రెండ్రోజుల క్రితం మా రాత్రి అన్నం మెనూ ఇది.
మా పెద్దత్తగారు కాకినాడ నుంచి పంపించారు. వాటిని చూడగానే నోరూరి ఇక ఆ పూటకు చపాతీలకు స్వస్తి చెప్పి(రాత్రి పూట మేం రోజూ చపాతీలే) దంపుడు బియ్యం కాకుండా వైట్ రైస్ వండేసి, వేడి వేడి అన్నంలో ఆవకాయ, కందిపొడి విత్ "ఇంట్లో చేసిన నెయ్యి" వేసుకుని సుభ్భరంగా తినేసాం. ఒక్కరోజుకు డైటింగ్ కు టాటా చెప్పచ్చు...:)
ఆవకాయలోనూ, కందిపొడిలోనూ నూనె వేసుకుని తినటం మామూలే. నెయ్యి వేసుకుని కూడా తింటే భలే ఉంటుంది. ఇక ముద్దపప్పు నాకోసం కాదు శ్రీవారి కోసం. ముద్దపప్పు + ఆవకాయ వాళ్ళింట్లో కాంబినేషన్. మరి మీరు కూడా కందిపొడి చేసేసుకుంటారా?
కందిపొడి:
కందిపప్పు : ఒక గ్లాసు
పెసరపప్పు : అర గ్లాసు
శెనగపప్పు : పావు గ్లాసు
పుట్నాలపప్పు : పావు గ్లాసు
చారెడు మినప్పప్పు (ఇది వేయకపోయినా పర్వాలేదు)
మీరు తినే కారానికి సరిపడా ఎండు మిరపకాయలు
తగినంత ఉప్పు
* ముందు పప్పులన్నీ కాసేపు ఎండబెట్టుకోవాలి. లేకపోయినా పర్వలేదు.
* తర్వాత ముందుగా కందిపప్పు దోరగా వేయించుకోవాలి.
* ఆ తరువాత మిగిలిన పప్పులు, మిరపకాయలు కలిపి మాడకుండా వేయించుకోవాలి.
* గుల్ల శనగపప్పు(పుట్నాలపప్పు) వేయించఖ్ఖర్లేదు. గ్రైండ్ చేసేప్పుడు కలిపి గ్రైండ్ చేస్తే సరి.
* వేయించిన అన్ని పప్పులు చల్లారాకా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
* గ్రైండ్ చేసాక ఉప్పు చివరలో కలుపుకోవాలి.
కందిపొడి రుచి పప్పులు సరిగ్గా మాడకుండా వేయించుకోవటం లోనే ఉంటుంది..:)
"మా పెద్దత్తగారు కాకినాడ నుంచి పంపించారు."
కా.......కి......నా.....డ ఈ పేరుకి తోడు పైన మీరు చెప్పిన మెనూ ఏం చెప్పమంటారు నా బాధ.
నేనొప్పుకోను..ఒప్పుకోను. ఒప్పుకోనంటే ఒప్పుకోనంతే. తృష్ణ గారూ ఇది మీకు భావ్యమా? న్యాయమా? తింటే తిన్నారు. ఇలా ఫోటో పెట్టి మమ్మల్ని ఊరించడం ఏమన్నా బావుందా? అహ అసలు ఇది పద్ధతేనా? అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇంకో సారి ఇలాంటి బ్రహ్మాండమైన అచ్చతెలుగు కాంబినేషన్ల ఫోటోలు పెడితే మీ మీద బ్లాగు హింస (గృహ హింస కి లేటెస్ట్ వెర్షన్) కేసు పెడతానని సవినయం గా హెచ్చరిస్తున్నాను.
వా(... :((((((((
@shankar:అయితే ఇంకోటి చెప్తాను...కాజాలు కూడా వచ్చాయి..రెండే రోజుల్లో పెట్టే ఖాళీ చేసేసాం !! ఆ ఫోటో పెడితే మీరు వా...అంటారనే పెట్టలే...అచ్చికచ్చికా...!!
గుర్ర్ ర్ర్ ర్ర్ ర్ర్ ర్ర్ ర్ర్ ......
ఇది శాడిజానికి పరాకాష్ట. నన్ను ఇంత ఏడిపించిన పాపం ఊరికే పోదండీ. ఏదో ఒక రోజు మీరు వరసగా నాలుగు షోలు బాలకృష్ణ సినిమాలు చూడు గాక. ఆ దెబ్బ నుండి కోలుకోడానికి మీకు కనీసం నాలుగైదు వారాలు పట్టుగాక. ఇదే నా భీషణ శాపం (నార్మల్ గా భీషణ ప్రతిజ్ఞ అంటారు పవర్ఫుల్ గా ఉంటుందని భీషణ శాపం అన్నా). శాప విముక్తి కావాలంటే నాకిష్టమయిన మెనూ చెప్తున్నాను. సావధానంగా వినండి.
కందాబచ్చలి కూర
పనసపొట్టు కూర
మామిడి కాయ పప్పు
సాంబారు(చిన్న ఉల్లిపాయలు ఎక్కువగా వేసి)
ఆలూ ఫ్రై
బొబ్బట్లు (ఇది నాకు ప్రాణం)
(భోజనం చేస్తున్నప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో M.S సుబ్బలక్ష్మి అన్నమాచార్య కీర్తనలు)
ఇవి తిని. విని ఓ కునుకేసి లేచాక వేడి వేడి పకోడీలు, దాంతో పాటు గ్రీన్ టీ
(రెడీ చేస్తానంటే చెప్పండి నేను, స్వాతి మీకు శాపవిమోచనం ఇచ్చేందుకు అంగీకరిస్తాము)
చాలా...?? ఇంకేమన్నా మర్చిపోయారేమో ఆలోచించుకుని చెప్పండి. లాక్ చేసేస్తే మళ్ళీ తెరవం మెనూ !! (ఇందులో నాకు రానివేమీ లేవు. పర్వాలేదు..:))
ముద్ద పప్పు గట్టిగ లేదు(గట్టి గ ఉన్న పప్పులో నెయ్యి వేసి పలుచగా చేసుకొని తినాలి). ఆవకాయలో ముక్క పెద్దగా లేదు. (పెద్దవకాయ ముందు శాంపిల్ కి చిన్న ఆవకాయ పెడతారు, సీజన్లో ముందు...)
:-)
@సాధారణపౌరుడు: ప్రశ్నలకు సమాధానం మీరే చెప్పేసారుగా ..:)
Thanks for the visit.
హ్మ్! అది ముద్దపప్పు కాదుగా......హిహ్హిహిహి...ముద్దపప్పంటే బాగా పప్పుగుత్తితో ఎనపాలి..అప్పుడు గట్టిగా, బేడలు లేకుండా ఒకటే మాస్ లా తయారైద్ది...దాంటో పూసల నెయ్యి, కొత్తావకాయ వేసుకుని కలుపుకు తింటే ఉంటదీ....అదుర్సే అదుర్సు....ః)
@kautilya:ఇంట్లోవాళ్ళు ఎలా తింటారో అలా పప్పుని చెయ్యటం ఇల్లాలి కర్తవ్యము. point to be noted...:)
/భోజనం చేస్తున్నప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో అన్నమాచార్య కీర్తనలు/
ఏటి జన్మమిది హా! ఓ రామా!
అనే త్యాగరాజు కృతైనా బాగానే వుంటుందనుకుంటా. :) :P
మెనూ అదిరిందండీ..కొత్త ఆవకాయ+ముద్దపప్పు కొత్తావకాయ+కందిపొడి కొత్తావకాయ+వేయించిన శనగపప్పు పొడి ఈ కాంబినేషన్స్ ట్రై చెయ్యని తెలుగువారు ఉండరేమో....బాక్గ్రౌండ్లో ఎం ఎస్ అన్నమాచార్య కీర్తనలు..ఇక్కడ ఇంకా ఆహా నా రాజా అనెయ్యాలి....త్రుష్ణ గారు ఎంత ఫూడ్ రెస్త్రిక్షన్స్ ఉన్నా ఎండకాలంలో ఎప్పుడైనా ఒకసారి ఇవి తింటే ఏమికాదు..
i tried kandi podi also also with the sambar podi.
after tasting kandipodi my kid daily asking at dinner time "can have that tasty powder".
Thank you thrushna garu.
(i already told the same in your buzz but felt it will be nice to say here.
Buzz Sneha sri.