పై ఫొటో లోది సన్నగా పెనంపై ఎక్కువ నూనె వెయ్యకుండా కాల్చాను కానీ అసలు దిబ్బరొట్టె అంటే మూకుడులో గానీ మందపాటి ఇత్తడి గిన్నెలో గానీ మందంగా పిండి వేసి రొట్టె ఇంత లావున వచ్చేలా రెందువైపులా ఎర్రగా కాలుస్తారు. మామూలుగా మినపట్టులో మినపప్పు, ఇడ్లీ రవ్వ వేసి కాలుస్తాం కదా, దిబ్బరొట్టె లో ఇడ్లి రవ్వకు బదులుగా బియ్యం రవ్వ వాడతారు. ఉండ్రాళ్ళకు వాడే బియ్యం రవ్వ అన్నమాట. అందువల్ల రొట్టె బాగా పెచ్చుకట్టి కరకరలాడుతూ ఉంటుంది. దీనిలో ఎంత నూనె పోస్తే అంత రుచి..:)
చిన్నప్పుడు మా ఇంట్లో పెద్ద ఇనప ముకుడు ఒకటి ఉండేది అందులో ఇంత లావున మందంగా దిబ్బ రొట్టే వేసి అది నాలుగు ముక్కలు చెసి నలుగురికీ పెట్టేది అమ్మ. అంటే చిన్న చిన్నది నాలుగైదు కాకుండా ఒకే ఒక్కటన్నమాట! ఎర్రగా కాలిన ఆ పెచ్చు నాక్కావాలంటే నాక్కావాలి అని దెబ్బలాడుకుంటూ పెచ్చు తినేసి మధ్యలో ఉన్న భాగాన్ని వదిలేసేవాళ్లం..:)
దిబ్బరొట్టె కు కావాల్సినవి:
* ఒక గ్లాసు మినపప్పు
* రెండు గ్లాసులు బియ్యం రవ్వ(rice rawa)
* తగినంత ఉప్పు
* రొట్టె కాల్చటానికి మూడు నాలుగు చెంచాల నూనె
తయారీ:
* మినపప్పు ఇడ్లీ కి లాగానే మూడు నాలుగు గంటలు నానబెట్టుకుని మెత్తగా గ్రైండ్ చెయ్యాలి.
* బియ్యం రవ్వ కూడా అలానే నానబెట్టి, గ్రైండ్ చేసిన మినప్పిండిలో ఇడ్లీ పిండి లాగ కలిపేసుకోవాలి.
* మూకుడులో రెండు చెంచాల నూనె వేసి నాలుగైదు గరిటెల పిండి వేసి మూత పెట్టేయాలి.
* మాడకుండా మధ్య మధ్య చూసుకుంటూ ఒక వైపు వేగాకా మరో వైపు తిప్పుకుని మరో చెంచా నూనె వెయ్యాలి.
* రెండు వైపులా ఎర్రగా కాలాగా దింపేసుకోవాలి.
* ఇది చల్లారిపోతే మెత్తబదిపోతుంది. వేడి మీద కరకరలాడుతుంటే రుచి అద్భుతంగా ఉంటుంది.
* కొబ్బరి పచ్చడి, టమాటా చట్నీ దేనితోనైనా దిబ్బరొట్టె తినచ్చు. కొందరు తేనె వేసుకుని కూడా తింటారు.
* మినపప్పు రుబ్బేప్పుడు కొంతమంది మిరియాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి గ్రైండ్ చేస్తారు. కారమని నేనెప్పుడూ ట్రై చెయ్యలే..:)
Mmmm...yummie ..deeni mundu e pizzaalu paniki vasthaayi..paina cheppinavannee mandapaati mookudulo vesi...paina badam akulu kappi...boggula kumpati lo gaani...daaligunta lo gani (low flame...sannnnnnnati sega) meeda kaalchi kotha aavakayatho thinte........aahaa...
బాగుందండి. నేను మామూలుగా ఇడ్లీ పిండితో మిరియాలు, అల్లం, ఉల్లిపాయముక్కలు, జీలకర్ర కలిపి మూకుడులో దిబ్బరొట్టె వేసేస్తూ ఉంటాను.
@jvrao garu, అవునండి కుంపటి మీద కాలిన దిబ్బరొట్టె రుచి చాలా బాగుంటుంది.thanks for the visit.
@జయగారు, ఇడ్లి పిండిపై కూరలు, సోయా గ్రాన్యూల్స్ వేసిన అట్టు లింక్ ఇచ్చా చూడండి.. దాన్ని మేము కూడా చిన్నప్పుడు దిబ్బరొట్టె అనేవాళ్ళం. dosa పిండి లాస్ట్ కి వచ్చేస్తే ఇలా మీరు చెప్పినట్లు అల్లం పచ్చిమిర్చి జీలకర్ర వేసి అట్టు వేస్తుంటాను నేను.
thank you :)
ఇక్కడ తృష్ణగారు ఇచ్చిన రొట్టిని మావాళ్ళు పోలిరొట్టి అంటారు. అంటే అందులో పచ్చిమిరపకాయలు అల్లం వగైరాలు ఏం ఉండవన్నమాట. మాంచి మందపాటి ఇత్తడిగిన్నె లేదా బూర్లమూకుడులో నూనె వేసి పిండి పోసి పైన మళ్ళీ దళసరి మూత పెట్టాలి. మధ్యలో ఓ ఖాళీ గిన్నె లేదా గ్లాసును బోర్లా వేస్తారు. (పిండి మధ్యలో) ఇక అది నిదానంగా ఉడుకుతుందన్నమాట. బాగా ఎర్రగా కాలక తిరగెయ్యాలి. బాబోయ్..అదో పని మూకుడును గట్టిగా పట్టుకుని వెనక్కి తిప్పాలి పడిపోకుండా. దీనికి కూడా ఉడికిందో లేదో చూడ్డానికి కేక్ లాగే పరీక్షించుకోవచ్చు. ఓ స్పూనో, కత్తో లోపలికి గుచ్చి చూస్తే దానికి పిండి అంటలేదూ అంటే కాలింది అని అర్థం చేసుకుని దింపేయవచ్చు. దీనికి నువ్వుల పచ్చడి కాంబినేషన్ అద్భుతః. అదెలా చెయ్యాలో ఎవరైనా అడిగితే చెప్తా..తృష్ణగారు కోప్పడనంటే..ఇప్పటికే కొసరు ఎక్కువైంది కదా.
sudha gaaru, అక్కడ ప్లస్ లో పప్పు నాగరాజు గారు కూడా ఇలానే చెప్పారు. కోప్పడేదేమిటండి భలేవారే చెప్పండి... నువ్వుల పచ్చడి నేను చేస్తుంటాను.. నువ్వులు పొడిగా వేయించి, ఎండుమిర్చి పోపు వేయించి గ్రైండ్ చేస్తాను. కాస్త ఎల్లం వేస్తే రుచి అమోఘం :) మీరెలా చేస్తారో చెప్పండి..
మా అత్తగారు కూడా దిబ్బ రొట్టె బియ్యం రవ్వతోనే చేస్తారు. మీ ఇంట్లో లాగే నాలుగు చెక్కలు చేసి పెడ్తారు. మా ఆయన తేనె పోసుకుని (యాక్..) నేను టమాటా పచ్చడి వేసుకునీ..!!
చాలా నూనె పడుతుంది కానీ ఆ నూనెలో నెమ్మదిగా వేగి, ఎంత రుచిగా ఉంటుందో
@sujata: :-)