ఊరగాయలు తినడమే మానేసామని ఈసారి అసలు ఆవకాయలూ అవీ వద్దనుకుంటూనే మొత్తానికి అనుకోకుండా పెట్టేసాను. ఏదో పని మీద బజారుకి వెళ్ళి అక్కడ ముక్కలు కొడుతుంటే చూసి ఉత్సాహం వచ్చేసి, గబగబా ఓ నాలుగు కాయల్ కొనేసి, ముక్కలు కొట్టించేసి, పక్కనే వలిచిన వెల్లుల్లి అమ్ముతుంటే అవి కూడా కొనేసి, ఇంటికొచ్చేద్దారిలో పప్పు నూనె కూడా కొని, ఇంటికొచ్చాకా రాత్రి పదకొండున్నరకి కూచుని ఆవకాయ పెట్టా :-)
ఇదివరకూ మూడురకాల ఆవకాయలు చెప్పా కానీ మామూలు వెల్లిల్లి ఆవకాయ రెసిపీ చెప్పలేదు. ఆ రెసిపీ కూడా అవసరం ఉన్నవాళ్ళకి ఉపయోగిస్తుందని ఇక్కడ ఇస్తున్నా.
ఈ రెసిపీ ఓ నాలుగు పెద్ద మామిడి కాయలకి:
* salt, కారం 1:1 పాళ్ళు.
* ఆవపొడి మాత్రం అంతకు మరో అరగ్లాసు ఎక్కువ.
(హైద్రాబాద్ లో ఉంటే నల్లకుంటలో దొరికే కారమైతే బెస్ట్! లేదా పెద్ద మిర్చి(లావుగా ఉండేది) కారం కొనుక్కోవాలి. అదైతే రంగు ఉంటుంది, కమ్మగా ఉంటుంది.
ఈసారికి నేను నాలుగు కాయలే పెట్టాను. సో, త్రీ మేంగోస్ కారంతో సరిపెట్టేసా :))
* నూపప్పు నూనె 1/2 కేజీ తీసుకోవాలి.
* powders అన్నీ బాగా కలిపేసి, అందులో పావు కేజీ నూనె వేసి, తొక్క తీసిన వెల్లుల్లిపాయలు(ఇవి కూడా రెడీగా దొరికేసాయి ఈసారి), వంద గ్రాములు మెంతులు వేసి మూత పెట్టేసి, మూడో రోజు మూత తీసి మిగిలిన పావు కేజీ నూపప్పునూనె కలిపేసి సీసాలోకెక్కించెయ్యడమే.
మెంతికాయ:
ఆవకాయ పెట్టిన తర్వాత కనీసం మెంతికాయ అయినా పెడదాం అనిపించి, ఓ మూడు కాయలతో మెంతికాయ కూడా పెట్టేసా. ఆ రెసిపీ ఇదివరకూ ఇక్కడ రాసా కాబట్టి ఇంక మళ్ళీ రాయట్లే. కొత్త మొంతికాయ ఫోటో మాత్రం పెడుతున్నా..:-)
* ఒక టిప్ ఏమిటంటే మెంతులు ఎంత దోరగా వేగితే, అంత కమ్మగా ఉంటుంది మెంతికాయ.
మెంతావకాయ ఓ మహాద్భుతమైన వంటకం కదండీ. నోరూరిపోతోంది చూస్తూంటే. మీ పచ్చళ్ళ ఫొటోల్లో కారాల ఘాటు ఊళ్ళూళ్ళూ దాటి మాక్కూడా దగ్గు తెప్పిస్తోంది. :D:D Super like!