పేలాల వడియాలు మొదటిసారి మా వదిన తెచ్చినప్పుడు తిన్నాను. రుచి అమోఘం. పేలాలతో చేస్తారు. మా వదినావాళ్ళ అమ్మమ్మగారు అనకాపల్లిలో ఉంటారు. ఆవిడ ఒకట్రెండుసార్లు పేలాల వడియాలు పంపించారు. చాలా నచ్చాయి మాకు. మరో రెండుసార్లు ఎవరో చేసి అమ్ముతున్నారంటే తెప్పించుకున్నాం. ఎన్నిసార్లని తెప్పించుకుంటాం? ఎలా చేయాలో తెలిసేసుకుని చేసేస్తే ఒ పనైపోతుంది కదా అని అడిగేసి మొత్తానికి ఈ ఏడు పెట్టేసాను. బాగా వచ్చాయి. ఎలా చేయాలో చెప్పేస్తాను. ఆసక్తి ఉన్నవాళ్ళు పెట్టేసుకోండి మరి.
పేలాలంటే కొంతమంది బజార్లో మరమరాలు ఇచ్చేస్తారు. మొదట నేను కూడా వాటితోనే ఒడియాలు పెట్టేసి వేయించేసరికీ అవి విరవటానికి వీల్లేకుండా వచ్చాయి. మళ్ళీ సరిగ్గా కనుక్కుని సరిగ్గా అడిగి కొని మళ్ళి పెట్టాను. అప్పుడు బాగా వచ్చాయి..:)
పేలాలు క్రింద ఫోటోలోలాగ ఉంటాయి.(తెలియనివాళ్ళకు)
ఎలా చేయాలంటే:
* అరకిలో పేలాలు తీసుకుని ఒడ్లు ఏరేసి శుభ్రం చేసుకోవాలి. నేను తడిపాకా ఆ సంగతి గ్రహించాను. అందువల్ల సరిగ్గా ఏరలేకపోయా..:)
* కాసిని నీళ్ళు తీసుకుని కాస్త కాస్త చప్పున పేలాలన్నీ ఒకసారి ముంచి తీసేసి, గట్టిగా పిండి పక్కనపెట్టుకోవాలి.
* అర కిలో పేలాలకి ఒక గ్లాసు సగ్గుబియ్యం తీసుకుని రాత్రి నానబెట్టి పొద్దున్నే వాడుకోవచ్చు. లేకపోతే అప్పటికప్పుడు రెండుగ్లాసులు నీళ్ళలో సగ్గుబియ్యాన్ని ఉడకబెట్టాలి.
* మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి, కాస్తంత జీలకర్ర కలిపి గ్రైండ్ చేసుకోవాలి.
*కాసిని నువ్వులు కూడా తీసుకోవాలి.
* ఇప్పుడు నీటిలో పిండేసి ఉంచిన పేలాల ముద్ద, ఉడికిన సగ్గుబియ్యం, తగినంత ఉప్పు, రుబ్బిన మిర్చి-జీలకర్ర పేస్ట్, నువ్వులు అన్నీ కలిపి బాగా కలుపుకోవాలి. నాకులా చేత్తో కలిపి తర్వాత మంట మంట అని గోలపెట్టకుండా చక్కగా ఒక గరిటేతో మొత్తం బాగా కలుపుకోండి.
ఆ ముద్ద క్రింది ఫోటోలోలాగ ఉంటుంది. ఫోటో సరిగ్గా రాలేదు..:(
రెండు ఎండలకే బాగా ఎండిపోయాయి వడియాలు. అవి వేయించుకుని తింటే... 'ఆహా ఏమి రుచి' అనక మానరు !!