పనస తొనలు తినేసాకా వాటి లోపల గింజల్ని పాడేయకుండా కూరలు చెయ్యటానికి వాడతారు. వీటితో ఏ రకమైన కూర చేసినా ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఎండబెట్టి తొక్కు తీసి, వాటిని వేయించుకుని తింటారు. పనసగింజల వేపుడు అన్నమాట. ఇలా కాకుండా పనసగింజలు ఉడకబెట్టి బంగాళా దుంపతోనూ లేక వంకాయతో కలిపి వండుతారు. ఇవాళ వంకాయ పనసగింజల కూర ఎలా చెయ్యాలో చెప్తానూ..
కావాల్సినవి:
* పావుకేజీ వంకాయలు
* పది,పన్నెండు పనస గింజలు
* చిన్న నిమ్మకాయంత చింతపండు నానబెట్టి తీసిన రసం
* పోపుకి ఆవాలు,శనగపప్పు,మినపప్పు,జీలకర్ర,కర్వేపాకు,2ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి
* ఉప్పు తగినంత , 2 స్పూన్స్ ఆయిల్
తయారీ:
* ముందు పనసగింజల తొక్కు తీసి, ఒకో గింజ నాలుగు ముక్కలు చేసి కాస్త ఉప్పు వేసి రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టాలి.
* తర్వాత వంకాయ ముక్కలు కూడా ఉప్పు వేసి మరీ మెత్తగా కాకుండా ఉడకబెట్టాలి.
* తర్వాత మూకుడులో రెండు చెంచాల నూనె వేసి పైన చెప్పిన పోపు పదార్ధాలతో పోపు వేయించాలి.
* పోపు వేగాకా ఉడికిన పనసగింజలు, వంకాయముక్కలు వేసి, అందులో తీసిపెట్టుకున్న చింతపండు రసం, చిటికెడు పసుపు వెయ్యాలి. ముక్కలు ఉడికేప్పుడు వేసుకున్న ఉప్పు సరిపోకపోతే మరికాస్త ఉప్పు వేసుకుని కూర దగ్గర పడ్డాకా దింపేసుకోవాలి. వంకాయ - పనసగింజల కూర రెడీ !
* ఈ కూర అన్నంలోకి బావుంటుంది.
* ఇదే విధంగా వంకాయ బదులు బంగాళా దుంపలు పనసగింజలతో కలిపి కూర చేయచ్చు. చింతపండు అక్కర్లేదు.
అసలు పనసగింజలు కుంపట్లో కాల్చుకుని తినకుండా కూరకోసం మిగల్చడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇటువంటి వంటలతో పనసగింజలకి జరుగుతున్నా అన్యాయానికి నిరసన వ్యక్తం చేస్తూ ఈ పోస్ట్ నుంచి వాకౌట్ చేస్తున్నా. :)