|
వంకాయ-కొత్తిమీరకారం
చక్కగా నవనవలాడే లేత వంకాయలు మార్కెట్లో దొరికినప్పుడు నాకు గబుక్కున తట్టేది ఒకటే కూర "వంకాయ-కొత్తిమీరకారం". గుత్తి వంకాయలైనా, మామూలు వంకాయలైనా ఫ్రెషా కాదా అనేది వాటి ముచికను బట్టి తేల్చచ్చు. ఫ్రెష్ అయితే ముచిక ఆకుపచ్చగా ఉంటుంది. లేకపోతే కాస్త వాడినట్లు ఉండి రంగు మారిపోయి అసలు ఆకుపచ్చగానే ఉండవు.
ఇప్పుడు కొత్తిమీర కారం గురించి చెప్పుకుందాం. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు కలిపి గ్రైండ్ చేసి కొన్ని కూరల్లో వేసుకోవచ్చు. వంకాయల్లో వేస్తే రుచి అమోఘంగా ఉంటుంది. నాకీ కొత్తిమీర అన్నది ఫేవొరేట్ కాబట్టీ దొండకాయ, బీరకాయ, ఆనపకాయ కూరల్లో కూడా ఈ కొత్తిమీర కారం వేస్తూంటాను. మా అన్నయ్య నాకన్నా ఒక మెట్టు పైకెక్కి కాకరకాయలో కూడా కొత్తిమీర కారం వేసి ఓరోజు వండాడు. (తినడానికి బాగానే ఉందిలెండి :))
వంకాయ-కొత్తిమీర కారం కూర తయారీ:
* పావుకేజీ వంకాయలు తోచిన విధంగా ఉప్పు వేసిన నీళ్ళల్లోకి తరుక్కోవాలి. ఇలా అయితే ముక్కలు నల్లబడకుండా ఉంటాయి.
* రెండు మీడియం సైజు కొత్తిమీర కట్టలు కడిగి చటుక్కున ఎండు మూడు భాగాలుగా తెంపి పెట్టుకోవాలి. (తెంపమనడం ఎందుకంటే దానికి చాకు అక్కర్లేదని అర్థం)
* మూడు, నాలుగు మీడియం సైజు పచ్చిమిరపకాయలు (ఇది ఎవరి కారాన్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు) కొత్తిమీర కలిపి గ్రైండ్ చేసుకోవాలి లేదా తొక్కుకున్నా సరే.
* మూకుట్లో కూరముక్కలు వేసి, ఆ ముక్కలకి సగం కొలతన నీళ్ళు పోసి, తగినంత(అరచెంచా) ఉప్పు వేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి. (వంకాయల్లో తక్కువ ఉప్పు పడుతుంది. కాస్త ఎక్కువైనా కూరంతా ఉప్పు కషాయం అయిపోతుంది.)
* వంకాయముక్కలు సగం ఉడికిన తర్వాత రెండు చెంచాల నూనె వేసి గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర కారాన్ని అందులో వేసేయాలి. (నూనె తినగలిగినవాళ్ళు మరో రెండు చెంచాలు నూనె వేసుకుంటే రుచి ఇంకా అద్భుతంగా ఉంటుంది.)
* కూర మాడకుండా మధ్య మధ్య కలుపుతూ దగ్గర పడ్డాకా స్టౌ ఆపేయడమే.

