|
మా చిన్నప్పుడు అమ్మ చేసే ఈ బ్రెడ్ ఉప్మా మాకు బాగా నచ్చేది. పోటీలు పడి ప్లేట్ ఖాళీ చేసేవాళ్ళం.
ఈ ఉప్మా చేయటం చాలా సులువు కూడా.
కావాల్సినవి:
ఒక చిన్న బ్రెడ్ పేకేట్
ఒక పెద్ద ఉల్లిపాయ
నాలుగు వెల్లుల్లు రేకులు
ఒక కేరెట్
కాస్త కొత్తిమీర
పోపుకి:
ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, చిటికెడు ఇంగువ, పావు చెంచా పసుపు, తగినంత ఉప్పు,కర్వేపాకు, రెండు పచ్చి మిర్చి, ఒక ఎండు మిర్చి.
చేసే విధానం:
* రెండు చెంచాల నూనెలో పోపు వేయించాలి. అందులో చితక్కొట్టిన వెల్లుల్లిరేకులు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కాసేపు వేయించాలి.
* ఉల్లిపాయ ముక్కలు మెత్తబడ్డాకా, కేరెట్ తురుముకున్నది లేదా చిన్న ముక్కలు గానీ చేసి ఉల్లిపాయ ముక్కలతో కలిపి రెండు నిమిషాలు వేయించాలి.(పైన ఫోటోలోని ఉప్మాలో నేను కేరెట్ బదులు గాజర్ వాడాను)
* ఉల్లిపాయలు వేగాకా, చిన్న చిన్న ముక్కలుగా చిదిమిన బ్రెడ్ ముక్కలు అందులో వేసి, పసుపు, కాస్తంత ఉప్పు వేసి బాగా కలపాలి. బ్రెడ్ ముక్కలు గట్టిగా ఉంటే కాస్తంత నీళ్ళు చిలకరిస్తే మెత్తబడతాయి.
* నాలుగైదు నిమిషాలు అడుగంటకుండా బాగా కలిపిన తరువాత కొత్తిమీర చల్లి దించేసుకోవాలి.
* నోరూరించే బ్రెడ్ ఉప్మా రెడీ. ఇది మిల్క్ బ్రెడ్ తోనే కాక, వీట్ బ్రెడ్ లేదా బ్రౌన్ బ్రెడ్ తో కూడా చేసుకోవచ్చు !!
