బీరకాయ అట్టు మా తాతమ్మగారు(నాన్న అమ్మమ్మగారు) మా చిన్నప్పుడు చేసేవారు. తరిగిన బీరకాయ ముక్కలూ, నానబెట్టిన గుప్పెడు బియ్యాన్ని కలిపి, పచ్చిమిర్చి వేసి రోటిలో రుబ్బి అట్టులా వేసి అన్నంలో (కూర బదులు) నెయ్యి వేసి, ముద్దలు చేసి తినిపించేవారు. ఆ రుచి నాలిక మీదే ఉంటుంది ఇప్పటికీ. వంటలో అంత గొప్ప చెయ్యి ఆవిడది. చాలా ఓర్పుగా, నిదానంగా చేసుకోవాల్సిన అట్లు ఇవి. రుచి మాత్రం అమోఘం. నాకు బాగా ఇష్టం.
పెద్దయ్యాకా తాతమ్మలా బీరకాయ అట్టు చేద్దామని చాలా సార్లు ప్రయత్నించి విఫలమయ్యాను....:) చిన్నప్పుడు తెలీదు మరి ఇలా వంటలు వండుతానని. లేకపోతే నాన్నమ్మ దగ్గర అడిగి రాసుకున్నట్లే తాతమ్మ దగ్గర కూడా చిట్కాలు రాసుకుని ఉండేదాన్ని. ఆవిడ నేను ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడు కాలం చేసారు. ఇక నేను నా సొంత బుర్ర ఉపయోగించి బీరకాయ అట్టుపై ప్రయోగాలు చేసాను. కాస్తంత బియ్యం నానబెట్టి గ్రైండ్ చెయ్యటం, అది మెత్తగా అవక, అట్టు సరిగా రాక తిప్పలు పెట్టేది.
అప్పుడు తెలివిగా బియ్యానికి బదులు బియ్యప్పిండి ని వాడాను. ఈసారి పిండి బానే వచ్చింది కానీ అట్టు విరిగిపోయింది. ఆ తరువాత నేను పరిశోధనలవల్ల తెలుసుకున్నది ఏమిటంటే బీరకాయలో నీరు ఉంటుంది కాబట్టి ముక్కల్ని గ్రైండ్ చేసేప్పుడు నీళ్ళు పొయ్యకూడదు. ముద్ద తయారయ్యాకా కూడా అట్టు లాగ రూపాంతరం చెందటానికి ఒక బైండింగ్ ఏజెంట్ కావాలి. అది బియ్యమే కానఖ్ఖర్లేదు. ఏదో ఒక పిండి పదార్ధం బీరకాయముక్కలను అట్టు రూపంలో బైండ్ చెయ్యటానికి ఉండాలి అంతే.
ఇక అప్పటినుంచీ బియ్యప్పిండికి బదులు నానబెట్టిన పెసరపప్పు లేక గోధుమపిండి లేక జొన్న పిండో లేక శనగపిండో కలిపేసి అట్టు వెయ్యటం మొదలుపెట్టాను...:) కాకపోతే ఏ పీండి అయినా బీరకాయ రుచి పోకుండా తగుమాత్రంలోనే కలపాలి. Just అట్టు విరగకుండా అన్నమాట. so, మీరు కూడా రకరకలు ట్రై చెసి ఏ రుచి బాగుంటే ఆ రుచితో i.e ఆ పిండితో continue అయిపొండి.
* బీరకాయల్ని పైన చూపిన విధంగా సన్నటి చెక్కు తీసి, మిగిలిన తొక్కుతో కలిపి ముక్కలు చేసుకోవాలి.
-- రెండు పచ్చిమిరపకాయలు,
-- కాస్త కొత్తిమీర
-- గుప్పెడు నానబెట్టిన పెసరపప్పు
-- గుప్పెడు బియ్యప్పిండి
ఇలా ఉంటుంది ఆ పిండి --
అప్పుడు ఆ పిండిని పెనం మీద వేసుకోవాలి. ఇలా --
బేబీ బీరకాయట్లు అన్నమాట. చిన్నగా ఉంటాయి, లేట్గా వేగుతాయి, పోటీ వచ్చేవారు కూడా ఎవరూ లేరు కాబట్టి ఒక వాయి అయ్యే లోపూ ముందర వేసిన ప్లేట్ నేనే ఖాళీ చేసేస్తాను...:)
వీటికి చట్నీ ఏమీ అఖ్ఖర్లేదు. అన్నంలో కానీ ఉట్టిగా గాని తినేయచ్చు.
అదీ బీరకాయ అట్టు కథ. బాగుందా ??
సూపర్. ఫొటోలతో సహా పెట్టినందుకు నెనర్లు. ఇప్పుడు నాకు అర్జంటుగా నోరూరిపోతోంది. ఇవ్వాళ్ళ ఇంటికెళ్ళే దార్లో ఇండియన్ షాపులో ఆగి బీరకాయలు పెట్టుకెళ్ళాలి.
ఆహా, వెతకబోయిన తీగ కాలికి దొరకడమంటే ఇదేనేమో. నేను నిన్నటి నుండీ శొధిస్తున్నా ఏమీ నానబెట్టక్కర్లేకుండా వేసే బీరకాయ అట్టుకోసం.మీరన్నట్లే బియ్యప్పిండీ కలిపి వెయ్యడం,అట్టు విరగడం కూడా అయ్యింది.
ముక్కలు గ్రైండ్ చేసేటప్పుడు నీళ్ళు పోసాను నేను.
మీ పద్ధతి లో ట్రై చేస్తాను.స్టెప్ బై స్టెప్ పరిచయం చేసారు అట్టు ఎలా వెయ్యాలో.థాంక్యూ.
మామూలుగా వంటలు చెప్పే సైట్లు (నలభీమ మినహాయించి) దాదాపుగా ఒకటే కంటెంటు తిరగా బొర్లా వేసి వుంటాయి అనిపిస్తుంది నాకు . కానీ మీ ఈ సైటు మాత్రం నాకు బాగా నచ్చింది. మీరు రాసేవన్నీ నాకు తెలియనివే.మొన్న అరటి దూట పెరుగు పచ్చడి చేసాను. మీ పాఠోళీ లాగా అమ్మ శెనగపిండితో పచ్చి మిరపకాయల కూర చేస్తుంది.రెండూ రుచిలో ఒకేలా ఉంటాయా అని అనుమానం. ఐనా అదీ ట్రై చేసి చూస్తాను. ఈ అట్టు కూడా చూచి మీకు చెబుతాను.కొత్త వంటలు నేర్పుతున్నందుకు మీకు తాంక్స్.
నాది కూడా సునీత గారి మాటే! మీరు కొత్తరకమైన (మనం మిస్సయిపోతున్న పాతకాలం వంటలు) రెసిపీలు చెపుతున్నారు. Thanks a lot! ఈసారి బీరకాయలు దొరికినప్పుడు తప్పకుండా ట్రై చేస్తాను. :)
నా కామెంటు ఏదీ?
నిన్న కామెంటు రాసాను, కనిపించట్లేదు?????????
@ఆ.సౌమ్య: నిన్న కామెంటేమీ రాలేదండీ మరి..??
బీరకాయ అట్టు ఈరోజు చేసానండి తృష్ణగారు. శెనగపిండి వేసి చేసాను. మొదట పిండి పల్చగా ఉండి అట్టు సరిగ్గా రాలేదు. దానితో కొంచెం గోధుమ పిండి కూడా కలిపి చేసాను. బ్రహ్మాండంగా వచ్చాయి. అన్నం, నెయ్యి, బీరకాయ అట్టు, దోసకాయ పచ్చడి కాంబినేషన్ బ్రహ్మాండం. ఇప్పుడింక నిద్ర వస్తుంటే ఆపుకుని ముందు కామెంట్ పోస్ట్ చేస్తున్నాను. :) థాంక్స్ ఫర్ సచ్ ఎ నైస్ రెసిపీ.
@padma: Thatz great. Thank you too..:)