వంటింట్లో కందిపప్పు వేయిస్తూంటేనే ఆ వాసనకి మా మావగారు వంటింట్లోకి వచ్చేసేవారు కండిపచ్చడి చేస్తున్నావా? అని. ఆయనకు ఎంతో ఇష్టం కందిపచ్చడి. ఆయన సూపర్ వంటల స్పెషలిస్ట్ కూడా. చిన్నతనంలో వాళ్ళ చెల్లెళ్లకూ, తమ్ముళ్ళకూ ఆయనే వండి పెట్టేవారుట. కందిపచ్చడి, టమాటో పచ్చడి ఆయన రోట్లో రుబ్బుతూంటే సగం రోట్లోనే ఖాళీ అయిపోయేవట. పైగా వాళ్లవన్నీ గుంటూరు కారాలు. మా పెళ్ళైన మొదట్లో పాపం అన్నీ తినేవారు కానీ తర్వాతర్వాత ఆయనకు ఫుడ్ రెస్ట్రిక్షన్స్ చాలా ఉండేవి. అందుకని ఆయన తినకూడరని ఆయనకు ఇష్టమైనవేమో వండేవాళ్లం కాదు. ఆయన కాలంచేసి నాలుగేళ్లవుతున్నా ఇప్పటికీ కందిపచ్చడి చేస్తే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి..!! ఆయనను తలవకుండా ఈ టపా కూడా రాయలేను మరి..
సరే, కొబ్బరి + కంది పచ్చడి లోకి వచ్చేస్తే... ఎర్రగా వేయించిన కందిపప్పు లో నానబెట్టిన చింతపండు, ఉప్పు, ఎర్ర మిరపకాయలతో వేయించిన పోపు కలిపి మెత్తగా గ్రైండ్ చేసి, ఘుమఘుమలాడే కందిపచ్చడి రెడి అయిపోతుంది కదా ! మా నాన్నమ్మ ఇదే కందిపచ్చడిలో కొబ్బరి కలిపి కొబ్బరి + కంది పచ్చడి చేసేది. అదీ చాలా బావుంటుంది. ఎలాగంటే..
ఒక కొబ్బరి చిప్ప (half coconut)
150gms కండిపప్పు
నిమ్మకాయంత నానబెట్టిన చింతపండు
రెండు పచ్చిమిరపకాయలు
పోపుకి: ఐదారు ఎండు మిరపకాయలు, ఒక చెంచా మినపప్పు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, చిటికెడు ఇంగువ, చిటికెడు పసుపు, కర్వేపాకు
* ముందుగా కందిపప్పు ఏమాత్రం మాడకుండా ఎర్రగా వేయించుకోవాలి. పచ్చడి రుచి అంతా ఈ వేయించటంలోనే దాగి ఉంటుంది. వేగిన కందిపప్పు మిక్సీలో కాస్త తిప్పాలి.
* కందిపప్పు కాస్త నలిగాకా చింతపండు, కొబ్బరి(కొబ్బరిచిప్ప ముక్కలు చేసి గ్రైండ్ చేసుకున్నా సరే, లేక తురుముకున్నా సరే), ఉప్పు, పచ్చి మిర్చి, పోపులో వేగిన ఎండు మిరపకాయలు వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడి మరీ గట్టిగా అనిపిస్తే కాసిని నీళ్ళు పోసికోవచ్చు గ్రైండ్ చేసేప్పుడు.
* పచ్చడితో పాటూ గ్రైండ్ చేసే కన్నా పచ్చడి గిన్నెలోకి తీసాకా వేగిన పోపు పైన వేసి కలిపితే ఏ పచ్చడి అయినా బావుంటుంది.
కొబ్బరి వెయ్యని కందిపచ్చడికి ఒక టిప్:
* గ్రైండ్ చేసేప్పుడు రెండు మూడు వెల్లుల్లి రేకులు వేసుకుంటే ఉత్తి కంది పచ్చడి మరి మరీ రుచికరంగా ఉంటుంది.