ఇడ్లీ, దోశ ఈ రెండింటిలో మనకి బియ్యం ఎక్కువగా ఉంటుంది. బియ్యం ఎంత తక్కువ తింటే అంత మంచిది అని అంటున్నారు కదా డాక్టర్లు. మరి బియ్యానికి ప్రత్నామ్యాయం ఏమిటి? అంటే - చిరుధాన్యాలు. చిరుధాన్యాల గురించి గతంలో చెప్పుకున్నాం కదా. కొన్ని రెసిపిలు కూడా చెప్పాను. జొన్న రవ్వ ఉప్మా , రాగి పూరీలు , మిక్స్డ్ రవ్వ ఉప్మా, రాగి సేమ్యాతో ఉప్మా మొదలైనవి.
ఇవాళ సజ్జలతో ఇడ్లీ, దోశ ఎలానో చెపుకుందామేం. ఇప్పుడు చెప్పబోయే సజ్జపిండిలో ప్రత్యేకత ఏంటంటే ఒకే పిండితో మనం ఇడ్లీ, దోశ కూడా చేసుకోవచ్చు. ముందర ఈ సజ్జపిండి గురించి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం:
సజ్జ పిండికి కావాల్సినవి:
* ఒక గ్లాసుడు సజ్జలు/సజ్జ రవ్వ
* పావు గ్లాసు మినపగుళ్ళు
* పావు గ్లాసు అటుకులు
1) ఒక గిన్నెలో గ్లాసుడు శుభ్రంగా ఏరిన సజ్జలు లేదా సజ్జరవ్వ (ఇది కూడా జొన్న రవ్వలాగ దొరుకుతుంది) రెండుగ్లాసులు మంచినీళ్లలో నానబెట్టాలి. సజ్జలు నానబెట్టే నీళ్ళు కాస్త వేడి చేస్తే త్వరగా నానతాయి.
2) మరో గిన్నెలో పావు గ్లాసు మినపగుళ్ళు అరగ్లాసు మంచినీళ్లలో నానబెట్టాలి.
౩)ఈ రెండూ కూడా ఒక నాలుగైదు గంటలు నానాలి.
4) గ్రైండ్ చెయ్యటానికి పది నిమిషాల ముందు పావు గ్లాసు అటుకులు పావు గ్లాసు నీటిలో నానబెట్టాలి.
5) మొత్తం కలిపి గ్రైండర్ లో మెత్తగా రుబ్బుకోవాలి. ఇంక నీళ్ళు ఎక్కువ పొయ్యకూడదు.
గట్టిగా కాక ,మరీ మెత్తగా కాక సజ్జ పిండి రెడీ అవుతుంది. అప్పుడు ఉప్పు కలుపుకోవాలి.
సజ్జదోశలు:
* దోశ కావాలంటే అప్పటికప్పుడు వేసుకోవచ్చు. లేదా పిండి రాత్రంతా బయటే ఉంచి ఫెర్మెంట్ అయ్యాకా పొద్దుటే వేసుకోవచ్చు.
* పెనంపై దోశ సన్నగా పోస్తే కాస్త క్రిస్పి గానే ఉంటాయీ దోశలు.
* పెనంపై కాస్త మందంగా వేసుకుని, నూనె వెయ్యకుండా మూత పెట్టి, స్టీం దోశ లాగ కూడా వేసుకోవచ్చు ఈ పిండితో.
సజ్జ ఇడ్లీ:
* ఇడ్లీకయితే రాత్రి పిండి రుబ్బుకుని పొద్దుటిదాకా ఫెర్మెంట్ అవ్వటానికి అట్టేబెట్టి పొద్దుటే వేసుకుంటే బాగుంటాయి ఇడ్లీలు. నేను పిండి రుబ్బగానే దోశతో పాటే ఒక ప్లేట్ ఇడ్లీ కూడా వేసి చూసాను. బానే వచ్చాయి.
* రవ్వ ఉండదు కాబట్టి ఈ ఇడ్లీలు బాగా మెత్తగా ఉంటాయి. వేడిగా తింటే రుచి బాగుంటుంది.
* ఏ రకమైన ఇడ్లి అయినా ఇడ్లీ వేసేప్పుడు ప్లేట్ మీద నెయ్యి గానీ నూనె గానీ రాసి వేస్తే ఇడ్లీలు తీసేప్పుడు ఇడ్లీప్లేట్ కి అంటుకోకుండా వస్తాయి.
* పిండి రాత్రంతా బయటే ఉంచేప్పుడు ఓ పెద్ద గిన్నెలో నీళ్ళు పోసి, అందులో ఈ పిండి ఉన్న గిన్నె పెడితే పిండి మరీ పులియకుండా ఉంటుంది.
బావుందండీ నేనూ ఇలాగే ప్రయోగాలు చేస్తూ ఉంటాను . జొన్నలతో దోశలు చేస్తున్నాను చాలా మృదదువుగా వస్తున్నాయి అంరర్నీ ఊదరగొట్టేస్తున్నా బియ్యం .బదులుగా జొన్నలు వాడమని మీరు కూడా వీలు చూసుకుని .ఒకసారి .నాబ్లాగు చూడండే .ఏదో మిమ్మల్ని అందర్నీ చూసి .నేనూ కెలకడం మొదలు .పెట్టాను . సజ్జ దోశలు ప్రయత్నిస్తాను .
@nagarani yerra: ఇక్కడ రాసారు మీరు జొన్న దోశల గురించి... సజ్జలతో ట్రై చేసారా?
ధన్యవాదాలు.