winter melon, ash gourd లేదా white gourd అని పిలవబడే బూడిదగుమ్మడి కాయతో మనం ఎక్కువగా ఒడియాలు పెట్టుకుంటాం కదా. దానితో కూర, పప్పు, హల్వా, సూప్ మొదలైనవి కూడా చేసుకోవచ్చు. ఎన్నో ఔషధగుణాలున్న ఈ బూడిదగుమ్మడి కాయను ఈ విధంగా రకరకాల వంటల్లో వాడతారని నాకు బొంబాయిలో ఉన్నప్పుడు తెలిసింది. అక్కడ మార్కెట్లో కూరలతో పాటూ బూడిదగుమ్మడికాయలు, కట్ చేసిన ముక్కలు బాగా అమ్మేవారు. నేను మినప్పిండి కలిపి అట్టు చెయ్యడానికి కొంటూ ఉండేదాన్ని. మీరూ ఇలానే తింటారా అని అడిగితే.. కూర గురించి చెప్పారు అప్పటి మా పక్కింటివాళ్ళు.
ఇది బాగా వాటర్ కంటేట్ ఉన్న కాయ కాబట్టి ఆనపకాయను ఎలా వండుకుంటామో అలా కూరలు చేసుకోవచ్చు. కాకపోతే ఇందులోని గింజలు తీసేసి వండుకోవాలి. ఆరోగ్యానికి చాలా మంచిదైన బుడిదగుమ్మడి కాయను తరచూ ఏదో విధంగా వండుకుంటే మంచిది.
బుడిదగుమ్మడి పప్పు తయారీ:
* మందపాటి తొక్క తీసేసి, మధ్యలో ఉన్న గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి.
* పప్పు, తరిగిన ముక్కలు(ఆనపకాయ పప్పు లాగనే), కాస్త పసుపు కలిపి కుక్కర్లో పెట్టాలి. అన్నంతో అయితే మూడు విజిల్స్, విడిగా పప్పు ఒక్కటే పెడితే రెండు విజిల్స్ రాగానే స్టౌ ఆపేయాలి.
* ఒక చెంచా నూనెలో మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కర్వేపాకు, ఒక ఎండు మిరపకాయ, ఒక పచ్చిమిరపకాయ, చిటికెడు ఇంగువ పోపు పెట్టుకోవాలి.
* పోపు వేగాకా ఉడికిన పప్పు, బుడిదగుమ్మడి ముక్కలు పోపులో వేసేసి రెండు నిమిషాల తర్వాత పప్పు దింపేయడమే.
* బుడిదగుమ్మడి ముక్కలు మరీ చప్పగా ఉంటాయి కాబట్టి పప్పు పోపులో వేసాకా అర చెంచా సాంబారు పౌడర్ లేదా అర చెంచా amchur powder(డ్రై మ్యాంగో పౌడర్) వేస్తే రుచి బావుంటుంది.
టిప్:
చాలామంది పప్పులో చింతపండు రసం వేస్తారు. కానీ వంటల్లో చింతపండు వాదకం ఎంత తగ్గిస్తే అంత మంచిది. దాని బదులు పులుపు కోసం పప్పులో డ్రై మ్యాంగో పౌడర్(amchur powder) వాడచ్చు.
బుడిదగుమ్మడి కాయ లోని ఔషధగుణాలు, ఉపయోగాల గురించి క్రింద లింక్స్ లో చూడవచ్చు:
http://vegrecipes4u.com/health-benefits-of-ash-gourd-winter-melon/
http://www.alwaysayurveda.com/ash-gourd/
Post a Comment