ఇందాకా పాప ఆకలి..అని గొడవ. ఇంట్లో ఉన్నవి వద్దు ఏదన్నా కొత్తది కావాలి అని పేచీ. బిస్కెట్లు తప్ప పాపకు బయట జంక్ ఫుడ్స్ అవీ కొనము మేము. ఏదన్నా కావాలంటే వీలైనంతలో ఇంట్లోనే చేస్తూంటాను. సరే ఇందాకా ఏమున్నాయి చెయ్యటానికి అని చూస్తే రాత్రి చపాతీలోకి కూర చేద్దామని పొద్దున్నే నానబెట్టిన సోయ గింజలు కనబడ్డాయి. వాటికి ఏం కలపాలి అని ఆలోచిస్తుంటే ఫ్రిజ్లో మొలకెత్తిన పెసలు కనబడ్డాయి.(ఇవి రోజూ కాసిని తినటానికని రెండ్రోజులకొకసారి మొలకెత్తించి ఉంచుతూంటాను).
ఇదివరకూ నేను బొబ్బర్లు, పెసలు, సోయా, మొక్కజొన్న అన్నీ కలిపి నానబెట్టి రుబ్బి వడలు చేస్తూండేదాన్ని. ప్రస్తుతం ఉన్న పదార్ధాలతో వడలు చేద్దామని మొదలెట్టాను.
నానబెట్టిన సోయా గింజలు |
ఏం కలిపానంటే:
ఒక కప్పుడు నానబెట్టిన సోయా గింజలు
అర కప్పు మొలకెత్తిన పెసలు
రెండంగుళాల అల్లం ముక్క
రెండు పచ్చిమిరపకాయలు
కాసిని ఫ్రెష్ పుదినా ఆకులు(ఫ్రెష్ ఎందుకంటే అవి మా గోడ మీది కుండీలోవి...:))
కలిపి గ్రైండ్ చేసేసాను.
అందులో --
ఒక చెంచా బియ్యప్పిండి
ఒక చెంచా కార్న్ ఫ్లోర్
చిన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కలు
తగినంత ఉప్పు
వేసి మొత్తం ఓసారి మళ్ళీ కలిపేసి ఫ్రై చేసేసా. వేగాకా టిష్యు పేపర్ మీద వేసేసా. ఇంకా... పాప, నేనూ కలిసి తనకి కూడా ఉంచకుండా ప్లేట్ ఖాళీ చేసేసాం...:)
ఆరోగ్యానికి ఎంతో మంచిదైన "సోయా"ను నేను ఎక్కువగానే వాడతాను. సోయా గ్రాన్యూల్స్ వెచ్చని ఉప్పునీటిలో నానబెట్టి పిండేసి అట్ల మీద, కూరల్లోనూ వేయచ్చు, సోయా పిండి చపాతీ పిండిలో ఓ గుప్పెడు కలిపేసుకోవచ్చు, కూరల్లో పన్నీర్ బదులు "టోఫు"(సోయాపాలతో చేసిన పన్నీర్) కూడా అప్పుడప్పుడు వాడుతూంటాను. సోయాలోని పోషకాల కోసం, మరిన్ని ఆరోగ్యకరమైన వివరాల కోసం ఇక్కడ చూడండి.
Post a Comment