"కందట్టు" అంటే కంద దుంపతో అట్టు అన్నమాట. కందట్టు, బీరకాయ అట్టు రెండూ కూడా నాన్నగారి చిన్నప్పుడు మా తాతమ్మగారు(వాళ్ల అమ్మమ్మగారు) చేసేవారుట. గ్రైండర్ లేని కాలంలో రోట్లో (కంద ముక్కలు)రుబ్బి మరీ చేసేవారుట. ఎంత ఓపికో..
కావాల్సిన పదార్ధాలు:
కంద - 1/4kg
పచ్చిమిర్చి 3
చిన్న టీ గ్లాసులో సగం పెసరపప్పు
తగినంత ఉప్పు
చిటికెడు ఇంగువ
తయారీ:
* ముందుగా పెసరపప్పు నానబెట్టుకుని, నానాకా నీరు ఓడ్చేసి మిర్చి వేసి మెత్తగా రుబ్బుకోవాలి.(ఇది అట్టుకి బైండింగ్ ఏజెంట్ అన్నమాట)
* తరువాత విడిగా చిన్నగా తరుగుకున్న కంద ముక్కలను(పచ్చివే) కూడా కాస్తంత నీరు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. రెండు కలిపి గ్రైండ్ చేస్తే కంద ముక్కలు మధ్య మధ్య ఉండిపోతాయి.
* గ్రైండ్ చేసుకున్న రెండు పదార్ధాలనూ, తగినంత ఉప్పునూ, చిటికెడు ఇంగువను వేసి ఓ గిన్నెలో బాగా కలపాలి.
* పెనం వేడెక్కాకా నెమ్మదిగా పిండిని అట్టులా వేయాలి. కంద జిగురుగా ఉంటుంది కాబట్టి పిండి అట్ల పిండిలా జారుగా ఉండదు. జాగ్రత్తగా పెనంపైన స్ప్రెడ్ చేసుకోవాలి. పెసరపప్పు ముద్ద కలిపాము కాబట్టి అట్టు సన్నగానే వస్తుంది. ఓ చిన్న చెంచాడు నూనె అట్టు చూట్టూ వేయాలి.
* ఇది చాలా నెమ్మదిగా కాలుతుంది. తక్కువ సెగ మీద కాస్తంత ఓపిగ్గానే కాల్చాలి.
* ఒక వైపు కాలాకా రెండో వైపు కూడా తిప్పుకుని కాలనివ్వాలి.
* ఈ అట్టును వేడి వేడి అన్నం లో తింటే చాలా బాగుంటుంది. విడిగా టిఫిన్ లా తినాలంటే అల్లప్పచ్చడో, కొబ్బరి చెట్నీనో అయితే బాగుంటుందేమో మరి.
నేను నిన్న రాత్రే మొదటిసారి కందట్టు చేసాను. బాగానే వచ్చింది. ఈ అట్టులోకి అల్లం, కొత్తిమీర, కేరెట్ కోరు వంటివి ఏడ్ చేస్తే ఎలా ఉంటుందో ఇంకా ప్రయోగం చెయ్యాల్సి ఉంది....:)
*** *** *** ***
కంద ఉపయోగాలు:
* దీనిలో మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్ కాక కాపర్,జింక్,సిలేనియం అనే ఖనిజాల ట్రేసెస్ కూడా ఉన్నాయి.
* దుంప కూర అనుకోకుండా డైయాబెటిక్ వాళ్ళు కూడా దీనిని హాయిగా తినచ్చు.
* కంద ఈస్ట్రోజన్ లెవెల్స్ పెంచుతుంది కాబట్టి స్త్రీల హార్మోనల్ బేలన్స్ కు ఇది చాలా ఉపయోగకరం. విటమిన్ B6 ఉండతమ్ వల్ల ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్ నుండి కూడా స్త్రీలకు రిలీఫ్ఫ్ ను అందించగలదు.
Post a Comment