ఇవాళ "పుదీనా రైస్" గురించి రాస్తాను.
కావల్సినవి:
* బాస్మతిబియ్యం గాని/ మామూలు బియ్యం గానీ రెండు కప్పులు(ఎలక్టిక్ రైస్ కుక్కర్ కు ఇచ్చే ప్లాస్టిక్ కప్పు కొలత)
* ఒక పెద్ద కట్ట కానీ రెండు మీడియం సైజు కట్టలు వలిచిన పుదీనా ఆకు(పైన
ఉదాహరణకి ఇచ్చిన కప్పైతే ముప్పావు కప్పు రుబ్బిన ముద్ద అవ్వాలి)
* మూడు మిర్చి సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి.(ఎక్కువకారం కావాలంటే ఇంకొన్ని ఎక్కువ మిరపకాయలు వేస్కోవాలి)
* రెండు లవంగాలు, ఒక ఇంచ్ దాల్చిన చెక్క
* ఒక పెద్ద చెంచా అల్లం,వెల్లుల్లి పేస్ట్(నచ్చకపోతే మానేయచ్చు)
*రెండు మూడు చెంచాల నూనె
* కావాలంటే అరచెక్క నిమ్మరసం
తయారీ:
* ముందు బియ్యం వండేసుకుని ముద్దల్లేకుండా పొడిగా విడదీసుకుని ఉంచాలి. (కావాలంటే ఒక చెంచా నెయ్యి వేసుకోవచ్చు.)
*వలిచిన పుదీనా ఆకు (పచ్చిదే) కాస్త నీళ్ళు పోసుకుని గ్రైండ్ చెసుకోవాలి. ముద్ద గట్టిగా కాకుండా జారుగా ఉండాలి. క్రింద ఫోటోలోలాగ.
* మూకుడులో నూనె వేసి అందులో దాల్చిన చెక్క, లవంగాలు వేసి కాస్త వేగాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి.
* అది వేగాకా రుబ్బిన పుదీనా ఆకు ముద్ద కలిపి అందులో ఉన్న నీరంతా బాగా ఇగర నివ్వాలి. క్రింద ఫోటోలోలాగన్నమాట.
* తరువాత వండి ఆరబెట్టిన అన్నం కొంచెం కొంచెం వేస్తూ, మొత్తం కలిసేలాగ బాగా కలపాలి. క్రింద ఫోటోలోలాగ. పుదీనారైస్ రెడీ !!
* ఇందులో కావాలంటే స్టౌ పైనుండి దింపిన తరువాత నిమ్మరసం కలుపుకోవచ్చు. లేకపోయినా తినేయచ్చు.