నారింజకాయ
నిన్నుచూడగానే
నోరూరుతుంది
తొక్కతీసి తింటే
అబ్బబ్బ పులుపు
తిననే తినను...
అంటూ చిన్నప్పుడు పాడుకునేవాళ్ళం కదా..!
నారింజకాయ చాలా పుల్లగా ఉంటుంది. బాగా పండితే తియ్యగా మారితుంది. సిటీల్లో అరుదుగా దొరికే ఈ నారింజకాయ చెట్టు ఒకటి అన్నయ్య వాళ్ల ఫ్రెండ్ ఇంట్లో ఉందిట. ఏవో మాటల్లో "ఆ కాయలేమిటో తెలీవు. ఏంచేసుకోవాలో తెలీక పడేస్తూ ఉంటాం" అన్నాడట అతను.. అయ్యో మేం వాడతాం..చెట్టుకెన్నుంటే అన్నీ పట్టుకురా అని అన్నయ్య నారింజకాయలు తెప్పించి నాకూ ఇచ్చాడు.
నారింజకాయతో చేసే "నారింజకాయ కారం" చాలా బావుంటుంది. రెండు రకాలుగా దీనిని చేయచ్చు..
మొదటిరకం:
* ఒక నారింజకాయ ఉంటే రెండు పెద్ద చెంచాలు నూనె వేడి చేసుకోవాలి.
* కాగిన నూనెలో పావుచెంచా ఇంగువ వేసి కాగాకా, మూడు చెంచాలు మెంతిపిండి వెయ్యాలి. తర్వాత మూడు చెంచాల కారం కూడా వేసి స్టౌ ఆపేయాలి. ఆ వేడికి కారం కూడా వేగుతుంది. ఇది చల్లర్చాలి.
* విడిగా ఒక గిన్నెలో నారింజకాయలు రసం తీసి,(రసం తీసేప్పుడు చెయ్యి తగలకుండా చూసుకోవాలి.లేకపోతే రసం చేదు వచ్చేస్తుంది) అందులో తగినంత ఉప్పు(కారానికి సమానంగా), ఒక చెంచా పచ్చి ఆవ పొడి(పచ్చిదే) వేసి బాగా కలిపిన తర్వాత కాచి చల్లార్చిన మెంతిపిండి మిశ్రమం అందులో కలపాలి.
రెండవరకం:
* రెండు చెంచాలు మినపప్పు
* రెండు చెంచాలు ఆవాలు
* నాలుగు చెంచాలు మెంతులు
* పది పన్నెండు ఎండు మెరపకాయలు
-- ఇవన్నీ కలిపి కాస్త నూనెలో వేయించి, చివరలో పావుచెంచా ఇంగువ కూడా వెయ్యాలి. చల్లారాకా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
తర్వాత నారింజకాయ రసం తీసుకుని, అందులో ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమం వేసి, తగినంత ఉప్పు వేసుకుని మొత్తం బాగా కలుపుకోవాలి.
ఇదేవిధంగా నిమ్మకాయ కారం కూడా చేసుకోవచ్చు.
వేడి వేడి అన్నంలో ఈ నారింజకాయ కారం కలుపుకుని, కాస్తంత నెయ్యి వేసుకుని తింటే... అమృతం అంటే ఇదేనేమో అనిపించకమానదు !!
ఈ పోస్ట్ చదువుతుంటేనే నోట్లో నీళ్లూరిపోతున్నాయి.
నారింజకాయ కారం చేస్తారా? మేము నిమ్మకాయ కారం చేస్తాం. దానికేదో పేరుంది. మరచిపోయా. అమ్మనడిగి చెబుతా!
నారింజకారం
నిన్నుచూడగానే
నోరూరుతుంది
నెయ్యేసి తింటే
అబ్బబ్బ అమృతం
వదలనే వదలను...
హ్మ్!! ఎన్నేళ్ళయిందో రుచి చూసి.
ఇలా ఫోటోలు పెట్టి ఊరించుట తగునా మీకు తృష్ణ గారూ. :((
Mouth watering...really!
@krishnapriya: :))thank you.
@aa.sowmya: పండకుండా ఉన్న నారింజకాయతో చేస్తే పులుపుతో కూడిన రుచి, పండిన నారింజతో చేస్తే తీపి,పులుపు కలిపిన మరొక రుచి రెండు చాలా బావుంటాయండి.
ధన్యవాదాలు.
@శంకర్: .....:(
thank you.
@సుజాత: thank you...thank you.
నారింజకాయ
నిన్నుచూడగానే
నోరూరుతుంది
తొక్కతీసి తింటే
అబ్బబ్బ పులుపు
తిననే తినను
లైన్ బాగుంది అండి
నారింజకాయ కారం చేస్తారా? ఎప్పుడు వినలేదు :| తినలేదు కుడా :(
ఎప్పటినుండో అనుకుంటున్నాను. రెసిపీ దొరికింది. థాంక్స్.
Trishna Gaaru,
Mouth watering !!! and it took me back to my childhood days. Not sure if this is also called 'Dabba nimmakaya' we used to have two trees in our rented home in hyd, apart from the recipie you mentioned here my mother also used to prepare chitrannam with these and parcel the pacchadi to freinds and relatives.
Surabhi
స్..స్....స్స్..నూరూరుతుంది!
నారింజ కాయ..నిమ్మకాయ..మేము కూడా రెంటితో కారం చేస్తాం.
ఈ కారాన్నీ దోసె వేసుకునేటప్పుడు కాస్త దోసె పైన వ్రాసి ఉల్లిపాయ ముక్కలు చల్లుకుంటే..వహా..వహా..
హే నారింజ చెట్టు మా అత్తగారింట్లో ఉంది. వెళ్ళినప్పుడల్లా నేను మోయగలిగినన్ని కాయలు తెచ్చుకుంటా. కాని నాకు దానితో ఇలా వంటలు చేస్తారని తెలీదు. పచ్చి కాయలతో ఐతే పులిహొర, పండితే రసం తీసి తాగడమే. ఇప్పుడు నా కూతురు పచ్చి/పండు తేడా లేకుండా కోసినవి కోసినట్టు అలానే తినేస్తోంది :)
మీ రెసిపీ ట్రై చేస్తాను. ఇది ఎంతకాలం నిలవ ఉంటుంది?
నారింజ కారం వినలేదండి ఎప్పుడూ. నిమ్మకాయ కారం బానే అలవాటు ఇంట్లో. చూస్తుంటే నోరూరిపోతోంది. నారింజ చెట్టు ఉంది మా ఫ్రెండ్ వాళ్ళింట్లో. దాన్ని అడిగి ఈ వీకెండ్ చేస్తానుండండి.
@Surabhi : దబ్బకాయ వేరే అండి. నిమ్మకాయ కన్నా పెద్దగా పుల్లగా పచ్చగా ఉంటుంది. పులిహోర, పచ్చడి చేస్తారు దానితో. చాలా బావుంటుంది.
ఈరోజే దబ్బకాయ పచ్చడి సీసా ఖాళీ అయింది. :(((( మళ్ళీ ఫ్రెష్ కోటా వచ్చేవరకు ఫొటోస్ చూసి లొట్టలెయ్యటమే.
@తెలుగుపాటలు: ఎప్పుడన్నా నారింజకాయ దొరికితే ప్రయత్నించండి..బావుంటుంది.
ధనయ్వాదాలు.
@రావ్ ఎస్ లక్కరాజు: అవునా..:)
ధన్యవాదాలు.
@సురభి: దబ్బకాయ వేరండి..దబ్బకాయతో చేసేవి క్రింద పద్మగారు కూడా రాసారుగా..దబ్బకాయ ఊరగాయ గురిణ్చి క్రింద లింక్ లో రాసాను చూడండి..
http://ruchi-thetemptation.blogspot.in/2011/11/blog-post_28.html
ధన్యవాదాలు.
@సిరిసిరిమువ్వ: దోశ మీద అల్లం chutney రాస్తారు కదా మామూలుగా...ఈ కొత్తటిప్ కూడా బావుందండీ..ట్రై చెస్తా..థాంక్యూ.
@రూత్:నారింజకాయతో పులిహోర చేస్తారా? బావుంది. నాకు దబ్బకాయతో చేస్తారని తెలుసు..
దొరికే ఒకటి రెండు కాయలతో పెట్టిన నారింజ కారం వారం కన్నా రాదండి..అందుకని ఎంతకాలం నిలవ ఉంటుందో తెలీదు నాకు..ఎప్పటికప్పుడు రెండేసి కాయలు పెట్టుకుంటేనే బెటరేమో..
ధన్యవాదాలు.
@పద్మ:అయితే ఎలా వచ్చిందో చెప్పoడి..
దబ్బకాయతో పప్పు కూడా చేస్తారండి. బావుంటుంది. దబ్బకాయ సీసా ఖాళీ అయిపోయిందా..? ప్రియా పచ్చడివాళ్ళు "సిట్రాన్ పికిల్ " అని దబ్బకాయ ఊరగాయ కూడా అమ్ముతారు. చాలా బావుంటుంది. అది తెప్పించుకోండి ఎవరన్నా వస్తుంటే.
ధన్యవాదాలు.