"మొత్తుకూర..?" ఇదేం పేరని నవ్వుకోకండి. దొండకాయల్ని మొత్తి చేసే కూర కాబట్టి మేం దీనిని మొత్తుకూర అంటాం. ఈజీగా, త్వరగా అయిపోయే కూర ఇది.
ఎలా చెయ్యాలంటే:
* ముందర దొండకాయల్ని కడిగి రెండువైపులా కొసలు కట్ చేసేసుకోవాలి. (లేతవైతే చేతితో గిల్లేసినా చాలు. ఒకోసారి అదీ చెయ్యను నేను :))
* పచ్చిమిర్చి, అల్లం తొక్కే రాయి/కల్వం తీసుకుని ఎవరిమీద కోపం ఉందో వాళ్లని తల్చుకుంటూ దొండకాయల్ని ఒక మొత్తుమొత్తండి. కోపం అన్నానని మరీ దొండకాయల్ని పచ్చడి చేసేయకండి. కాయ కాస్త చిట్లేలా(స్లిట్ అయ్యేలా) జస్ట్ అలా ఒక చిన్న దెబ్బ వెయ్యండి చాలు. ఇలా..
* తర్వాత చిన్న కుక్కర్(2 or 3 ltrs) తీసుకుని అందులో ఒక చెంచా ఆయిల్ వేసి, మొత్తి ఉంచిన దొండకాయ ముక్కలు, తగినంత ఉప్పు, కారం, తొక్కిన వెల్లుల్లి రేకలు నాలుగు, పావు చెంచా పసుపు, పావు చెంచా జీలకర్ర పొడి, అర గ్లాసు నీళ్ళు(ఈ కొలతలు ఓ పావుకేజీ దొండకాయలకి) పోసి విజిల్ పెట్టేసి, రెండు విజిల్స్ రాగానే స్టౌ ఆపేయాలి.
ఒకవేళ చిన్న కుక్కర్ లేకపోతే మూకుడులోనే ఇవన్నీ వేసి మూత పెట్టాలి. మూకుడైతే మరో అర గ్లాస్ ఎక్కువ నీళ్ళు పోయాలి.
* కుక్కర్ మూత తీసి నీళ్ళేమైనా మిగిలి ఉంటే ఇగిరేదాకా ఐదు నిమిషాలు కూరని పొయ్యిపై ఉంచాలి.
* ఉప్పుకారాలు చెక్ చేసుకుని అవసరమైతే కలిపాలి. ఒకవేళ ఎక్కువైతే కూరలో అరగ్లాస్ నీళ్ళు పోసి అటుఇటు కదిపి ఓ గిన్నెలోకి వంపేసుకోవాలి. అవి కూర ఉడికిన నీళ్ళు కాబట్టి తర్వాత ఏ చారులోకో వాడుకోవచ్చు.
కూర అలానే తినేయచ్చు కానీ కూర ముక్కలు బాగా వేగినట్లు అవ్వాలి అనుకుంటే కుక్కర్లోంచి ఏదైనా పేన్/మూకుడు లోకి షిఫ్ట్ చేసి, ఒక చెంచా ఆయిల్ వేసి మధ్య మధ్య కదుపుతూ ఐదు నిమిషాల తర్వాత స్టౌ ఆపేయాలి.
* మూకుడులోనే ఉడకపెడితే నీళ్ళు ఇగిరిపోయాకా చెంచా ఆయిల్ వేసి, ముక్కలు బాగా వేగినట్లయ్యాకా ఆపేయాలి.
* అన్నం లేదా చపాతీల్లోకి ఈ కూర బావుంటుంది.
*** *** ***
* దొండకాయ కారం పెట్టి చేసిన కూర రెసిపీ క్రింద లింక్ లో:
http://ruchi-thetemptation.blogspot.in/2012/06/blog-post_04.html
*** ***
టిప్:
దొండకాయలు ఫ్రై చేసేప్పుడు కూడా ఇలా కాసిని నీళ్ళు పోసి చిన్న కుక్కర్లో పెట్టి, ఒకటి లేదా రెండు విజిల్స్ వచ్చాకా ఆపేసి, తర్వాత మూకుట్లో ఫ్రై చేసుకుంటే త్వరగా అవుతుంది కూర + ఎక్కువ నూనె వాడక్కర్లేదు . ముక్కల్ని బట్టి కాసిని నీళ్ళు పోతే కాబట్టి కుక్కర్లో పెట్టినా కూర ముక్కలు పేస్ట్ అవ్వవు.