శరీరాన్ని చల్లబరిచే గుణమే కాక అరుగుదలకూ, ఎసిడిటీకీ కూడా మంచి మందైన పుదీనా అకులను ఏదో విధంగా భోజనంలో include చేసుకోవడం ఆరోగ్యానికి మంచిది. పుదీనా రైస్, పుదీనా పచ్చడి, పుదీనా నిలవ పచ్చడి, పుదీనా కారం, పుదీనా రైతా మొదలైనవి నేను చేస్తుంటాను. ఇవాళ చాలా సులువుగా చేసుకునే పుదీనా కారం గురించి చెప్తాను.
కావాల్సినవి:
రెండు కట్టలు పుదీనా
రెండు, మూడు పచ్చిమెరపకాయలు
తగినంత ఉప్పు(సుమారు అర చెంచా)
అర చెక్క నిమ్మరసం
తయారీ:
* పుదీనా ఆకులు కడిగేసి, ఒక చిన్న చెంచాడు నూనెలో కొద్దిగా(మూడు నాలుగు నిమిషాలు) వేయించాలి. పచ్చివాసన పోతే చాలు. ఆకుపచ్చరంగు అలానే ఉండగానే ఆపేయాలి. రంగు మారితే ఆకులు బాగా వేగిపోయినట్లు. (పుదీనా కారానికి అలా అవసరం లేదు.)
* వేగిన ఆకు చల్లారాకా, పచ్చిమెరపకాయలు, ఉప్పు వేసి మిక్సీలో మెత్తగా తిప్పేయాలి.
* గిన్నెలోకి తీసాకా అరచెక్క నిమ్మరసం తీసి అందులో కలిపితే సరిపోతుంది.
* ఇందులోకి పోపూ కూడా అక్కర్లేదు.
* వేడి వేడి అన్నంలో ఈ పుదీనా కారం చాలా బాగుంటుంది.
టిప్:
ఇదే విధంగా కొత్తిమీర కారం కూడా చేసుకోవచ్చు. ఇది అయితే ఆకు వేయించక్కర్లేదు కూడా. పచ్చిదే మిక్సీలో తిప్పేయచ్చు.
ప్రెగ్నెంట్ లేడీస్ ఇలాంటి గ్రీన్ చట్నీ(పుదీనా లేదా కొత్తిమీర) మొదటి ముద్దలో తింటే మంచిది.