సోయా, బొబ్బర్లు, శనగలు లాగ రాజ్మా గింజలు కూడా బజార్లో దొరుకుతాయి. ఆరోగ్యానికి ఎంతో మంచివి. ముఖ్యంగా రక్తంలో సుగర్ లెవెల్స్ ను వియంత్రించగలవు, చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించగలవు. కాబట్టి డయాబెటిక్ పేషంట్స్ రెగులర్ గా వాడితే చాలా మంచిది. రాజ్మా గింజలు రాత్రి నానబెడితే పొద్దున్నకు బాగా నానతాయి. మిగిలిన పప్పుధాన్యాల కన్నా ఇవి నానటానికి, ఉడకటానికీ ఎక్కువ సమయం పడుతుంది. నానిన రాజ్మా ఉడకబెట్టి, వాటితో చేసిన కూర చపాతీల్లోకీ,పూరీల్లోకీ తినవచ్చు.
రాజ్మా గింజలు ఎరుపువి, కాశ్మీరీ రాజ్మా అని నల్ల గింజలు, ఎక్కువ ముదురు ఎరుపు..ఇలా మూడు నాలుగు వెరైటీలు దొరుకుతాయి. ఏవైనా కొనవచ్చు. ఎక్కువ కాలం నిలవ ఉంటాయి. శనగల్లా త్వరగా పురుగు పట్టవు. ఇంకా, శనగల కూరలో వేసే "ఛోలే మసాలా" అమ్మినట్లే బయట "రాజ్మా మసాలా" పొడి అమ్ముతారు. అది ఎక్స్పైరీ డేట్ చూసి కొని ఉంచుకోవాలి.
రాజ్మా వాడకం వల్ల ఆరోగ్యపరమైన ఉపయోగాలు ఇక్కడ:
http://www.infosamay.com/health-benefits-of-kidney-beans-rajma/
ఎక్కువ మసాలా వెయ్యకుండా చపాతీల్లోకి నేను రాజ్మా కూర ఎలా చేస్తానో చెబుతాను..
కావాల్సినవి:
* ఉడకబెట్టిన రాజ్మా ఒక కప్పు(సుమారు 150gms)
* ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక పెద్ద టమాటా ముద్ద (ఫ్రెష్ గా గ్రైండ్ చేసినది)
* ఒక చెంచా రాజ్మా మసాలా పౌడర్
* అర కప్పు ఉడికించిన కందిపప్పు
* అర చెంచా జీలకర్ర పొడి/జీలకర్ర
* కాసిని కొత్తిమీర ఆకులు
చేసే విధానం:
* నానిన రాజ్మా గింజలని కుక్కర్లో కాస్త ఉప్పు(తర్వాత కూరలో సరిపడా వేయొచ్చు), కాస్త పసుపు వేసి బాగా ఉడికించాలి. ఆరేడు కూతలు వచ్చినా పర్వాలేదు. ముద్దగా అవ్వవు.
* మూకుడులో రెండు చెంచాల నూనె వేసి అర చెంచా జీలకర్ర పొడి/జీలకర్ర వేసి అదివేగాకా గ్రైండ్ చేసి ఉంచిన టమాటా,ఉల్లిపాయ ముద్ద వేసి బాగా వేగనివ్వాలి.
* అప్పుడు రాజ్మాను కుక్కర్లో రాజ్మా ఉడికించిన నీళ్లతో సహా ఉడికిన టమాటా,ఉల్లిపాయ ముద్ద లో వెయ్యాలి. అవసరమైతే మరి కాస్త ఉప్పు కలపాలి.
* కాసేపు అది దగ్గర పడ్డాకా అరకప్పు ఉడికిన పప్పు పల్చగా చేసి కూరలో కలిపి, టమాటా,ఉల్లిపాయ ముద్ద లో ఒక చెంచా రాజ్మా మసాలాపొడి కూడా వేసి బాగా కలపాలి. అవసరమైతే అరగ్లాసు నీళ్ళు పోసి కూర మీద మూత పెట్టాలి.
* మధ్య మధ్య కలుపుతూ ఒక ఐదు,పది నిమిషాల తర్వాత ఆపేయాలి.
* కూర ఆపేసాకా తరిగిన కొత్తిమీర ఆకులు పైన చల్లాలి.
సలహాలు:(ఇది నూనె,మసాలా ఎక్కువ వాడినా పర్వాలేదనుకునేవారికి)
* మసాలా ఎక్కువ కావాలనుకుంటే కూర ఉడికేప్పుడు ఒక చెంచా అల్లం,వెల్లుల్లి పేస్ట్, ఒకచెంచా ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు.
* ఉడికిన పప్పు కలిపే బదులు అర కప్పు పెరుగు చిలికి కూరలో కలపచ్చు.
* ఉల్లిపాయ ముక్కలు తరిగి వేయించి ఆ తర్వాత టమాటా ముద్ద అందులో వేసి ఉడికించచ్చు.
--------------------------
ఇదే రెసిపీని బొబ్బర్లు, అలసందలు, సోయా మొదలైన గింజలతో చేసుకోవచ్చు లేదా అన్ని గింజలు కలిపి నానబెట్టి, ఇదే రెసిపీ ప్రకారం వండుకోవచ్చు.