కావాల్సినవి:
* రెండు పెద్ద ములక్కాడలు
* అర చిప్ప కోరిన కొబ్బరి
* నాలుగు పెద్ద చెంచాలు నానబెట్టిన బియ్యం
* సుమారు 50gms బెల్లం లేక పంచదార (తీపి ఇష్టమున్నవారు మరికాస్త ఎక్కువ తీపి వేసుకోవచ్చు)
* పోపు కు : ఆవాలు, జీలకర్ర, మినపప్పు, రెండు ఎండు మిరపకాయలు.
* రుచికి సరిపడా ఉప్పు.
తయారీ:
* రెండు గంటల ముందుగా బియ్యం నానబెట్టి, కూర వండే ముందు తురిమిన పచ్చి కొబ్బరి వేసి మెత్తగా, జారుగా గ్రైండ్ చేసుకోవాలి.
* ములక్కాడ ముక్కలు రెండంగుళాలు చప్పున ముక్కలు తరుక్కుని, చిటికెడు ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి. కుక్కర్లో పెడితే ఒక్క స్టీం రాగనే ఆపేయాలి. ఏ రకంగా ఉడకపెట్టిన ముక్కలు ముద్దవ్వకుండా చూసుకోవాలి.
* మూకుడులో గ్రైండ్ చేసిన బియ్యం, కొబ్బరి పేస్ట్ కు గ్లాసుడు నీళ్ళు(150ml) కలిపి పోసి అడుగంటకుండా ఉడకనివ్వాలి.
* బియ్యప్పిండి కాస్త ఉడికినట్లు అనిపించాకా అందులో బెల్లం లేదా పంచదార వెయ్యాలి.
* ఈ మిశ్రమం వండేప్పుడు ఎంత జారుగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే వండిన కాసేపటికి (బియ్యంతో రుబ్బిన పేస్ట్ వేయటం వలన) గట్టిపడి అంతా గట్టి ముద్దగా అయిపోతుంది.
* బెల్లం / పంచదార కరిగాకా ఉడికిన ములక్కాడ ముక్కలు వేసి, చిటికెడు ఉప్పు కూడా వేయాలి. (రుచి చూసి చాలా తక్కువగా ఉప్పు వేసుకోవాలి.)
* మొత్తం అంతా మరో ఐదు నిమిషాలు ఉడికాకా పైన చెప్పిన పదార్ధాలతో విడిగా పోపు పెట్టి, ఉడుకుతున్న ఈ కూరలో కలపాలి.
* దీనిని అన్నంలో కాకుండా విడిగా ఏదైనా స్వీట్ తిన్నట్లే మేము తినేవాళ్ళం.
బియ్యo నానబెట్టి రుబ్బటం కష్టమైతే బియ్యప్పిండి కూడా అప్పటికప్పుడు వాడుకోవచ్చు కానీ బియ్యం నానబెట్టి చేసుకుంటేనే రుచి బావుంటుంది. ములక్కాడ ముక్కలు మరీ మెత్తగా కాకుండా, అలాగని పచ్చిగా కాకుండా సమంగా ఉడికేలా చూసుకుంటే ఈ కూర రుచి బాగుంటుంది.ఇది తియ్యగా ఉంటుందని దీనినే మేము "ములక్కాడ పరమాన్నం" అని కూడా అనేవాళ్ళం.నాకు ఇష్టమని మా పిన్నివాళ్లు మా ఊళ్ళో ఉన్నన్నాళ్ళు ఇది చేసినప్పుడల్లా నాకు పంపిస్తూ ఉండేది. పిన్ని దగ్గర ఇది నేర్చుకున్నాను.