గోధుమ పిండీ, బియ్యపిండీ కలిపి అప్పాలు చేస్తారు. అరిశలు కష్టం అనుకునేవారు ఇలా రెండుమూడు రకాల పిండిలు కలిపి అప్పాలు చేసుకోవచ్చు. మరోరకం అప్పాలు సజ్జ పిండితో(bajra) చేస్తారు. వాటినే సజ్జప్పాలు అంటారు.
నేను ఈసారి గోధుమ పిండీ, బియ్యపిండీ + సజ్జ పిండి కలిపి అప్పాలు చేసాను. బాగా వచ్చాయి.
ఇదిగో రెసిపీ:
* గోధుమపిండి: రెండు గ్లాసులు
* బియ్యప్పిండి :ఒక గ్లాసు
* సజ్జపిండి: ఒక గ్లాసు
* ఒక చిప్ప కొబ్బరి కోరు
* బెల్లం తురుము: రెండు గ్లాసులు
* పావు కప్పు నెయ్యి
* ఐదారు ఏలకుల పొడి
* అప్పాలు వేయించటానికి తగినంత నూనె
విధానం:
* పిండిలన్నీ బాగా కలిపి జల్లించి ఉంచుకోవాలి.
* బెల్లంతురుములో గ్లాసుడు నీళ్ళు పోసి ఉండపాకం పట్టాలి. (కాస్త పాకం చెంచాతో తీసి నీళ్ళల్లో వేస్తే కరగకుండా గట్టిపడుతున్నట్లు ఉండాలి)
* బెల్లం పాకం తయారవ్వగానే కొబ్బరికోరు, జల్లించి ఉంచిన పిండి పాకంలో పోసి ఉండలు కట్టకుండా బాగా కలపాలి. యాలకుల పొడి, నెయ్యి కూడా ఈ కలిపేప్పుడే వేసేయాలి.
* నాలుగైదు నిమిషాలు పొయ్యి మీద మొత్తం మిశ్రమం బాగా కలిపి బాగా దగ్గర పడినట్లు కనబడ్డాకా స్టౌ ఆపేయాలి. తయారైన ఉండ ఇలా ఉంటుంది.
* చలిమిడి లాగ ఉన్న ఆ మిశ్రమం కొద్దిగా చల్లారాకా(ఎక్కువ చల్లారిపోతే గట్టిగా అయిపోతుంది) గోరుచెచ్చగా ఉండగానే చిన్న చిన్న ఉండలు చేసుకుని, పాల కవర్ మీదో లేక అరిటాకు మీదో కాస్తంత నూనె రాసి, చేత్తో గుండ్రంగా వత్తుకోవాలి. (మరీ సన్నంగా వత్తనక్కర్లేదు.)
* వత్తిన వెంఠనే నూనెలో వేయించాలి.
* పొంగిన అప్పాలను ఏదైనా గరిటతో లేదా అరిశలు వత్తే చెక్కతో వత్తాలి. ఇలా వత్తటం వల్ల ఎక్సెస్ నూనె అంతా బయటికి వచ్చేసి అప్పాలు ఫ్లాట్ గా అవుతాయి.
* ఇలా చేసుకున్న అప్పాలు పదిహేను ఇరవై రోజులు నిలవ ఉంటాయి. అప్పటికి ఇంట్లో వాళ్ళు డబ్బా ఖాళీ చేసేయకుండా ఉంటే..:)
ఎంత సంతోషమో - అప్పాలు అన్న పేరు తెలిసున్నోళ్ళు ఉన్నారంటే. :) మేము అరిసెలు, అప్పాలు, పోలుముక్కలు, పాకుండలు వండుతాము అనేకన్నా వండించుకు లాగిస్తాము అనటం సరేమో. కానీ, కొందరు అప్పాల్ని 'బూరెలు' అని, మేము బూరెలు అనేవాటిని 'పూర్ణాలు' అని - ఈ వాదోపవాదాల్లోనే సరిపాయే. థాంక్స్ - ట్రై చేస్తాను.
ఉష గారూ, తమరి రాక నాకెంతో సంతోషం సుమండి...:)
మాకు ఇంట్లో సంవత్సరానికి నాలుగైదు అబ్దీకాలు ఉండేవండీ.. ఎప్పుడూ అప్పాలూ లేక అరిసెలూ చేసేవారు. పండుగల్లో కన్నా ఆబ్దీకాల్లోనే ఎక్కువ తెలుసు నాకు ఇవి...:)
కొందరు అప్పాలను 'బూరెలు' అంటారు. కొందరు మొత్తం బియ్యప్పిండి తోనే అప్పాలు వండుతారు.అసలు గోధుమపిండీ కొంచెం కూడా వెయ్యకుండా. అవి కూడా బావుంటాయి.