నాకు బాగా ఇష్టమైన, నేను తరచూ చేసే సలాడ్ ఇది. కాకపోతే రకరకాల హోటల్స్ లో రకరకాల పదార్ధాలతో చేస్తారు. అంటే కొందరు పొటాటో, కేప్సికం కూడా వేస్తారు. కొందరు అవి వెయ్యరు. నేను ఎలా చేస్తానంటే:
* పైనాపిల్ ముక్కలు, కేరెట్ , బఠాణీ, బీన్స్ ముక్కలు వాడతాను. బఠాణీ ఫ్రెష్ వి దొరకని సీజన్లో నానబెట్టి, విడిగా ఉడకబెట్టి కలుపుతాను. కూరముక్కల కన్నా ఎక్కువ టైమ్ తీశుకుంటాయి కదా ఉడకటానికి అందుకు.
* కేరెట్ , బీన్స్ రెండూ కొంచెం ఉడకబెట్టిన ముక్కలు. పూర్తిగా మెత్తగా అవ్వకుండా కాస్త మెత్తబడితే చాలు. (half-boiled అన్నమాట)
* ఈ ముక్కలు రెండు కప్పులు ఉన్నాయంటే డ్రెస్సింగ్ కోసం క్రింద పదార్ధాలన్నీ తీసుకుంటాను..
1) నాలుగు చెంచాలు మయోన్నీస్( నేను ఎగ్లెస్స్ వాడతాను. ఎగ్ ఉన్నదయినా వాడచ్చు)
2) చిటికెడు ఆవపొడి
3) అర చెంచా ఉప్పు
4) వైట్ పెప్పర్ లేక బ్లాక్ పెప్పర్ అర చెంచా
5) ఫ్రెష్ క్రీం నాలుగు చెంచాలు(ఇది వెయ్యకపోయిన పర్వాలేదు). ఫ్రెష్ క్రీం బజార్లో చిన్న చిన్న పేకెట్లలో దొరుకుతుంది.
* పైన రాసిన నాలుగు పదార్ధాలు బాగా కలిపేసి; పైనాపిల్, బఠాణీ, కూర ముక్కలు అందులో వేసి మళ్ళీ బాగా కలపాలి.
* పైన ఫోటోలో సలాడ్లో నేను ఎక్కువ క్రీం వేయలేదు. weight problem లేనివారు క్రీం ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు.
* కొందరు అర చెంచా పంచదార కూడా వేస్తారు కానీ మయోన్నీస్ లో కాస్త షుగర్ ఎలానూ ఉంటుందని నేను వెయ్యను.
* యమ్మీ యమ్మీ టేస్టి రష్యన్ సలాడ్ రెడీ. సర్వింగ్ బౌల్ చుట్టూరా పైన ఫోటోలోలాగ బత్తాయి లేక కమలా గానీ అలా గుండ్రని స్లైసెస్ చేసి పెట్టుకుంటే కలర్ఫుల్ గా ఉంటుంది. ఆ ముక్కలు కూడా సలాడ్ తో పాటూ తినొచ్చు.