పచ్చి టమాటాలతో పప్పు, పచ్చడి చాలా బావుంటాయి. పచ్చి టమాటాలతో చేసే 'మెంతి బద్దలు ' ఇంకా బావుంటాయి. అన్నం లోకీ, చపాతీల్లోకీ కూడా బావుంటాయి.
పచ్చి టమాటా తో మెంతిబద్దలకి కావాల్సినవి:
ఆకుపచ్చని పచ్చి టమాటాలు - 3
మెంతులు - నాలుగు స్పూన్లు
ఆవాలు - మూడు స్పూన్లు
మినపప్పు - ఒక స్పూన్
ఎండు మిరపకాయలు - నాలుగైదు
రెండు చెంచాల నూనె
చిటికెడు ఇంగువ
అర చెక్క నిమ్మరసం
తయారీ:
* ముందుగా అర చెంచా నునెలో మెంతులు, ఆవాలు,మినప్పప్పు బాగా వేగనిచ్చి తరువాత ఎండు మిర్చి కూడా వేసి, అన్నీ వేగాకా స్టౌ ఆపే ముందర కాస్తంత ఇంగువ వేయాలి.
* పైన వేయించిన మెంతులు అవీ చల్లారాకా మిక్సీ లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
* ఈ పిండిని తరుగుకున్న పచ్చి టమాటా ముక్కల్లో కలిపి, మిగిలిన నూనె పోసి బాగా కలపాలి.
* దీనిలో అర చెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి.
ఇది ఎక్కువ నిలవ ఉండదు. కాబట్టి తక్కువ మోతాదులోనే చేసుకోవాలి. రెండ్రోజులు ఉన్నా కూడా ఫ్రిజ్ లో పెట్టుకుంటే పాడవకుండా ఉంటుంది. మెంతులు వేయించే బదులు ఆవాలు వేగాకా కొందరు మెంతి పిండి, మిరపకాయల బదులు ఎండు మిర్చి కారం వాడుతూ ఉంటారు. అలా కూడా చేయచ్చు కానీ రుచిలో కొంచెం తేడా ఉంటుంది..:)
వావ్ చాలా బాగుందండీ రెసీప్..ట్రై చెయ్యాలి...ఈ బ్లాగు మీద శీతకన్ను వేసారు..కనీసం వారానికి ఒక్కసారైనా పోస్టులు వేస్తూఉండండి....
తృష్ణ గారూ..పచ్చి టమటాలతో పచ్చడి విరివిగా చేస్తాను..కానీ ఇలా ఎప్పుడూ చేయలేదు..ఈ సారి చేసి చూడాలి..చూడటానికి మాత్రం బాగుంది.
తృష్ణ గారూ మీరు చెప్పింది ఇంట్లో టమాటో మొక్కలు ఉంటే ఈజీగా చేసుకోవచ్చండీ. మరి మొక్కలు లేని మాలాంటి వాళ్లకి పచ్చి టమాటో లు ఎక్కడ దొరుకుతాయీ అని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను.
Nice. మామిడి కాయలు, దోస కాయలతో కూడా ఇలాగ చేయటం చూశాను.
నేను పచ్చి టమటాలతో దోసకాయ పచ్చడిలాగ కొత్తిమీర, పచ్చి మిర్చి వేసి చేస్తాను.కానీ, పచ్చి టమటాలకి నీరెక్కువ అన్పిస్తుంది. చూస్తుంటే మీకా ప్రాబ్లం ఎదురయ్యినట్టు లేదు పచ్చడి చక్కగా వుంది.
@ నైమిష్: తప్పకుండా ప్రయత్నిస్తానండి..ధన్యవాదాలు.
@ సిరిసిరిమువ్వ: పండు టమాటా పచ్చడి కన్న పచ్చి పచ్చడి చాలా బావుంటుందండి కదండి. ఇలా చేసి చూడండి.బావుంటుంది. మెంతులు ఎర్రగా వేగేలా చూడండి చేదు రాకుండా ఉంటుంది.
ధన్యవాదాలు.
@ శంకర్.ఎస్: నాకూ ఇంట్లో టమాటా మొక్కల్లేవండి. బెజవాడలో అయితే ప్రత్యేకం పచ్చి టమాటాలు అమ్మేవారు. ఇక్కడ పండు టమాటాల లోంచే పచ్చివి ఏరుకుని కొనాల్సివస్తోంది..:(
ధన్యవాదాలు.
@కృష్ణప్రియ: మావిడికాయతో మెంతిబద్దలు చాలామంది చేస్కుంటారు. అదీ అదివరకూ రాసానండి బ్లాగులో. దోసకాయతో కూడా ఒక కొత్త రకం ఆవపచ్చడి కూడా రాసాను..ఆసక్తి ఉంటే ఒకసారి పాత టపాల్లో చూడండి..ప్రస్తుతం లింక్ ఇవ్వలేకపోతున్నను.ఏమనుకోకండి.
ధన్యవాదాలు.
@సత్య: పచ్చి టామటాలు బాగా గట్టిగా ఉంటే మరీ ఎక్కువ రసం రాదండి. వచ్చినా అది ఊటలాగ వాడుకోటానికి బాగా పనికి వస్తుంది. రసం ఎక్కువ ఉండి కొద్దిగా జారుగా వచ్చినా రుచికి తేడా రాదులెండి.
ధన్యవాదాలు.
అబ్బ, మంచి రేసిపే ఇచ్చారు , అర్జెంటు గా చెట్టుకి వున్న పచ్చి టొమాటోల తో ఈ వీకెండ్ పెట్టేస్తా :) థాంక్స్ తృష్ణ గారు
ఆ పచ్చి టొమాటో ల తో పప్పు ఎలా చేసుకుంటారో కూడా కాస్త చెప్పేద్దురూ , ప్లీజ్ :)
@ విరిబోణి: పండు టమాటాలతో చేసుకున్నట్లు గానేనండి. కుక్కర్లో పప్పు,టమాటా ముక్కలు పెట్టేయటం, దింపాకా పోపుపెట్టుకోవటం.
ధన్యవాదాలు.
మేము పచ్చి టొమాటో లతో పచ్చడి చేస్తాం కాని, పప్పు చేస్తారు అని తెలియదు అండి, ఓకే ట్రై చేస్తా ! థాంక్స్
మా ఇంట్లో పచ్చి టమటాలతో పులుసు చేసు కుంటాము. చాలా బాగుంటుంది. చింతపండు పులుపు, పచ్చి టమటాలతో వచ్చే పులుపు కలిసి కొత్త రుచి వస్తుంది.
@ విరిబోణి: మీక్కూడా..థాంక్స్ అండి.
@ Rao S lakkaraaju : అవునా బావుందండీ..కొత్త రెసిపీ. కానీ నేను ప్రయత్నించలేను. మా ఇంట్లో కొంచెం పులుపు వాడకం తక్కువేనండి..:(
పులుపు తినే వాళ్లకు చెప్తాను.
ధన్యవాదాలు.
నేను కూడా చేసి చూస్తాను.పచ్చి టమాటా తినడం ఆరోగ్యం కూడాను
chala bagundi ee pachchadi..
Bagundandi try chesta ..Radhika