(పైన ఫోటో లోనిది అల్లం చారు. క్రింద వరుసలో ఎనిమిదో రకం.)
అప్పుడెప్పుడో "బ్లాగాడిస్తా" రవిగారు చారు మీద ఒక అద్భుతమైన టపా రాసారు. ఆసక్తిగల బ్లాగ్మిత్రులు "ఇక్కడ"ఓ లుక్కేయండి. అందులో మొదట్లో చారు మీద ఆయన రాసిన శ్లోకం మా నాన్నగారికి ఆయన నాన్నమ్మగారు చెప్పేవారట. నాన్న మాకు చెప్తూ ఉండేవారు. మా ఇంట్లో(పుట్టింట్లో + అత్తవారింట్లో కూడా ) అందరూ సాంబారు ఇష్టంగా తింటారు కానీ ఎక్కువ చారుప్రియులే. ఏపూట కాపూటే వంట. మళ్ళీ రాత్రి భోజనానికి చారు కొత్తగా పెట్టల్సిందే. బొంబాయిలో ఉన్నప్పుడు మా వింగ్ లో అందరూ పొద్దున్నే రెండు పూటలకీ వండేసి, ఇక రాత్రి అన్నం ఒక్కటే వండుకుంటారని తెలిసినప్పుడూ ఆశ్చర్యం వేసేది అలా ఎలా తింటారబ్బా అని. అక్కడ అందరివీ ఉరుకులు పరుగుల జీవితాలు. కొన్ని రాజీలు తప్పవు మరి.
సరే ఇక చారులు.. రకాల్లోకి వచ్చేస్తే ....
నీళ్ళు, చింతపండు, ఉప్పు, చిటికెడు పసుపు, కొత్తిమీర కామన్ పదార్ధాలు. ఇవి కాక చారులో అదనంగా వేసే పదార్ధాలను బట్టి "చారు" రుచి మారుతుంది. గిన్నె నిండా నీళ్ళు పోసి ముప్పావు భాగం ఇంకా కావాలంటే సగ భాగం నీరు ఇగిరేవరకూ ఉంచటమే చారులోని రుచి రహస్యం. నాకు తెలిసిన చారు రకాలు రాస్తున్నాను.
1) చారుపొడి తో చారు :
చారు పొడికి: కందిపప్పు(1 cup), పెసర పప్పు (1/2 cup), ధనియాలు (3/4 cup), జీలకర్ర1 spoon, మిరియాలు1 spoon ఎండలో కాసేపు ఎండబెట్టి మెత్తగా పొడికొట్టుకోవాలి. నీళ్ళు, చింతపండు, ఉప్పు, చిటికెడు పసుపు, కొత్తిమీర మొదలైన కామన్ పదార్ధాలు వేసాకా ఈ చారు పొడి కూడా రెండు చెంచాలు వేసి బాగా మరిగించుకోవాలి.
2)టమాటా చారు : రెండు మూడు టమాటాలు బాగా మెత్తగా గ్రైండ్ చేసేసి జూస్ లాగ నీళ్ళు, ఉప్పు, చిటికెడు పసుపు, కొత్తిమీర మొదలైనవి వేయాలి. టమాటాలు పుల్లగా ఉంటాయి కాబట్టి చింతపండు కొద్దిగానే వేసుకోవాలి. మా అమ్మ అయితే అసలు టమాటా చారు లోకి చింతపండు వేసేది కాదు.
3)మామూలు చారు: అన్నింటిలోకీ ఇది నాకు ఇది ఇష్టం. నీళ్ళు, చింతపండు, ఉప్పు, చిటికెడు పసుపు, కాస్త ధనియాల పొడి, కొత్తిమీర,సగం పచ్చిమెరపకాయ ముక్క,(కావాలంటే ఒక టమాటా) వేసి బాగా మరిగిస్తే ఆ రుచే అద్భుతం. ఏ చారుపొడులో అఖ్ఖర్లేదు. నేనసలు చారు పొడి చెయ్యటం చాలా తక్కువ. నేను ఎక్కువగా ఈ మామూలు చారే పెడతాను. చారులో దండిగా వేసిన కొత్తిమీర అంతా నాక్కావాలి అంటే నాక్కావాలి అని దెబ్బలాడుకునేవాళ్ళం నేనూ మా తమ్ముడూ. ఇప్పుడిక పోటీ లేదు కాబట్టి కొత్తిమీరంతా నాకే. కానీ " ఆకులూ, కాడలూ మనుషులు తినరు" అనే దెప్పుడు మాత్రం వినాల్సివస్తుంది. అంతే..:)
4) మిరియాల చారు: ఫ్రెష్ గా అప్పటికప్పుడు మిరియాలు కొట్టి చేసుకునే మిరియాల చారు(దీని గురించి "పాకవేదం" బ్లాగ్లో కౌటిల్యగారు రాసారు)
5) కందికట్టు: కస్త ఎక్కువ నీళ్ళతో కందిపప్పుని ఓ గిన్నెలో ఉడికించి పైన తేరిన నీళ్లతో పెట్టే చారుని కందికట్టు అంటారు. కుక్కర్లో పెట్టిన కందిపప్పు అయినా గిన్నెలో పైన తేరిన నీటితో చారు కాచవచ్చు. దీనిలో కాస్త ముద్దపప్పు మెత్తగా చేసి కలపుతారు కూడా.
6)పెసరకట్టు: కందిపప్పు బదులు పెసరపప్పు ఉడికిన నీటితో పెట్టే చారు. దీనిలో చింతపండు బదులు నిమ్మకాయ వాడుతూంటారు.
7) ములక్కాడ చారు: దీనిలో మామూలు చారులో వేసే అన్ని పదార్ధాలు వేసి, ఒకటి లేక రెండు ములక్కాడ ముక్కలు కట్ చేసి వేసి ఉడికించే చారు. ములక్కడ ఉడకటానికి టైం పడుతుంది కాబట్టి నేనైతే బుల్లి కుక్కర్లో ఒక్క విజిల్ రాగానే తీసేసి చారులో వేస్తాను. ఒకటి కంటే ఎక్కువ విజిల్స్ రానిస్తే ములక్కాడ ముక్కలు రూపాన్ని కోల్పోయి ముద్దయిపోతాయి...:)
ముఖ్య గమనిక: ఈ చారులన్నింటికీ పోపు చాలా ముఖ్యమైనది. అది కూడా నేతి పోపు పెట్టుకుంటే ఆ రుచే వేరు. చెంచాడు నెయ్యిలో ఆవాలు, జీలకర్ర, మెంతులు వేగాకా ఇంగువ ,కర్వేపాకు వేసుకుని అది మరిగే చారులో వేసేయాలి. అమ్మయితే గరిట కూడా చారులో ముంచేసేది. చూయ్.. మని భలే శబ్దం వచ్చేది. పోపు ముందర పెట్టి తరువాత నీళ్ళు పోసి చారు కాచితే పోపు మెత్తబడిపోయి ఫ్రెష్నెస్ పోతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా చారు బాగా మరిగాకానే పోపు పెట్టుకొనవలెను.
8) ఇక చింతపండు వెయ్యని మరో రకం చారు "అల్లం చారు". పైన ఫోటో లోనిది. దీనినే "నిమ్మకాయ చారు" అని కూడా అంటాము. నాన్నవాళ్ళు చదువుకునే రోజుల్లో మద్రాసు హాస్టల్లో "ఇంజి(అల్లం) రసం" అని చేసేవారట. ఆ రెసిపీ చెప్పి అమ్మకి నేర్పించారు. నేను ఎక్కువగా చేసే ఈ అల్లం చారు ఎలా చెయ్యాలంటే:
* ముందుగా రెండు అంగుళాల అల్లాన్ని తొక్కు తీసి, సన్నగా పొడుగ్గా ముక్కలు తరుక్కోవాలి.
* తరువాత ఒక మీడియం కప్పు పెసరపప్పు కడిగి రెండు కప్పుల నీరు పోసి,చిటికెడు పసుపు వేసి కుక్కర్లో ఉడుకించాలి. అందులోనే మరీ చిన్న గిన్నెలో ఈ అల్లం ముక్కలు వేసి కాసిని నీళ్ళు పొయ్యాలి. పప్పులో కలిపి పెట్టినా, విడిగా పెట్టినప్పుడు ఎక్కువ నీరు పోసినా అల్లం ముక్కలు పేస్ట్ అయిపోతాయి. (అలా కాకూడదంటే విడిగా గిన్నెలో ఉడికించుకోవటమే.)
* కుక్కర్లోంచి తీసాకా పెసరపప్పు ని పప్పు కనబడకుండా మెత్తగా మేష్ చేసుకోవాలి. కుక్కర్లో పెట్టేప్పుడు పసుపు వేసాం కాబట్టి ఉడికిన పప్పు మంచి రంగులో చూడ్డానికి బాగుంటుంది.
* మెత్తగా చేసిన పెసరపప్పుకి ఒక అర లీటర్ గానీ మరికొన్ని ఎక్కువగానీ నీళ్ళు పోసి, ఉడికిన అల్లం ముక్కలు, ఉప్పు వేసి బాగా మరిగించాలి. తరువాత ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంగువ, కర్వేపాకు వేసి పోపు పెట్టాలి. స్టౌ ఆపేసాకా ఒక అరచెక్క నిమ్మరసం పిండాలి. ఇది సూప్ లాగ తాగేయచ్చు కూడా. మధ్య మధ్య ఉడికిన అల్లం ముక్కలు తగుల్తూంటే భలే ఉంటుంది. అల్లం ఇష్టమైనవాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది.
9) ఉలవ చారు: ఇది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. కానీ నేనెప్పుడూ తినలేదు. చెయ్యలేదు...:) (ఎవరికైనా తెలిస్తే చెప్పండి)
ఉలవలు నానబెట్టి, ఉడికించి,fresh కొబ్బరికోరు వేసి , పోపు వేసి చాట్ లాగ తినొచ్చు. అప్పుడప్పుడు ఇదైతే చేస్తూంటాను.
10)పప్పు చారు: ఇది చాలా ఫేమస్సు. మామూలు చారులో(item.no.3)నే కొంచెం ఎక్కువ మోతాదులో పప్పు వేసి చేసేదాన్ని పప్పు చారు అంటారు. పొద్దున్న మిగిలిన పప్పుతో రాత్రికి అమ్మ పప్పుచారు పెట్టేసిన సందర్భాలెన్నో...ఇప్పుడు నేను చేసేదీ అదే మరి...:)
కొసమెరుపు:ఇక ఈ చారుల్లో తీపి సంగతి: మా అమ్మ అయితే చారులో పంచదార వేసేది. అలవాటు ప్రకారం పెళ్ళయ్యాకా అత్తవారింట్లో మొదటిరోజు వంటచేసినప్పుడు చారు తిని మా మరిది ఇది చారా పానకమా? అని అడిగాడు. వాళ్ళసలు చారులొ తీపి వేసుకోరని తెలిసి నేను అవాక్కయ్యాను...ఇప్పుడిక అలవాటైపోయింది...:) కానీ అప్పుడప్పుడు కాస్త బెల్లం ముక్క వేస్తూంటాను తెలిసీ తెలియకుండా.
ఇవండీ నాకు తెలిసిన చారులు. మీకింకేమైనా రకాలు తెలిస్తే చెప్పగలరు.
బావున్నయి చారుల్లో రకాలు...అల్లం చారు మాత్రమే కొత్తది, మిగతావన్నీ తెలిసినవే. ఈ సారి అల్లం చారు కాచి చూడాలి.
మా ఇంట్లో ఉలవ పులుసులాగ పెట్టుకుంటాం. ఉలవలు ఉడికించి మెత్తగా మిక్సీలో రుబ్బేసుకోవాలి (మేష్ తో మెదుపుకోవచ్చు కూడా). చిన్న ఉల్లిపాయలు పాళంగా, టమాటాలు (optional) చిన్న చింతపండు వేసి ఉడకబెట్టుకుని ఆ రసంలో ఉలవల ముద్ద పొయ్యాలి. అన్నీ బాగా దగ్గరగా ఉడికాక పోపు వేసుకోవాలి. మామూలుగా శెనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండు మిరపలతో పాటు బాగా దండిగా వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఈ వెల్లుల్లే ఉలవచారుకి రుచి. తరువాత తగినంత ఉప్పు వేసి కలియబెట్టి దించేసుకోవడమే. దించుకున్నాక కాసింత మీగడ వేసి కలిపితే అమోఘం.
అదిరిపోయింది త్రుష్ణ గారు..ఈ పేజి ప్రింట్ తీస్కొని పెట్టుకున్నా..నాకు అన్నిటికన్న ధనియాల ( simple) చారు..నిమ్మకాయ చారు బాగా ఇష్టం..మేము చారు కొంచెం తియ్యగా కొంచెం పుల్లగా తింటాం..అందుకని కొంచెం బెల్లం లేక పంచదార వేస్కుంటాం..
@ఆ.సౌమ్య: చాలా థాంక్స్ అండి ఉలవచారు(పులుసు) రెసిపీ చెప్పినందుకు. అన్నీ అందరికీ తెలిసినవేనండి. ఒకచోట పెడితే ఎవరైనా "స్టాటర్స్" కోసం బావుంటుందని చేసిన ప్రయత్నం...:)
@నైమిష్: హమ్మయ్య. చారుల గురించి కూడా రాయాలా అంటారేమో అని భయపడిపోయానండి. ఇందాకా ఏదో టివీలో మిరియాల చారు ఎలా చేయాలో చెప్తున్నారు. అందుకని కాస్త ధైర్యం వచ్చింది. రేపొద్దున్న ముద్ద పప్పు ఎలా చెయ్యాలో ,స్టౌ ఎలా వెలిగించాలో కూడా టివీలో చెప్తారేమో...:)
నాక్కూడా చారులో కాస్తంత బెల్లం వేస్తేనే ఇష్టం అండీ.Thankyou for the visit.
నాకు తెలిసిన చారులు చాలానే ఉన్నాయి. ఎక్కువగా అప్పటికప్పుడు సృష్టిస్తుంటాను. తిన్నవాడి అదృష్టం.. ఉలవచారు ఇదిగోండి...
http://aviivianni.blogspot.com/2010/09/blog-post_22.html
ఇంకో రెండు చారులు కూడా లిస్ట్లో కలుపుకోండి!!!
బీట్రూట్ తో చారు చేస్తారు ఇక్కడ బెంగళూర్లో. నేను ఒకసారి ఇస్కాన్ టెంపల్ లో టేస్ట్ చేశాను. చూడగానే గులాబ్ జల్ లా ఎర్రటి రంగులో చాలా బాగుంది. ఎలా చెయ్యాలో తెలీదు మరి నెట్లో వెతకాలేమో.
ఇకరెండోది, పన్నీరు చారు. బెంగళూర్ లో పెళ్ళిళ్ళలో చేస్తారు...పన్నీర్ అంటే పాలతో అనుకునేరు... అస్సలు కాదు.. గులాబీ పన్నీరు. చాలా బాగుంటుంది. రెండిట్లో కామన్ ఏంటంటే పప్పు ఉండదు, థిక్ గా అస్సలు ఉండదు . చాలా తేలిగ్గా ఉంటాయి. ఉల్లి, వెల్లుల్లి లేవుగానీ, రెండిట్లో ను అల్లం పరిమళం అయితే వచ్చింది మరి.
బాబోయ్! బోల్డు చారులు చెప్పారుగా...మా అత్తయ్య పుదీనారసం కూడా పెట్టేది...నేనైతే ముక్కు మూసుకుని అలా గొంతులో పోసుకునేవాణ్ణి...ః)
అల్లం చారొక్కటే నాకు తెలియంది...ఈ సారి ప్రయత్నిస్తా..
మీలానే నేనూ,అమ్మ ఘాటుగా పెట్టే రసం కప్పులు కప్పులు లాగించేవాణ్ణి....బాగా అలిసిపోయి బడలికగా ఉన్నప్పుడు ఎంత రిలీఫ్ గా ఉంటది...
@r గారూ,
ఏమీ అనుకోవద్దు...మీరు చెప్పిన పన్నీరు చారు చూడగానే నాకు నవ్వాగలేదు, భానుమతమ్మ అత్తగారి కథల్లో పన్నీరుపప్పు గుర్తొచ్చింది...ః)
మా ఇంట్లో అందరికీ చారు ఇష్టమే. మరి నాకెందుకో అది అంతగా నచ్చదు. పథ్యం లా అనిపిస్తుంది నాకు. ఎందుకో అది జ్వరం వచ్చిన వాళ్ళే తినాలన్న ఒక ఫీలింగ్ నాకు. అయితే చారు విషయం లో నేను అచారుడిని అన్నమాట.
'పొద్దున్న మిగిలిన పప్పుతో రాత్రికి అమ్మ పప్పుచారు పెట్టేసిన సందర్భాలెన్నో..."
దీనికి మాత్రం ఎందుకో మినహాయింపు ఇవ్వబుద్ధేసేది.
ఉలవచారు గురించి విన్నాను గానీ ఎప్పుడూ ఇంట్లో ఎవరూ చేయలేదు కాబట్టి రుచి చూడలేదు.
అన్ని రకాలు ఒకే చోట పెట్టడం బాగుంది. కావసినప్పుడు వచ్చి చూసుకోవచ్చు.
మేము అన్ని రకాలు ఇంచు మించుగా ఇలాగె చేస్తాము కాని, అల్లం చారు లో, పెసర పప్పుతో నిమ్మకాయ వేసి చేస్తాము, అల్లం వెయ్యకుండా. అలాగే బూరెలకి శనగ పప్పు ఉడకపెట్టినప్పుడు, ఆ నీళ్ళతో కూడా రసంలా చేసేది మా నాన్నమ్మ. అది నాకు చాలా ఇష్టం. మా అమ్మ ప. గో నుండి, తనకి చారు తీపి వేయటమ అలవాటు, కానీ ఇంకెవ్వరికీ ఇష్టం ఉండదని మానేసిందట. నేను అప్పుడప్పుడు, లేదా కారంగా అయినపుడు కొంచెం చాటుగా వేసేస్తాను.
@జ్యోతి: అప్పటికప్పుడు కొత్త వంటకాల రెసిపీలు సృష్టించటం వంట చేసేవాళ్ల జన్మ హక్కు...:) ఒకటో రెండో మీ ఇన్వెన్షన్స్ కూడా రాయాల్సిందండీ ఇక్కడి చారుల లిస్ట్లో కలిసేవి. లింక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు.
@r: బీట్రూట్ చారా...?!
మీరు రాసిన రెండో రకం గురించి చదవగానే ఆ మధ్యన ఒక హోటల్లో తిన్న ఓ సూప్ గుర్తొచ్చిందండి. పేరు బాగుందని ఆర్డర్ చేస్తే ...వేడి ఉప్పునీళ్ళలో ఉడికిన నాలుగు కూర ముక్కలకి పైన ఒక చెంచాడు బటర్ వేసి తీసుకువచ్చాడు. నవ్వొచ్చింది తినడానిక్కూడా...:)
@r: ఇందాకా మరిచా.. ధన్యవాదాలు.
@కౌటిల్య: "పుదీనా" అంటే చిన్నపుడు మీలానే ముక్కుమూసుకునేవాళ్ళం కానీ ఇప్పుడు బోలెడు ఇష్టం.
అవునండీ అప్పుడే చేసుకున్న మంచి వేడి వేడి చారు తాగితే ఎంతబాగుంటుందో..!!
ధన్యవాదాలు.
@శంకర్.ఎస్: లాభంలేదు.. మీ స్వాతిగారికి రోజూ చారు చేయమని చెప్పేయాలి...:)
ఉలవచారు నేనూ ఎప్పుడు తినలేదండీ..బహుశా నేను టేస్ట్ చేయని ఏకైక వెజిటేరియన్ ఫుడ్ అదే అయ్యుంటుందని నా అభిప్రాయం...:)
ధన్యవాదాలు.
@పద్మవల్లి: అదేనండి నా ఉద్దేశం కూడా.
ని.చారు ఈసారి అల్లం వేసి చేయండి సూపర్ ఉంటుంది. మీ అమ్మగారు ప.గో.నుంచా? అయితే మనం మనం చుట్టాలమన్నమాట...:)
ధన్యవాదాలు.
ఐసీ ఇలా చేసిన వేన్నీళ్ళను కూడా చారు అని కొంత మంది ఆంధ్రులు తింటున్నారన్న మాట! ఇక తెలంగాణాంధ్రులు ఎలా తింటున్నారో అని తలుచుకుంటేనే .. ప్చ్.. పాపం, గుండె తరుక్కుపోతోంది. :P :)
అవునండి తృష్ణ. అమ్మమ్మ నరసాపురం. నేను పుట్టింది కూడా అక్కడే. మీరు ఎక్కడా?
నిన్న మీ స్టీల్లో, అంతే తమతో, ఉల్లి, కొబ్బరి రుబ్బి వేసి సాంబార్ చేశాను. చాల బావుంది. నేను చేసున్న సాంబార్ పౌడర్ వేసాను, ఉందని, మీరు చెప్పినట్టు పౌడర్ ఇంకా చెయ్యలేదు.
@padmavalli:ఓహో,మాకూ నరసాపురంలో చుట్టాలు ఉన్నారు.ఇక వివరాలు బ్లాగులో వద్దులెండి...:) మా నాన్నగారిది తణుకు దగ్గర ఊరండీ.అమ్మది రాజమండ్రి.so,రెండు జిల్లాలూ నావేనన్నమాట..:)
ఇప్పుడు చాలా బఫే డిన్నర్లల్లో ఉలవ చారు వేస్తున్నరుగా! సరిగ్గా చేస్తే అది తిన్న వాళ్ళకి స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉన్నట్లే ఉంటుంది.
A pinch, just a pinch of sugar,gives that tangy taste, hing in the popu is the main ing. in my view, happy charu drinking..bloggers.
vasantham.
chaala baagunnayi . naaku chaaru antae chaala ishtam . chaarulo inko variety nenu regular gaa chestaanu
pepper , jeelakarra , tomato ,vellullipaaya grind chesukovaali . baanali lo taalimpu vesi ee grind chesina paste , chintapandu guujju , neellu ,pasupu, uppu vesi baaga maraganivvaali . ghuma ghumalaadae chaaru ready .
@anupama: Thanks for the recipe and the comment too :)