ఉసిరి దొరికే సీజన్ అయిపోతూంటే ఇప్పటికి కుదిరింది రాయడానికి..! రుచి సంగతి ఎలా ఉన్నా ఔషధగుణాలు పుష్కలంగా ఉన్న ఉసిరికాయను ఏడాది పొడువునా తినగలిగేలా నిలవచేసి పచ్చడి చేసుకునే పధ్ధతి మన పెద్దవాళ్ళు మనకు చెప్పారు. ఆవకాయ కన్నా ఉసిరిపచ్చడి శ్రేష్ఠం. ఉరిసితొక్కు నిలవ ఉంచి, అప్పుడప్పుడూ అంత తొక్కుతో పచ్చడి చేసుకు రోజూ భోజనంలో మొదటి ముద్దలో తింటే ఎంతో మంచిదిట. కనీసం మనం మొదట తినే పప్పులో అయినా నంచుకుంటే ఆరోగ్యానికి మేలు.
ఉసిరి కొనేప్పుడు కూడా కార్తీకమాసంలో దొరికే ఉసిరికాయలు కొనాలిట. వాటిల్లో ఔషధగుణాలు ఇంకా ఎక్కువగా ఉంటాయిట. పచ్చడి తర్వాత చేసుకున్నా కార్తీకమాసం అయ్యేలోపూ ఉసిరికాయలు కొని ఫ్రిజ్ లో పెట్టేస్తుంటాను నేను. సరే, ఇప్పుడు ముందు ఉసిరి తొక్కు నిలువ ఉంచేదెలాగో చెప్తానేం...
ఉసిరి తొక్కు నిలువ చేయడం:
* ముందర ఉసిరికాయలు కడిగి, తుడిచి, తడి ళేకుందా ఆరబెట్టాలి.
* తర్వాత చిన్న చిన్న ముక్కలు చెయ్యాలి. ఇలా..
* ముక్కలు గ్రైండర్ లో వేసి ఊరగాయలకు వాడే రాళ్ల ఉప్పు, పసుపు వేసి మెత్తగా తిప్పుకోవాలి. పావుకేజీ ఉసిరికాయలకు రెండు గుప్పెళ్ళు ఉప్పు, రెండు చెంచాల పసుపు వేయచ్చు.
అలా గ్రైండ్ చేసిన ఉసిరి తొక్కు ఇలా ఉంటుంది..
* ఇది ఒక సీసాలో కానీ పింగాణీ జాడీలో కానీ వేసి తడి తగలకుండా మూత పెట్టాలి. కావాల్సినప్పుడల్లా కాస్త కాస్త తీసి పచ్చడి చేసుకోవచ్చు.
ఉసిరి పచ్చడి:
* సుమారు టీ గ్లాసుడు ఉసిరి తొక్కును పచ్చడికి తీసుకుంటే నాలుగు ఎండు మిరపకాయలు, నాలుగు పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజు కట్ట కొత్తిమీర తీసుకోవాలి.
* ఒక చెంచా నూనెలో మినపప్పు, ఆవాలు, ఇంగువ, ఎండు మిర్చి వేసి వేగాకా ఒక చెంచా మెంతిపొడి వేసి, మెంతిపొడి బాగా ఎర్రగా వేగాకా స్టౌ ఆపేయాలి. అప్పుడు కడిగి, తరిగిన కొత్తిమీర ఆ వేడి పోపులో వెయ్యాలి. కాస్త మగ్గినట్లు అవుతుంది.
* వేగిన ఎండు మిర్చి, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు గ్రైండర్ లో వేసి ఒకసారి తిప్పాకా , ఉసిరి తొక్కు కూడా అందులో వేసి మొత్తం కలిసేలా మిక్సీ మరోసారి తిప్పాలి.
* నిలవ ఉంచేప్పుడు ఉప్పు వేస్తాం కాబట్టి, ఇంకా ఉప్పు అవసరం అనుకుంటే రుచి చూసి తగినంత కలుపుకోవాలి.
* ఇలా చేసుకున్న పచ్చడి కూడా నాలుగైదు నెలలు పాడవకుండా ఉంటుంది.
---------------------------
ఉసిరి ఆవకాయ:
* ఉసిరికాయలు ముక్కలు చెయ్యకుండా కాయలకు మధ్య మధ్య చాకుతో గాట్లు పెట్టి, మూకుడులో రెండు చెంచాల నూనె వేసి కాస్త మగ్గించాలి. కాయలు కాస్త మెత్తబడ్డాయి అనుకున్నాకా ఆపేయాలి. ఇలా చేస్తే ముక్కలు త్వరగా ఊరతాయి.
* ఆవకాయ పాళ్ళలో ఆవపొడి, కారం, ఉప్పు (౧:౧:౧) తీసుకుని ఊరగాయ పెట్టేసుకొవడమే.
రెండవరకం:
* ఇందులో కాస్త మెంతిపిండి కలుపుతారు. ప్రొసిజర్ ఇదివరకూ దబ్బకాయ ఊరగాయ చెప్పాను.. అలానే..! దబ్బకాయ ముక్కలకు బదులు మగ్గించిన ఉసిరికాయలు చల్లారాకా, అవి పిండిలో కలుపుతాం. అంతే!
* ముక్కలుగా కోసి అవకాయ పెట్టుకున్నా ముక్కలు చెంచాడు నూనెలో మగ్గిస్తే బావుంటుంది.
బాగుందండి సమయానికి చెప్పారు .మేం ఆవకాయ లా పెడతాం కానీ తొక్కు చెయ్యము.ఇది చూసాక ఈ సారి కాస్త తొక్కు కూడా చెద్దామనుకుంటున్నాను .తొక్కు ఫ్రిజ్ లో పెట్టాలా?
@రాధిక(నాని ): తొక్కు బయటె ఉంచచ్చండి. అందుకే కదా రాళ్ళఉప్పు(rock salt ), పసుపు వేసేది.
nice...nallagaa avakundaa undaalante, konchem menthulu veyinchi kalapaalanukuntaa tRshnaa..!!
@Ennela: మంచి సలహాకు ధన్యవాదాలు ఎన్నెల గారూ!