skip to main | skip to sidebar

Pages

  • Home

రుచి...the temptation

"The best way to a man's heart is through his stomach."
Showing posts with label chutneys n పచ్చడ్స్. Show all posts
Showing posts with label chutneys n పచ్చడ్స్. Show all posts

quick & easy: పుదీనా కారం

6:35 PM | Publish by తృష్ణ




శరీరాన్ని చల్లబరిచే గుణమే కాక అరుగుదలకూ, ఎసిడిటీకీ కూడా మంచి మందైన పుదీనా అకులను ఏదో విధంగా భోజనంలో include చేసుకోవడం ఆరోగ్యానికి మంచిది. పుదీనా రైస్, పుదీనా పచ్చడి, పుదీనా నిలవ పచ్చడి, పుదీనా కారం, పుదీనా రైతా మొదలైనవి నేను చేస్తుంటాను. ఇవాళ చాలా సులువుగా చేసుకునే పుదీనా కారం గురించి చెప్తాను.

కావాల్సినవి:
రెండు కట్టలు పుదీనా
రెండు, మూడు పచ్చిమెరపకాయలు
తగినంత ఉప్పు(సుమారు అర చెంచా)
అర చెక్క నిమ్మరసం

తయారీ:
* పుదీనా ఆకులు కడిగేసి, ఒక చిన్న చెంచాడు నూనెలో కొద్దిగా(మూడు నాలుగు నిమిషాలు) వేయించాలి. పచ్చివాసన పోతే చాలు. ఆకుపచ్చరంగు అలానే ఉండగానే ఆపేయాలి. రంగు మారితే ఆకులు బాగా వేగిపోయినట్లు. (పుదీనా కారానికి అలా అవసరం లేదు.)
* వేగిన ఆకు చల్లారాకా, పచ్చిమెరపకాయలు, ఉప్పు వేసి మిక్సీలో మెత్తగా తిప్పేయాలి.
* గిన్నెలోకి తీసాకా అరచెక్క నిమ్మరసం తీసి అందులో కలిపితే సరిపోతుంది.
* ఇందులోకి పోపూ కూడా అక్కర్లేదు.
* వేడి వేడి అన్నంలో ఈ పుదీనా కారం చాలా బాగుంటుంది.

టిప్:
ఇదే విధంగా కొత్తిమీర కారం కూడా చేసుకోవచ్చు. ఇది అయితే ఆకు వేయించక్కర్లేదు కూడా. పచ్చిదే మిక్సీలో తిప్పేయచ్చు.
ప్రెగ్నెంట్ లేడీస్ ఇలాంటి గ్రీన్ చట్నీ(పుదీనా లేదా కొత్తిమీర) మొదటి ముద్దలో తింటే మంచిది.

Labels: chutneys n పచ్చడ్స్, quick & easy 1 comments

quick & easy: చుక్కాకు పచ్చడి

3:05 PM | Publish by తృష్ణ


టూ మినిట్స్ మ్యాగీ కన్నా సులువు ఈ పచ్చడి చెయ్యడం. కరెంట్ లేదు.. మిక్సీ లేకుండా పచ్చడి ఎలా చెయ్యడం అన్న దిగులు ఉండదు. మిక్సీలో తిప్పాల్సిన అవసరం లేని ఈజీ అండ్ సింపుల్ పచ్చడి ఇది!

ఎలాగంటే:
* ముందు ఓ చిన్న చెంచా నూనెలో ఆవాలు,మినపప్పు,జీలకర్ర,ఇంగువ పోపు పెట్టుకోవాలి. పోపు వేగాకా కట్టేసే ముందు అర చెంచా కారం వేసి బాగాకలిపి స్టౌ ఆపేయాలి. (కారం ఇష్టం లేకపోతే ఒక పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ పోపులో వేయించాలి. కానీ ఇవి మళ్ళీ తొక్కుకోవాలి. సో,కారమే బెటర్)
* పోపు చిన్న గిన్నెలోకి తీసేసుకుని, మూకుడులో మళ్ళీ ఓ చెంచా నూనె వేసిన తర్వాత, కడిగి,తరిగి ఉంచిన రెండు కట్టలు చుక్కాకు వేసి, అర చెంచా ఉప్పు వేసి బాగా కలుపుతూ వేగనివ్వాలి.
* చుక్కాకు సుగుణం ఏంటంటే ఇట్టే పేట్ లా అయిపోతుంది. పచ్చడికి గ్రైండర్లో వేయక్కర్లేదు. అందుకే పోపులో కారం వేయమన్నా.

ఆకు కడిగిన తడి చాలు మళ్ళీ నీళ్ళు కూడా చల్లక్కర్లేదు. జస్ట్ బాగా కలుపుతూ ఉండాలి వెగేదాకా. లేకపోతే అడుగంటిపోతుంది ఆకు.
* ఈ ఆకు పుల్లగా ఉంటుంది కాబట్టి చింతపండు కూడా అవసరం లేదు.
* ఆకు బాగా దగ్గరపడి ముద్దలా అయిపోయాకా ఆపేసి, అందులో పోపు కలుపుకుని తినెయ్యడమే.
* అన్నం లోకీ దోశల్లోకీ కూడా బావుంటుందీ పచ్చడి.

టిప్:
* కావాలనుకుంటే ఆకు వేగేప్పుడు ఓ చిటికెడు ఆమ్చూర్ పౌడర్(డ్రై మ్యాంగో పౌడర్) వేస్తే కూడా బావుంటుంది.

Labels: chutneys n పచ్చడ్స్, quick & easy 4 comments

అంతా mango మయం... !! (Raw Mango recipies)

8:15 PM | Publish by తృష్ణ



"అంతా mango మయం... మార్చంతా mango మయం..." అని పాడుకునేదాన్ని ఒకప్పుడు.. కొన్నేళ్ల పాటు! పచ్చి మామిడికాయలు మార్కెట్లో కనబడ్డం ఆలస్యం.. మా అత్తగారు అలా కొంటూనే ఉండేవారు సీజన్ అయ్యేదాకా. సీజన్ లో పచ్చిమామిడి కాయలు వస్తూంటే మా అమ్మ ఆవబద్దలు, మెంతి బద్దలు మాత్రం వేసేది. నేనేమో పచ్చి మామిడి జ్యూస్ , చుండో  చేసేదాన్ని. ఇంకా పచ్చిమామిడి పులుసు మా అన్నయ్య బాగా చెస్తాడు. నే చెయ్యలేదెప్పుడు...తినేవాళ్ళు లేక :( 
కానీ మా అత్తగారు మాత్రం వారంలో నాల్రోజులు మామిడివంటలే చేసేవారు. కొబ్బరికాయ - మామిడికాయ పచ్చడి ఆవిడకి ప్రాణం. ఇంకా మామిడికాయ పులిహోర, మామిడికాయ పప్పు, ఆవబద్దలు, మెంతి బద్దలు ఇలా రకరకాల వంటకాలు చేసేసేవారు. ఇంట్లో అందరూ ఇష్టంగా తినేసేవారు కూడా. ఆ రకంగా నాక్కూడా సీజన్ రాగానే పచ్చిమామిడికాయలు కొని ఈ ఐటెంస్ అన్నీ చెయ్యడం అసంకల్పితంగా వచ్చేసింది..:) ఈ నెల్లో చేసిన పచ్చిమామిడి వంటలు...



మామిడి పిండెలతో ఆవబద్దలు: 

http://ruchi-thetemptation.blogspot.in/2012/04/blog-post.html


మెంతి బద్దలు:



రెసిపిలతో కాకుండా ఈ రెసిపీ విడిగా ఇదివరకూ రాసాను :)
http://ruchi-thetemptation.blogspot.in/2011/04/blog-post_10.html






మామిడికాయ పప్పు:



పప్పు రెసిపీ రాసేదేముంది.. 
* ముక్కలు పప్పు కలిపి కుక్కర్లో ఉడికించాకా, 
* ఆవాలు,మినపప్పు,జీలకర్ర,వెల్లుల్లుపాయలు, కర్వేపాకు,ఎండుమిరపకాయలు,పసుపు,ఇంగువ లతో చక్కని పోపు వేసుకోవడమే.



మామిడికోరు పులిహోర:

* 250gm రైస్ తో అన్నం వండాలి.
* మీడియం సైజ్ మామిడికాయ ఇలా కోరుకోవాలి.



* తర్వాత మామూలు పులిహోరకు వేయించుకున్నట్లే పోపు వేయించుకోవాలి. 

* అదనంగా ఐదారు జీడిపప్పు పలుకులు, రెండు అంగుళాలు అల్లంముక్క కోరి పోపులో వేస్తే అదనపు రుచి!

మామిడికోరు పులిహోర



 కొబ్బరికాయ - మామిడికాయ పచ్చడి:



* ఒక పెద్దకప్పు కొబ్బరి ముక్కలకి, అందులో అర కప్పు పచ్చిమామిడి ముక్కలు, పోపులో వేయించిన రెండు ఎండు మిరప, రెండు పచ్చిమిర్చి, నాలుగు కొత్తిమీర రొబ్బలు, తగినంత ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసాకా మిగిలిన పోపు కలపాలి. 

* మామిడి ముక్కలు ఎక్కువైపోతే పుల్లగా బావుండదు పచ్చడి. కాబట్టి కాయ పులుపుని బట్టి మామిడి ముక్కలు తక్కువగా వేసుకోవాలి.

* అన్నంలో ఈ పచ్చడి కలుపుకుని తింటూంటే ఉంటుందీ.... సూపరంతే!

***   ***    ****

ఆవకాయలు   మాగాయలు  రకాలు, రెసిపీలు ఆ లింక్స్ లో..! 



Labels: chutneys n పచ్చడ్స్, పప్పులు, పులిహోర 2 comments

పచ్చిటమాటా + పల్లీ చట్నీ

12:13 PM | Publish by తృష్ణ




ఇదివరకూ పచ్చి టమాటా తో మెంతి బద్దలు పెట్టుకోవడం రాసా కదా.. ఇప్పుడు పచ్చి టమాటా చట్నీ ఎలానో చూద్దాం! పండుటమాటాలు పచ్చడి చేసుకున్నట్లు సేమ్ ప్రొసీజర్ లో అన్నంలోకి పచ్చడి చేసుకోవచ్చు. (చింతపండు అక్కర్లేదు)
అలా కాకుండా టిఫిన్స్ లోకి కాసిని పల్లీలు వేసి చట్నీ చేసుకుంటే చాలా బావుంటుంది.


ఎలాగంటే..

* పావుకేజీ పచ్చి టమాటాలు కడిగి, ముక్కలు చేసి రెండు చిన్న చెంచాల నూనెలో వేయించాలి. మూకుడు పైన మూత పెడితే ముక్కలు త్వరగా మగ్గుతాయి.

* తర్వాత 50gms 0r 100gms పల్లిలు పొడిగా వేయించుకుని పొట్టు తీసేయాలి. (పల్లీ పచ్చడికి పొట్టు తీసేస్తాం కదా..అలాగ!)

* అర చెంచా ఆవాలు, చెంచా మినపప్పు, అర చెంచా జీలకర్ర, కర్వేపాకు, చిటికెడు పసుపు, రెండు ఎండుమిర్చి, రెండు పచ్చిమిరపకాయలు, కాస్త ఇంగువ వేసి పోపు వేయించాలి. చివరలో చిన్న కట్ట కొత్తిమీర కడిగి అది కూడా పోపులో వేసేసి స్టౌ ఆపేయాలి. కొత్తిమీర వేగక్కర్లేదు. వేడికి ఆకులు మగ్గితే చాలు.

* ముందు ఓసారి పల్లీలు పొడి అయ్యేలా మిక్సీలో తిప్పేసుకోవాలి.

* తర్వాత వేగిన పచ్చిటమాటా ముక్కలు, పోపులో వేగిన మిరపకాయలు, కొత్తిమీర, తగినంత ఉప్పు అందులోనే వేసి చెట్నీ మెత్తగా గ్రైండ్ చెయ్యాలి.

* ఈ చట్నీ ఇడ్లీల్లోకీ, అన్నిరకాల దోశల్లోకీ బాగుంటుంది.


Labels: chutneys n పచ్చడ్స్ 4 comments

అడై దోశ (Adai dosa)

5:12 PM | Publish by తృష్ణ





'అడై' తమిళనాట బాగా ఫేమస్సు! ఊతప్పం లాగనే 'అడై' కూడా కాస్త మందంగా ఉంటుంది కానీ అడై పిండితో దోశ కూడా వేయచ్చు. మందంగా కాకుండా మామూలు దోశలా ఉండి. టేస్ట్ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.

కావాల్సినవి:

మామూలు బియ్యం లేదా ఉప్పుడు బియ్యం: 11/2 cup
మినపప్పు :1/2 cup (వెయ్యకపోయినా పర్లేదు. ఇది నా సొంత ఆప్షన్ :))
పెసరపప్పు: 1/2 cup
శనగపప్పు: 1/2 cup
కందిపప్పు: 1/2 cup
రెండు మూడు ఎండు మిరపకాయలు లేదా పచ్చిమిరపకాయలు
పావు చెంచా ఇంగువ
అర చెంచా మెంతులు
రెండు కేరెట్లు: తురిమినవి
రెండు ఉల్లిపాయలు: సన్నగా తరిగినవి
అంగుళం అల్లం ముక్క
చిన్న కట్ట కొత్తిమీర


తయారీ: 
* ముందుగా బియ్యం, పప్పులన్నీ + మెంతులు ఓమాటు కడిగి, రెండు మూడు గంటలు నానబెట్టాలి.

* నానిన పప్పులన్నీ మెత్తగా రుబ్బుకోవాలి. 

* ఎండుమిర్చి వేయాలంటే పప్పులతో పాటే నానబెట్టేసి రుబ్బేయాలి. పచ్చిమిరపకాయలైతే డైరెక్ట్ గా నానిన పప్పులతో కలిపి రుబ్బచ్చు. (నేను పచ్చిమిరపకాయలు వేసాను)

* రుబ్బిన పిండిలో ఉప్పు , ఇంగువ, కేరెట్ తురుము, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలపాలి.

* పెనం కాలాకా దోశలాగ వేసి బాగా కాలనిచ్చి రెండో వైపుకి తిప్పాలి. మామూలు దోశ కన్నా కాస్త ఎక్కువ సేపు కాలాలి ఇది. అడై దోశ ఎంత రో్స్ట్ అయితే అంత రుచి. బటర్ తో కాలిస్తే ఇంకా రుచిగా ఉంటాయి ఈ దోశలు :)







* ఉల్లిపాయ ముక్కలు కూడా కలిపేసి ఊతప్పం లాగ మందంగా వేసుకోవచ్చు. ఇలా..



* ఉల్లిపాయ ముక్కలు కేరెట్ కోరులాగ దోశ పిండిలో కలపేయకుండా దోశ వేసాకా పైన చల్లాలి. అలా అయితే దోశ సన్నగా వస్తుంది. ఉల్లిపాయముక్కలు వేసేస్తే పిండి రౌండ్ గా స్ప్రెడ్ చేసేప్పుడు అవి ఆడ్డం వచ్చేస్తాయి. 

* ఇందులోకి అల్లం, కొబ్బరి, పచ్చిటమాటా మొదలైన చట్నీలు బావుంటాయి. పైన ఫోటోలోది పల్లీలు+కొత్తిమీర కలిపి చేసిన చట్నీ.

Labels: chutneys n పచ్చడ్స్, tiffins, దోశలు రకాలు 11 comments

కాలీఫ్లవర్ కాడలతో పచ్చడి

2:02 PM | Publish by తృష్ణ






కాలీఫ్లవర్ పువ్వు పై భాగం కూరకి తరిగాకా, మిగిలే కాడలతో పచ్చడి చేయచ్చు.

కావాల్సినవి: 
* ఒక కప్పు కాలీఫ్లవర్ కాడలు
* రెండు ఎండుమిర్చి, ఒక పచ్చిమిరపకాయ
* చెంచాడు చింతపండు(చిన్న నిమ్మకాయలో సగం అన్నమాట)
* తగినంత ఉప్పు
* కాస్త కొత్తిమీర (పై ఫోటొలో పచ్చడిలో కొత్తిమీర వెయ్యలేదు :))
* చిటికెడు పసుపు
పోపుకి: మినపప్పు,ఆవాలు,జీలకర్ర, కర్వేపాకు,ఇంగువ,


తయారీ:

* కాలీఫ్లవర్ కాడలు ఒక చెంచాడు నూనెలో కాస్తంత వేయించాలి.


* మొరపకాయలతో పోపు వేయించుకోవాలి. ఆఖరులో కొత్తిమీర పోపులో వేసి స్టౌ ఆపేయాలి.(వేడికి కాస్త మగ్గుతాయి కొత్తిమీర ఆకులు)

* వేగిన ఎండు మిరపకాయలు, పచ్చిమిర్చి, చింతపండు, కాలీఫ్లవర్ కాడలు, పసుపు, కొత్తిమీర, ఉప్పు కలిపి మిక్సీలో తిప్పాలి.

* పచ్చడి మిక్సీ లోంచి తీశాకా పోపు కలుపుకోవాలి.

* ఈ పచ్చడి దోశల్లో, ఇడ్లీల్లో లేదా అన్నంలో కలుపుకుని తినచ్చు.


Labels: chutneys n పచ్చడ్స్ 0 comments

ఉసిరి ఆవకాయ, ఉసిరి పచ్చడి

3:35 PM | Publish by తృష్ణ




ఉసిరి దొరికే సీజన్ అయిపోతూంటే ఇప్పటికి కుదిరింది రాయడానికి..! రుచి సంగతి ఎలా ఉన్నా ఔషధగుణాలు పుష్కలంగా ఉన్న ఉసిరికాయను ఏడాది పొడువునా తినగలిగేలా నిలవచేసి పచ్చడి చేసుకునే పధ్ధతి మన పెద్దవాళ్ళు మనకు చెప్పారు. ఆవకాయ కన్నా ఉసిరిపచ్చడి శ్రేష్ఠం. ఉరిసితొక్కు నిలవ ఉంచి, అప్పుడప్పుడూ అంత తొక్కుతో పచ్చడి చేసుకు రోజూ భోజనంలో మొదటి ముద్దలో తింటే ఎంతో మంచిదిట. కనీసం మనం మొదట తినే పప్పులో అయినా నంచుకుంటే ఆరోగ్యానికి మేలు. 


ఉసిరి కొనేప్పుడు కూడా కార్తీకమాసంలో దొరికే ఉసిరికాయలు కొనాలిట. వాటిల్లో ఔషధగుణాలు ఇంకా ఎక్కువగా ఉంటాయిట. పచ్చడి తర్వాత చేసుకున్నా కార్తీకమాసం అయ్యేలోపూ ఉసిరికాయలు కొని ఫ్రిజ్ లో పెట్టేస్తుంటాను నేను. సరే, ఇప్పుడు ముందు ఉసిరి తొక్కు నిలువ ఉంచేదెలాగో చెప్తానేం...

ఉసిరి తొక్కు నిలువ చేయడం:
* ముందర ఉసిరికాయలు కడిగి, తుడిచి, తడి ళేకుందా ఆరబెట్టాలి.
* తర్వాత చిన్న చిన్న ముక్కలు చెయ్యాలి. ఇలా..


* ముక్కలు గ్రైండర్ లో వేసి ఊరగాయలకు వాడే రాళ్ల ఉప్పు, పసుపు వేసి మెత్తగా తిప్పుకోవాలి. పావుకేజీ ఉసిరికాయలకు రెండు గుప్పెళ్ళు ఉప్పు, రెండు చెంచాల పసుపు వేయచ్చు.
అలా గ్రైండ్ చేసిన ఉసిరి తొక్కు ఇలా ఉంటుంది..


* ఇది ఒక సీసాలో కానీ పింగాణీ జాడీలో కానీ వేసి తడి తగలకుండా మూత పెట్టాలి. కావాల్సినప్పుడల్లా కాస్త కాస్త తీసి పచ్చడి చేసుకోవచ్చు.


ఉసిరి పచ్చడి:

* సుమారు టీ గ్లాసుడు ఉసిరి తొక్కును పచ్చడికి తీసుకుంటే నాలుగు ఎండు మిరపకాయలు, నాలుగు పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజు కట్ట కొత్తిమీర తీసుకోవాలి.

* ఒక చెంచా నూనెలో మినపప్పు, ఆవాలు, ఇంగువ, ఎండు మిర్చి వేసి వేగాకా ఒక చెంచా మెంతిపొడి వేసి, మెంతిపొడి బాగా ఎర్రగా వేగాకా స్టౌ ఆపేయాలి. అప్పుడు కడిగి, తరిగిన కొత్తిమీర ఆ వేడి పోపులో వెయ్యాలి. కాస్త మగ్గినట్లు అవుతుంది.

*  వేగిన ఎండు మిర్చి, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు గ్రైండర్ లో వేసి ఒకసారి తిప్పాకా , ఉసిరి తొక్కు కూడా అందులో వేసి మొత్తం కలిసేలా మిక్సీ మరోసారి తిప్పాలి.

* నిలవ ఉంచేప్పుడు ఉప్పు వేస్తాం కాబట్టి, ఇంకా ఉప్పు అవసరం అనుకుంటే రుచి చూసి తగినంత కలుపుకోవాలి.

* ఇలా చేసుకున్న పచ్చడి కూడా నాలుగైదు నెలలు పాడవకుండా ఉంటుంది.

---------------------------
ఉసిరి ఆవకాయ:



* ఉసిరికాయలు ముక్కలు చెయ్యకుండా కాయలకు మధ్య మధ్య చాకుతో గాట్లు పెట్టి, మూకుడులో రెండు చెంచాల నూనె వేసి కాస్త మగ్గించాలి. కాయలు కాస్త మెత్తబడ్డాయి అనుకున్నాకా ఆపేయాలి. ఇలా చేస్తే ముక్కలు త్వరగా ఊరతాయి. 


* ఆవకాయ పాళ్ళలో ఆవపొడి, కారం, ఉప్పు (౧:౧:౧) తీసుకుని ఊరగాయ పెట్టేసుకొవడమే.



రెండవరకం:



* ఇందులో కాస్త మెంతిపిండి కలుపుతారు. ప్రొసిజర్ ఇదివరకూ దబ్బకాయ ఊరగాయ  చెప్పాను.. అలానే..! దబ్బకాయ ముక్కలకు బదులు మగ్గించిన ఉసిరికాయలు చల్లారాకా, అవి పిండిలో కలుపుతాం. అంతే!

* ముక్కలుగా కోసి అవకాయ పెట్టుకున్నా ముక్కలు చెంచాడు నూనెలో మగ్గిస్తే బావుంటుంది.

Labels: chutneys n పచ్చడ్స్, ఊరగాయలు-రకాలు 4 comments

టమటా నిలవ పచ్చడి

4:56 PM | Publish by తృష్ణ





ఎండాకాలంలో మామూలు ఊరగాయలతో పాటూ ముక్కలు బాగ ఎండుతాయని నిమ్మకాయ, దబ్బకాయ, టమాటా మొదలైన ఊరగాయలు పెట్టుకుంటాము కదా, ఎండ లేకపోయినా కూడా స్టౌ మీద మగ్గించి టమాటా నిలవ పచ్చడి చేసుకోవచ్చు. ఎండబెట్టి పెట్టిన ఊరగాయంత నిలవ ఉండకపోయినా, ఇదీ నెలా రెండునెలలు నిలవ ఉంటుంది.

కావాల్సినవి:
కేజీ టమాటాలు
వంద గ్రాములు నూనె
వంద గ్రాములు చింతపండు
వంద గ్రాములు కారం
ఏభై గ్రాములు మెంతిపొడి(కొన్నది లేక పొడిగా మెంతులు వేయించి గ్రైండ్ చేసినది)
తగినంత ఉప్పు (సుమారు 75-100 gms మధ్య)
చెంచా ఇంగువ
చెంచా పసుపు
పోపుకి  చెంచా ఆవాలు

తయారీ:
* టమాటాలు కడిగి పొడిగా ఉండేలా తుడిచి, ముక్కలు చేసి ఏభైగ్రాములు నూనె వేసి వేయించాలి.  పైన మూతపెడితే త్వరగా మగ్గుతాయి ముక్కలు.




* ఆ ముక్కలు కాస్త మగ్గాకా, చింతపండు చిన్నచిన్న ముక్కలు చేసి టమాటా ముక్కల్లో వెయ్యాలి. ముక్కలు మెత్తపడి దగ్గర పడుతుండగా మూత తీసేసి, రసం అంతా ఇగరనివ్వాలి.

*  రసం అంతా ఇగిరి టమాటా ముక్కలు బాగా దగ్గరపడ్డాకా స్టౌ ఆపేయాలి.

* ఈ మిశ్రమం చల్లారాకా తగినంత ఉప్పు కలిపి గ్రైండర్ లో మెత్తగా గ్రైండ్ చెయ్యాలి. మెత్తబడిపోతాయి కాబట్టి ఒక్క తిప్పు చాలు.

* మూకుడులో నాలుగైదు చెంచాల నూనె వేసి అందులో ఆవాలు, ఇంగువ పోపు వేయించాలి.

* తర్వాత మెంతిపొడి వేసి బాగా ఎర్రగా వేగనివ్వాలి.

* తర్వాత కారం కూడా వేసి మిగిలిన నూనె కూడా పోసి స్టౌ ఆపేయాలి.  కారం వేగటానికి ఆ వేడి చాలు.

* తర్వాత గ్రైండ్ చేసిన టమాటా ముద్ద అందులో కలిపేయాలి. వేడి మీద అదే మూకుడులో కలిపేయచ్చు.

* చల్లారాకా తడి తగలకుండా సీసాలో దాచుకుంటే నెలా, రెండునెలలు నిలవ ఉంటుంది.

రెండో రకం టమాటా పచ్చడి:
* పైన చెప్పినట్లుగా మెంతిపొడి, కారం వేగిన మూకుడిలో టమటా ముద్ద కలిపేసాకా, అది చల్లార్చి, అందులో ఓ డభ్భై గ్రాములు పచ్చి ఆవపిండి కలపాలి.
ఊరగాయలాగ అన్నమాట.

* ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. టమాటా ముక్కలు వేగేప్పుడే వెల్లుల్లి కలిపి వేయించేసి, గ్రైండ్ చెసేస్తే రుచి బావుంటుంది.

* ఇది కూడా తడి తగలకుండా ఉంచితే నెలా, రెండునెలలు నిలవ ఉంటుంది.

Labels: chutneys n పచ్చడ్స్, ఊరగాయలు-రకాలు 4 comments

కొబ్బరికాయ - చింతకాయ పచ్చడి

5:05 PM | Publish by తృష్ణ



చింతకాయలు దొరికే సీజన్ లో కొత్తిమీర, దోసకాయ, బీరకాయ, ఆనపకాయ మొదలైన అన్ని పచ్చళ్లలోకీ చింతపండు బదులు చింతకాయలనే వాడతాను నేను. చింతకాయల వల్ల పచ్చడికి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. చింతపండు కన్నా ఇదే మంచిది కూడానూ.

ఈ టపాలో "చింతకాయ - కొబ్బరికాయ పచ్చడి" ఎలాగో చూడండి..


కావాల్సినవి: 

*అర కొబ్బరిచిప్ప (కోరుకున్నా సరే, ముక్కలు చేసి గ్రైండ్ చేసినా సరే)

* మూడు నాలుగు పెద్ద చింతకాయలు (పచ్చివి)
(నాలుగే అయితే ఎక్కువ పులుపు ఉండదు)
* తగినంత ఉప్పు

* రెండు పచ్చిమిరపకాయలు

* కాసిని కొత్తిమీర రొబ్బలు(పచ్చివే) , కొత్తిమీర ఇష్టమైతే చిన్న కట్ట మొత్తం వేసుకోవచ్చు.

పోపులోకి: అర టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, టీస్పూన్ మినపప్పు, రెండు ఎండుమిరపకాయలు, చిటికెడు ఇంగువ, కాస్త కర్వేపాకు, చిటికెడు పసుపు.




తయారీ:


* ముందు ఒక చెంచా నూనెలో పైన చెప్పినవాటితో పోపు పెట్టేసుకోవాలి.

* తర్వాత పచ్చి చింతకాయలో గింజలు తీసేసి, అవీ కొబ్బరి ముక్కలూ , తగినంత ఉప్పు , పోపులో వేయించిన రెండు ఎండుమిరపకాయలు, రెండు పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

* గిన్నెలోకి తీసాకా మిగిలిన పోపు కలిపి వడ్డించటమే.

* ఈ పచ్చడి దోశల్లోకీ, అన్నంలోకీ కూడా బావుంటుంది. 





Labels: chutneys n పచ్చడ్స్ 0 comments

కర్వేపాకు పచ్చడి

5:42 PM | Publish by తృష్ణ



కూరలో, ఉప్మాలో కర్వేపాకు వస్తే ఏరి పారేయకుండా తినేవాళ్ళెంత మంది? "పోపులో కర్వేపాకులా ఏరిపారేసారు!" అనే నానుడి కూడా ఉంది..:) చిన్నప్పుడు నేనూ కర్వేపాకు ఏరేసేదాన్ని. కానీ కర్వేపాకులోని ఔషథగుణాలు, ఉపయోగాలు తెలిసాకా ఎప్పుడూ కర్వేపాకును ఏరిపారేయలేదు. ఏ విధంగా కర్వేపాకుని ఎక్కువగా వాడచ్చో కనుక్కుని ఆ విధంగా వాడటం మొదలుపెట్టాను. కర్వేపాకు ఎప్పుడూ తాజాగా ఉన్నది వాడితే ఎక్కువ ఉపయోగకరం.

కర్వేపాకులో ఇనుము, కేల్షియం, ఫోలిక్ ఏసిడ్, ఏంటీఆక్సిడేంట్లు మొదలైనవి ఉన్నాయి. కర్వేపాకు శరీరంలోని చెడ్డ కొలెస్ట్రాల్ ను తగ్గించగలదు; జుట్టు పెరిగేలా, తెల్లబడకుండా చెయ్యగలదు; రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ తగ్గించగలదు; జీర్ణ శక్తిని పెంచగలదు.... ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కర్వేపాకు ని గురించి మరిన్ని ఉపయోగాలు ఇక్కడ చూడండి:

http://www.diethealthclub.com/health-food/curry-leaves-health-benefits.html




కర్వేపాకుతో నేను కర్వేపాకుపొడి, కర్వేపాకు పచ్చడి, కర్వేపాకు రైస్ చేస్తుంటాను. ఇవాళ కర్వేపాకుతో పచ్చడి గురించి చెప్తానేం.. మిగిలిన రెండూ మరోసారి.

కావాల్సినవి:

* లేత కర్వేపాకు - రెండు గ్లాసులు  (250-300 ml నీళ్ళు పట్టే గ్లాసన్నమాట)

* చిన్న నిమ్మకాయంత నానబెట్టిన చింతపండు

*పోపులోకి : మినపప్పు, ఆవాలు, జీలకర్ర, చిటికెడు ఇంగువ, ఆరు,ఏడు ఎండుమిరపకాయలు 

*తగినంత ఉప్పు

* రెండు మూడు చెంచాల నూనె

* మూడు, నాలుగు చెంచాల బెల్లం తురుము- optional (తీపి పచ్చడి కావాలనుకుంటేనే)

తయారీ:

* ముందుగా కర్వేపాకు శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. నీళ్ళు ఓడటం తగ్గితే చాలు.

* రెండు చెంచాల నూనెలో కర్వేపాకు మాడకుండా వేయించాలి.

* పోపు కూడా విడిగా వేయించేసుకోవాలి.

* వేగిన ఆకు చల్లరాకా, కర్వేపాకు + నానబెట్టిన చింతపండు + ఎండు మిరపకాయలు, salt కలిపి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి.

* తీపి కావాలనుకునేవారు కాస్తంత బెల్లం తురుము కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు.

* కర్వేపాకు ముదురుగా ఉంటే పచ్చడి మెత్తగా అవ్వదు. అలాంటప్పుడూ కాస్త గోరువెచ్చని నీళ్ళు గ్రైండ్ చేసేప్పుడు పోసి తిప్పుకుంటే పచ్చడి మెత్తగా అవుతుంది.

*ఈ పచ్చడి అన్నంలోకీ, దోశల్లోకీ కూడా బావుంటుంది.




Labels: chutneys n పచ్చడ్స్ 2 comments

బచ్చలాకు(malabar spinach) పచ్చడి

1:21 PM | Publish by తృష్ణ




కావల్సినవి:

*మూడు బచ్చలాకు కట్టలు

*కాస్త చింతపండు(అర నిమ్మచెక్క అంత) నానబెట్టినది

*పోపులోకి : పావుచెంచా ఆవాలు, అర చెంచా మినపప్పు, కాస్త జీలకర్ర, చిటికెడు ఇంగువ, మూడు ఎండుమిరపకాయలు
* తగినంత ఉప్పు

* 2,3 tsp oil.



తయారీ:

* బచ్చలాకు వలిచి కడగాలి. కాడలు లేతగా ఉంటే వేయచ్చు కానీ ముదురుగా ఉంటే ఆకు ఒక్కటే వలవాలి.

* 2 tsp oil లో బచ్చలాకు + చిటికెడు పసుపు వేసి మాడకుండా కలుపుతూ వేయించాలి.

* తర్వాత 1tsp oil లో పైన చెప్పిన పోపు పదార్థాలతో పోపు వేయించుకోవాలి.

* మిక్సీలో నానబెట్టిన చింతపండు,ఎండుమిర్చి, వేయింఛి చల్లార్చిన బచ్చలాకు కలిపి మరీ మెత్తగా పేస్టా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి.

* బచ్చలాకు జిగురుగా ఉంటుంది కాబట్టి గ్రైండర్లో పేస్ట్ అయిపోతుందేమో అనుకుంటే రోట్లో తొక్కుకోవచ్చు కూడా.

* పచ్చడి చేసేప్పుడు పోపు కలిపేసే కన్నా, గిన్నెలోకి తీసాకా పోపు పైన వేసి కలుపుకుంటే బావుంటుంది.

* వేడి వేడి అన్నంతో తింటే ఈ పచ్చడి చాలా బావుంటుంది.




బచ్చలి ఉపయోగాలు ”కందబచ్చలి కూర’టపాలో చూడవచ్చు.

Labels: chutneys n పచ్చడ్స్ 3 comments

కొబ్బరి + కంది పచ్చడి

5:39 PM | Publish by తృష్ణ






వంటింట్లో కందిపప్పు వేయిస్తూంటేనే ఆ వాసనకి మా మావగారు వంటింట్లోకి వచ్చేసేవారు కండిపచ్చడి చేస్తున్నావా? అని. ఆయనకు ఎంతో ఇష్టం కందిపచ్చడి. ఆయన సూపర్ వంటల స్పెషలిస్ట్ కూడా. చిన్నతనంలో వాళ్ళ చెల్లెళ్లకూ, తమ్ముళ్ళకూ ఆయనే వండి పెట్టేవారుట. కందిపచ్చడి, టమాటో పచ్చడి ఆయన రోట్లో రుబ్బుతూంటే సగం రోట్లోనే ఖాళీ అయిపోయేవట. పైగా వాళ్లవన్నీ గుంటూరు కారాలు. మా పెళ్ళైన మొదట్లో పాపం అన్నీ తినేవారు కానీ తర్వాతర్వాత ఆయనకు ఫుడ్ రెస్ట్రిక్షన్స్ చాలా ఉండేవి. అందుకని ఆయన తినకూడరని ఆయనకు ఇష్టమైనవేమో వండేవాళ్లం కాదు. ఆయన కాలంచేసి నాలుగేళ్లవుతున్నా ఇప్పటికీ కందిపచ్చడి చేస్తే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి..!! ఆయనను తలవకుండా ఈ టపా కూడా రాయలేను మరి..


సరే, కొబ్బరి + కంది పచ్చడి లోకి వచ్చేస్తే... ఎర్రగా వేయించిన కందిపప్పు లో నానబెట్టిన చింతపండు, ఉప్పు, ఎర్ర మిరపకాయలతో వేయించిన పోపు కలిపి మెత్తగా గ్రైండ్ చేసి, ఘుమఘుమలాడే కందిపచ్చడి రెడి అయిపోతుంది కదా ! మా నాన్నమ్మ ఇదే కందిపచ్చడిలో కొబ్బరి కలిపి కొబ్బరి + కంది పచ్చడి చేసేది. అదీ చాలా బావుంటుంది. ఎలాగంటే..

ఒక కొబ్బరి చిప్ప (half coconut)
150gms కండిపప్పు
నిమ్మకాయంత నానబెట్టిన చింతపండు
రెండు పచ్చిమిరపకాయలు
పోపుకి: ఐదారు ఎండు మిరపకాయలు, ఒక చెంచా మినపప్పు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, చిటికెడు ఇంగువ, చిటికెడు పసుపు, కర్వేపాకు

* ముందుగా కందిపప్పు ఏమాత్రం మాడకుండా ఎర్రగా వేయించుకోవాలి. పచ్చడి రుచి అంతా ఈ వేయించటంలోనే దాగి ఉంటుంది. వేగిన కందిపప్పు  మిక్సీలో కాస్త తిప్పాలి.

*   కందిపప్పు   కాస్త నలిగాకా చింతపండు, కొబ్బరి(కొబ్బరిచిప్ప ముక్కలు చేసి గ్రైండ్ చేసుకున్నా సరే, లేక తురుముకున్నా సరే), ఉప్పు, పచ్చి మిర్చి, పోపులో వేగిన ఎండు మిరపకాయలు వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడి మరీ గట్టిగా అనిపిస్తే కాసిని నీళ్ళు పోసికోవచ్చు గ్రైండ్ చేసేప్పుడు.

* పచ్చడితో పాటూ గ్రైండ్ చేసే కన్నా పచ్చడి గిన్నెలోకి తీసాకా వేగిన పోపు పైన వేసి కలిపితే ఏ పచ్చడి అయినా బావుంటుంది.

కొబ్బరి వెయ్యని కందిపచ్చడికి ఒక టిప్:


* గ్రైండ్ చేసేప్పుడు రెండు మూడు వెల్లుల్లి రేకులు వేసుకుంటే ఉత్తి కంది పచ్చడి మరి మరీ రుచికరంగా ఉంటుంది.


Labels: chutneys n పచ్చడ్స్ 2 comments

పండుమిరమకాయ - చింతకాయ పచ్చడి

9:08 PM | Publish by తృష్ణ



బజార్లో ఎక్కడ చూసినా పండుమిరపకాయలే ! ఎర్రగా భలే ఉన్నాయి చూట్టానికి. పండు మిర్చి కారం తింటే మాత్రం గూబ గుయ్యే !! అది క్రితం ఏడాది పెట్టాను. ఈసారి పండుమిర్చి, చింతకాయలు కలిపి పచ్చడి చేద్దామని ట్రై చేసాను. బాగానే వచ్చింది.


కావాల్సినవి:

పండుమిర్చి 200gms

చింతకాయలు 300gms (క్వాంటిటి ఇలా అయితే బాగా కారం లేకుండా ఉంటుంది పచ్చడి)

ఉప్పు తగినంత (పచ్చడిలో ఎవరెంత వేసకుంటే అంత)



పోపుకి:

మూడు పెద్ద చెంచాల నూనెలో ఆవాలు, మినపప్పు , 1/2sp ఇంగువ, 1/2sp పసుపు.


చేయటం:


* పండుమిరపకాయలు కడిగి ఆరబెట్టి, తడిలేకుండా ఆరాకా గ్రైండ్ చేసుకోవాలి.
* చింతకాయలు గ్రైండర్ సాయంతో కానీ రోట్లో కానీ కాస్త తొక్కి గింజ తీసేసి, గ్రైండర్లో ముద్దగా చేసి పెట్టుకోవాలి.
* తర్వాత తగినంత ఉప్పు వేసి చింతకాయ, పండు మిర్చి రెండు ముద్దలు మెత్తగా గ్రైండ్ చేసేయాలి.
* పైన చెప్పిన పదార్ధాలతో పోపు పెట్టి, స్టౌ ఆపేసాకా అందులో ఈ గ్రైండ్ చేసిన ముద్ద వేసి బాగా కలిపి, చల్లారాకా సీసాలో స్టోర్ చేసుకోవటమే.





*వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని, ఓ చెంచా నెయ్యి లేదా పప్పునూనె వేసుకుని తింటే....ఆహా..!!

* చింతకాయ, పండుమిర్చి రెండూ బాగా వేడి చేసే పదార్ధాలు కాబట్టి ఈ పచ్చడి తిన్న రోజున తప్పకుండా ఓ గ్లాసుడు పల్చని మజ్జిగ తాగితే మంచిది...:))


Labels: chutneys n పచ్చడ్స్ 6 comments

అరటిపువ్వు పచ్చడి

11:30 AM | Publish by తృష్ణ



అరటిపువ్వులో vitamin E పుష్కలంగా ఉంటుంది. చాలా మంచిది. అరటిపువ్వు ముఫ్ఫై రోజులు వరుసగా వాడితే బ్లడ్ సుగర్ లెవెల్స్ తగ్గుతాయని క్రింద వెబ్సైట్ లో రాసాడు....వాడకం వల్ల శరీరానికి చేకూరే మరిన్ని లాభాల గురించీ ఇక్కడ చూడండి.


ఇదివరకూ అరటిపువ్వు వడలు గురించి రాసాను. ఇప్పుడు పచ్చడి చేస్కుందాo..

ముందుగా ఒక అరటిపువ్వు తీసుకుని, చేతికి కాస్త నూనె రాసుకుని(లేకపోతే వేళ్ళు నల్లగా అయిపోతాయి) ఆ పువ్వులో చివర ఉన్నవి వలుచుకోవాలి. ఆ తరువాత వాటిల్లోంచి క్రింద ఫోటోలో చూపించినవి తొలగించవలెను. లేకపోతే చేదు,వగరు కలగలిపి ఒక వింత టేస్టు వస్తుంది. అది మనం భరించలేము.





* ఆ తర్వాత వాటిని కాస్త ఉప్పు వేసి (క్రింద ఫోలోలాగ) రోటిలో కాస్తంత కచ్చాగా తొక్కుకోవాలి లేదా గ్రైండర్ లో ఒక్కసారి బర్రున తిప్పేసుకోవాలి.


* * ఆ తొక్కిన/గ్రైండ్ చేసిన పదార్ధాన్ని గట్టిగా పిండుకోవాలి. అలా చేయటం వల్ల వగరంతా పోతుందన్నమాట. పిండేసాకా క్రింద ఫోటోలోలా ఉంటుంది.


* అప్పుడొక ముద్ద రెడీ అవుతుంది. అదే మనకు కావాల్సిన పదార్ధం. ఆ ముద్దనే వడలకు, పచ్చడికీ, కూరకూ వాడతారు.



పచ్చడి విధానం:


* అర చెంచాఆవాలు, అర చెంచా మినప్పప్పు, కాస్త జీలకర్ర, కాస్త ఇంగువ,రెండు ఎండు మిరపకాయలు వేసి పోపు వేయించి పెట్టుకోవాలి.

* తర్వాత పైన చెప్పిన విధంగా పిండేసి పెట్టుకున్న ముద్దను రెండు చెంచల నూనెలో మాడకుండా 2,3mins వేయించాలి.

* వేయించిన ముద్దలో :

నానబెట్టిన (మీడియం సైజు నిమ్మకాయంత) చింతపండు,

తగినంత ఉప్పు(పైన పిండేందుడుకు కాస్త ఉప్పు వేసాం కాబట్టి తక్కువగానే వేసుకోవాలి)

రెండు పచ్చిమిర్చి, రెండు ఎండుమిర్చి (పోపుతో వేగినవి)

* పైనరాసినవన్నీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గిన్నెలోకి తీసాకా వేయించి ఉంచికున్న పోపు వేసి కలుపుకోవాలి.

* టేస్టీ టేస్టీ అరటిపువ్వు పచ్చడి రెడీ. అద్భుతమైన ఆ రుచి కోసం కొంచెం కష్టమైన విధానమే అయినా చేసేసుకోవాలి. తప్పదు మరి...:))





Labels: chutneys n పచ్చడ్స్ 3 comments

వాక్కాయ-కొబ్బరికాయ పచ్చడి

5:34 PM | Publish by తృష్ణ



మార్కెట్లోకి వక్కాయలు వచ్చాయి.. మరి పచ్చడి చేసేస్కుందామా? వాక్కాయలు మరీ పండిపోకుండా గ్రీన్ గా ఉన్నవి కొనుక్కోవాలి.. ఇలా..




వాటి మధ్యన గింజలు తీసేయాలి క్రింద ఫోటోలోలాగ. లేకపోతే పచ్చడి చేదొస్తుంది.


కొబ్బరికాయ పచ్చడి ఎలా చేసుకుంటామో అలానే అన్ని పాళ్ళు తీసుకుని, చింతపండు బదులుగా ఈ వాక్కయల్ని వాడాలి. అంతే.


 కొలతలు కావలంటే:

* మొదట ఆవలు, మినపప్పు (కాస్త ఎక్కువ), కాస్త జీలకర్ర, రెండు ఎండు మిర్చి, కాస్త ఇంగువ, ఓ రొబ్బ కర్వేపాకు లతో పోపు పెట్టుకోవాలి.

తర్వాత:

* ఒక కొబ్బరి చిప్ప (మొత్తం కాదు సగమే..:)) చిన్నగా ముక్కలు తరుక్కోవాలి లేదా కోరుకోవాలి

* ఎనిమిది లేక పది వాక్కాయలు (ఎక్కువ వేస్తే పులుపు తినలేము)


* రెండు పచ్చిమిర్చి

* తగినంత ఉప్పు ,చిటికెడు పసుపు

* పోపుతో వేయించిన ఎండు మిరపకాయలు



* పైన చెప్పినవన్నీ కలిపి గ్రైండ్ చేసేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ అయ్యిన పచ్చడిలో మొదట్లో పెట్టుకున్న పోపు కలిపేసుకోవాలి.



* పోపు కూడా పచ్చడితో గ్రైండ్ చేసేస్తారు కొందరు. కానీ పెరుగు పచ్చడిలో అయినా, రోటి పచ్చడిలో అయినా పోపు చివరన వేస్తేనే మధ్య మధ్య వేగిన మినపప్పు తగులుతూ రుచిగా ఉంటుంది.




Labels: chutneys n పచ్చడ్స్ 6 comments

పచ్చి టమాటా తో ' మెంతిబద్దలు '

2:36 PM | Publish by తృష్ణ


పచ్చి టమాటాలతో పప్పు, పచ్చడి చాలా బావుంటాయి. పచ్చి టమాటాలతో చేసే 'మెంతి బద్దలు ' ఇంకా బావుంటాయి. అన్నం లోకీ, చపాతీల్లోకీ కూడా బావుంటాయి.


పచ్చి టమాటా తో మెంతిబద్దలకి కావాల్సినవి:

ఆకుపచ్చని పచ్చి టమాటాలు - 3

మెంతులు - నాలుగు స్పూన్లు
ఆవాలు - మూడు స్పూన్లు
మినపప్పు - ఒక స్పూన్
ఎండు మిరపకాయలు - నాలుగైదు
రెండు చెంచాల నూనె
చిటికెడు ఇంగువ
అర చెక్క నిమ్మరసం


తయారీ:

* ముందుగా అర చెంచా నునెలో మెంతులు, ఆవాలు,మినప్పప్పు బాగా వేగనిచ్చి తరువాత ఎండు మిర్చి కూడా వేసి, అన్నీ వేగాకా స్టౌ ఆపే ముందర కాస్తంత ఇంగువ వేయాలి.


* పైన వేయించిన మెంతులు అవీ చల్లారాకా మిక్సీ లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

* ఈ పిండిని తరుగుకున్న పచ్చి టమాటా ముక్కల్లో కలిపి, మిగిలిన నూనె పోసి బాగా కలపాలి.

* దీనిలో అర చెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి.


ఇది ఎక్కువ నిలవ ఉండదు. కాబట్టి తక్కువ మోతాదులోనే చేసుకోవాలి. రెండ్రోజులు ఉన్నా కూడా ఫ్రిజ్ లో పెట్టుకుంటే పాడవకుండా ఉంటుంది. మెంతులు వేయించే బదులు ఆవాలు వేగాకా కొందరు మెంతి పిండి, మిరపకాయల బదులు ఎండు మిర్చి కారం వాడుతూ ఉంటారు. అలా కూడా చేయచ్చు కానీ రుచిలో కొంచెం తేడా ఉంటుంది..:)


Labels: chutneys n పచ్చడ్స్ 15 comments

Gujarati 'chundo'

6:00 PM | Publish by తృష్ణ


"చుండో" పచ్చిమావిడికాయలతో చేస్తారు. దీనిని చెపాతీలతో తింటారు గుజరాతీవాళ్ళు. మేం బొంబాయిలో ఉన్నప్పుడు మా ఇంటి పక్కన ఒక గుజరాత్ వాళ్ళు ఉండేవారు. ఆవిడ నాకు భక్రీ, చుండో మొదలైనవి టేస్ట్ చూపించి ఎలా చేయాలో చెప్పేవారు. నేనూ ప్రతి వేసవిలో తప్పనిసరి చేస్తుంటాను. ఇవాళే చేసాను. ఎలా చేయాలంటే:

రెండు పచ్చిమావిడికాయల తురుము
మావిడి తురుములో సగం కొలత పంచదార
ఉప్పు రెండు చెంచాలు
కారం ఒకటిన్నర చెంచాలు
జీలకర్ర ఒక చెంచా
పసుపు అర చెంచా

* పుల్లటి పచ్చడి మావిడికాయలు రెండింటిని తురుముకోవాలి.
* ఆ తురుములో అరచెంచా పసుపు, రెండు చెంచాల ఉప్పు కలిపి మూడు గంటలు పక్కన పెట్టాలి. (ఊట ఊరుతుంది.)
* తర్వాత తురుముకు సగం కొలత ఉన్న పంచదార తీసుకుని దాంట్లో కలిపి మందపాటి మూకుడులో పొయ్యి మీద పెట్టాలి.
* పంచదార తురుముకి వుప్పావు వంతు కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉంటే.
* మధ్య మధ్య అడుగంటకుండా కలుపుతూ ఉండాలి.
* ఆ మిశ్రమం దగ్గర పడ్డాకా ఒకటిన్నర చెంచాల కారం వేసి, మరీ రెండు మూడు నిమిషాల తరువాత ఒక చెంచా జీలకర్ర వేసి దింపేసుకోవాలి.

ఇది నేను చేసిన ప్రయోగం:
ఇంట్లో ఉంటే కనుక చిటికెడు కుంకుమపువ్వు(saffron) తయారైన మిశ్రమంలో వేస్తే రుచి అమోఘం.

ఈ "చుండో" చపాతీల్లోనే కాక దోశల్లోకి కూడా బావుంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే మావిడికాయ జామ్ మాదిరి అన్నమాట. వేసవికాలంలోనే ఎందుకు చేసుకోవాలంటే పచ్చడిమావిడికాయలతో పెడితేనే రుచి బావుంటుంది. తడి తగలకుండా తయారు చేస్తే ఎక్కువ కాలం నిలవ ఉంటుంది. పిల్లలే కాక పెద్దలు కూడా ఇష్టంగా తింటారు(తీపి ఇష్టమున్నవాళ్ళు).


మరో ట్రెడిషనల్ పధ్ధతి కూడా ఉంది. మా ఇంటిపక్క గుజరాతీ ఆవిడ ఇలా చేసేవారు. మావిడి తురుములో వెయ్యాల్సిన పదార్ధాలన్ని వేసేసి ఊట వచ్చాకా అది విడిగా తీసి, ఎండలో ఓ వారం పాటు రోజూ ఊట విడిగా తీసి మళ్ళీ రాత్రి కలిపి మళ్ళీ పొద్దున్నే తీసేసి(మన మజ్జిగ మెరపకాయల టైపులో) పాకం ఇగిరేదాకా ఎండలో పెట్టడం. అది కష్టం అంటే పొయ్యి మీద చేసే పైన చెప్పిన విధానం చెప్పిందావిడ. ఆవిడ పేరు బావుండేది "పారుల్" అని. అర్ధం ఏంటండీ అంటే తెలీదనేది..!

Labels: chutneys n పచ్చడ్స్ 6 comments

మెంతిబద్దలు

8:39 AM | Publish by తృష్ణ




మార్కెట్లో చిన్న చిన్న మావిడికాయలు దొరకటం మొదలవగానే మా ఇంట్లో మొదట అమ్మ మెంతిబద్దలు పెట్టేసేది. ఆ తరువాత చిన్న చిన్న మావిడి పిందెలు సంపాదించి బుల్లి బుల్లి ముక్కలు కోసి ఆవకాయ పెట్టేసేది. పెద్ద మావిడికాయతో కన్నా ఇలా చిన్న చిన్న పిందెలతో పెట్టిన ఆవకాయ బద్దలు చాలా రుచిగా ఉంటాయి. లార్జ్ స్కేల్లో కొత్తావకాయ, మాగాయ, మెంతికాయ మొదలైనవి పెట్టుకునేదాకా టెంపరరీ రిసోర్సెస్ అన్నమాట ఇవి.

క్రితం వారం ఉగాదికి కొన్న చిన్న మావిడికాయ ఒకటుంటే నేనూ మెంతిబద్దలు వేసాను. చాలా బాగా కుదిరింది. చాలా వంటలు అలా కొంచెం చేసినప్పుడే బాగా వస్తూంటాయి ఎందుకో మరి.  'మెంతిబద్దలు' తెలియనివారికి ఎలా చేస్కోవాలో చెప్పెయ్యనా?

* ఆవాలు, మెంతులు 1:1 పాళ్ళలో విడివిడిగా పొడి మూకుడులో ఎర్రగా వేయించుకోవాలి. ఆవాలు వేలితో నొక్కితే పొడుం అవ్వాలి. అప్పుడు బాగా వేగినట్లు. కానీ మాడకూడదు. మెంతులు కూడా ఎర్రగా వేగాలి నల్లగా అవ్వకూడదు.

* ఒకటి రెండుకాయలకైతే ఆవాలూ,మెంటులు కలిపి వేయింఛుకోవచ్చు. కానీ నాలుగైదు కాయలకైతే ఆవాలు విడిగా, మెంతులు విడిగా వేయించుకోవాలి.

* నూనె వేడిచేసుకుని అందులో కాస్త ఇంగువ వేసి వేగాకా అందులో కారం (ఆవాలు,మెంతులతో సరిపోయేంత కొలత) వేసి స్టౌ ఆపేయాలి. కారం మరీ నల్లబడిపోకూడదన్నమాట.

* ఈ మిశ్రమం చల్లారాకా తొక్కు తీసేసి తరిగి ఉంచుకున్న చిన్న చిన్న మవిడి ముక్కలు, ఉప్పు అందులో కలిపేయటమే. మెంతిబద్దలు రెడీ.

Labels: chutneys n పచ్చడ్స్ 7 comments

గోంగూర గ్రీన్ పచ్చడి

12:15 PM | Publish by తృష్ణ


"ఏమిటా..గోంగూర...శాకంభరీదేవీ ప్రసాదం..ఆంధ్ర శాకం..అది లేనిదే ప్రభువులు ముద్దైనా ముట్టరు. తెలిసిందా..!" అన్న "మాయాబజార్"సినిమా డైలాగ్ తెలియనివారు, గోంగూర అంటే ఇష్టం లేనివారు ఎక్కడో గానీ ఉండరనటం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. గోంగూర పచ్చడి నచ్చనివారుంటారా? డౌటే. ఉన్నా చాలా తక్కువమంది ఉంటారేమో. ఎందు మిరపకాయలు వేయించుకుని చేసే గోంగూర నిలవ పచ్చడి అందరిఖీ తెలిసినదే. కానీ అమ్మ(వాళ్ళ అత్తగారి దగ్గ నేర్చుకుని) ఇంకో రకంగా కూడా చేస్తూండేది. దాన్ని నేను గోంగూర గ్రీన్ పచ్చడి అనేదాన్ని. వారం కంటే నిలువ ఉండదు కానీ రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది. ఎలాగో చూసేస్తారా?

నేను కారం బాగా తక్కువ తింటాను కాబట్టి నేను కేవలం నేనే చేసిన తయారీ పధ్ధతి మాత్రమే చెప్తాను. మీరు చేసుకునేప్పుడు పాళ్ళు ఎవరికివారే సరిచేసుకువాల్సినదని మనవి.

కావాల్సినవి:
బాగా కడిగి ఆరబెట్టిన గోంగూర ఆకులు (5కట్టలు వి)
పచ్చిమిరపకాయలు - 10
ఒక పెద్ద ఉల్లిపాయ (తెల్ల ఉల్లిపాయ అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేనదే వాడతాను. మామూలు ఉల్లిపాయ కన్నా ఎక్కువ చలవ చేసే గుణం తెల్ల ఉల్లి కి ఉంది)
5,6 వెల్లుల్లిపాయలు
ఆకు వేయించటానికి తగినంత నూనె
తగినంత ఉప్పు
పోపుకు:
చిన్న చెంచాడు మెంతులు
రెండు చెంచాల మినపప్పు
అర చెంచా ఇంగువ

తయారీ:
* బాగా కడిగి ఆరబెట్టిన గోంగూరను తగినంత నూనెలో మాడకూండా కలుపుతూ బాగా వేయించుకోవాలి.
* వేగిన గోంగూర ఆకు ముద్ద పక్కన పెట్టి, ఆ కడాయీలో గానీ వేరే దాంట్లోనో కాస్తంత నూనె వేసి తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసి ఉల్లిపాయ ముక్కలు కాస్తంత మెత్తబడేదాకా కాసేపు వేయించాలి.
* తరువాత గోంగూర ముద్ద, వేగిన ఉల్లి,పచ్చిమిర్చి,వెల్లుల్లి మిశ్రమాన్ని కలిపి, తగినంట ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి.
* ఆఖరున మెంతులు,మినపప్పు, ఇంగువ వేసి పోపు పెట్టుకుని గ్రైండ్ చేసిన గోంగూర ముద్దకు కలపాలి.
* ఉల్లిపాయలు వేస్తాం కాబట్టి ఇది వారం కన్నా నిలవ ఉండదు.
*వేడి వేడి వైట్ రైస్ లో లేదా మాకులా దంపుడుబియ్యంలో అయినా సరే కలుపుకుని తింటే...రుచి అమోఘంగా ఉంటుంది.

Labels: chutneys n పచ్చడ్స్ 0 comments
Older Posts »
"Health is Wealth."

ఇక్కడ వెతకండి..

'రుచి' చూసినవారు

పంచుకున్న రుచులు

  • ▼  2015 (3)
    • ▼  March (3)
      • సలాడ్ ప్రసాదం :-)
      • బుడిదగుమ్మడి కాయ పప్పు (ash gourd/winter melon dal )
      • Veg.Hakka Noodles
  • ►  2014 (24)
    • ►  December (2)
    • ►  November (2)
    • ►  September (1)
    • ►  July (2)
    • ►  June (4)
    • ►  May (3)
    • ►  April (2)
    • ►  March (7)
    • ►  January (1)
  • ►  2013 (32)
    • ►  December (3)
    • ►  September (4)
    • ►  August (2)
    • ►  July (3)
    • ►  May (1)
    • ►  April (8)
    • ►  March (3)
    • ►  February (1)
    • ►  January (7)
  • ►  2012 (26)
    • ►  December (1)
    • ►  November (3)
    • ►  October (5)
    • ►  June (4)
    • ►  May (5)
    • ►  April (1)
    • ►  March (1)
    • ►  February (4)
    • ►  January (2)
  • ►  2011 (35)
    • ►  December (3)
    • ►  November (6)
    • ►  September (3)
    • ►  August (4)
    • ►  June (2)
    • ►  May (4)
    • ►  April (6)
    • ►  March (5)
    • ►  February (2)
  • ►  2010 (14)
    • ►  December (6)
    • ►  September (4)
    • ►  August (1)
    • ►  June (3)

About

ఇవి కూడా నావే

  • తృష్ణ...
    OTT Entertainment - 3 : 8 వసంతాలు
    2 months ago
  • మనోనేత్రం
    Millet fest - 2015
    10 years ago
Powered by Blogger.

రుచులు - రకాలు

  • chutneys n పచ్చడ్స్ (19)
  • cooking tips (1)
  • experiments (10)
  • Kitchen Essentials (1)
  • pulses (3)
  • quick & easy (4)
  • recipe links (1)
  • rotis (2)
  • salads (7)
  • snacks n sweets (19)
  • soups and appetizers (2)
  • tiffins (24)
  • అట్లు - రకాలు (6)
  • ఊరగాయలు-రకాలు (12)
  • ఒడియాలు (3)
  • కూరలు (25)
  • చారులు రకాలు (1)
  • టీలు - రకాలు (1)
  • దోశలు రకాలు (7)
  • పప్పులు (4)
  • పులిహోర (4)
  • పులుసులు (2)
  • పెరుగు పచ్చడి (2)
  • మన పిండివంటలు (2)
  • రకరకాల పొడులు (2)
  • రైస్ వెరైటీస్ (6)
  • వేసవి పానీయాలు (7)

'రుచి' ఇష్టపడేవారు

Copyright (c) 2010 రుచి...the temptation. Design by Template Lite
Download Blogger Templates And Directory Submission.