బీరకాయ...ఇష్టమైన కూరల్లో ఒకటి !! బీరకాయతో భలే భలేగా బోలెడు రకాలు వండుకోవచ్చు. బీరకాయతో పప్పు(ముద్దగానూ, పొడిగానూ కూడా), పచ్చడి, బజ్జీలు, బీరకాయ అట్టు(ఇది చాలా ఇష్టం నాకు), బీరకాయ+మెంతికూర మొదలైనవి. ఇక కూరల సంగతికొస్తే బీరకాయ ఉల్లికారం, బీరకాయ శనగపప్పు కారం, బీరకాయ పోపు కూర, బీరకాయ బంగాళాదుంప మొదలైనవి చేసుకోవచ్చు. ఇవన్నీ అందరికీ తెలుసున్నవే.
ఇక బీరపొట్టుతో:
ఇక బీరపొట్టుతో కూడా చాలా రకాలు వండుకోవచ్చు. బీరపొట్టు పచ్చడి, పొడికూర, తియ్యగా మెంతులు వేసిన పొడికూర, కొత్తిమీర కలిపి పచ్చడి etc. మా ఇంట్లో బీరకాయ వండితే తప్పక మా అమ్మ పొట్టు విడిగా ఉంచి పైన రాసిన వాటిల్లో ఏదో ఒక రకం తప్పక చేసేది. ఇవన్నీ కూడా అందరికీ తెలిసినవే.
బీరపొట్టుతో పప్పు కూడా చాలా బాగుంటుంది. అదే నేనిప్పుడు రాయబోయేది. మా అమ్మమ్మ కుంపటి మీద చేసిన "బీరపొట్టు పొడి పప్పు" అమ్మావాళ్ళంతా చాలా ఇష్టంగా తినేవారుట.
బీరపొట్టు పప్పుకు కావాల్సిన పదార్ధాలు:
* మూడు,నాలుగు బీరకాయల పొట్టు బాగా మెత్తగా కాకుండా బరుగ్గా గ్రైండ్ చేసుకోవాలి. అంటే పచ్చడికి చేసుకున్నటు పేస్ట్ చేసేయకూడదు.
పొట్టును క్రింద బొమ్మలో చూపినట్లు ముందు సన్నగా ఈనెలు తీసేసి, తరువాత బాగా దళసరిగా బీరపొట్టు తీసి ఉంచాలి.
"బీరపొట్టు" |
* చిన్న టీ గ్లాసుడు కందిపప్పు.
* పచ్చి మిర్చి ఒకటి, ఎండుమిర్చి ఒకటి( ఎక్కువ కారం కావాలంటే ఇంకా వేసుకోవచ్చు)
* పోపు కోసం- ఆవాలు,జీలకర్ర,మినపప్పు, చిటికెడు ఇంగువ, ఓ కర్వేపాకు రొబ్బ.
*రుచికి సరిపడ ఉప్పు, చిటికెడు పసుపు.
* ఒక స్పూన్ నూనె.
విధానం:
పొడిపప్పు:
కందిపప్పును ఓ అరగంట నానబెట్టి ఆ తరువాత మూకుడులో పోపు వేసి, తరువాత పొడి పొడిగా గ్రైండ్ చేసుకున్న బీరపొట్టు ముద్ద, నానబెట్టిన కందిపప్పు అందులో వేసి 11/2 టీ గ్లాస్ నీళ్ళలో నీరు పోసి, చిటికెడు పసుపు వేసి, కందిపప్పు ఉడికేదాకా పొయ్యిమీద ఉంచాలి. పప్పు మరీ మెత్తగా అయిపోకూడదు. ఇది అన్నంలోకి బాగుంటుంది.
ఇది మెత్తటి పప్పు |
మెత్తటి పప్పు:
* కుక్కర్లో కందిపప్పు ఉడికించేసుకోవాలి. అది మెత్తగా మేష్ చేసేసుకోవాలి.
* తరువాత మూకుడులో పోపు పెట్టుకుని, దాంట్లో పొడి పొడిగా గ్రైండ్ చేసుకున్న బీరపొట్టు ముద్ద వేసి, 1/2 టీ గ్లాస్ నీళ్ళలో అదంతా మెత్తబడనివ్వాలి.
* ఆ తరువాత ఉడికిన పప్పు అందులో కలిపి, రెండు మూడు నిమిషాల తరువాత దింపేసుకోవాలి.
* పప్పుతో పాటే బీరపొట్టును కూడా కుక్కర్లో పెట్టవచ్చు కానీ అది ఐడెంటిటీ కోల్పోయి అదేమిటో తెలియకుండా అయిపోతుంది. విడిగా వండటం వల్ల, బీరపొట్టును పొడి పొడిగా గ్రైండ్ చేయటం వల్ల టేస్ట్ కొత్తగా ఉండి బాగుంటుంది.
* ఇది అన్నం లోనే కాక చపాతీల్లోకి కూడా బాగుంటుంది.
*** *** **** ***
అంతర్జాలంలో ఒకసారి నాకు ఇందిర అనే ఒక "బీరకాయ అభిమాని" తన బ్లాగులో రాసిన బోలెడు రకాల బీరకాయ రెసిపీలు కనబడ్డాయి. ఆసక్తి ఉంటే "ఇక్కడ" చూడండి.
***** ***** *****
బీరకాయ లో ఏముంది:
* పీచు పదార్ధం ఎక్కువ ఉంటుంది కాబట్టి తేలిగ్గా జీర్ణం అవుతుంది.
* నీరు శాతం ఎక్కువ ఉంటుంది. క్రొవ్వు, కొలెస్ట్రాల్ రెండూ తక్కువే.
* విటమిన్ సి, జింక్,రిబొఫ్లావిన్, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం మొదలైన మినరల్స్ ఉన్నాయి.
* శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంది కాబట్టి శరీరంలో వేడి ఎక్కువ ఉన్నవారికి మంచిది.
నేను బీరకాయ కి వీరాభిమానిని, ఆ ఇందిరగారి "బీరకాయ అభిమాని" బ్లాగు లింక్ ఇవ్వండి ప్లీజ్.
బీరకాయ అట్టు ఎలా చేస్తారండీ, చెప్పరూ?
ఆ.సౌమ్య: టపాలో "ఇక్కడ" అన్నచోట క్లిక్ చేస్తే లింక్ ఓపెన్ అవుతుందండీ.
బీరకాయ అట్టుకి నేను సూపర్ ఫాన్ ని.
బీరకాయ + మరో కూర అట్లు నెక్స్ట్ టపాలో...:)
ఆ చూసానండీ, బీరకాయ అట్టు త్వరగా...ఎక్కువ రోజులు వైట్ చెయ్యలేము, అంత ఓపిక లేదు, నేను ఆగుదామనుకున్నా నా జిహ్వ చాపల్యం నన్ను కుదురుగా ఉండనివ్వదు, అసలే బీరకాయ పిచ్చి నాకు :D
రెండు మార్కుల ప్రశ్న. బీరకాయ పొట్టు అనగానేమి?
కొసరు మార్కు ప్రశ్న. బీరకాయ అట్టు చేయు విధమెట్టిది?
- ఇట్లు ఇంకో బీరకాయ అభిమాని.
@కొత్త పాళీ : టపాలో ఫోటో చూపాను కదా మాష్టారు..బీరకాయ ఈన్లు ముందు సన్నగా తీసివేసి, తరువాత మందంగా పీల్ చేసుకుంటే ఆ తొక్కునే "బీరపొట్టు" అందురు. (మరొకసారి టపాలోని బొమ్మ చూడవలెను)
బీరకాయ అట్టు తదుపరి టపాలో అతిత్వరలో...:)