"ఏమిటా..గోంగూర...శాకంభరీదేవీ ప్రసాదం..ఆంధ్ర శాకం..అది లేనిదే ప్రభువులు ముద్దైనా ముట్టరు. తెలిసిందా..!" అన్న "మాయాబజార్"సినిమా డైలాగ్ తెలియనివారు, గోంగూర అంటే ఇష్టం లేనివారు ఎక్కడో గానీ ఉండరనటం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. గోంగూర పచ్చడి నచ్చనివారుంటారా? డౌటే. ఉన్నా చాలా తక్కువమంది ఉంటారేమో. ఎందు మిరపకాయలు వేయించుకుని చేసే గోంగూర నిలవ పచ్చడి అందరిఖీ తెలిసినదే. కానీ అమ్మ(వాళ్ళ అత్తగారి దగ్గ నేర్చుకుని) ఇంకో రకంగా కూడా చేస్తూండేది. దాన్ని నేను గోంగూర గ్రీన్ పచ్చడి అనేదాన్ని. వారం కంటే నిలువ ఉండదు కానీ రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది. ఎలాగో చూసేస్తారా?
నేను కారం బాగా తక్కువ తింటాను కాబట్టి నేను కేవలం నేనే చేసిన తయారీ పధ్ధతి మాత్రమే చెప్తాను. మీరు చేసుకునేప్పుడు పాళ్ళు ఎవరికివారే సరిచేసుకువాల్సినదని మనవి.
కావాల్సినవి:
బాగా కడిగి ఆరబెట్టిన గోంగూర ఆకులు (5కట్టలు వి)
పచ్చిమిరపకాయలు - 10
ఒక పెద్ద ఉల్లిపాయ (తెల్ల ఉల్లిపాయ అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేనదే వాడతాను. మామూలు ఉల్లిపాయ కన్నా ఎక్కువ చలవ చేసే గుణం తెల్ల ఉల్లి కి ఉంది)
5,6 వెల్లుల్లిపాయలు
ఆకు వేయించటానికి తగినంత నూనె
తగినంత ఉప్పు
పోపుకు:
చిన్న చెంచాడు మెంతులు
రెండు చెంచాల మినపప్పు
అర చెంచా ఇంగువ
తయారీ:
* బాగా కడిగి ఆరబెట్టిన గోంగూరను తగినంత నూనెలో మాడకూండా కలుపుతూ బాగా వేయించుకోవాలి.
* వేగిన గోంగూర ఆకు ముద్ద పక్కన పెట్టి, ఆ కడాయీలో గానీ వేరే దాంట్లోనో కాస్తంత నూనె వేసి తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసి ఉల్లిపాయ ముక్కలు కాస్తంత మెత్తబడేదాకా కాసేపు వేయించాలి.
* తరువాత గోంగూర ముద్ద, వేగిన ఉల్లి,పచ్చిమిర్చి,వెల్లుల్లి మిశ్రమాన్ని కలిపి, తగినంట ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి.
* ఆఖరున మెంతులు,మినపప్పు, ఇంగువ వేసి పోపు పెట్టుకుని గ్రైండ్ చేసిన గోంగూర ముద్దకు కలపాలి.
* ఉల్లిపాయలు వేస్తాం కాబట్టి ఇది వారం కన్నా నిలవ ఉండదు.
*వేడి వేడి వైట్ రైస్ లో లేదా మాకులా దంపుడుబియ్యంలో అయినా సరే కలుపుకుని తింటే...రుచి అమోఘంగా ఉంటుంది.
Post a Comment