నిన్ననే మొదటిసారి చేసిన ఈ రెండు ఎక్స్పరిమెంట్లు బాగా వచ్చాయి.
చక్కిలాలు:
బియ్యం నానపెట్టి గ్రైండ్ చేసి జల్లించి, అందులో మినప్పిండి కలిపి చేసేవి ఒకరకమైన చక్కిలాలు. అలా కాకుండా మైదా పిండి, పెసరపప్పులతో చేసే మరో రకం ఉందిట. చాలా మందికి తెలిసే ఉండచ్చు, నాకు ఈమధ్యనే కొత్తగా తెలిసింది.
కావాల్సినవి:
1/4kg మైదా
100 gms పెసరపప్పు
రెండు చెంచాలు నువ్వులు
రెండు చెంచాలు వాము
తగినంత ఉప్పు
వేయించటానికి సరిపడా నూనె
విధానం:
* ముందర 100 gms పెసరపప్పు ఒక గ్లాసుడు నీళ్ళలోకుక్కర్లో ఉడకపెట్టేసి, జారుగా ఉండేలా మేష్ చేసి ఉంచికోవాలి.
* తర్వాత మైదా పిండిని కూడా ఓ గిన్నెలో వేసి, కుక్కర్ అడుగున నీళ్ళు పోసి, మామూలుగా కుక్కర్ అడుగున పెట్టే చిల్లుల ప్లేట్ పెట్టి, అందిమీద ఈ మైదాపిండి ఉన్న గిన్నె పెట్టాలి. నీళ్లు పొయ్యకుండా. మూత అక్కర్లేదు. విజిల్ పెట్టకుండా ఓ పావుగంట అలా ఉంచాలి పొయ్యి మీద. తర్వాత స్టౌ ఆపేసి, చల్లారాకా పిండిని ఏదన్నా గరిటతో పిండి పొడిపొడిగా ఉండేలా కదపాలి. ఇలా పిండి కుక్కర్లో పెట్టడం వల్ల జంతికలు క్రిస్పీగా వస్తాయిట.
* తర్వాత జారుగా మేష్ చేసిపెట్టుకున్న పెసరపప్పుని ఈ మైదా పిండిలో పోస్తూ జంతికల పిండిలా ముద్ద కలుపుకోవాలి. అది మరీ ముద్దగా ఉండకూడదు. గట్టిగాను ఉండకూడదు. పిండి కలిపేప్పుడే ఉప్పు,కారం,వాము,నువ్వులు వేసి ముద్ద కలపాలి. జారుగా ఉన్న పెసరపప్పు తప్ప ఇక నీళ్ళు కలపకూడదు పిండికి.
* అప్పుడు జంతికల గొట్టంలో ఈ పిండి వేసి ఏదైనా ప్లాస్టిక్ కవర్ మీద చక్కిలాలు చుట్టుకోవాలి. క్రింద ఫోటోలోలాగ.
* ఐదారు చుట్టుకుని, కాగిన నూనెలో వేయించుకోవాలి. అవి అయ్యాకా మళ్ళీ ఐదారు చుట్టుకోవాలి. అన్నీ ఒకేసారి చుట్టేస్తే ఎండిపోతాయి.
* అంతే. చక్కని రుచికరమైన చక్కిలాలు రెడీ !
===========================================
చెక్కలు:
బియ్యప్పిండిలో వేడినీళ్ళూ కలిపి చెక్కలు చెయ్యాలని ప్రయత్నిస్తే రెండుమూడు సార్లు ఫ్లాప్ అయ్యింది. మర్నాటికి మెత్తబడిపోయేవి. ఈసారి చన్నీళ్ళు కలిపి చేసాను. బాగా వచ్చాయి.
చేయటానికి కావాల్సినవి:
* ఒక గ్లాసు బియ్యప్పిండి
* రెండు పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, కర్వేపాకు మెత్తగా తొక్కేసుకోవాలి లేదా గ్రైండ్ చేసుకోవాలి.
* రెండు చెంచాల వెన్న
* వేయించటానికి తగినంత నూనె.
* ఉప్పు తగినంత.
తయారీ:
* గ్లాసు బియ్యప్పిండి, తగినంత ఉప్పు, వెన్న, తొక్కుకున్న ముద్ద కలిపి నీళ్ళతో కట్టిగా ముద్ద కలుపుకోవాలి. చపాతీ ముద్దలాగ ఉండాలి.
* కలిపిన పిండి లోంచి చిన్న ఉండ చేసుకుని, ప్లాస్టిక్ కవర్ మీద చేత్తో స్ప్రెడ్ చేస్కోవాలి.
* వాటిని కాగిన నూనెలో వేసి వేయించుకోవటమే. చక్కని చెక్కలు తయారయిపోతాయి.
chekkalu aslu nellu lekunda vullipaya allam parchimirpaka baga grind chesi aa rasam tho biyapindi kalipicheste baaga gattiga vastyandi.try cheyandi
@స్వాతి: hi ! మీ బాబు బాగున్నాడా?
ఈసారి మీరు చెప్పిన విధంగా ట్రై చేస్తానండి.keep blogging !