ఇప్పుదంటే చాలామంది రాత్రిళ్ళు అన్నం మానేసి టిఫిన్ తింటున్నారు కానీ నా చిన్నప్పుడు పెద్దలందరూ వారాలు చేసేవారు. "శనివారం","ఆదివారం","గురువారం" అంటూ. ఆయవారాల్లో రాత్రిళ్ళు తిఫిన్ తినేవారు. అలాంటి వారపు రోజుల్లో మా ఇంట్లో ఎక్కువగా చేసే టిఫిన్ ఉప్పుడుపిండి. ఇది మా అన్నయ్యకు చాలా చాలా ఇష్టం. శనివారం రాత్రి చేస్తే కొంచెం ఎక్కువ చేయించుకుని ఆదివారం పొద్దున్నే ఉప్పుడుపిండిలో ఆవకాయ కలుపుకుని తినటం వాడి మోస్ట్ ఫేవొరేట్ హాబీ ! మేం అన్నయ్య దగ్గరకు వెళ్ళినప్పుడు వాడు కలుపుకున్న (ఉప్పుడుపిండిలో) ఆవకాయ ముద్దలు అడిగి తినటం నాకూ, మా తమ్ముడికీ ఎంతో ఇష్టమైన పని. అన్నయ్య పెళ్ళిచూపుల్లో అమ్మాయికి "ఉప్పుడుపిండి చేయటం" వస్తే చాలండి ఇంకేమీ రాకపోయినా పర్వాలేదు అని చెప్పాం.
ఇక ఆ ఉప్పుడుపిండితోనే పులిహోర చేస్తారు. అది నాకు చాలా చాలా ఇష్టం. my most favourite అనొచ్చు. కానీ అది నేర్చుకొవటం తేలికైన పని కాదు. అప్పట్లో గుండ్రని ఇత్తడి గిన్నెతో వండేవారు. సులువు తెలుకోకపోతే ఓ పట్టాన సరిగ్గా చెయ్యటానికి రాదు. ఉప్పుడుపిండి చెయ్యటానికి కావాల్సినది బియ్యం రవ్వ. కాస్త నూనె, పెసరపప్పు బద్దలు వేసి, salt వేసి, కావాలంటే ఆవగింజలు, కర్వేపాకు పోపు వేసి వండుతారు. మధ్య మధ్యన గరిటెతో తిప్పుతూ ఉండటం ఇంకా కష్టం. అదివరకూ బియ్యాన్ని పిండిమరకు పట్టుకెళ్ళి రవ్వ ఆడించుకోవాల్సివచ్చేది. ఇప్పుడు "rice rawa" అని మార్కెట్లో దొరుకుతుంది. ఉండ్రాళ్ళకి రాత్రి బియ్యం తడిపి, ఆరబెట్టి, పొద్దుటే దంచి, జల్లించి నానా హైరానా పడేవారు పూర్వం. ఇప్పుడు ఉండ్రాళ్ళు కూడా దాంతోనే(rice rawa) చేసేస్తున్నారు .
ఇంతకీ నేను ఉప్పుడుపిండిపులిహోర నేర్చుకోవటానికి చాలా పరిశోధనలు చేసాను. ఇత్తడి గిన్నెలో, కుక్కర్లో, చిన్న కుక్కర్లో డైరెక్ట్ గా రవ్వ పోసి...రవ్వను ముద్దవ్వకుండా వండటానికి నానాతంటాలు పడేదాన్ని. నాన్నమ్మ, అమ్మ చేసినట్లు, పిన్నివాళ్ల అత్తగారు చేసినట్లు పొడిపొడిగా రవ్వ జలజలా రాలేలా "ఉప్పుడుపిండి పులిహోర" చెయ్యటం అసలు వస్తుందా అని బెంగ పెట్టుకున్నా కూడా. కానీ ఈ మధ్యనే కాస్త బాగా పొడిపొడిగా చెయ్యటం నేర్చుకున్నా. నాకు ఇత్తడిగిన్నె కన్నా, పెద్దకుక్కర్లో కన్నా, 2 ltrs బుల్లికుక్కర్లో డైరెక్ట్ గా వండితే బాగా వచ్చింది.
చేసే విధానం:
* ఒక గ్లాసు బియ్యం రవ్వ
ఒకటింపావు నీళ్ళు
తగినంత ఉప్పు
రెండు చెంచాలు నూనె వేసి బుల్లికుక్కర్లో డైరెక్ట్ గా సన్న సెగ మీద స్టౌ మీద పెట్టాలి. నీళ్ళు తక్కువైతే రవ్వ ఉడకదు. ఎక్కువైతే ముద్దైపోతుంది. అందుకని నీళ్ళు ఎంత పొయ్యాలో రెండుమూడు సార్లు వండితే కానీ పాళ్ళు తెలీదు. ఏ రకం బియ్యంతో రవ్వ చేసామో అన్నదాని మీద కూడా పొడిగానా,ముద్దగానా అన్నది ఆధారపడి ఉంటుంది.
* స్టౌ ఆపేసాకా బాగా చల్లారాకా మూత తీసి ఉడికిన రవ్వను ఏదైనా బేసెన్లో గానీ పెద్ద గిన్నెలో కానీ వెయ్యాలి.
* పులిహోరకు మామూలుగా పెట్టుకునే పోపు(ఆవాలు,జీలకరా,మినపప్పు,శనగపప్పు,వేరుశెనగ,కర్వేపాకు,ఎండు మిర్చి,పచ్చి మిర్చి,ఇంగువ,పసుపు) పెట్టుకుని ఆ ఉడికిన బియ్యం రవ్వలో కలపాలి. మామూలు పులిహోరలో లాగనే అల్లం తురుముకుని వేస్తే రుచి బావుంటుంది. వేరుశనగ బదులు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు.
* రవ్వ బాగా ఆరాకా(చల్లారాకా) ఇందులో నిమ్మకాయ రసం పిండుకోవాలి. నిమ్మరసం బదులు మావిడి కోరుతో కూడా చేయచ్చు. చింతపండు రసం కూడా వేసి చేసుకోవచ్చు.
* చింతపండు రసంతో చేస్తే గనుక ఇందులో నూపొడెం కూడా కలుపుకోవచ్చు.
* ఇందులో పసుపు కాస్త తక్కువ వాడితే చూట్టానికి బావుంటుంది.
Nice andi, Thanks for sharing. I haven't heard of it. It looks like rawa upma to my eyes, will there be any difference in taste!
@అనిర్విన్: రవ్వ ఉప్మా అంటే మీరన్నది గోధుమరవ్వ ఉప్మా నా? అదే అయితే బోలెడు తేడా ! ఉప్పుడుపిండి పులిహోర రుచే రుచి !! ఒక్కసారి చేసుకుని తినండి. ఇక వదలరు..:)
Thanks for the visit.