కాకరకాయ చేదుగా ఉన్నా ఆరోగ్యానికి చాలా మంచిది. రక్తాన్ని శుధ్ధి చేయగలదు. ఇందులో ఇనుము ఉంటుంది. ఓ వారం రోజులు పరగడుపున ఒక ఔన్స్ కాకరకాయ రసం తాగితే ఎక్కువగా ఉన్న బ్లడ్ సుగర్ లెవెల్స్ కూడా కంట్రోలౌతాయిట.(ఇది చేయదలిస్తే మాత్రం ఎవరన్నా ఆయుర్వేదం డాక్టర్ ని అడిగి చేయండి) ఎన్నో ఔషథగుణాలున్న ఈ కూరను వారానికి ఓసారన్నా తింటే మంచిది. ఎక్కువ గింజపట్టని లేత కాకరకాయలతో ఏ కూర చేసినా అద్భుతంగా ఉంటుంది. కాకరకాయతో మాత్రమే చేసే కొన్ని రకాల కూరలు ఈ టపాలో:
1.కాకరకాయ శనగపప్పుకారం:
పావు కేజీ కాకరకాయలకి
రెండు పెద్ద చెంచాల శనగపప్పు,
ఒక పెద్ద చెంచామినపప్పు,
ఆవాలు,
పావు చెంచా మెంతిగింజలు,
ఐదారు(మీ కారం బట్టి) ఎండు మిర్చి కలిపి గ్రైండ్ చేసుకుని,
కాకరకాయలు అటు ఇటు చీరి వాటిల్లో ఈ పైన చెప్పిన పొడిని కూరి నాన్స్టిక్ మూకుడులో మగ్గించండి. అంటే కాస్త నీళ్ళు పోసి,నూనె వేసి సిమ్ లో ఉడకనివ్వాలి.
లేదా కాకరకాయ ముక్కలు ఉడకపెట్టేసుకుని, తర్వాత నూనె వేసి, ఈ పొడి వేసి వేయించినా సరే.
2.కాకరకాయ మసాలా type1 :
*కాకరకాయ ముక్కలు నిలువుగా చీరి చింతపండు నీళ్ళలో ఉడకబెట్టేసుకోవాలి.
*రెండు చెంచాలు వేరుశనగ, రెండు చెంచాలు నువ్వులు పొడిగా వేయించి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
* తర్వాత నూనెలో ఆవాలు, ఎండుమిర్చి కర్వేపాకు పోపు వేసి,
*సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కల్ వేసి వేగనివ్వాలి.
*తర్వాత అందులో ఇందాకా చేసుకున్న వేరుశనగ నువ్వుల పేస్ట్, ఒక చెంచా అల్లంవెల్లుల్లి పేస్ట్ , కారమ్(కావలిస్తే), ఉప్పు, పసుపు (పావు చెంచా) వేసి, కాసిని నీళ్ళు పోసి, మొత్తంమ్ముద్ద బాగా ఉడికాకా,
*అందులో ఉడికిన కాకరకాయ ముక్కలు వేసి ఐదు నిమిషాల తర్వాత దింపేసుకోవాలి.
3.కాకరకాయ మసాలా 2:
కాకరకాయ ముక్కలు చింతపండు నీళ్ళలో ఉడకపెట్టి ఉంచాలి.
రెండు ఉల్లిపాయ,రెండు టమాటా గ్రైండ్ చేసుకోవాలి.
అల్లం వెల్లుల్లి ముద్ద ఒక చెంచా తీసుకోవాలి. వీటితో పాటే రెండు లవంగాలు, అంగుళం దాల్చిన చెక్క కలిపి గ్రైండ్ చేసేసుకోవాలి.
మూకుడులో నూనె వేసి పైన చేసుకున్న ముద్దలు రెండూ బాగా వేగనిచ్చి,
తర్వాత కాకరకాయ ముక్కలు వేసి ఐదు నిమిషాలు ఉడికాక దింపేసుకోవాలి.
4. కాకరకాయ పెసరపప్పు:
* ఐదారు కాకరకాయలు
* ఒక చిన్న టీగ్లాసుడు పెసరపప్పు ఒకటి, ఒకటిన్నర గంటలు నానబెట్టుకోవాలి.
* నానిన పెసరపప్పుని ఉప్పు, రెండుమూడు పచ్చిమెరపకాయలు, చిటికెడు ఇంగువ వేసి గ్రైండ్ చేసుకోవాలి.
(ఇదే పెసరపప్పు పచ్చడి. అన్నంలో తింటే చాలా బావుంటుంది)
* కాకరకాయలు నాలుగువైపులా చీరి(కట్ పెట్టి) ఈ ముద్ద అందులో కూరి రెండుమూడు కాయల చప్పున వేయించుకోవాలి.
* డీప్ ఫ్రై వద్దనుకుంటే మూకుడులో(నాన్స్టిక్ ప్రిఫర్డ్ :)) అన్నీ కలిపి స్టౌ సిమ్ లో పెట్టి వేయించుకోవచ్చు.
5.ఉల్లికారం:
కాకరకాయ ముక్కలు చింతపండు నీళ్ళలో ఉడకపెట్టి ఉంచాలి.
మూడు ఉల్లిపాయలు, కారమ్ (మీ అనుసారం), చిటికెడు ఇంగువ కలిపి గ్రైండ్ చేసేసుకుని,
ఈ ముద్దను నూనెలొ బాగా వేగనిచ్చి, తర్వత కాకరకాయ ముక్కలు కలిపి ఐదు నిమిషాల తర్వాత దింపేసుకోవటం.
ఇది చిన్న కాకరకయలు దొరికితే కాయపడంగా కూడా చేసుకోవచ్చు.
6.కాకరకాయ వేపుడు 1:
కాకరకాయ వేపుడు (ఉల్లిపాయ వేసి గాని వెయ్యకుండా గానీ) వేగిపోయాకా పైన ఉప్పు, కారం చల్లేప్పుడు కాస్త శనగపిండి చల్లి మరొ ఐదు నిమిషాల తర్వత దించుకుంటే బావుంటుంది.
7.కాకరకాయ వేపుడు 2:
కాకరకాయ ముక్కలు గుడ్రంగా స్లైసెస్ లాగ తరుక్కుని, వేరుశనగగుళ్ళు,కర్వేపాకు కలిపి వేయించుకుంటే బావుంటుంది.
8. కాకరకాయ కొబ్బరి తీపి కూర:
*పావుకేజీ కాకరకాయలు
*ఒకచిప్పకొబ్బరి కోరు
*ఏభైగ్రాములు బెల్లంతరుగు
*చిన్న నిమ్మకాయంత చింతపండు నానబెట్టి గుజ్జు తీసుకోవాలి.
* కాకరకాయ ముక్కలు స్లైసెస్ లాగ గుండ్రంగా తరుక్కోవాలి.(ఎలాగైనా తరుగచ్చు. తియ్య కూరకి గుండ్రంగా అయితే బావుంటాయి)
* కాకరకాయ ముక్కలు చింతపండు గుజ్జు, కాస్త ఉప్పు వేసి మెత్తగా ఉడికించుకోవాలి.
* మూకుడులో శనగపప్పు,మినపప్పు,ఆవాలు,జీలకర్ర,కర్వేపాకు పోపు వేసి అందులో కొబ్బరి కోరు వేసి ఒక నిమిషం వేయించాలి.
* తర్వాత ఉడికిన కాకరకాయ ముక్కలు, బెల్లంతరుగు వేసి ఐదునిమిషాలు స్టౌ సిమ్ లో ఉంచి తరువాత ఆపేయాలి.
----------
* 9:
మా అన్నయ్య ఓరోజున కాకరకాయ కొత్తిమీర కారం ఎందుకు చెయ్యకూడదు? అని పరిశోధన చేసాడు. బానే ఉంది. కాకరకాయ అంటే బాగ ఇష్టంమున్న ఎవరన్నా ఆసక్తి ఉంటే ఇది కూడా ట్రై చేయచ్చు.
కొత్తిమీర,పచ్చిమిర్చి కలిపి గ్రైండ్ చే్సి, కాస్త నూనెలో ఉడికిన కాకరకాయముక్కలు,ఈ ముద్ద వేసి మగ్గించటమే.
------
10.
కుంపటి మీద కాకరకాయలు కాల్చి కూడా కూర చేస్తారు. నేనెప్పుడూ చేయటానికి ప్రయత్నించలేదు. ఎప్పుడన్నా చేస్తే అది కూడా రాస్తా :)
అబ్బా, నోరూరిపోతోంది తృష్ణ :) వీటిల్లో ఏదో ఒకటైనా ఈ వీకెండ్ ట్రై చేస్తా, మా మెక్సికన్ స్టోర్ వాడు కాకరకాయలు పెడితే.
కాకరకాయలు నిలువునా , గుండ్రంగా , నాలుగువైపులా , చీరి , తరిగీ అని బానే వ్రాసారు.... అంతకు ముందు కాకరకాయ పైన తొక్క (ఆలూ తొక్క తీసినట్టు ) తీసెయ్యాలని చెప్పలేదు ... నేను అలాగే చేసా..... ఆఉ చేదు చేదు.... పైగా అది చూసినవాళ్ళు ఆ కాకరకాయ ముక్కలని రకరకాలుగా వర్ణించేసరికి కూర మొత్తం డస్టుబిన్ను పాలయ్యింది.
తూచ్ తూచ్ తృష్ణ గారూ ఇలాంటి చిన్న చిన్న డీటేల్స్ మరిచిపోతే మాలాంటి వాళ్ళ పరీస్థితి ఏటవుద్దీ... ?? :-)
@mahek: tried?
@సప్తస్వరాలు: నాకు తెలిసినవాళ్ళేవరూ ఆలూ తొక్కు తీసినట్లు కాకరకాయ తొక్కుతీయరండీ. కాకరకాయ అలానే తింటారు. తొక్క తీసేస్తే అదేదో సామెత లాగ అది కాకరకాయ ఎలా అవుతుంది? ఆ చేదు నచ్చనివాళ్ళూ తినరంతే!
ట్రై చేసినందుకు థాంక్స్. అయ్యో..చేసినందుకు మీరయినా తినలేదాండీ...