ఆకాకరకాయలు అన్ని సీజన్స్ లో దొరకవు. ఈ సీజన్ లో బాగా దొరికుతాయి. ఆంగ్లంలో Spiny Gourd అనీ, నార్త్ లో 'కంటోలా' అంటారు వీటిని. మా చిన్నప్పుడు బజార్లో ఆకాకరకాయ దొరికినన్నాళ్ళూ వీలయినప్పుడల్లా కొంటూండేది అమ్మ. మా ఇంట్లో అందరికీ మహా ఇష్టం. మా అత్తవారి ఇంట్లో అసలు తెలీదంటారు. ఆకాకరకాయ తెలిదన్నవాళ్లందరికీ ఆనందరావు కథ చెప్తుంటాను నేను. "ఆనందరావు ఆకాకరకాయ" అని ఓ కథ చదివానెప్పుడో.. ఎంటంటే..
ఒక ఆనందరావుకి ఆకాకరకాయలంటే మహా ఇష్టంట. పెళ్ళయిన కొత్తల్లో ఓ రోజు కొనుక్కొచ్చి భార్య కిచ్చి వండమన్నాడట. ఆవిడకు ఆకాకరకాయ అంటే తెలీదుట. ఎలా వండాలో అంతకన్నా తెలీదుట. తోచినట్లు చేసిందట. ఎంతో ఆత్రంగా కూర తిందామని ఆనందరావు కంచం ముందు కూచున్నాట్ట. ఆవిడ ఓ చెంచాడు కూర వేసిందిట. ఇదేమిటన్నాడుట.. అప్పుడు ఆవిడా, నేనివెప్పుడూ చూళ్ళేదు.. బయట గరుకుగా ఉందని పెచ్చు తీసేసాను. లోపల గింజలు ఉన్నాయని అవి తీసేసాను. ఇక ఇంతే కూర అయ్యిందందిట... పాపం ఆనందరావు! అయ్యగారికి ఆకాకరకాయ తెలియకపోయినా నాకు వండుకోవడం వచ్చు కాబట్టి ఆనందరావులాంటి ఇబ్బంది లేదు నాకు :)
ఆకాకరకాయ కాకరకాయలాగానే ఉంటుంది కానీ బయట బాగా గరుగ్గా ఉంటుంది కాబట్టి బాగా కడిగి వాడాలి. సన్నగా నిలువుగా చీరచ్చు లేదా చిన్న చిన్న ముక్కలు తరగచ్చు. వాటితో మూడు నాలుగురకాయ కూరలు వండచ్చు. గింజ ఎక్కువ పట్టని లేత కాయలు చూసి కొనుక్కుంటే ముదిరిన గింజలు పళ్ళల్లో ఇరుక్కోకుండా, రుచిగా ఉంటుందీ కూర.
1. ఆకాకరకాయ వేపుడు:
* సన్నగా పొడుగ్గా కాని చిన్న ముక్కలుగా గాని తరిగి ఆకాకరకాయలు డైరెక్ట్ గా ఫ్రై చేసుకోవచ్చు. లేదా ఒక్క విజిల్ వచ్చేదాకా ప్రెజర్ కుక్ చేసి తర్వాత ఒకటి రెండు చెంచాల నూనెలో ఫ్రై చేయచ్చు. ఇలా అయితే తక్కువ ఆయిల్ లో వేయించినట్లు అవుతుంది. ప్రెజర్ కుక్ చేసేట్లయితే నీళ్లు ఎక్కువ పొయ్యకూడదు. ఒక్కటే విజిల్ రాగానేతీసెయ్యాలి. లేకపోతే ముక్కలు పేస్ట్ అయిపోతాయి.
ఉడికించిన ఆకాకరకాయ |
* ముక్కలు వేగాకా రెండు చెంచాల నూనెలో కాస్తంత వేయించి తగినంత ఉప్పు,కారం వేసుకుని దింపేయచ్చు.
* వేపుడు కాస్త స్పైసీ గా కావాలనుకుంటే అర చెంచా ఆమ్చూర్ పౌడర్(dried mango powder), చిటికెడు పసుపు, అర చెంచా ధనియాల పొడి, అర చెంచా జీలకర్ర పొడి వేసి బాగా కలిపి ఆపేయాలి.
2. ఆకాకరకాయ తీపి కూర:
* ఆకాకరకాయ ముక్కలు తగినంత ఉప్పు వేసి ఒక్క విజిల్ వచ్చేలా పెజర్ కుక్కర్లో ఉడికించాలి, లేదా విడిగా మూకుడులో కొద్దిగా ఉడకబెట్టి దింపుకోవాలి.
* తర్వాత ఆవాలు,జిలకర్ర, మినపప్పు,సనగపప్పు, ఇంగువ పోపు పెట్టి, ఉడికిన ఆకాకరకాయ ముక్కలు వేసేసి, అరకప్పు తురిమిన పచ్చి కొబ్బరి ,రెండుమూడు చెంచాల బెల్లం తరుగు వేసి, బెల్లం కరిగాగా కూర బాగా కలిపి స్టౌ ఆపేయాలి.
౩. ఆకాకరకాయ ఉల్లికారం:
* పావుకేజీ ఆకాకరకాయలకి మూడు మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకోవాలి.
* ఉల్లిపాయ ముక్కలు తరిగి కారం,ఉప్పు,రెండు వెల్లుల్లిపాయలు(ఇష్టమైతేనే), అరచెంచా జీలకర్ర, చిటికెడు పసుపు, చిటికెడు ఇంగువ వేసి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి.
* ఆకాకరకాయ ముక్కలు ముందుగా కాస్త ఉప్పు,పసుపు వేసి ఉడకబెట్టేసుకోవాలి.
* మూకుడులో రెండు చెంచాల నూనె వేసి గ్రైండ్ చేసిన ఉల్లి కారం ముద్ద వేసి కాస్త పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి.
* తర్వాత ఆకాకరకాయ ముక్కలు వేసి, కూర బాగా దగ్గర పడేదాకా మధ్య మధ్య కలుపుతూండాలి.
* ఉల్లికారం ముందు వేగిపోతుంది కాబట్టి ఓ ఐదునిమిషాల్లో కూర అయిపోతుంది.
4. stuffed ఆకాకరకాయ:
* బేసిక్ గా ఇది ఓ స్నాక్ ఐటెం అనచ్చు. డీప్ ఫ్రై చెయ్యాలని నేనెప్పుడూ ప్రయత్నించలేదు కానీ విధానం తెలుసు. తురిమిన ఫ్రెష్ కొబ్బరి, వేరుశనగ(పల్లీ) పొడి, ఉప్పు ,కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్,కొత్తిమీర బాగా కలిపి ఈ ముద్దని ఆకాకరకాయ సగానికి చీరి, గింజలు తీసేసి అందులో కూరాలి.
* ముప్పవు కప్పు శనగపిండి, పావు కప్పు బియ్యప్పిండి,చిటికెడు వంటసోడా, ఉప్పు, కారం కలిపి కాసిని నీళ్లతో బజ్జి పిండిలా కలుపుకుని ఇందాకా స్టఫ్ చేసిన ఆకాకరకాయలు ఈ బజ్జి పిండిలో ముంచి డీప్ ఫ్రై చెయ్యాలి.
* ఇవి బజ్జీల్లా అప్పటికప్పుడు ఏ టమాటా సాస్ తోనో కొత్తిమీర చట్ని తోనో తింటే బాగుంటాయి.
--------------------------------
టిప్:
కాకరకాయ లాగానే ఆకాకరకాయ కూడా బాగా వేడి చేస్తుంది కాబట్టి వేడివేడి చేసే తత్వం గలవాళ్ళు ఈ కూర తిన్నప్పుడు మజ్జిగ తాగడమో, కొబ్బరినీళ్ళు తాగడమో చేస్తే వేడి చెయ్యకుండా ఉంటుంది.
ఇక్కడ (అమెరికాలో) ఫ్రోజెన్ వి తప్ప దొరకవు. మా ఇంట్లో ఆకాకరకాయతో కూరలాగా ఫ్రై చేసుకుంటాము.చాలా ఇష్టం. రుచి చాలా బాగుంటుంది. మిగతా రకాలు ఇప్పుడే మా ఆవిడకి చూపెట్టాను. కాబట్టి ఎప్పుడో రుచి చూసే భాగ్యం కలగచ్చు లేకపోతే టీ స్పూనులకు పనిచెప్పి నేనే చేతులు కాల్చుకోవాలి.
@Rao S Lakkaraju:ఫ్రోజన్ అయినా లేతవి దొరికితే పర్వాలేదండి. ఎలా చేసినా ఆకాకరకాయ రుచి అద్భుత: అనాలండి.. మిగతా రకాలు మీరు త్వరలో తినగలగాలని కోరుకుంటున్నా :)
మేమూ దొరికినన్ని రోజులు తెప్పించి వండుతాము .ఎక్కువగా ఉల్లిపాయ తో కలిపి పాలు పోసి ఇగురు వండుతాము .మీరు చెప్పినట్టు కూడా ట్రై చేయాలి .
ఈ లింక్ చూడండి నా ఆకాకరకాయ కూర పోస్ట్
http://saisatyapriya.blogspot.in/2010/11/blog-post_21.html
@radhika(nani): i remember that post radhikagaarU..thank you..
చాలా మంచి వెరయిటీలు చెప్పారండీ తృష్ణ గారూ!! మీరు చెప్పిన ఆ కధ నేనూ చదివాను.
డి.కామేశ్వరి గారి రచన అని గుర్తు. మంచి కధ ని గుర్తు తెచ్చినందుకూ, అలాగే మంచి కూరలని పరిచయం చేసినందుకూ చాలా థాంక్స్.
@satya:రచయిత పేరు గుర్తులేదండీ..thank you too :-)