|
బియ్యం లేకుండా ఎన్ని రకాల దోశలు చేయచ్చా అన్ని రకాలూ ప్రయోగాలు చేస్తున్నా నేను. మొన్నొకరోజున సజ్జలతో దోశలు చెప్పా కదా.. ఇవాళ జొన్న దోశల రెసిపీ చెప్పుకుందాం. సజ్జ దోశల కన్నా ఈ జొన్నదోశలు నాకు బాగా నచ్చాయి. బజార్లో జొన్నపిండి కాక జొన్నలు కూడా దొరుకుతాయి. ఇవి కాస్త కాస్త చప్పునే కొనుక్కోవాలి. (మాక్సిమం కేజీ) ఎక్కువగా కొనుక్కుంటే పురుగుపట్టి పాడయిపోతాయి.(అనుభవసారం:))
కావాల్సినవి:
జొన్నలు : ఒక పెద్ద గ్లాసు
మినప గుళ్ళు: అర గ్లాసు (పైన చెప్పిన క్వాంటిటీలో సగం)
చెంచా మెంతులు
తయారీ:
* వేడిచేసిన రెండుగ్లాసుల నీటిలో జొన్నలు నానబెట్టాలి.
* విడిగా మినపప్పు, మెంతులు పెద్ద గ్లాసుడు నీళ్లలో నానబెట్టాలి.
* 5 గంటల పాటు జొన్నలు,మినపప్పు నానాకా మెత్తగా రుబ్బుకోవాలి. పైన చెప్పిన క్వాంటిటి అయితే వెట్ గ్రైండర్ లో తిరుగుతాయి.
* జొన్నలు బాగా నలగటానికి మామూలు దోశ పిండి కన్నా కాస్త ఎక్కువసేపు పడుతుంది. అందుకే వెచ్చని నీటిలో నానబెట్టడం.
* రుబ్బిన పిండిలో తగినంత ఉప్పు కలుపుకుని కావాలంటే అరగ్లాసు నీళ్ళు కలిపి బాగా కలుపుకోవాలి.
* ఈ పిండితో ఫ్రెష్ గా అప్పటికప్పుడు దోశలు వేసుకోవచ్చు. లేదా రాత్రంతా బయట ఉంచేసి(ఫ్రిజ్ లో పెట్టకుండా) పొద్దున్నే దోశలు వేసుకోవచ్చు.

