ఇదివరకూ మొక్కజొన్న వడలు, పొంగడాలు విడివిడిగా రెసిపీలు రాసాను . ఈసారి మొక్కజొన్నలతో పొంగడాలు చేయడం ఎలానో చెప్తానేం..!
మా నాన్నగారు హార్ట్ పేషంట్. ఆయిల్ బాగా తక్కువ వాడాలి కాబట్టి సాయంత్రం స్నాక్స్ క్రింద మా అమ్మ ఇలా రకరకాల పొంగడాలు వేస్తూంటూంది. మొక్కజొన్నలతోనే కాక బొబ్బర్లు, సోయా బీన్ గింజలు, మొలకెత్తిన పెసలు మొదలైనవాటితో రోజుకో రకం పొంగడాలు చేస్తుంది అమ్మ. పొంగడాలు వేసే గుంటల్లో ఒక చుక్క ఆయిల్ వేయచ్చు. డీప్ ఫ్రైడ్ ఐటేమ్స్ అవాయిడ్ చెయ్యాలనుకునేవారు ఇలా మొలకెత్తిన గింజలతో పొంగడాలు చేసుకుంటే ఆరోగ్యకరం.
ఇప్పుడు కూరల మార్కెట్లో, షాపింగ్ మాల్స్ లో అన్ని సీజన్స్ లో మొక్కజొన్నలు దొరుకుతున్నాయి కాబట్టి మొక్కజొన్నతో లేదా ఇష్టమైన వారు స్వీట్ కార్న్ తో కూడా ఈ పొంగడాలు చేయచ్చు.
మొక్కజొన్న పొంగడాలకు కావాల్సినవి:
మొక్కజొన్న లేదా స్వీట్ కార్న్ గింజలు - ఒక కప్పు
చిన్న ఉల్లిపాయ - తరిగిన ముక్కలు
చిన్న అల్లం ముక్క
రెండు పచ్చిమిరపకాయలు
చిన్న కట్ట కొత్తిమీర లేదా పుదీనా
రెండు చెంచాలు బియ్యప్పిండి
తగినంత ఉప్పు
తయారీ:
* ముందుగా మొక్కజొన్న గింజలు, అల్లం, మిర్చి, కొత్తిమీర/పుదీనా, ఉప్పు కలిపి కాస్త నీళ్ళు కలిపి మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేస్కోవాలి.
* ఆ పిండిలో ఉల్లిపాయ ముక్కలు, రెండు చెంచాలు బియ్యప్పిండి కలిపి, పొంగడాలు గుంటల్లో ఒక చుక్క నూనె వేసి, పిండిని వేసి మూత పెట్టాలి.
* మూడు నాలుగు నిమిషాల తరువాత పొంగడాలు వెనక్కు తిప్పాలి.
* రెండువైపులా బాగా కాలాకా స్టౌ ఆపేయాలి.
* కొత్తిమీర/పుదీనా + అల్లం వేస్తాం కాబట్టి చట్నీ ఏమీ లేకపోయినా ఉట్టినే తినేయచ్చు.
టిప్:
* మొక్కజొన్న లేతది కాక కాస్త ముదిరినదైనా పొద్దున్నే గింజలు వొలిచి నోళ్ళల్లో నానబెడితే సాయంత్రానికి నాని రుబ్బుతే పేస్ట్ అవుతాయి.
chala bavunnayi.
thanks krishnakka :)
స్టవ్ ఎప్పుడు వెలిగించాలో చెప్పలేదు???ఎప్పుడు ఆర్పాలో మాత్రం చెప్పారు.. అసంపూర్ణంగా వుంది..కాస్త వివరించగలరు..
@voleti: 2nd స్టెప్ తర్వాత స్టౌ వెలిగించుకోవాలండీ :)Thanks frr the visit.