బీట్రూట్ తో వండుకునే కూఅల్లో ఇదీ ఒక రకం.
కావాల్సినవి:
బీట్రూట్ - రెండు పెద్దవి
పోపుకు : ఆవాలు,శనగపప్పు,మినపప్పు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిరపకాయలు, కర్వేపాకు
అర చెంచా పచ్చి ఆవపొడి
పోపుకి తగినంత నూనె
తయారీ:
* బీట్రూట్ ముక్కలు చిన్నగా తరిగి, ముక్కలు ఎంత క్వాంటిటి ఉన్నాయో వాటికి సగం వంతు నీళ్ళు పోసి, తగినంత ఉప్పు కుక్కర్లో ఉడకపెట్టుకోవాలి. (కుక్కర్లో ఉడకపెట్టే ఏ ముక్కలకయినా ఇలానే నీళ్ళు పోస్తే, నీళ్ళు వేస్ట్ అవ్వవు. వాటిలోని పోషకాలు కూడా పోకుండా ఉంటాయి.)
* మూకుడులో పోపు వేసుకుని ఉడికిన ముక్కలు అందులో వెయ్యాలి. రెండు నిమిషాల తరువాత ఆపేయ్యాలి. కారం సరిపోకపోతే కాస్తంత ఎండుమిరప పొడి వేసుకోవచ్చు.
* కూర చల్లారిన తరువాత అరచెంచా ఆవ పొడి వేసి బాగా కలపాలి. ఆవ ఎక్కువ అస్సలు వేయకూడదు. ఘాటుగా ఉంది తినలేము. వేడి మీద వేస్తే చేదు వచ్చేస్తుంది.
* ఈ కూర అన్నంలోకే కాక చపాతీల్లోకి కూడా బావుంటుంది.
బీట్రూట్, కేరెట్, మావిడల్లం కలిపి ఇలా చిన్నచిన్న ముక్కలు చేసుకుని సాల్ట్, చిన్న చిన్నపచ్చి మిర్చి ముక్కలు కలిపి, నిమ్మరసం పిండుకుంటే సైడ్ డిష్ క్రింద బావుంటుంది. పప్పులోకి బావుంటాయి ఈ ముక్కలు. మావిడల్లం దొరకకపోయినా బీట్రూట్, కేరెట్లతో ఇలా చేసుకోవచ్చు.
బీట్రూట్ పచ్చడి కూడా చాలా బావుంటుంది. అది మరోసారి చెప్పుకుందాం.
* సుగర్ ఉన్నవాళ్లకు మంచిది కాదు కానీ డయాబెటిస్ లేనివాళ్ళకు బీట్రూట్ ఎంతో మంచిది.
*కేల్షియం,మెగ్నీషియం, సోడియం,పొటాషియం, B1, B2, B3, B6 and C మొదలైన విటమిన్లు కలిగిన బీట్రూట్ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.
* రక్తం పెరగటానికి ఉపయోగపడే బీట్రూట్ కొలెస్ట్రాల్ తగ్గిచటానికి,
* బ్లడ్ ప్రెషర్ తగ్గించటానికీ కూడా ఉపయోగకరం అని పరిశోధనల్లో తెలిసిందట.
టెంప్లేట్ లో స్ట్రాబెర్రీ లు పోస్ట్ లో బీట్ రూట్లు
హ్మ్మ్..!
బ్లాగు పేరు కి సార్ధకత చేకూరింది ఫొటోస్ yummy :)
త్రుష్ణ గారు బీట్రూట్ తో చాలా ఈజీ గా చేస్కునే రెండు రెసీప్స్ అందించినందుకు big thanks. ..మీరు cookbook for dummies రాయచ్చు కదా?
బీట్రూట్ తో ఆవ పెట్టి చేస్తారని నాకు తెలియదు.దుంప లో సహజంగా కొంచెం ఉప్పదనం ఉన్నట్టు అనిపిస్తుంది నాకు.కొబ్బరి వేసి పొడికూర,హల్వా మా పిల్లలికి బాగా ఇష్టం.
తృష్ణ గారూ ఇది మీ ఇన్వెన్షనా? ఒక వేళ అయితే కనక మీకు "కిచెన్ ఎడిసన్" బిరుదు ఇచ్చేయచ్చండీ బాబూ. బీట్రూట్ ఆవపెట్టిన కూర నేను ఫస్ట్ టైం వింటున్నా.
బీట్రూట్ ఎప్పుడూ ట్రై చెయ్యలేదు గానీ
"కేరెట్, మావిడల్లం కలిపి ఇలా చిన్నచిన్న ముక్కలు చేసుకుని సాల్ట్, చిన్న చిన్నపచ్చి మిర్చి ముక్కలు కలిపి, నిమ్మరసం పిండుకుంటే"
ఇప్పుడు అర్జంటుగా పప్పులోకి ఈ కాంబినేషన్ టేస్ట్ చేసేయ్యాలని ఉంది. అసలు ఇందులో మావిడల్లం, నిమ్మ రసాలు మాయాబజార్లో ఘటోత్కచుడు, శ్రీ కృష్ణుడి పాత్రల్లాంటివి. అంతకు మించి పోల్చడం నా వల్ల కావటం లేదు.
వేడిచేస్తుందేమో కదా! :) ఫొటో మాత్రం బాగా టెంప్టింగ్ గా ఉంది ;)
@హరే కృష్ణ: :)) బోలెడు థాంకూలు.
@నైమిష్: ఏదో మీ అభిమానం గానీ పుస్తకం రాయటమంటే మాటలాండీ...!
ధన్యవాదాలు.
@ఇందిర: నాకూ ఈ మధ్యన్నే తెలిసింది. చేస్తే బానే వచ్చింది. బీట్రూట్ లో, కేరెట్ లో(విడి విడిగానే లెండి) శెనగపప్పు,కొబ్బరి వేసి మా అమ్మ చేసేది. స్వీట్ నేను చెయ్యను కానీ తెలుసు.
ధన్యవాదాలు.
@శంకర్.ఎస్: ప్చ్..మీ బిరుదు మిస్సవుతున్నాను..:(( మరోసారి ప్రయత్నిస్తాను. ప్రస్తుతానికి ఇది "ఇన్వెన్షన్" కాదు...డిస్కవరీనే..:))
మావిడల్లం గురించి ఒక టపాయే రాయాలి. అంతిష్టం నాకు. దానితో రెసిపీలు మరోసారి చెప్తాను.
ధన్యవాదాలు.
@ఇందు: కొద్దిగా ఆవ పెట్టుకుంటే పర్వాలేదు. అయినా ఆవ వేడి చేస్తుందని పనసపొట్టులోనూ, కంద బచ్చలి కూరలోనూ, బచ్చలి కూర పులుసులో, తోటకూర పులుసులోనూ వెయ్యటం మానేస్తామా...హ్మ్మ్ !! అంతగా అయితే ఆపూట ఓ గ్లాసుడు మజ్జిగ ఎక్కువ తాగాలి. అంతే..:))
థాంక్యూ.