆపేయాలి.

* పండిన దొండకాయ ముక్కలు పుల్లగా ఉంటాయి కాబట్టి కూరలో ఇంక చింతపండు రసం లాంటివేమీ కలపక్కర్లేదు.

* తియ్యతియ్యగా,పుల్లపుల్లగా బావుంటుందీ కూర!




* తీపి వద్దనుకుంటే ఉడకపెట్టిన ముక్కలు పోపులో వేసేసి, కొబ్బరి కోరు వేసి కూడా వండుకోవచ్చు.

Labels: కూరలు 2 comments

ఆకాకరకాయ(kantola/Spiny Gourd)తో...

4:19 PM | Publish by తృష్ణ






ఆకాకరకాయలు అన్ని సీజన్స్ లో దొరకవు. ఈ సీజన్ లో బాగా దొరికుతాయి. ఆంగ్లంలో Spiny Gourd అనీ, నార్త్ లో 'కంటోలా' అంటారు వీటిని. మా చిన్నప్పుడు బజార్లో ఆకాకరకాయ దొరికినన్నాళ్ళూ వీలయినప్పుడల్లా కొంటూండేది అమ్మ. మా ఇంట్లో అందరికీ మహా ఇష్టం. మా అత్తవారి ఇంట్లో అసలు తెలీదంటారు. ఆకాకరకాయ తెలిదన్నవాళ్లందరికీ ఆనందరావు కథ చెప్తుంటాను నేను. "ఆనందరావు ఆకాకరకాయ" అని ఓ కథ చదివానెప్పుడో.. ఎంటంటే..

ఒక ఆనందరావుకి ఆకాకరకాయలంటే మహా ఇష్టంట. పెళ్ళయిన కొత్తల్లో ఓ రోజు కొనుక్కొచ్చి భార్య కిచ్చి వండమన్నాడట. ఆవిడకు ఆకాకరకాయ అంటే తెలీదుట. ఎలా వండాలో అంతకన్నా తెలీదుట. తోచినట్లు చేసిందట. ఎంతో ఆత్రంగా కూర తిందామని ఆనందరావు కంచం ముందు కూచున్నాట్ట. ఆవిడ ఓ చెంచాడు కూర వేసిందిట. ఇదేమిటన్నాడుట.. అప్పుడు ఆవిడా, నేనివెప్పుడూ చూళ్ళేదు.. బయట గరుకుగా ఉందని పెచ్చు తీసేసాను. లోపల గింజలు ఉన్నాయని అవి తీసేసాను. ఇక ఇంతే కూర అయ్యిందందిట... పాపం ఆనందరావు! అయ్యగారికి ఆకాకరకాయ తెలియకపోయినా నాకు వండుకోవడం వచ్చు కాబట్టి ఆనందరావులాంటి ఇబ్బంది లేదు నాకు :)

ఆకాకరకాయ కాకరకాయలాగానే ఉంటుంది కానీ బయట బాగా గరుగ్గా ఉంటుంది కాబట్టి బాగా కడిగి వాడాలి. సన్నగా నిలువుగా చీరచ్చు లేదా చిన్న చిన్న ముక్కలు తరగచ్చు. వాటితో మూడు నాలుగురకాయ కూరలు వండచ్చు. గింజ ఎక్కువ పట్టని లేత కాయలు చూసి కొనుక్కుంటే ముదిరిన గింజలు పళ్ళల్లో ఇరుక్కోకుండా, రుచిగా ఉంటుందీ కూర.



1. ఆకాకరకాయ వేపుడు:

* సన్నగా పొడుగ్గా కాని చిన్న ముక్కలుగా గాని తరిగి ఆకాకరకాయలు డైరెక్ట్ గా ఫ్రై చేసుకోవచ్చు. లేదా ఒక్క విజిల్ వచ్చేదాకా ప్రెజర్ కుక్ చేసి తర్వాత ఒకటి రెండు చెంచాల నూనెలో ఫ్రై చేయచ్చు. ఇలా అయితే తక్కువ ఆయిల్ లో వేయించినట్లు అవుతుంది. ప్రెజర్ కుక్ చేసేట్లయితే నీళ్లు ఎక్కువ పొయ్యకూడదు. ఒక్కటే విజిల్ రాగానేతీసెయ్యాలి. లేకపోతే ముక్కలు పేస్ట్ అయిపోతాయి.


ఉడికించిన ఆకాకరకాయ


* ముక్కలు వేగాకా రెండు చెంచాల నూనెలో కాస్తంత వేయించి తగినంత ఉప్పు,కారం వేసుకుని దింపేయచ్చు.

* వేపుడు కాస్త స్పైసీ గా కావాలనుకుంటే అర చెంచా ఆమ్చూర్ పౌడర్(dried mango powder), చిటికెడు పసుపు, అర చెంచా ధనియాల పొడి, అర చెంచా జీలకర్ర పొడి వేసి బాగా కలిపి ఆపేయాలి.


2. ఆకాకరకాయ తీపి కూర:

* ఆకాకరకాయ ముక్కలు తగినంత ఉప్పు వేసి ఒక్క విజిల్ వచ్చేలా పెజర్ కుక్కర్లో ఉడికించాలి, లేదా విడిగా మూకుడులో కొద్దిగా ఉడకబెట్టి దింపుకోవాలి.

* తర్వాత ఆవాలు,జిలకర్ర, మినపప్పు,సనగపప్పు, ఇంగువ పోపు పెట్టి, ఉడికిన ఆకాకరకాయ ముక్కలు వేసేసి, అరకప్పు తురిమిన పచ్చి కొబ్బరి ,రెండుమూడు చెంచాల బెల్లం తరుగు వేసి, బెల్లం కరిగాగా కూర బాగా కలిపి స్టౌ ఆపేయాలి.



౩. ఆకాకరకాయ ఉల్లికారం:

* పావుకేజీ ఆకాకరకాయలకి మూడు మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకోవాలి.

* ఉల్లిపాయ ముక్కలు తరిగి కారం,ఉప్పు,రెండు వెల్లుల్లిపాయలు(ఇష్టమైతేనే), అరచెంచా జీలకర్ర,  చిటికెడు పసుపు, చిటికెడు ఇంగువ వేసి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి.

* ఆకాకరకాయ ముక్కలు ముందుగా కాస్త ఉప్పు,పసుపు వేసి ఉడకబెట్టేసుకోవాలి.

* మూకుడులో రెండు చెంచాల నూనె వేసి గ్రైండ్ చేసిన ఉల్లి కారం ముద్ద వేసి కాస్త పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి. 

* తర్వాత ఆకాకరకాయ ముక్కలు వేసి, కూర బాగా దగ్గర పడేదాకా మధ్య మధ్య కలుపుతూండాలి. 

* ఉల్లికారం ముందు వేగిపోతుంది కాబట్టి ఓ ఐదునిమిషాల్లో కూర అయిపోతుంది.




4. stuffed ఆకాకరకాయ:

 * బేసిక్ గా ఇది ఓ స్నాక్ ఐటెం అనచ్చు. డీప్ ఫ్రై చెయ్యాలని నేనెప్పుడూ ప్రయత్నించలేదు కానీ విధానం తెలుసు. తురిమిన ఫ్రెష్ కొబ్బరి, వేరుశనగ(పల్లీ) పొడి, ఉప్పు ,కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్,కొత్తిమీర బాగా కలిపి ఈ ముద్దని ఆకాకరకాయ సగానికి చీరి, గింజలు తీసేసి అందులో కూరాలి.

* ముప్పవు కప్పు శనగపిండి, పావు కప్పు బియ్యప్పిండి,చిటికెడు వంటసోడా, ఉప్పు, కారం కలిపి కాసిని నీళ్లతో బజ్జి పిండిలా కలుపుకుని ఇందాకా స్టఫ్ చేసిన ఆకాకరకాయలు ఈ బజ్జి పిండిలో ముంచి డీప్ ఫ్రై చెయ్యాలి.

* ఇవి బజ్జీల్లా అప్పటికప్పుడు ఏ టమాటా సాస్ తోనో కొత్తిమీర చట్ని తోనో తింటే బాగుంటాయి.

--------------------------------

టిప్:
కాకరకాయ లాగానే ఆకాకరకాయ కూడా బాగా వేడి చేస్తుంది కాబట్టి వేడివేడి చేసే తత్వం గలవాళ్ళు ఈ కూర తిన్నప్పుడు మజ్జిగ తాగడమో, కొబ్బరినీళ్ళు తాగడమో చేస్తే వేడి చెయ్యకుండా ఉంటుంది.

Labels: కూరలు 6 comments

రాజ్మా(Rajma) కూర

6:56 PM | Publish by తృష్ణ





సోయా, బొబ్బర్లు, శనగలు లాగ రాజ్మా గింజలు కూడా బజార్లో దొరుకుతాయి. ఆరోగ్యానికి ఎంతో మంచివి. ముఖ్యంగా రక్తంలో సుగర్ లెవెల్స్ ను వియంత్రించగలవు, చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించగలవు. కాబట్టి డయాబెటిక్ పేషంట్స్ రెగులర్ గా వాడితే చాలా మంచిది. రాజ్మా గింజలు రాత్రి నానబెడితే పొద్దున్నకు బాగా నానతాయి. మిగిలిన పప్పుధాన్యాల కన్నా ఇవి నానటానికి, ఉడకటానికీ ఎక్కువ సమయం పడుతుంది. నానిన రాజ్మా ఉడకబెట్టి, వాటితో చేసిన కూర చపాతీల్లోకీ,పూరీల్లోకీ తినవచ్చు. 

రాజ్మా గింజలు ఎరుపువి, కాశ్మీరీ రాజ్మా అని నల్ల గింజలు, ఎక్కువ ముదురు ఎరుపు..ఇలా మూడు నాలుగు వెరైటీలు దొరుకుతాయి. ఏవైనా కొనవచ్చు. ఎక్కువ కాలం నిలవ ఉంటాయి. శనగల్లా త్వరగా పురుగు పట్టవు. ఇంకా, శనగల కూరలో వేసే "ఛోలే మసాలా" అమ్మినట్లే బయట "రాజ్మా మసాలా" పొడి అమ్ముతారు. అది ఎక్స్పైరీ డేట్ చూసి కొని ఉంచుకోవాలి. 

రాజ్మా వాడకం వల్ల ఆరోగ్యపరమైన ఉపయోగాలు ఇక్కడ:
http://www.infosamay.com/health-benefits-of-kidney-beans-rajma/

ఎక్కువ మసాలా వెయ్యకుండా  చపాతీల్లోకి నేను రాజ్మా కూర ఎలా చేస్తానో చెబుతాను.. 

కావాల్సినవి: 

* ఉడకబెట్టిన రాజ్మా ఒక కప్పు(సుమారు 150gms)
* ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక పెద్ద టమాటా ముద్ద (ఫ్రెష్ గా గ్రైండ్ చేసినది)
* ఒక చెంచా రాజ్మా మసాలా పౌడర్
* అర కప్పు ఉడికించిన కందిపప్పు
* అర చెంచా జీలకర్ర పొడి/జీలకర్ర
* కాసిని కొత్తిమీర ఆకులు

చేసే విధానం:

* నానిన రాజ్మా గింజలని కుక్కర్లో కాస్త ఉప్పు(తర్వాత కూరలో సరిపడా వేయొచ్చు), కాస్త పసుపు వేసి బాగా ఉడికించాలి. ఆరేడు కూతలు వచ్చినా పర్వాలేదు. ముద్దగా అవ్వవు.

* మూకుడులో రెండు చెంచాల నూనె వేసి అర చెంచా జీలకర్ర పొడి/జీలకర్ర వేసి అదివేగాకా గ్రైండ్ చేసి ఉంచిన టమాటా,ఉల్లిపాయ ముద్ద వేసి బాగా వేగనివ్వాలి.

* అప్పుడు రాజ్మాను కుక్కర్లో రాజ్మా ఉడికించిన నీళ్లతో సహా ఉడికిన టమాటా,ఉల్లిపాయ ముద్ద లో వెయ్యాలి. అవసరమైతే మరి కాస్త ఉప్పు కలపాలి.

* కాసేపు అది దగ్గర పడ్డాకా అరకప్పు ఉడికిన పప్పు పల్చగా చేసి కూరలో కలిపి, టమాటా,ఉల్లిపాయ ముద్ద లో ఒక చెంచా రాజ్మా మసాలాపొడి కూడా వేసి బాగా కలపాలి. అవసరమైతే అరగ్లాసు నీళ్ళు పోసి కూర మీద మూత పెట్టాలి.

* మధ్య మధ్య కలుపుతూ ఒక ఐదు,పది నిమిషాల తర్వాత ఆపేయాలి.

* కూర ఆపేసాకా తరిగిన కొత్తిమీర ఆకులు పైన చల్లాలి.

సలహాలు:(ఇది నూనె,మసాలా ఎక్కువ వాడినా పర్వాలేదనుకునేవారికి)

* మసాలా ఎక్కువ కావాలనుకుంటే కూర ఉడికేప్పుడు ఒక చెంచా అల్లం,వెల్లుల్లి పేస్ట్, ఒకచెంచా ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు.

* ఉడికిన పప్పు కలిపే బదులు అర కప్పు పెరుగు చిలికి కూరలో కలపచ్చు.

* ఉల్లిపాయ ముక్కలు తరిగి వేయించి ఆ తర్వాత టమాటా ముద్ద అందులో వేసి ఉడికించచ్చు.

--------------------------

ఇదే రెసిపీని బొబ్బర్లు, అలసందలు, సోయా మొదలైన గింజలతో చేసుకోవచ్చు లేదా అన్ని గింజలు కలిపి నానబెట్టి, ఇదే రెసిపీ ప్రకారం వండుకోవచ్చు.




Labels: pulses, కూరలు 6 comments

చిక్కుడు కాయతో రెండు కూరలు..

7:03 PM | Publish by తృష్ణ



ఈ చలికాలంలో చిక్కుడు కాయలు బాగా వస్తాయి కదా. వాటితో రెండు కూరలు.. ఇవి చాలామంది చేసుకునేవే.. తెలియనివాళ్ళు ఉంటే చేసుకుంటారని రాస్తున్నా.




సింపుల్ చిక్కుడుకాయ కూర:

* చిక్కుడుకాయలు కడిగి,  పురుగు లేకుండా వలిచి చూసుకుని మధ్యకి తుంపుకోవాలి.

*  ఆ ముక్కల్ని చిన్న కుక్కర్లో కాస్త ఉప్పు వేసి ఉడికించాలి. ముక్కలెన్ని ఉంటాయో దానికి సగమ్ నీళ్ళు పోస్తే చాలు.

* ఒకే ఒక్క విజిల్ వచ్చాకా ఆపేయాలి. ఎక్కువ కూతలు వస్తే ముక్కలు పేస్ట్ అయి కూర ముద్దగా అయిపోతుంది.


* కడాయిలో ఒకటి,రెండు చెంచాల నూనె వేసి ఈ ముక్కలు అందులో వేసేసి, ఐదు నిమిషాల తర్వాత కాస్త ఉప్పు, కారం(వెల్లుల్లి ఉన్న 'మసాల కారం' అయితే బావుంటుంది) చల్లి దింపేసుకోవటమే. పోపు కూడా అక్కర్లేదు. 


* ఈ కూర అన్నంలోకీ, చపాతీల్లోకీ కూడా చాలా చాలా బావుంటుంది.



వంకాయ-చిక్కుడుకాయ:

* వంకాయ, చిక్కుడికాయ రెండు సమానంగా తీసుకోవాలి.

* తెల్లవంకాయలు అయినా పర్వాలేదు, పొడుగు వంకాయలైనా పర్వలేదు.

* పావుకేజి కూరకి చిన్న నిమ్మకాయంత చింతపండు నానబెట్టి, ఆ రసం + తగినంత ఉప్పు, చిటికెడు పసుపు  కూరముక్కల్లో వేసి ఉడకబెట్టాలి. (గిన్నెడుముక్కలు ఉంటే వాటికి మూడు వంతులు నీరు పొయాలి).

* కుక్కర్లో పెడితే రెండు, మూడు విజిల్స్ రావచ్చు.



* ఈ కూరకి ఉడికించే ముక్కలు పై ఫోటొలో లాగ పొడిపొడిగా ఉండచ్చు, లేదా ఎక్కువ నీళ్ళు పోసి కాస్త ముద్దగా కూడా ఉడకపెట్టుకోవచ్చు.

* రెండు అంగుళాలు  అల్లం ముక్క, మూడు పచ్చిమిరపకాయలు తొక్కి ఉంచాలి. గ్రైండ్ చేసేకన్నా తొక్కితేనే బావుంటుంది.. మధ్య మధ్య అల్లం ముక్కలు తగులుతూ :)

* ఆవాలు,మినపప్పు, శనగపప్పు, కర్వేపాకు పోపు వేసి వేగాకా ఇందాకా తొక్కుకున్న అల్లం పచ్చిమిర్చి  ముద్ద వేసి రెండు నిమిషాలయ్యాక ఉడికిన కూర ముక్కలు ఇందులో వేసి కూర బాగా దగ్గర పడ్డాకా ఆపేయటమే.

* కూర పోపు పెట్టాకా తీసిన ఫోటో ఎంత వెతికినా కనబడలేదు..:(



Labels: కూరలు 2 comments

కాకరకాయతో..

4:05 PM | Publish by తృష్ణ





కాకరకాయ చేదుగా ఉన్నా ఆరోగ్యానికి చాలా మంచిది. రక్తాన్ని శుధ్ధి చేయగలదు. ఇందులో ఇనుము ఉంటుంది. ఓ వారం రోజులు పరగడుపున ఒక ఔన్స్ కాకరకాయ రసం తాగితే ఎక్కువగా ఉన్న బ్లడ్ సుగర్ లెవెల్స్ కూడా కంట్రోలౌతాయిట.(ఇది చేయదలిస్తే మాత్రం ఎవరన్నా ఆయుర్వేదం డాక్టర్ ని అడిగి చేయండి) ఎన్నో ఔషథగుణాలున్న ఈ కూరను వారానికి ఓసారన్నా తింటే మంచిది. ఎక్కువ గింజపట్టని లేత కాకరకాయలతో ఏ కూర చేసినా అద్భుతంగా ఉంటుంది. కాకరకాయతో మాత్రమే చేసే కొన్ని రకాల కూరలు ఈ టపాలో:

1.కాకరకాయ శనగపప్పుకారం:

పావు కేజీ కాకరకాయలకి
రెండు పెద్ద చెంచాల శనగపప్పు, 
ఒక పెద్ద చెంచామినపప్పు, 
ఆవాలు, 
పావు చెంచా మెంతిగింజలు, 
ఐదారు(మీ కారం బట్టి) ఎండు మిర్చి కలిపి గ్రైండ్ చేసుకుని,

కాకరకాయలు అటు ఇటు చీరి వాటిల్లో ఈ పైన చెప్పిన పొడిని  కూరి నాన్స్టిక్ మూకుడులో మగ్గించండి. అంటే కాస్త నీళ్ళు పోసి,నూనె వేసి సిమ్ లో ఉడకనివ్వాలి.

లేదా కాకరకాయ ముక్కలు ఉడకపెట్టేసుకుని, తర్వాత నూనె వేసి, ఈ పొడి వేసి వేయించినా సరే.

2.కాకరకాయ మసాలా type1 :

*కాకరకాయ ముక్కలు నిలువుగా చీరి చింతపండు నీళ్ళలో ఉడకబెట్టేసుకోవాలి.

*రెండు చెంచాలు వేరుశనగ, రెండు చెంచాలు నువ్వులు  పొడిగా వేయించి    మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.

* తర్వాత నూనెలో ఆవాలు, ఎండుమిర్చి కర్వేపాకు పోపు వేసి, 

*సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కల్ వేసి వేగనివ్వాలి.

*తర్వాత అందులో ఇందాకా చేసుకున్న వేరుశనగ నువ్వుల పేస్ట్, ఒక చెంచా అల్లంవెల్లుల్లి పేస్ట్ , కారమ్(కావలిస్తే), ఉప్పు, పసుపు (పావు చెంచా) వేసి, కాసిని నీళ్ళు పోసి, మొత్తంమ్ముద్ద బాగా ఉడికాకా,

*అందులో ఉడికిన కాకరకాయ ముక్కలు వేసి ఐదు నిమిషాల తర్వాత దింపేసుకోవాలి.

3.కాకరకాయ మసాలా 2:

కాకరకాయ ముక్కలు చింతపండు నీళ్ళలో ఉడకపెట్టి ఉంచాలి.

రెండు ఉల్లిపాయ,రెండు టమాటా గ్రైండ్ చేసుకోవాలి. 

అల్లం వెల్లుల్లి ముద్ద ఒక చెంచా తీసుకోవాలి. వీటితో పాటే రెండు లవంగాలు, అంగుళం దాల్చిన చెక్క కలిపి గ్రైండ్ చేసేసుకోవాలి.

మూకుడులో నూనె వేసి పైన చేసుకున్న ముద్దలు రెండూ బాగా వేగనిచ్చి,

తర్వాత కాకరకాయ ముక్కలు వేసి ఐదు నిమిషాలు ఉడికాక దింపేసుకోవాలి.


4. కాకరకాయ పెసరపప్పు:





* ఐదారు కాకరకాయలు

* ఒక చిన్న టీగ్లాసుడు పెసరపప్పు ఒకటి, ఒకటిన్నర గంటలు నానబెట్టుకోవాలి.

* నానిన పెసరపప్పుని ఉప్పు, రెండుమూడు పచ్చిమెరపకాయలు, చిటికెడు ఇంగువ వేసి గ్రైండ్ చేసుకోవాలి.
(ఇదే పెసరపప్పు పచ్చడి. అన్నంలో తింటే చాలా బావుంటుంది)

* కాకరకాయలు నాలుగువైపులా చీరి(కట్ పెట్టి) ఈ ముద్ద అందులో కూరి రెండుమూడు కాయల చప్పున వేయించుకోవాలి.

* డీప్ ఫ్రై వద్దనుకుంటే మూకుడులో(నాన్స్టిక్ ప్రిఫర్డ్ :))  అన్నీ కలిపి స్టౌ సిమ్ లో పెట్టి వేయించుకోవచ్చు.



5.ఉల్లికారం:

కాకరకాయ ముక్కలు చింతపండు నీళ్ళలో ఉడకపెట్టి ఉంచాలి.

మూడు ఉల్లిపాయలు, కారమ్ (మీ అనుసారం), చిటికెడు ఇంగువ కలిపి గ్రైండ్ చేసేసుకుని,

ఈ ముద్దను నూనెలొ బాగా వేగనిచ్చి, తర్వత కాకరకాయ ముక్కలు కలిపి ఐదు నిమిషాల తర్వాత దింపేసుకోవటం.

ఇది చిన్న కాకరకయలు దొరికితే కాయపడంగా కూడా చేసుకోవచ్చు.


 6.కాకరకాయ వేపుడు 1:

కాకరకాయ వేపుడు (ఉల్లిపాయ వేసి గాని వెయ్యకుండా గానీ) వేగిపోయాకా పైన ఉప్పు, కారం చల్లేప్పుడు కాస్త శనగపిండి చల్లి మరొ ఐదు నిమిషాల తర్వత దించుకుంటే బావుంటుంది.

7.కాకరకాయ వేపుడు 2:

కాకరకాయ ముక్కలు గుడ్రంగా స్లైసెస్ లాగ తరుక్కుని, వేరుశనగగుళ్ళు,కర్వేపాకు కలిపి వేయించుకుంటే బావుంటుంది.


8. కాకరకాయ కొబ్బరి తీపి కూర:

*పావుకేజీ కాకరకాయలు
*ఒకచిప్పకొబ్బరి కోరు
*ఏభైగ్రాములు బెల్లంతరుగు
*చిన్న నిమ్మకాయంత చింతపండు నానబెట్టి గుజ్జు తీసుకోవాలి.

* కాకరకాయ ముక్కలు స్లైసెస్ లాగ గుండ్రంగా తరుక్కోవాలి.(ఎలాగైనా తరుగచ్చు. తియ్య కూరకి గుండ్రంగా అయితే బావుంటాయి)

* కాకరకాయ ముక్కలు చింతపండు గుజ్జు, కాస్త ఉప్పు వేసి మెత్తగా ఉడికించుకోవాలి.

* మూకుడులో శనగపప్పు,మినపప్పు,ఆవాలు,జీలకర్ర,కర్వేపాకు పోపు వేసి అందులో కొబ్బరి కోరు వేసి ఒక నిమిషం వేయించాలి.

* తర్వాత ఉడికిన కాకరకాయ ముక్కలు, బెల్లంతరుగు వేసి ఐదునిమిషాలు స్టౌ సిమ్ లో ఉంచి తరువాత ఆపేయాలి.

----------
* 9: 
మా అన్నయ్య ఓరోజున కాకరకాయ కొత్తిమీర కారం ఎందుకు చెయ్యకూడదు? అని పరిశోధన చేసాడు. బానే ఉంది. కాకరకాయ అంటే బాగ ఇష్టంమున్న ఎవరన్నా ఆసక్తి ఉంటే ఇది కూడా ట్రై చేయచ్చు.
కొత్తిమీర,పచ్చిమిర్చి కలిపి గ్రైండ్ చే్సి,  కాస్త నూనెలో ఉడికిన కాకరకాయముక్కలు,ఈ ముద్ద వేసి మగ్గించటమే.

------

10.
కుంపటి మీద కాకరకాయలు కాల్చి కూడా కూర చేస్తారు. నేనెప్పుడూ చేయటానికి ప్రయత్నించలేదు. ఎప్పుడన్నా చేస్తే అది కూడా రాస్తా :)




Labels: కూరలు 3 comments

తోటకూర కూర - తోటకూర పెరుగుపచ్చడి

1:00 PM | Publish by తృష్ణ





"రైతా" అని ఉత్తరాది వాళ్లు రకరకాలు చేస్తారు గానీ కమ్మని ఇంగువపోపు పెట్టిన మన పెరుగుపచ్చళ్ల ముందు ఆ రైతాలన్నీ బలాదూరే ! రాత్రిపూట భోజనంలోకి రోజు ఏదో ఒక పెరుగుపచ్చడి చేసేది అమ్మ. ఆనపకాయ, పొట్లకాయ, తోటకూర, అరటి దూట, కేరెట్.. మదలైనవాటితో. ఏదీ లేకపోతే చిన్న అల్లంముక్కతొక్కేసి, ఓ పచ్చిమిరపకాయ, కాస్తంత కొత్తిమీర వేసి పొపు పెట్టేసేది. అదో రకం అన్నమాట.



కళ్లకి మంచిదని, ఐరన్, కేల్షియమ్, ఫోలిక్ ఏసిడ్ ఎక్కువగా ఉంటాయని నేను తోటకూర ఎక్కువగా వాడతాను. తోటకూరతో పప్పు, ఆవ పెట్టి పులుసు, పచ్చడి, పెరుగుపచ్చడి, వడలు, గారెలు మొదలైనవెన్నో చేసుకోవచ్చు. ఇవాళ 'తోటకూర పెరుగుపచ్చడి ' ఎలా చెయ్యాలో చెప్తాను..


* ముందు తోటకూరను బాగా కడగాలి. లేకపోతే తినేప్పుడు మట్టి వచ్చి చాలా ఇబ్బంది పెడుతుంది ఈ అకుకూర.


* రెండు కట్టలు ఆకుకూర తరిగి, ఒక గ్లాసు నీటిలో ఉడికించాలి. తోటకూర త్వరగా ఉడికిపోతుంది కాబట్టి కుక్కర్లో అక్కర్లేకుండా ఏదైనా గిన్నెలోనే ఉప్పు వేసి, మూతపెట్టి ఉడికించుకోవచ్చు. ఆకుకూరలు ఉడికించేప్పుడు ఆకుతరుగులో సగం నీళ్ళు పోస్తే చాలు. నీళ్ళు వేస్ట్ అవ్వవు, ఆకు ఉడికాకా పారబొయ్యక్కర్లేదు.

* ఆకు రంగు మారకుండా ఉడికించుకుంటే పోషకాలు నిలిచి ఉంటాయి.


* ఉడికిన తోటకూరను ఇలా మేష్ చేసుకోవాలి. ఆకులు ఆకులుగా కొందరు తినటానికి ఇష్టపడరు.

* తర్వాత పెరుగులో తగినంత ఉప్పు వేసి చిలుక్కోవాలి.

* ఆవాలు, మినపప్పు, మెంతులు(ఎర్రగా వేగాలి), చిటికెడు ఇంగువ, ఒక ఎండు మిర్చి వేసి పోపు వేయించి, చిలికిన పెరుగులో వేసి కలపాలి.


* అప్పుడు అందులో ఉడికించి మేష్ చేసి ఉంచిన తోటకూర బాగా కలపాలి.
* ఇలా చేసుకున్న పెరుగుపచ్చడి రోజూ తింటే చాలా మంచిది. అన్నంలోనే కాక ఉత్తిగా కూడా తినేయచ్చు.

=========================


simple తోటకూర కూర:



* పైన చెప్పిన విధంగా ఉడకపెట్టిన తోటకూర నీరు లేకుండా వాడ్చిపెట్టుకోవాలి.

* తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, కాస్త జీలకర్ర్ర, పోపు వేయించాలి. అందులో రెండు తోటకూర కట్టలకి మూడు పచ్చిమిరపకాయలు, అంగుళం అల్లం ముక్కతొక్కి ఆ ముద్ద వేసి, అది కాస్త వేగాకా వడ్చి ఉంచిన తోటకూర అందులో వేసి బాగా కలపాలి. ఉప్పు తక్కువైతే కాస్తంత కలుపుకోవాలి.

* కొందరు తోటకూరలో టమాటా,ఉల్లిపాయ,వెల్లుల్లి కూడా వేసి కూర చేసుకుంటారు.









Labels: కూరలు, పెరుగు పచ్చడి 2 comments

దొండకాయ కాయపడంగా

2:46 PM | Publish by తృష్ణ



దొండకాయలు కాయపడంగా ఎక్కువ నూనె వెయ్యకుండా వండుకోవచ్చు.

శనగపప్పు కారం వేసి:

కావాల్సినవి:
పావుకేజీ దొండకాయలు

శనగపప్పు కారానికి కావాల్సినవి:
శనగపప్పు నాలుగు చెంచాలు
మినపప్పు మూడు చెంచాలు
ఆవాలు ఒక చెంచా
జీలకర్ర ఒక చెంచా
పావు స్పూన్ మెంతులు
రెండు చెంచాల కొబ్బరి(optional)
ఎండు మిరపకాయలు నాలుగైదు
ఉప్పు తగినంత

తయరీ:

* ముందుగా ఒక చెంచా నూనెలో పైనచెప్పిన పోపుసామానులో పప్పులన్నీ వేయించి స్టౌ ఆపేసాకా కొబ్బరి ఉంటే అందులో కలపాలి. తర్వాత బరగ్గా(మరీ మెత్తగా కాకుండా) గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు కూడా కలిపేసి ఉంచాలి.

* కడిగిన దొండకాయలను రెండువైపులా మధ్యదాకా కట్ చేసుకోవాలి.

* వాటిలో గ్రైండ్ చేసుకున్న పొడి కూరి అదంతా వేగేదాకా చాలా టైమ్ పడుతుంది. నూనె కూడా పడుతుంది. అందుకని ముందు రెండువైపులా స్లిట్ చేసిన దొండకాయలను ఒక టీగ్లాసుడు నీళ్ళు,అర చెంచా ఉప్పు వేసి చిన్న కుక్కర్లో ఒక్క విజిల్ వచ్చేదాకా ఉడికించి దింపేయాలి. నీళ్ళు కొద్దిగానే పోసాం కాబట్టి వంపేయాల్సిన అవసరం ఉండదు. (అంతగా ముక్కల్లో నీళ్ళు మిగిలితే చారులోకో పప్పులోకో అవి వాడచ్చు.)

* ఇప్పుడు దొండకాయలు చల్లారాకా అందులోకి రెండువైపులా గ్రైండెడ్ పౌడర్ కూరాలి.

* పాన్ లో గానీ, మూకుడులో గానీ రెండు చెంచాల నూనె వేసి అందులో దొండకాయలు వేసి మాడకుండా రెండు నిమిషాలకొకసారి అటు ఇటు తిప్పుతూ వేగనివ్వాలి.

* శనగపప్పు కారం కూరిన దొండకాయల కూర రెడీ అయిపోతుంది..:)

========================================




Labels: కూరలు 2 comments

వంకాయ - పనసగింజల కూర

5:16 PM | Publish by తృష్ణ


పనస తొనలు తినేసాకా వాటి లోపల గింజల్ని పాడేయకుండా కూరలు చెయ్యటానికి వాడతారు. వీటితో ఏ రకమైన కూర చేసినా ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఎండబెట్టి తొక్కు తీసి, వాటిని వేయించుకుని తింటారు. పనసగింజల వేపుడు అన్నమాట. ఇలా కాకుండా పనసగింజలు ఉడకబెట్టి బంగాళా దుంపతోనూ లేక వంకాయతో కలిపి వండుతారు. ఇవాళ వంకాయ పనసగింజల కూర ఎలా చెయ్యాలో చెప్తానూ..

కావాల్సినవి:
* పావుకేజీ వంకాయలు
* పది,పన్నెండు పనస గింజలు
* చిన్న నిమ్మకాయంత చింతపండు నానబెట్టి తీసిన రసం
* పోపుకి ఆవాలు,శనగపప్పు,మినపప్పు,జీలకర్ర,కర్వేపాకు,2ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి
* ఉప్పు తగినంత , 2 స్పూన్స్ ఆయిల్

తయారీ:



* ముందు పనసగింజల తొక్కు తీసి, ఒకో గింజ నాలుగు ముక్కలు చేసి కాస్త ఉప్పు వేసి రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టాలి.


* తర్వాత వంకాయ ముక్కలు కూడా ఉప్పు వేసి మరీ మెత్తగా కాకుండా ఉడకబెట్టాలి.


* తర్వాత మూకుడులో రెండు చెంచాల నూనె వేసి పైన చెప్పిన పోపు పదార్ధాలతో పోపు వేయించాలి.
* పోపు వేగాకా ఉడికిన పనసగింజలు, వంకాయముక్కలు వేసి, అందులో తీసిపెట్టుకున్న చింతపండు రసం, చిటికెడు పసుపు వెయ్యాలి. ముక్కలు ఉడికేప్పుడు వేసుకున్న ఉప్పు సరిపోకపోతే మరికాస్త ఉప్పు వేసుకుని కూర దగ్గర పడ్డాకా దింపేసుకోవాలి. వంకాయ - పనసగింజల కూర రెడీ !
* ఈ కూర అన్నంలోకి బావుంటుంది.


* ఇదే విధంగా వంకాయ బదులు బంగాళా దుంపలు పనసగింజలతో కలిపి కూర చేయచ్చు. చింతపండు అక్కర్లేదు.


Labels: కూరలు 1 comments

పచ్చి బొప్పాయి(raw papaya) కూర

7:56 PM | Publish by తృష్ణ






ఇదివరకు ఓసారి ఈ కూర తృష్ణ లో రాసాను. ఒక్క కొబ్బరి మాత్రమే వేసి చేసాను అప్పుడు. ఇవాళ ఇదే కూరలో కొబ్బరిలో అల్లం, పచ్చిమిర్చి కలిపి గ్రైండ్ చేసి వండాను. బాగా వచ్చింది.




తయారీ:


* పచ్చి బొప్పాసి కాయ మధ్యలో గింజలు తీసేసి తురుముకోవాలి.


* చిన్న అల్లం ముక్క, నాలుగు పచ్చిమిర్చి,కొబ్బరి ముక్కలు కలిపి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 


* కుక్కర్లో అయితే కొద్దిగా (అంటే తురుము క్వాంటిటిలో సగం నీళ్ళు) పోసి ఒక్క కూత రాగానే ఆపేసుకుని తడంతా పోయేలా వడబోసేసుకోవాలి. తక్కువ నీళ్ళు పోస్తాం కాబట్టి వడబోసినప్పుడు కాస్తంత మాత్రమే నీళ్ళు పోతాయి.





* శనగపప్పు,మినపప్పు,ఆవాలు,జీలకర్ర, కర్వేపాకు,ఒక ఎండు మిర్చి పోపు పెట్టుకుని, అందులో గ్రైడ్ చేసుకున్న కొబ్బరికోరు వేసి కాస్త వేగాకా ఉడికించి ఉంచుకున్న బొప్పాయి తురుము వేసి బాగా కలపాలి.


* ఈ కూర అన్నంలో కన్నా చెపాతీల్లోకి బాగుంటుంది.

Labels: experiments, కూరలు 0 comments

ఆనపకాయతో చపాతీ/పూరీ కూర

4:01 PM | Publish by తృష్ణ


ఆనపకాయతో పాలు పోసి వండే కూర, అల్లంపచ్చిమిర్చి, కొత్తిమీర కారం, నూపప్పు కారం, కూటు, పప్పుకూర, పెసరపప్పు పొడికూర, పంచదార వేసి తియ్యకూర మొదలైన ఎన్నో రకాల కూరలు వండుకోవచ్చు. అయినా సరే నీటి శాతం ఎక్కువ ఉండి రుచిలో చప్పదనం ఎక్కువ ఉండటం వల్ల ఎక్కువమంది ఆనపకాయ కూరను ఒక పథ్యం కూరగానే పరిగణిస్తారు. ఆనపకాయ కూర కూడా ఓ కూరేనా? అనేవారు కూడా ఉన్నారు.




పైన రాసినవి కాక ఆనపకాయతో చపాతీ లేదా పూరీల్లోకి తినేలాంటి రెండు రకాల కూరలు బొంబాయిలో ఉండగా మా పక్కింటి ఆంటీ దగ్గర నేర్చుకున్నాను. అందులో ఒకటి ఈ టపాలో చెప్తున్నాను. చేస్కోవటమ్ చాలా తేలిక. ఎలాగంటే --





ఆనపకాయ పావుకేజీ
గుప్పెడు వేరుశనగపప్పు(పల్లీలు)
ఒక ఉల్లిపాయ (మీడియం సైజు)
పచ్చిమిరపకాయలు మూడు లేక నాలుగు
అల్లం,వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా




తయారీ:



* ముందుగా గుప్పెడు వేరుశనగపప్పు(పల్లీలు) పొడిగా వేయించి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
* తర్వాత తరిగిన ఆనపకాయ ముక్కలు ఉప్పు వేసి కొంచెం నీళ్ళలో ఉడకబెడితే నీళ్ళు మిగలకుండా, రంగు మారకుండా ఉడుకుతాయి ముక్కలు.






* తర్వాత మూకుడులో రెండు చెంచాలు నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి.



* దానిలో ఒక చెంచా అల్లమ్వెల్లుల్లి పేస్ట్ వేసి, అది వేగాకా గ్రైండ్ చేసుకున్న వేరుశనగపప్పు(పల్లీల) పేస్ట్ అందులో వేసి కలపాలి. ఈ మిశ్రమం క్రింద ఫోటోలోలాగ జారుగా ఉండాలి. అవసరమైతే కాసిని నీళ్ళు పోసుకోవాలి.
* సుమారు ఐదు నిమిషాలు ఈ మిశ్రమం ఉడకనివ్వాలి. మధ్య మధ్య కలుపుతూ ఉండాలి. మిశ్రమం ఉడికాకా ఇలా ఉంటుంది.




* అందులో ఉడికిన ఆనపకాయ ముక్కలు వేసి మరో ఐదు నిమిషాల తరువాత దింపేసుకోవాలి.

* ఈ కూర చపాతీ, రోటీ, పూరీ దేన్లోకయినా బావుంటుంది.

Labels: కూరలు 1 comments

(కాల్చిన)అరటికాయ పొడి కూర

11:33 AM | Publish by తృష్ణ




మరుగున పడిపోతున్న మంచి మంచి ఆంధ్రా వంటకాల్లో ఒకటి ఈ అరటికాయ పొడి కూర. వంకాయను కాల్చి పచ్చడి చేసినట్లు అరటికాయను కూడా కాల్చి ఈ కూర చేస్తారు. ఓపిక ఉంటే అరటికాయను కుంపటిలో కాల్చవచ్చు లేదా స్టౌ మీద కూడా కాల్చవచ్చు.


ఎలా చెయ్యాలంటే:


* ముందుగా పచ్చి అరటికాయకు కాస్త నూనె రాసి పొయ్యి మీద పెట్టాలి. అన్నివైపులా అరటికాయ బాగా కాలేలా కాల్చాలి. (ముచిక బాగ కాలి రాలిపోతే అతఇకాయ బాగా కాలినట్లు.) క్రింద ఫోటోలోలాగ.


* తర్వాత తొక్కలోపలి అరటికాయకి మసి అంటకుండా జాగ్రత్తగా తొక్కవలవాలి. వలిచిన అరటికాయ లోపల ఇలా ఉంటుంది..



* కాల్చిన అరటికాయ కు (మీ కారానికి)తగినంత అల్లం,పచ్చిమిర్చి ముద్ద తొక్కి పెట్టుకోవాలి.


* తర్వాత మూకుడులో రెండు చెంచాల నూనె వేసి, శనగపప్పు,మినపప్పు,ఆవాలు,జీలకర్ర,చిటికెడు పసుపు,కర్వేపాకు వేసి పోపు పెట్టుకోవాలి. పోపు వేగాకా అల్లం పచ్చిమిర్చి ముద్ద వేసి, అది వేగాకా మేష్ చేసిపెట్టుకున్న అరటికాయ పొడి అందులో వేసి, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి రెండు నిమిషాల తరువాత దింపేసుకోవాలి.

* చూడటానికి అరటికాయ ముక్కలు ఉడకబెట్టి అల్లం,పచ్చిమిర్చి వేసి పోపు కూర వండుకున్నట్లే ఉంటుంది. కానీ రుచిలో తేడా ఉంటుంది. నిమ్మరసం ఇష్టముంటే వడ్డించేముందు కూరలో అరచెక్క నిమ్మరసం పిండివచ్చు.


Labels: కూరలు 2 comments

mixed vegetable "కూటు"

1:18 PM | Publish by తృష్ణ


నాకు తెలిసీ "కూటు" అన్ని కూరలు కలిపి చేసుకోవచ్చు, లేక విడివిడిగా ఆనపకాయ, కేరెట్, గుమ్మడికాయ, కేబ్యేజ్ తో, బీట్ రూట్ తో, చౌ చౌ తో, బీన్స్ మొదలైన కూరలతో కూడా చేసుకోవచ్చు. రెండు మూడు రకాలుగా దీన్ని వండుకుంటారు.

* కొందరు శనగపప్పు, మినప్పప్పు, కొబ్బరి,ధనియాలు, మిరియాలు కలిపి వేయించి పొడి చేసి ఉడికిన కూరముక్కలు , పప్పు కలిపి చేస్తారు.

* కొందరు ఈ పొడి లోనే ఒక కొబ్బరి చిప్ప మొత్తం గ్రైండ్ చేసి పప్పు లేకుండా ఒట్టి కూరముక్కల్లో కలిపి వండుతారు.

* కొందరు కూరముక్కలు లేకుండా ఈ పొడిని ఒక్క పప్పులోనే కలిపి వండుతారు.

నేను నేర్చుకున్న mixed veg కూటు లో ingredients ఏంటంటే:

* రెండు చెంచల నూనెలో
* ఒక చెంచా శనగపప్పు
* ఒక చెంచా మినపప్పు
* మూడు నాలుగు ఎండు మిరపకాయలు
* 11/2 చెంచాల ధనియాలు
* చిన్న దాల్చిన చెక్క ముక్క
* ఒక చెంచా గసగసాలు
* (కొందరు ఒక చెంచా మిరియలు కూడా వేసుకుంటారు. నేను వెయ్యను)
* ఫ్రెష్ కొబ్బరి తురుము రెండు మూడు చెంచాలు లేదా చిన్న చిన్న కొబ్బరిముక్కలు పైన ఐటెమ్స్ తో కలిపి వేయించుకోవచ్చు.

____ పైన చెప్పిన ఐటెమ్స్ అన్నీ బాగా వేగాకా, చల్లార్చి పొడి కొట్టుకోవాలి.

* ముఖ్యమైన పాయింట్ ఏంటంటే కూటు కు ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా పొడి కొట్టుకుంటేనే రుచి బావుంటుంది.

చేసే విధానం:

* ఒక గ్లాసు కందిపప్పు (సుమారు 150gms) కాస్త పసుపు వేసి మెత్తగా ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకోవాలి.

* కేరెట్, బీన్స్, క్యేబేజ్, కాలీఫ్లవర్, చౌ చౌ, ఉంటే గుప్పెడు బఠాణీ మొదలైన కూరముక్కలు (300gms అంటే పప్పుకి డబుల్ క్వాంటిటి కూర ముక్కలు ఉండాలి ఎప్పుడూ) మరీ మెత్తగా కాకూండా ఉడికించికుని ఉంచాలి. (బంగాళా దుంప, వంకాయ కూడా కలుపుకోవచ్చు ఇష్టం ఉంటే)

* ఒక కడాయీ లో ఒక చెంచ నూనె వేసి అవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఇంగువ ,కర్వేపాకు పోపు వేయించాలి.

* వేగిన పోపులో ఉడికిన పప్పు, కూరముక్కలు, గ్రైండ్ చేసి ఉంచుకున్న మసాలా పొడి అన్నీ వేసి బాగా కలపాలి. కలిపేప్పుడు కూర ముక్కలు ముద్దగా అవ్వకుండా చూసుకోవాలి.

* ఒక ఐదు నిమిషాలు ఉంచాక స్టౌ ఆపేసి తరిగిన ఫ్రెష్ కొత్తిమీర కూటు పై చల్లి వడ్డించటమే.

* అన్నం లోకైతే మరి పల్చబడకుండా ఉంచేయాలి. చపాతిలోకో, దోశ లోకో అయితే ఉడికేప్పుడు కాస్త నీరు కలిపితే జారుగా బావుంటుంది.


Labels: కూరలు, పప్పులు 2 comments

బెంగుళూరు వంకాయ (chow chow) తో రకాలు...

2:56 PM | Publish by తృష్ణ



వంకాయతో ఏమాత్రం పోలిక లేని ఈ కూరను "బెంగుళూరు వంకాయ" అని ఎందుకు అంటారో అర్ధం కాదు...:( ఇది బెంగుళూరులో ఎక్కువగా దొరుకుతుందో ఏమో మరి. నార్త్ లో దీన్ని చౌ చౌ(chow chow) అని పిలుస్తారు. ఇంగ్లీష్ లో chayote అంటారు. చలికాలంలో ఎక్కువగా మార్కెట్లోకి వస్తాయి ఇవి. ఇక ఈ కూరతో అమ్మ "కూటు" మాత్రమే చేసేది. ఇదీ కర్ణాటక వంటకమే . చౌ చౌ మార్కెట్లో కొనేప్పుడు లేతవి చూసి కొనుక్కోవాలి. ముదిరిపోతే పీచు వచ్చేసి రుచి బాగుండదు.


ఇంట్లో బహుకొద్ది కూరలు తినేవాళ్ళతో ఈ వంటకం తినిపించటానికి నేను ఈ కూరతో కొన్ని ప్రయోగాలు చేసాను. అదృష్టం బాగుండి ఈ కూర నా కూరలమార్కెట్ లిస్ట్ లో ఏడ్ అయిపోయింది. తెలియనివాళ్ళకు ముందు ఇది ఎలా వండాలో చెప్తాను...చెక్కు తీసేసి మధ్యకు కోయాలి. అందులో మావిడికాయలోలాగ జీడి ఉంటుంది. అది తీసేయాలి. క్రింద ఫోటోలోకలాగ.
 

అలా జీడి తీసేసిన చౌ చౌ ని చిన్న చిన్న ముక్కలు చేసుకుని, ఎన్ని ముక్కలు ఉన్నాయో వాటికి సగం నీరు(ఉడికాకా వార్చాల్సిన అవసరం లేకుండా కొన్నే నీళ్ళన్నమాట) పోసి, కాస్తంత ఉప్పు వేసి ఒక్క విజిల్ వచ్చేలా కుక్కర్లో ఉడికించుకోవాలి. ముద్దయిపోతుందనిపిస్తే వీడిగా ఉడకపెట్టుకున్నా త్వరగా అయిపోతుంది. ఇలా ఉడకపెట్టుకున్న కూరముక్కలతో  నాలుగైదురకాల కూరలు వండుకోవచ్చు.


1) మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కర్వేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి ఉట్టిగా పోపు కూర వండుకోవచ్చు. ఆనపకాయ లాగ.




2) పోపు వేసాకా తురిమిన ఫ్రెష్ కొబ్బరి కూరలో వేసుకోవచ్చు. కొబ్బరి వేసే కూరల్లాగ.



3) పోపు కూర చల్లారాకా పచ్చి ఆవపొడి వేసి ఆవ కూరలా కూడా చేయవచ్చు.


4)పొపు వేసాకా దాంట్లోనే నూపొడి కారం ( నువ్వులు వేయించి, కారం కలిపి చేసిన పొడి) వేసుకోవచ్చు. ఇది పొయ్యి మీద ఉండగానే వేసుకోవచ్చు. క్రింద ఫోలోలా ఉంటుంది.
 
 
5) అన్ని కూరముక్కలతో కలిపి లేక ఒక్క చౌ చౌ తో కూటు చేసుకోవచ్చు. "కూటు" గురించి రేపు రాస్తాను.




chow chow పచ్చడి:

తరిగిన చౌ చౌ ముక్కలను కాస్త వేయించి, చింతపండు వేసి (ఆనపకాయముక్కలతో చేసినట్లుగానే) పచ్చడి చేసుకొవచ్చు.

-----------             --------------

* ముక్కలు ఉప్పు వేసి ఉడకఎట్టుకుని సలాడ్ లాగ కూడా తినవచ్చు.



ఈ బెంగుళూరు వంకాయ తినటం వల్ల ఉపయోగాలు ఇక్కడ చదవవచ్చు.

Labels: కూరలు 13 comments

పనసపొట్టు ఆవకూర

1:33 PM | Publish by తృష్ణ



మా కాకినాడ ఇంట్లో పేద్ద పనసచెట్టు ఉండేది. నిండా కాయలు, పిందెలతో చెట్టు కళకళాలాడుతూ ఉండేది. కాయ పండితే వంద తక్కువకాకుండా పనసతొనలు వచ్చేవి. అంత పెద్ద పెద్ద కాయలు కాసేది చెట్టు. విచిత్రం ఏంటంటే నాకు పనసతొనలు నచ్చేవి కాదు. వాటి వాసన కూడా గిట్టదు ఇప్పటికీ. కానీ పనసపొట్టు కూర మాత్రం తినేదాన్ని. మేం కాకినాడ నుండి విజయవాడ వచ్చేప్పుడల్లా చిన్న చిన్న కాయలు ఐదారు ఓ సంచీతో ఇచ్చేది మా నాన్నమ్మ. సామానుతో పాటూ ఈ సంచీ కూడా విజయవాడ వచ్చాకా కొందరికి మొత్తం కాయ, కొందరికి కొట్టిన పనసపొట్టూ పంచేవాళ్ళం. ఇప్పుడు బజార్లో పనసపొట్టు కొన్నప్పుడల్లా అవన్నీ గుర్తుకువస్తాయి.

చౌపాల్, రిలయన్స్, ఫ్రెష్ ఎట్ మొదలైన కూరలషాపుల్లో కొట్టిన పనసపొట్టు అమ్ముతారు. వీటిలో ఎక్కువ నిలవ ఉండటానికి ఉప్పు ఎక్కువ వేసేస్తారు కాబట్టి వండే ముందు రెండు మూడు సార్లు కడుక్కోవలసి ఉంటుంది. అలాకాకుండా బజార్లలో అరటిదూట, అరటి పూవ్వులు అమ్మేవాళ్ళు అమ్మే పనసపొట్టు ఫ్రెష్ గా ఉంటుంది. అందులో ఉప్పు ఉండదు. కానీ ఇలా అమ్మే చోట్లు చాలా అరుదుగా ఉంటుంటాయి. మొన్న అరటిదూట కొనటానికి వేళ్తే ఫ్రెష్ పనసపొట్టు దొరికింది. బాగానే కొట్టాడు. ఈ పనసపొట్టును సన్నగా కొట్టడం అనేది ఒక అద్భుతమైన కళ. కూర వండటం కూడా..:)

సరే ఇక ఆవ పెట్టిన పనసపొట్టు కూర చేసేసుకుందామా? ముందర బజార్లో కొన్న పనసపొట్టు ఒక్కసారి గబుక్కున కడిగేసుకుని వార్చేసుకోవాలి.

 
సుమారు ఓ పెద్దగ్లాసుడు పనసపొట్టుకు, నిమ్మకాయంత చింతపండు నానబెట్టుకుని రసం తీసి, ఈ పనసపొట్టు + చింతపండు రసం + బుల్లిగ్లాసుడు నీళ్ళు + తగినంత ఉప్పు + చిటికెడు పసుపు వేసి కుక్కర్లో కానీ విడిగా గిన్నెలో కానీ ఉడకపెట్టుకోవాలి.

విడిగా ఉడకపెట్టేట్లయితే కాసిన్ని నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి. కుక్కర్లో అయితే ఒక్క విజిల్ వస్తే చాలు. కొన్న పనసపొట్టులో పసుపు కలిపి అమ్ముతారు కాబట్టి ఇక పసుపు వేయక్కర్లేదు ఉడికేప్పుడు. కాయ దొరికి మనమే కొట్టుకుని వండేప్పుడు అయితే ఉడికేప్పుడు కాస్త పసుపు కూడా వేసుకోవాలి. ఉడికిన పొట్టులో నీళ్ళుంటే ఇలా వార్చేసుకోవాలి. ఉడికిన పనసపొట్టు మరీ ముద్దయిపోకుండా పొడిపొడిగా ఉండాలి.




కొంతమంది ఉడకపెట్టినతరువాత పోపు వేసేప్పుడు కూడా చింతపండు రసం వేసి కాసేపు పొయ్యిమీద మగ్గిస్తారు. అప్పుడు పోపు ఫ్రెష్నెస్ పోతుందని నేను ఉడికించేప్పుడే చింతపండు రసం వేసేస్తాను. చివరగా పోపులో వేస్తాను.


ఒక మూకుడులో మూడు చెంచాల నూనె వేసి, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, 3 ఎండుమిర్చి, 3 పచ్చి మిర్చి, కర్వేపాకు, కాస్త ఇంగువ వేసి పోపు పెట్టేసుకోవాలి. పొపులో చివరిగా 6,7 జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు వద్దనుకుంటే కాసిని వేరుశనగగుళ్ళు కూడా వేసుకోవచ్చు. వేగిన పోపులో వార్చి పెట్టి ఉంచుకున్న ఉడికిన పనసపొట్టు వేసి బాగా కలిపి రెండు నిమిషాల తరువాత ఆపేసుకోవాలి.


కూర చల్లారాకా పచ్చి ఆవపొడి ఒక ముప్పావు చెంచా(ఇది ఇది సుమారు ఓ పెద్దగ్లాసుడు పనసపొట్టుకు) అందులో వేసి బాగా కలుపుకోవాలి. నోరూరించే పనసపొట్టు కూర రెడీ !!

పనసపొట్టుకూరలోకి చిట్టొడియాలు కాంబినేషన్. (చిన్నగా పెట్టుకునే మినపఒడియాలు). కొన్నిచోట్ల ఈ ఒడియాలు వేయించి కూరలో కలిపేస్తారు కూడా.

అన్నంలోకే కాక, చపాతిల్లోకి కూడా ఈ కూర బావుంటుంది. టెస్టెడ్ & ట్రైడ్ అన్నమాట.

Labels: కూరలు 7 comments
Older Posts »
"Health is Wealth."

ఇక్కడ వెతకండి..

'రుచి' చూసినవారు

పంచుకున్న రుచులు

  • ▼  2015 (3)
    • ▼  March (3)
      • సలాడ్ ప్రసాదం :-)
      • బుడిదగుమ్మడి కాయ పప్పు (ash gourd/winter melon dal )
      • Veg.Hakka Noodles
  • ►  2014 (24)
    • ►  December (2)
    • ►  November (2)
    • ►  September (1)
    • ►  July (2)
    • ►  June (4)
    • ►  May (3)
    • ►  April (2)
    • ►  March (7)
    • ►  January (1)
  • ►  2013 (32)
    • ►  December (3)
    • ►  September (4)
    • ►  August (2)
    • ►  July (3)
    • ►  May (1)
    • ►  April (8)
    • ►  March (3)
    • ►  February (1)
    • ►  January (7)
  • ►  2012 (26)
    • ►  December (1)
    • ►  November (3)
    • ►  October (5)
    • ►  June (4)
    • ►  May (5)
    • ►  April (1)
    • ►  March (1)
    • ►  February (4)
    • ►  January (2)
  • ►  2011 (35)
    • ►  December (3)
    • ►  November (6)
    • ►  September (3)
    • ►  August (4)
    • ►  June (2)
    • ►  May (4)
    • ►  April (6)
    • ►  March (5)
    • ►  February (2)
  • ►  2010 (14)
    • ►  December (6)
    • ►  September (4)
    • ►  August (1)
    • ►  June (3)

About

ఇవి కూడా నావే

  • తృష్ణ...
    దివ్యమైన అనుభూతిని అందించిన "HANUMAN ANSH"
    2 weeks ago
  • మనోనేత్రం
    Millet fest - 2015
    11 years ago
Powered by Blogger.

రుచులు - రకాలు

  • chutneys n పచ్చడ్స్ (19)
  • cooking tips (1)
  • experiments (10)
  • Kitchen Essentials (1)
  • pulses (3)
  • quick & easy (4)
  • recipe links (1)
  • rotis (2)
  • salads (7)
  • snacks n sweets (19)
  • soups and appetizers (2)
  • tiffins (24)
  • అట్లు - రకాలు (6)
  • ఊరగాయలు-రకాలు (12)
  • ఒడియాలు (3)
  • కూరలు (25)
  • చారులు రకాలు (1)
  • టీలు - రకాలు (1)
  • దోశలు రకాలు (7)
  • పప్పులు (4)
  • పులిహోర (4)
  • పులుసులు (2)
  • పెరుగు పచ్చడి (2)
  • మన పిండివంటలు (2)
  • రకరకాల పొడులు (2)
  • రైస్ వెరైటీస్ (6)
  • వేసవి పానీయాలు (7)

'రుచి' ఇష్టపడేవారు

Copyright (c) 2010 రుచి...the temptation. Design by Template Lite
Download Blogger Templates And Directory Submission.