మార్కెట్లో రాసిగా పోసిన బుజ్జి బుజ్జి బంగాళాదుంపలను చూస్తే వాటితో రకరకాల కూరలు చేసేయాలని సరదా పుడుతుంది నాకు. బంగాళాదుంపలు నా కిచెన్ లో మోస్ట్లీ నిషిధ్ధం! అయినా ఓసారికి ఆ నిషేధాన్ని ఎత్తివేసి బేబి ఆలూస్ దొరికినంతకాలం ఓ కేజి కొనేస్తూ ఉంటాను. వన్స్ ఇన్ ఎ వైల్ ఆలూస్ తినచ్చు పర్లేదు అనేస్కుని :)
మా పాప కూడా మెంతికూరతో పప్పు చేస్తే తినడానికి తిప్పలు పెడుతుంది కానీ ఈ కూర చేస్తే ఇష్టంగా తింటోంది. ఈ కూర నేనే చేసే పధ్ధతి ఎలాగంటే..
కావాల్సినవి:
అరకేజీ బేబీ పొటాటోస్
ఒక పెద్ద ఉల్లిపాయ లేదా రెండు మీడియం ఉల్లిపాయ ముక్కలు
మూడు కట్టలు మెంతి ఆకు లేదా ఐదు కట్టలు చిన్న మెంతుకూర
మూడు నాలుగు చెంచాల నూనె
అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అరచెంచా(ఫ్రెష్ గ తొక్కుకుంటె బావుంటుంది)
అర చెంచా ధనియాల పొడి
అర చెంచా ఆమ్చూర్ పౌడర్(dry mango powder)
అర చెంచా జీరా పౌడర్
అర చెంచా పసుపు
పోపులోకి: ఆవాలు, జీలకర్ర, మినపప్పు, చిటికెడు ఇంగువ
తయారీ:
* ముందు ఓ అరకేజీ బిజ్జి పొటాటోస్ రాళ్లఉప్పు(కూరలు,దుంపలు, పల్లీలు తొక్కతో ఉడకబెట్టేప్పుడు రాళ్ల ఉప్పు వాడతాను) వేసి మూడు విజిల్స్ వచ్చేదాకా ప్రెషర్ కుక్ చెయ్యాలి.
* తర్వాత తొక్క తీసి, (కొన్ని ఆలూస్ మరీ పెద్దగా ఉంటే మధ్యకు కోసి) ఓ రెండు చెంచాల నూనెలో కాసేపు వేగనివ్వాలి. ఓ చెంచా కారం వెయ్యాలి.
* మెంతి ఆకులు బాగా కడిగి చిన్నగా కట్ చేసుకోవాలి.
* మూకుడులో రెండు చెంచాల నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, చిటికెడు ఇంగువ పోపు వేయించిన తర్వాత, ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేగుతుండగా మెంతి ఆకు వేసి, ఆకు అడుగంటకుండా మధ్య మధ్య కలుపుతూ బాగా వేగనివ్వాలి. ఇలా..
* తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆమ్చూర్ పౌడర్, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలిపాకా,
* ముందుగా వేయించుకున్న బేబి ఆలూస్ అందులో కలిపెయ్యాలి.
* ఒక్క అర గ్లాస్ నీళ్ళు పోసి, ఉప్పు కాస్త వేసుకుని మూత పెట్టేయాలి.
* నీళ్ళు ఇగిరిపోయి కూర డ్రై గా అవుతుండగా స్టౌ ఆపేసుకోవడమే.
* చపాతీ, పూరీ, రైస్ మూడింటిలోకీ ఈ కూర బాగుంటుంది.