వర్షాలు ఎక్కువైయ్యాయి కదా.. ఇక మరి వేడివేడిగా బజ్జీలూ, పకోడీలూ, జంతికలు, చెక్కలు, పుణుకులు మొదలైనవి తినాలనిపింస్తుంది అందరికీ. కానీ శెనగపిండి మంచిది కాదు వాడద్దు అని ఆరోగ్యసూత్రం! ఎందుకు అంటే అరుగుదల తక్కువ, గ్యాస్ ప్రోబ్లం ఉన్నవాళ్ళకి, డయాబెటిక్ పేషంట్స్ కీ కూడా మంచిది కాదు అంటారు. సో, శెనగపిండి వాడకుండా వర్షాకాలపు సాయంత్రాలు స్నాక్స్ కి ఏ పిండి వాడచ్చు, ఏం చేయచ్చు అని ఎక్స్పరిమెంట్లు చేస్తున్నా నేను. అందులో ఒకటి జొన్నపిండితో పకోడి.
ముందర ఉల్లిపాయ పకోడికి కావాల్సినవి చూద్దాం:
* ఒక కప్పు జొన్నపిండి
* అర కప్పు బియ్యప్పిండి
* గుప్పెడు పుట్నాలపప్పు
* ఒక ఇంచ్ అల్లం, రెండు పచ్చిమిరపకాయలు
* ఓ చెంచా వాము
* ఓ గుప్పెడు పల్లీలు(అక్కర్లేకపోతే మానేయచ్చు కూడా)
* తగినంత ఉప్పు
* రెండు పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరిగినవి
* వేయించటానికి తగినంత నూనె
తయారీ:
* పుట్నాలపప్పు, అల్లం, పచ్చి మిర్చి కలిపి గ్రైండ్ చెయ్యాలి. పొడిగానే వస్తుంది.
* అలానే పల్లీలు కూడా ఒక్కసారి (ఓ అరనిమిషం) పొడిగా మిక్సిలో తిప్పి తీసేయాలి. పలుకులుగా అన్నమాట.
* ఒక బేసెన్ లో జొన్నపిండి,బియ్యపిండి, గ్రైండ్ చేసిన పుట్నాల పిండి, వాము, పల్లూ పలుకులు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఏదన్నా స్పూన్ తో బాగా కలపాలి.
* పిండిలన్నీ బాగా కలిసాకా, అప్పుడు కాసిని నీళ్ళు చిలకరిస్తూ ముద్దగా మళ్ళీ కలపాలి.
* ఇలా కలిపిన పిండిని కాస్త కాస్తగా కాగిన నూనెలో వేయించటమే.
జొన్నపిండితో ఉల్లి పకోడీలు రెడీ అయిపోతాయి :)
బచ్చలాకుతో పకోడి:
బచ్చలాకుతో బజ్జీ చేస్తారు కదా; తోటకూర, పుదీనా పకోడీలకి వేసినప్పుడు బచ్చలాకు పకోడి ఎందుకు చేయకూడదు అని ఐడియా వచ్చి ట్రై చేసా. బానే ఉన్నాయి తినటానికి. ఈ ఉల్లిపాయలు కలిపిన జొన్నపిండిలోనే బచ్చలాకు తరిగి వేసేసా. కాబట్టి ఇందులో ఉల్లిపాయ వేసినా బాగుంటుందన్నమాట.
ఈ పిండితో వేసినవి నచ్చుతాయో లేదో అనుకున్నా, బాగున్నాయని ఇంట్లోవాళ్ళు కూడా తినేసారు :) తేడా తెలియకపోతే మంచిదే కదా!
బచ్చలిఆకు తో పకోడీలు నేనూ వేస్తూ ఉంటా .కానీ సెనగపిండి ,గోదుమపిండి తో ఈ సారి ఇలా ట్రై చేయాలి .పుట్నాల పప్పు వేయను .అదికూడా వేసి చేస్తా
మంచి టైం లో పకోడిల గురించి పోస్ట్ చేశారు తృష్ణ గారు. చూడ్డానికే యమ్మీగా ఉన్నాయి. తప్పకుండా ప్రయత్నిస్తాను :)
@radhikagaaru,priya gaaru, ట్రై చేసారా?thanks for the comments.