skip to main | skip to sidebar

Pages

  • Home

రుచి...the temptation

"The best way to a man's heart is through his stomach."

గోధుమరవ్వ పొంగలి

7:52 AM | Publish by తృష్ణ




గోధుమరవ్వ ఉప్మా తిని తిని బోర్ కొట్టేస్తే ఇలా రవ్వ పొంగలి కూడా చేసుకోవచ్చు. మామూలుగా మనం బియ్యంతో చేసుకునే కట్ పొంగలి లాగానే ఇదీ కూడా.


కావాల్సినవి:


ఒక కప్పు(150gms) గోధుమరవ్వ
అర కప్పు పెసరపప్పు
నాలుగు పెద్ద చెంచాల నెయ్యి
ఐదారు జీడిపప్పు పలుకులు
రెండు పచ్చిమిరపకాయలు
రెండు ఎండుమిరపకాయలు
అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు
బరగ్గా పొడి చేసిన పది మిరియాలు
కాస్తంత కర్వేపాకు, తగినంత ఉప్పు


తయారీ:


* ముందుగా నెయ్యి లో ఆవాలు,జీలకర్ర, మిరియాలు, కర్వేపాకు మిర్చి వేసి పోపు వేయించాలి. చివరలో జీడిపప్పు వెయ్యాలి.
* తర్వాత పెసరపప్పు వేసి ఎర్రగా వేగనివాలి. పెసరపప్పు వెయ్యకుండా కూడా పొపులో గోధుమరవ్వ వేయించి పొంగలి చేసేసుకోవచ్చు. పైన ఫోటొలో పొంగలి లో పెసరపప్పు వెయ్యలేదు.
* తర్వాత రవ్వ కూడా వేసి రెండు నిమిషాలు వేగాకా కప్పు రవ్వకు మూడు కప్పుల నీళ్ళు పోసి, ఉప్పు వేసి కుక్కర్(2 ltrs or 3 ltrs cooker) మూత పెట్టేయాలి.
* రెండు విజిల్స్ రాగానే కుక్కర్ ఆపేయాలి. రవ్వ పొంగలి తయార్ !!




Labels: tiffins 5 comments

వంకాయ - పనసగింజల కూర

5:16 PM | Publish by తృష్ణ


పనస తొనలు తినేసాకా వాటి లోపల గింజల్ని పాడేయకుండా కూరలు చెయ్యటానికి వాడతారు. వీటితో ఏ రకమైన కూర చేసినా ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఎండబెట్టి తొక్కు తీసి, వాటిని వేయించుకుని తింటారు. పనసగింజల వేపుడు అన్నమాట. ఇలా కాకుండా పనసగింజలు ఉడకబెట్టి బంగాళా దుంపతోనూ లేక వంకాయతో కలిపి వండుతారు. ఇవాళ వంకాయ పనసగింజల కూర ఎలా చెయ్యాలో చెప్తానూ..

కావాల్సినవి:
* పావుకేజీ వంకాయలు
* పది,పన్నెండు పనస గింజలు
* చిన్న నిమ్మకాయంత చింతపండు నానబెట్టి తీసిన రసం
* పోపుకి ఆవాలు,శనగపప్పు,మినపప్పు,జీలకర్ర,కర్వేపాకు,2ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి
* ఉప్పు తగినంత , 2 స్పూన్స్ ఆయిల్

తయారీ:



* ముందు పనసగింజల తొక్కు తీసి, ఒకో గింజ నాలుగు ముక్కలు చేసి కాస్త ఉప్పు వేసి రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టాలి.


* తర్వాత వంకాయ ముక్కలు కూడా ఉప్పు వేసి మరీ మెత్తగా కాకుండా ఉడకబెట్టాలి.


* తర్వాత మూకుడులో రెండు చెంచాల నూనె వేసి పైన చెప్పిన పోపు పదార్ధాలతో పోపు వేయించాలి.
* పోపు వేగాకా ఉడికిన పనసగింజలు, వంకాయముక్కలు వేసి, అందులో తీసిపెట్టుకున్న చింతపండు రసం, చిటికెడు పసుపు వెయ్యాలి. ముక్కలు ఉడికేప్పుడు వేసుకున్న ఉప్పు సరిపోకపోతే మరికాస్త ఉప్పు వేసుకుని కూర దగ్గర పడ్డాకా దింపేసుకోవాలి. వంకాయ - పనసగింజల కూర రెడీ !
* ఈ కూర అన్నంలోకి బావుంటుంది.


* ఇదే విధంగా వంకాయ బదులు బంగాళా దుంపలు పనసగింజలతో కలిపి కూర చేయచ్చు. చింతపండు అక్కర్లేదు.


Labels: కూరలు 1 comments

ఆవకాయలు మాగాయలు - 2

6:16 PM | Publish by తృష్ణ



నిన్న కొన్నిరకాల ఆవకాయలు గురించి రాసాను కదా.. ఇవాళ మూడు మాగాయ రకాలు చెప్పుకుందాం. చిన్న సలహా ఏంటంటే ఆవకాయకు, మాగాయకు కూడా కాయ కొనేప్పుడు పీచు ఉన్న మావిడికాయలు ఎన్నుకోవాలి. అప్పుడవి ఏడాదంతా నిలవ ఉంటాయి.
తురుముమాగాయ:



మామిడికాయ తురిమేసుకుని ఒక ఎండలో పెట్టాలి. పొద్దున్న పెట్టి సాయంత్రం తెచ్చేసుకోవచ్చు.



మామిడికాయలు ౩
100gms మెంతులు,
75gms ఆవాలు
150gms కారం
150gms ఉప్పు
1/4kg నూపప్పు నూనె



తయారీ:



* 1/4kg నునె కాగాకా అందులో చింతగింజంత ఇంగువ వేసి కాచి ఉంచాలి. ఇంగువ వెయ్యగానే బుడగలు వస్తాయి. అప్పుడు దింపెయ్యాలి.
* ఆవాలు,మెంతులు రెండూ విడివిడిగా పొడిమూకుడులో వేయించుకోవాలి. ఆవాలు నొక్కితే పొడుం అయ్యేలా వేయించాలి. మెంతులు ఎర్రగా వేగి కమ్మటి వాసన రావాలి. వీటిని విడివిడిగా గ్రైండ్ చేసుకుని ఉంచుకోవాలి.



* తురిమిన కోరు తెచ్చుకున్నాకా ముందుగా టీ గ్లాస్ ఉప్పు వేసి కలుపుకోవాలి.
* తర్వాత అందులో కారం, ఆ తరువాత వేయించి పొడి చేసుకున్న మెంతిపొడి ఆవ పొడి, ఇంగువ నూనె వేసి బాగా కలపాలి.
* మూడోరోజు మరి కాస్త (తగినంత) నూనె వేసి మళ్ళీ బాగా కలిపి జాడీలో దాచుకోవటమే.
---------------------------------------
మెంతికాయ:

మామిడికాయలు 6
ఉప్పు 1/4kg
కారం 1/4kg
100gms మెంతులు
40gms ఆవాలు
1/2kg నూపప్పు నూనె
ఒక చెంచా పసుపు

తయారీ:

* మావిడి ముక్కలు సన్నగా పొడుగ్గా తరిగి ఒకరోజు లేక ఒక పూట ఎండబెట్టాలి.
* 1/4kg నునె కాగాకా అందులో చింతగింజంత ఇంగువ వేసి కాచి ఉంచాలి. ఇంగువ వెయ్యగానే బుడగలు వస్తాయి. అప్పుడు దింపెయ్యాలి.
* ఆవాలు,మెంతులు రెండూ విడివిడిగా పొడిమూకుడులో వేయించుకోవాలి. ఆవాలు నొక్కితే పొడుం అయ్యేలా వేయించాలి. మెంతులు ఎర్రగా వేగి కమ్మటి వాసన రావాలి. వీటిని విడివిడిగా గ్రైండ్ చేసుకుని ఉంచుకోవాలి.
* కారంలో కాగిన నూనె కాస్త వేసి కలిపి తర్వాత ఉప్పు వేసి కలపాలి. నూనె చల్లారిన తర్వాత ఆవపిండి, మెంతిపిండి కలపాలి.
* తర్వాత ఎండిన ముక్కలు వేసి కలపాలి. తర్వాత పసుపు కూడా అందులో కలపాలి.
* మూడవ రోజున ఊట రాకపోతే కాస్త ఇంగువ నూనె కాచి చల్లార్చి ఊరగాయలో కలపాలి.
---------------------------------------
ఎండు మాగాయ:

మామిడికాయలు 4
ఉప్పు 1/4kg
కారం 1/4kg
150gms మెంతులు
150gms ఆవాలు
1 spoon పసుపు
450/500gms నూపప్పు నూనె

తయారీ:

* మామిడికాయలను తొక్కు తీసి సన్నగా పల్చగా ఉండేలా ముక్కలు పీలర్ తో పీల్ చేయాలి.
* ముక్కల్లో 1/4kg ఉప్పు, ఒక చెంచా పసుపు కలిపి జాడీలో పెట్టాలి.
* రెండవరోజు బాగా కలపాలి. మూడవరోజు జాడీలో కాస్త ఊట కనిపిస్తుంది.
* మూడవరోజు ముక్కలు మాత్రం తీసి ఎండలో పెట్టాలి. సాయంత్రం మళ్ళీ జాడిలో ఉన్న ఊటలో ముక్కలు వేసేయాలి.
* అలా ముక్కలని రెండు మూడు రోజులపాటు ముక్క విరిగేలా ఎండేదాకా ఎండబెట్టాలి. చివరిరోజు ఊట కూడా ముక్కలతో పాటూ విడిగా ఎండలో పెట్టాలి.
* ఎండబెట్టడానికి మూడురోజులు సరిపోతాయి.
* మూడవరోజు 1/4kg కారం వేసి ముక్కలు, ఊట అన్నీ కలిపాలి.
* తర్వాత ఆవాలు,మెంతులు విడివిడిగా వేయించి , విడివిడిగానే పొడి చేసుకుని ఊరగాయలో కలపాలి.
* చింతగింజంత ఇంగువ వేసి 1/4kg పప్పు నూనె కాచి, చల్లార్చి ఊరగాయలో వెయ్యాలి.
* జాడీలో పెట్టిన మూడవరోజు కాస్త ఇంగువ వేసి 200gms నూనె కాచి చల్లార్చి ఊరగాయలో కలపాలి.



Labels: ఊరగాయలు-రకాలు 4 comments

ఆవకాయలు మాగాయలు - 1

4:41 PM | Publish by తృష్ణ




రకరకాల ఆవకాయలు మాగాయల list గతంలో "మామ్మయ్య - ఊరగాయలు !" టపాలో రాసాను. తర్వాత క్రితం ఏడాది ఊరగాయలు పెట్టాకా "ఊరగాయ వైరాగ్యం" అని కూడా రాసానా... పది కాయలకే నేనిలా అనుకుంటే వందల లెఖ్ఖలో ఆవకాయలు, మాగాయలు పెట్టిన అమ్మమ్మలూ, నాన్నమ్మలూ ఎలా పెట్టేవారో, పెట్టాకా ఏం అనుకునేవారో అనుకుంటూ ఉంటాను ! నేనైతే ఈసారి మూడే మూడు రకాలు పెట్టాను. వెల్లుల్లి ఆవకాయ, తురుము మాగాయ, మెంతికాయ.



ఈసారి కొన్ని రకాల ఆవకాయలు, మాగాయలు రకాలు ఈ బ్లాగులో రాద్దామని. ఈ టపా అయితే ప్రత్యేకంగా బ్లాగ్మిత్రులు సునీత గారి కోసం ! ఇంకా ఊరగాయలు పెట్టుకోనివాళ్లెవరన్నా ఉంటే ఈ రకాలు ట్రైచేయండి..


1) పెసర ఆవకాయ:

పచ్చిపెసరపప్పు గ్రైండ్ చేసి, జల్లించాకా వచ్చిన మెత్తటి పచ్చి పెసరపిండితో ఈ ఆవకాయ పెడతారు. ఇందులో ఆవపిండి కలపరు. పెసరపిండి ఉంటుంది కాబట్టి కమ్మగా ఉంటుందీ ఆవకాయ.

పాళ్ళు:
5 మావిడికాయలు (మామూలు ఆవకాయకు లాగానే కొట్టించుకోవాలి)
1/4kg కారం
1/4kg ఉప్పు (రాళ్ళ ఉప్పు మెత్తగా పౌడర్ చేసినది అమ్ముతారు. అది వాడితే మంచిది)
300gms జల్లించిన పచ్చి పెసరపిండి
అరచెంచా పసుపు
1/2 kg నూపప్పు నూనె
తయారీ:

* పచ్చిపెసరపప్పు గ్రైండ్ చేసి, జల్లించాకా వచ్చిన మెత్తటి పెసరపిండి కొలిచి పక్కన పెట్టుకోవాలి.
* ఉప్పు ఉండలు లేకుండా చూసుకుంటూ ముందు పొడులన్నీ బాగా కలపాలి.
* తర్వాత పసుపు, 1/4kgనూనె వేసి కలిపి, ముక్కలు కూడా వేసి కలపాలి.
* ఆవకాయ కలిపిన మూడవ రోజు ఊరగాయ మళ్ళీ బాగా కలిపి మిగిలిన 1/4kg నూనె వేసి కలిపి జాడీలోనో సీసాలోనో పెట్టేసుకోవటమే.

***********************************************
2)అల్లం ఆవకాయ:
ఇందులో కూడా ఆవ బదులు అల్లంవెల్లుల్లి ముద్ద కలుపుకోవాలి.






పాళ్ళు:
5 మావిడికాయలు (మామూలు ఆవకాయకు లాగానే కొట్టించుకోవాలి)
1/4kg కారం
(రాళ్ళ ఉప్పు మెత్తగా పౌడర్ చేసినది అమ్ముతారు. అది వాడితే మంచిది)
1/4kg అల్లంవెల్లుల్లి ముద్ద ( ఫ్రెష్ గా ఇంట్లోనే గ్రైండ్ చేసుకుంటే మంచిది)
అరచెంచా పసుపు
1/2 kg నూపప్పు నూనె


తయారీ:

* ముందుగా అల్లం,వెల్లుల్లి పొట్టు తీసుకుని, మెత్తగా ముద్దలా గ్రైండ్ చేసుకోవాలి.
* పావుకేజీ నూనె మూకుడులో పోసి, అది వేగాకా ఓ చెంచాడు ఆవాలు వేసి వెగనివ్వాలి.
*తర్వాత గ్రైండ్ చేసిన అల్లంవెల్లుల్లి ముద్ద వేసి మాడకుండా వేగనివ్వాలి.
* అల్లంవెల్లుల్లి ముద్ద వేగాకా స్టౌ ఆపేసి అందులో 1/4kg కారం, 1/4kg ఉప్పు, అర చెంచా పసుపు అందులో కలపాలి.
* చల్లారాకా మామిడి ముక్కలు వేసి బాగాకలుపుకోవాలి.
* ఆవకాయ కలిపిన మూడవ రోజు ఊరగాయ మళ్ళీ బాగా కలిపి మిగిలిన 1/4kg నూనె వేసి కలిపి జాడీలోనో సీసాలోనో పెట్టేసుకోవాలి.
**********************************

3)పులిహోర ఆవకాయ:

కావాల్సినవి:

ఐదు మావిడికాయలు ఆవకాయ కోసం కొట్టినట్లుగా కాకుండా బాగా చిన్నగా కొట్టించుకోవాలి.
1/4kg కారం
1/4kg ఉప్పు (రాళ్ళ ఉప్పు మెత్తగా పౌడర్ చేసినది అమ్ముతారు. అది వాడితే మంచిది)
1/4kg ఆవపిండి
అరచెంచా పసుపు
1/2 kg నూపప్పు నూనె
తయారీ:

* ఆవకాయకు కలుపుకున్నట్లే ముందుగా పొడులన్నీ కలిపేసి, తర్వాత 1/4kg నూనె, ముక్కలు వేసి కలిపేయాలి.
* మూడవ రోజున యధాప్రకారం మిగిలిన 1/4kg నూనె వేసి కలిపేసి జాడిలో పెట్టేయాలి.

తర్వాత "పులిహోర ఆవకాయ" తినాలనిపించినప్పుడు ఏం చెయ్యాలంటే:

* ఓ 100gms ఆవకాయ బయటకు తీసుకోవాలి.
* 100gms నూపప్పు పొడిగా దోరగా వేయించి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
* ముకుడులో ఆవాలు,శనగపప్పు, కర్వేపాకు, చిటికెడు ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి.
* గ్రైండ్ చేసిన మెత్తటి నూపప్పు, పోపు తీసిపెట్టుకున్న ఆవకాయలో బాగా కలిపేస్తే పులిహోర ఆవకాయ రెడీ.

పెసరావకాయ పెట్టుకున్నట్లు నూపప్పు పొడెం ఆవకాయ కలిపేసుకోవచ్చు. కానీ అప్పటికప్పుడు పోపు పెట్టుకున్న ఫ్రెష్నెస్ దానికి ఉండదు. అందుకని పులిహోర ఆవకాయ అంటే ఇలా అప్పటికప్పుడూ చేసుకోవటమే ఉత్తమం.


ఈవాళ్టికి ఇవి చాలు. మళ్ళీ రేపు మరికొన్ని రకాల ఊరగాయలతో వస్తానేం !!



Labels: ఊరగాయలు-రకాలు 3 comments

పచ్చి బొప్పాయి(raw papaya) కూర

7:56 PM | Publish by తృష్ణ






ఇదివరకు ఓసారి ఈ కూర తృష్ణ లో రాసాను. ఒక్క కొబ్బరి మాత్రమే వేసి చేసాను అప్పుడు. ఇవాళ ఇదే కూరలో కొబ్బరిలో అల్లం, పచ్చిమిర్చి కలిపి గ్రైండ్ చేసి వండాను. బాగా వచ్చింది.




తయారీ:


* పచ్చి బొప్పాసి కాయ మధ్యలో గింజలు తీసేసి తురుముకోవాలి.


* చిన్న అల్లం ముక్క, నాలుగు పచ్చిమిర్చి,కొబ్బరి ముక్కలు కలిపి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 


* కుక్కర్లో అయితే కొద్దిగా (అంటే తురుము క్వాంటిటిలో సగం నీళ్ళు) పోసి ఒక్క కూత రాగానే ఆపేసుకుని తడంతా పోయేలా వడబోసేసుకోవాలి. తక్కువ నీళ్ళు పోస్తాం కాబట్టి వడబోసినప్పుడు కాస్తంత మాత్రమే నీళ్ళు పోతాయి.





* శనగపప్పు,మినపప్పు,ఆవాలు,జీలకర్ర, కర్వేపాకు,ఒక ఎండు మిర్చి పోపు పెట్టుకుని, అందులో గ్రైడ్ చేసుకున్న కొబ్బరికోరు వేసి కాస్త వేగాకా ఉడికించి ఉంచుకున్న బొప్పాయి తురుము వేసి బాగా కలపాలి.


* ఈ కూర అన్నంలో కన్నా చెపాతీల్లోకి బాగుంటుంది.

Labels: experiments, కూరలు 0 comments
« Newer Posts Older Posts »
"Health is Wealth."

ఇక్కడ వెతకండి..

'రుచి' చూసినవారు

పంచుకున్న రుచులు

  • ►  2015 (3)
    • ►  March (3)
  • ►  2014 (24)
    • ►  December (2)
    • ►  November (2)
    • ►  September (1)
    • ►  July (2)
    • ►  June (4)
    • ►  May (3)
    • ►  April (2)
    • ►  March (7)
    • ►  January (1)
  • ►  2013 (32)
    • ►  December (3)
    • ►  September (4)
    • ►  August (2)
    • ►  July (3)
    • ►  May (1)
    • ►  April (8)
    • ►  March (3)
    • ►  February (1)
    • ►  January (7)
  • ▼  2012 (26)
    • ►  December (1)
    • ►  November (3)
    • ►  October (5)
    • ►  June (4)
    • ▼  May (5)
      • గోధుమరవ్వ పొంగలి
      • వంకాయ - పనసగింజల కూర
      • ఆవకాయలు మాగాయలు - 2
      • ఆవకాయలు మాగాయలు - 1
      • పచ్చి బొప్పాయి(raw papaya) కూర
    • ►  April (1)
    • ►  March (1)
    • ►  February (4)
    • ►  January (2)
  • ►  2011 (35)
    • ►  December (3)
    • ►  November (6)
    • ►  September (3)
    • ►  August (4)
    • ►  June (2)
    • ►  May (4)
    • ►  April (6)
    • ►  March (5)
    • ►  February (2)
  • ►  2010 (14)
    • ►  December (6)
    • ►  September (4)
    • ►  August (1)
    • ►  June (3)

About

ఇవి కూడా నావే

  • తృష్ణ...
    ఒక కలయిక
    3 months ago
  • మనోనేత్రం
    Millet fest - 2015
    10 years ago
Powered by Blogger.

రుచులు - రకాలు

  • chutneys n పచ్చడ్స్ (19)
  • cooking tips (1)
  • experiments (10)
  • Kitchen Essentials (1)
  • pulses (3)
  • quick & easy (4)
  • recipe links (1)
  • rotis (2)
  • salads (7)
  • snacks n sweets (19)
  • soups and appetizers (2)
  • tiffins (24)
  • అట్లు - రకాలు (6)
  • ఊరగాయలు-రకాలు (12)
  • ఒడియాలు (3)
  • కూరలు (25)
  • చారులు రకాలు (1)
  • టీలు - రకాలు (1)
  • దోశలు రకాలు (7)
  • పప్పులు (4)
  • పులిహోర (4)
  • పులుసులు (2)
  • పెరుగు పచ్చడి (2)
  • మన పిండివంటలు (2)
  • రకరకాల పొడులు (2)
  • రైస్ వెరైటీస్ (6)
  • వేసవి పానీయాలు (7)

'రుచి' ఇష్టపడేవారు

Copyright (c) 2010 రుచి...the temptation. Design by Template Lite
Download Blogger Templates And Directory Submission.