skip to main | skip to sidebar

Pages

  • Home

రుచి...the temptation

"The best way to a man's heart is through his stomach."

కంద బచ్చలి కూర

9:30 AM | Publish by తృష్ణ



తొంభైఐదు శాతం గోదావరి జిల్లాలవారి పెళ్ళి భోజనాలలో "కంద బచ్చలి కూర" తప్పనిసరి ఉంటూంటుంది.(పనసపొట్టు కూరలాగే). ఇలా వండటానికి ఒక కారణం ఉంది. ఈ కూరలో ఎలాగైతే కంద,బచ్చలి తమ తమ ఐడెంటిటీ తెలీకుండా కలిసిపోతాయో, అదే విధంగా పెళ్ళి అనే పవిత్ర బంధంతో రెండు కుటుంబాలు ఒకటిగా కలసిపోవాలి అనేది ఇందులోని ఇంటర్నల్ మెసేజ్. ఇక ఈ కూర చేసేప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే బచ్చలాకు ఆకు లాగ, కంద ముక్కలుగా కనబడకూడదు. మొత్తం చక్కని ముద్దలాగ మిక్స్ అయిపోవాలి ఇందాకటి మెసేజ్ మాదిరిగా.

పై ఫోటోలోని బచ్చలి తీగ(malabar spinach) మా కొత్త ఇంట్లో అదివరకెవరో వేసినది. ఇది తీగ బచ్చలి. సాధారణంగా మార్కెట్లో మనకు దొరికేదాన్ని మట్ట బచ్చలి అంటారు. అది పాలకూర,చుక్కకూరల్లాగే రెండంగుళాలు పొడవుగా దుబ్బుగా పెరిగే బచ్చలి. క్రింద ఫోటోలోలాగ.






ఇలాకాక తీగ లాగ పెరిగి, పందిరి వేసుకునేంత పెద్దగా ఎదిగేది తీగ బచ్చలి. పైన మొదటి ఫోటోలోదన్నమాట. మా నాన్నమ్మకు బచ్చలికూరంటే ప్రాణం, కూరలబ్బాయి వస్తే అతని దగ్గర ఉన్న బచ్చలంతా తనే కొనేసేది. ఈ మహా బచ్చలి తీగను చూసేసరికీ మహా సరదా పుట్టేసి ఆ బచ్చలితో పప్పు, బజ్జీలు, మజ్జిగ పులుసు, పచ్చడి(మిగతా వంటకాల కన్నా నాకు ఇది నచ్చుతుంది) వగైరా వగైరాలు చేసేసాను. మరి ఫ్రీగా ఆకుకూర రోజూ ఎదురుగా కనిపిస్తూంటే వండకుండా ఉండగలమా? ఇక ఇంకా ఏం మిగిలి ఉన్నాయి అంటే "కంద బచ్చలి" కూర గుర్తుకు వచ్చింది. పైగా టివీలో మొన్నొక రోజు ఒకావిడ "కార్తీక మాసంలో మేము తప్పనిసరిగా కంద బచ్చలి కూర తింటాం.." అని చెప్పారు. ఇదెప్పుడూ నేను వినలేదు. అయినా తినేస్తే ఓ పనైపోతుంది కదా అని బయటకు వెళ్ళి "కంద" కొనుక్కువచ్చా.



కంద(elephant yam) మొక్క క్రింద ఉన్న ఫోటోలోలా ఉంటుంది. దాని క్రింద వేరు ఇలా కంద దుంపలా ఉంటుంది. మా ఇంట్లో కూర కాకుండా కందతో కందట్టు వేస్తారు. దాని గురించి చేసినప్పుడు ఫోటోతో సహా రాస్తాను...:) "పోలాల అమావాస్య" కు కంద మొక్కకు చేసే పూజ గురించి ఇక్కడ అదివరకూ రాసాను.




ఇక కంద బచ్చలి కూర ఎలా చెయ్యాలంటే.. ముందుగా బచ్చలాకులు కడిగి పెట్టుకోవాలి. తర్వాత కందని తొక్కు తీసి ముక్కలుగా తరిగి పెట్టు కోవాలి. క్రింది విధంగా.















తయారీ:




* కంద ముక్కలు, బచ్చలి ఆకులు కలిపి కాస్తంత చింతపండు రసం, అర చెంచా పసుపు, తగినంత ఉప్పు వేసి కుక్కర్లో ఉడికించుకోవాలి.


* నీరు తగినంత పొసుకుంటే ఉడికాకా వార్చాల్సిన పని ఉండదు. పోషకాలు పోవు.


* ఉడికిన పదార్ధాన్ని ముద్దగా ఎనిపేసుకుని(మేష్ చేసుకుని) పక్కన పెట్టుకోవాలి.


* మూకుడులో ఒక పెద్ద చెంచడు నూనె తీసుకుని అందులో ఆవాలు, మినపప్పు, కాస్త ఎక్కువ శనగపప్పు, కాస్తంత జీలకర్ర, రెండు ఎండు మిర్చి, ఒకటి రెండు పచ్చిమిర్చి, కర్వేపాకు,ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి.


* పోపులో కావాలంటే వేరుశనగపప్పు కూడా వేసుకోవచ్చు.


* బాగా వేగిన పోపులో ఉడికిన కంద,బచ్చలి మిశ్రమాన్ని వేసి బాగా కలిపి దింపేయాలి.


* కూర కాస్త చల్లారాకా ఒక చెంచాడు(కూర అరకేజీ దాకా ఉంటే) ఆవ పొడి(పచ్చి ఆవపొడి) వేసి బాగా కలుపుకోవాలి.


*వేడి చేస్తుందేమో అనుకునేవారు ఆవ వేయటం మానేసుకోవచ్చు.


*వేడి వేడి అన్నంలో నెయ్యి లేక కమ్మని పప్పు నూనె వేసుకుని ఈ కూర తింటే...ఆహా! అనుకోకుండా ఉండలేరనే నా అభిప్పిరాయం.






బచ్చలి ఉపయోగాలు:


* ఇందులో విటమిన్ ఏ, సీ,ఐరన్ మరియు కాల్షియం కూడా ఉంటాయి.


* కేలొరీస్ తక్కువ, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది.


* ముఖ్యంగా సోల్యబుల్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది.


* కొన్ని ప్రాంతాల్లో ఉదకబెట్టి గ్రైండ్ చేసిన ఈ బచ్చలాకు పేస్ట్ ను సూప్స్ చిక్కగా చేయటానికి కూడా వాడతారట.






కంద ఉపయోగాలు:


* దీనిలో మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్ కాక కాపర్,జింక్,సిలేనియం అనే ఖనిజాల ట్రేసెస్ కూడా ఉన్నాయి.


* omega 3 fatty acids చాలా ఎక్కువ కాబట్టి దినికి బాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించి, గుడ్ కొలెస్ట్రాల్ ను పెంచే గుణం ఉంది. అందువల్ల హైపర్టెన్షన్(హై బి.పి) ఉన్నవాళ్ళకు ఇది మంచిది.


* వేడి శరీరాన్ని చల్లబరిచే గుణం కూడా దీనికి ఉంది.


* ఫైబర్ చాలా ఎక్కువ కాబట్టి బరువును తగ్గించే గుణం ఉంది. సన్నబడాలనుకునే వాళ్ళు నిరభ్యంతరంగా ఇది తినచ్చు.


* హై ఫైబర్ వల్ల కాన్స్టిపేషన్ నుంచి కూడా రిలీఫ్ ను ఇవ్వగలదు కంద.


* పైల్స్ తో బాధపడేవారికి కూడా ఇది గొప్ప ఉపయోగకరం.


* దుంప కూర అనుకోకుండా డైయాబెటిక్ వాళ్ళు కూడా దీనిని హాయిగా తినచ్చు.


* కంద ఈస్ట్రోజన్ లెవెల్స్ పెంచుతుంది కాబట్టి స్త్రీల హార్మోనల్ బేలన్స్ కు ఇది చాలా ఉపయోగకరం. విటమిన్ B6 ఉండతమ్ వల్ల ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్ నుండి కూడా స్త్రీలకు రిలీఫ్ఫ్ ను అందించగలదు.


* అయితే దీనికి కూలింగ్ ఎఫెక్ట్ ఉండటం వల్ల సైనస్, ఆస్థ్మా, జలుబు శరీరం గలవారు డాక్టర్ సలహాతో మాత్రమే తినాలి.

* గర్భిణీ స్త్రిలు, పాలిచ్చే తల్లులు దీనిని తినకపోవటం మంచిది.







Labels: కూరలు 26 comments
26 Responses
  1. sunita Says:
    December 1, 2010 at 8:13 PM

    baagundanDi. intakumundu beerakaayi aTTu try chaesaanu. baagundi kaanee beera vaasana poegoTtalaekapoeyaanu. daanitoe pillalatoe tinipinchaDaaniki ibbandi aindi. ruchi baagundi.alaagae eesaari paqnasapoTTu koora resipee ichchaeyinDi.


  2. బాలు Says:
    December 1, 2010 at 8:49 PM

    మేం గోదారిజిల్లా వాళ్లం కాకపోయినా మా యింట్లో బాగా అలవాటు కందబచ్చలి కూర. నాకు బలే ఇష్టిం. తల్చుకుంటేనే నోట్లో నీళ్లూరిపోతున్నాయి. వేడి చేస్తుందని ఆవపెట్టడం మానేయమంటారా? ఆమాట అనడానికి అంటానికి మనసెలా ఒప్పిందండీ మీకు! మొత్తానికి బచ్చలిపాదూ కంద మొక్క చూపించి చిన్నప్పటి రోజులు గుర్తుకు తెచ్చారు. మా పెరట్లోనూ నా చిన్నప్పుడు ఈ రెండూ ఉండేవి.


  3. ఇందు Says:
    December 1, 2010 at 8:50 PM

    నాకు బాగా గుర్తు.మేము గోదావరి వారం కాకపోయినా మా పెళ్ళిళ్ళలో ఇది కంపల్సరీ.మా పెళ్ళీలో కూడా చేసారు. కానీ పెళ్ళిలో ఈ కూర ఎందుకు చేస్తారొ మీరు చెప్పిన సూత్రం చదివాక నాకు ఇప్పుడు బోధపడింది. బాగుంది :)


  4. కృష్ణప్రియ Says:
    December 1, 2010 at 9:00 PM

    చాలా బాగా చెప్పారు..


  5. కొత్త పాళీ Says:
    December 1, 2010 at 11:04 PM

    నాకు ఆక్కూరలన్నిటిలో బచ్చలి కూర అంటే చాలా ఇష్టం. ఇన్నిరకాల భారతీయ కూరగాయలు దొరుకుతున్న ఈ అమెరికా దేశంలో అదేమి ఖర్మమో బచ్చలి ఒక్కటే దొరకదు. ఇప్పుడేమో మీరు ఒకటికి రెండు మొక్కల ఫొటోలు కూడా పెట్టారు - అందువల్ల నా మనోభావాలు తీవ్రంగా గాయపడినాయని మనవి చేసుకుంటున్నాం అధ్యక్షా!

    Very nice write up and nicer pics


  6. నిషిగంధ Says:
    December 1, 2010 at 11:09 PM

    నాకు సూపరిష్టం ఈ కూర.. మా ఇంట్లో చేసేవాళ్ళు కాదు కానీ మా ట్యూషన్ మాస్టారి గారి భార్య ఎప్పుడూ చేశేవాళ్ళు.. ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూడు అని కాస్త చేతిలో వేస్తే నేను తిని లొట్టలేశానంట (నాకసలు గుర్తులేదు)! ఇక అప్పటి నించీ చిన్న నేతిగిన్నెలో పెట్టి ఇచ్చేవారు.. ట్యూషన్ కి వెళ్ళడం ఆపేసినా ఇల్లు ఒకే సందులో కాబట్టి ఆవిడ చాలా రోజుల వరకూ పంపారు.. మీ టపా చూడగానే ఆ ఇంగువ, ఆవ వాసన మళ్ళీ గుర్తుకొచ్చి ఆత్మారాముడు మారం చేస్తున్నాడు :-)
    మీ రెసిపీని అక్షరం తప్పకుండా ఫాలో అయిపోయి వెంటనే వండేయాలి :-)


  7. Anonymous Says:
    December 2, 2010 at 10:10 AM

    నాకు ఇష్టమైన, చాలా రుచికరమైన కూర గురించి వ్రాసారు.
    ఇది చెయ్యడం ఒక ఆర్టు. అందరికీ రాదు.


  8. నేస్తం Says:
    December 2, 2010 at 10:11 AM

    కెవ్వ్ తృష్ణ మీ బ్లాగ్ నేను ఎలా మిస్ అయ్యాను.. ఇక్కడ కంద దొరుకుతుంది ..బచ్చలి దొరకదు..ఇప్పుడెలా :(


  9. ఆత్రేయ Says:
    December 2, 2010 at 11:08 AM

    ఎక్కడో కొడితే ఎక్కడో రాలినట్లు మీ కంద బచ్చలి చదివి మా నాన్న గుర్తొచ్చారు( మర్చిపోయానా?) ఆయనకీ చాలా ఇష్టం
    చాలా మంది కొడుకుల్లాగానే ఆయన ఉన్నప్పుడు ఆ కూర నేను పట్టించుకోలేదు (కుర్ర తనం వల్ల) ఇప్పుడు ఆ కూర నాకూ ఇష్టమే
    ఇంకా, నేనూ బాగా చెయ్యగలను మా నాన్న ని తలచుకుంటూ..
    పెళ్ళిళ్ళలో ఈ కూర వండటానికి మీరు చెప్పినా కారణం చాలా బాగుంది.
    ప్రతి తెలుగు వాళ్ళు తెలుసు కోవాల్సిన విషయం
    నేను మా అమ్మాయి పెళ్ళిలో తప్పక వండిస్తా
    కంద బచ్చలి ..
    భోజన ప్రియా నెచ్చలి..
    ఆనందామృత.. లాలాజల వర్షిణి


  10. సత్యసాయి కొవ్వలి Satyasai Says:
    December 2, 2010 at 12:51 PM

    very tasty post. i feel like eating curry immediately. You forgot about its calcium content. It is rich in calcium. It also causes irritation of tongue (not always,of course).


  11. Surya Mahavrata Says:
    December 2, 2010 at 4:06 PM

    మీరు ప్రదర్శించింది ఏ దేశం బచ్చలికుమారి ఫోటోనో గాని, కన్నాల్లేని బచ్చలాకుని చూసి దశాబ్దాలు దాటిపోయిందండి. బ్లాగూ చిత్రాలూ కూడా కందాబచ్చలి లాగే పసందుగా కుదిరాయి.


  12. తృష్ణ Says:
    December 2, 2010 at 5:58 PM

    @సునీత: కేబేజీ కయితే తెలుసండి,బీరకాయ వాసనా? ఇష్టం కాబట్టి ఇన్నాళ్ళూ తెలియలేదేమో నాకు.
    సరే మీ కోరిక తప్పక తీర్చేస్తాను...:)

    @బాలు: భలే భలే..బాగుందండీ. అసలు ప్రతీ ఇంట్లో ఒక బచ్చలి తీగో,మొక్కో తప్పకుండా చూసేదాన్ని చిన్నప్పుడు. మట్ట బచ్చలి ఆకులు కోసేసాకా ఆ కాడ పాతితే చిగుర్లు వచ్చేసేవి.


  13. తృష్ణ Says:
    December 2, 2010 at 6:04 PM

    @ఇందు: మా నాన్నగారు చెప్తూడేవారండీ పెళ్ళిల్లలో ఇందుకు చేస్తారు అని. మా పెళ్ళిలో కూడా చేసారు...:)

    @కృష్ణప్రియ: థాంక్స్ అండీ.

    @కొత్తపాళీ: మా నాన్నగారికి, అన్నయ్యకూ కూదా బచ్చలి చాలా ఇష్టం. నాకు మెంతికూర,తోటకూర ఫేవొరేట్స్.
    ఈసారి ఇండియా వచ్చినప్పుడు నాలుగు బచ్చలి గింజలు(నల్లగా బచ్చలి తీగలకు ఉంటాయి కదా) పట్టుకెళ్ళి ఓ కుండీలో వెయ్యండి. చక్కని తీగ అమెరికాలో కూడా వచ్చేస్తుంది.
    మెచ్చుకోలుకు చాలా చాలా థాంక్సండి...:)


  14. తృష్ణ Says:
    December 2, 2010 at 6:06 PM

    @నిషిగంధ: అయితే ఈపాటికి వండేసి ఉంటారని అనుకుంటున్నాను...భలే సంతోషమైంది మీ వ్యాఖ్య చూసి.

    @బోనగిరి: అవునండి. మా నాన్నగారు అనేవారు కంద బచ్చలి, తోటకూర పులుసు ఆవ పెట్టి వండగలిగితే వంట వచ్చేసినట్లే అని.


  15. తృష్ణ Says:
    December 2, 2010 at 6:11 PM

    @నేస్తం: ఈసారి నేనూ కెవ్వ్...మొన్న సంగీతప్రియ బ్లాగ్లో చిన్నిగారు కూడా ఆ బ్లాగ్ గురించి తెలీదన్నారు. ఇప్పుడు మీరు...:( సరే ఓసారి మా ఇంటివైపు వచ్చేయండి తపాలోనిది పెద్ద బచ్చలి తీగ... కావాల్సినంత కోసుకువెళ్ళచ్చు.

    @ఆత్రేయ: :) :) తప్పక మీ అమ్మాయి పెళ్ళిలో చెయించండీ.
    కొన్ని కొన్ని విషయాల ప్రాముఖ్యత లేట్ గానే తెలుస్తూ ఉంటుందండీ..!


  16. తృష్ణ Says:
    December 2, 2010 at 6:14 PM

    @సత్యసాయి కొవ్వలి: అవునండి హడావుడిలో మర్చిపోయాను.
    "కందకు లేని దురద కత్తిపీటకెందుకు" అనే సామెత కూడా ఉందండోయ్.

    @సూర్య: అక్షరాలా మన దేశపు బచ్చలేనండి. ఆయ్..అందునా మా పెరటిలోని మొక్కండి. విజయవాడలో ఉన్నన్నిరోజులూ నేనూ చిల్లుల బచ్చలినే చూసేదాన్నండి.


  17. తృష్ణ Says:
    December 2, 2010 at 6:16 PM

    చివరిగా వ్యాఖ్యాతలందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే వ్యాఖ్యలు చూసాకా ఇంక ఆకలెయ్యటంలేదు...:)


  18. రాధిక(నాని ) Says:
    December 2, 2010 at 7:09 PM

    "కంద బచ్చలి కూర మేము ఎప్పుడు చేయలేదు.మీ పోస్ట్ చూస్తుంటే ఆబ్బా.. నోరూరిపోతుంది. తప్పకుడా చేసేస్తా.


  19. Anonymous Says:
    December 3, 2010 at 9:06 AM

    తృష్ణ గారూ
    నేను కందబచ్చలి కూర.విన్నాను కాని ఎప్పుడూ తినలేదు. ఫ్రెండ్స్ దగ్గర వినడమే. మేము బచ్చలి పప్పు, పులుసు మాత్రమే చేస్తాము. ఈ సారి ట్రై చెయ్యాలి. చూడడానికే చాలా బాగుంది. నాకు ఆవ పెట్టిన కూరలు అంటే కూడా చాలా ఇష్టం. అందరి కామెంట్స్ చదివి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉంది.
    కొత్తపాళీ గారూ, అయ్యో, మీకు బచ్చలి దొరక లేదా డెట్రాయిట్ లో. చైనీస్ / oriental గ్రోసరీ షాపులో సీజన్లో ఎక్కువగానే దొరుకుతాదండీ. నేను ఒకసారి పది ఏళ్ళ క్రితం అక్కడ numdE తీసుకొచ్చి, ఒక కొమ్మ నాటితే అది, అచ్చం తృష్ణ గారు పెట్టిన బొమ్మలో లాగే విపరీతంగా పెరిగింది. ఆ మొక్క నుంచి వచ్చిన విత్తనాలు దాచి తరువాత సంవత్సరం వేసేదాన్ని. ఒకసారి ఆ షాప్ లో ట్రై చెయ్యండి.
    పద్మవల్లి


  20. తృష్ణ Says:
    December 3, 2010 at 10:31 AM

    @రాధిక(నాని): ఇంకేం త్వరగా చేసేయండి మరి..మా అన్నయ్య కూడా బ్లాగులో ఫోటో పెడితే ఎలా వచ్చేప్పుడు కాస్త బచ్చలాకు పట్రమ్మని ఫోను..:)

    @పద్మవల్లి:బచ్చలితో పచ్చడి చలా బాగుంటుందండీ. మజ్జిగ పులుసు,తోటకూర పులుసు లాగ ఆవ పెట్టి పులుసు కూడా చేస్తాము మేము.ఈసారి కూర కూడా ట్రైచేయండీ.

    @కొత్తపాళీగారూ, పద్మవల్లి గారు చెప్పినట్లు ఆ బచ్చలి కొమ్మేదో తెచ్చి వేసేసుకోండి త్వరగా.


  21. ఆ.సౌమ్య Says:
    December 3, 2010 at 12:51 PM

    ఏవండీ ఇది చాలా అన్యాయం....గోదావరి జిల్లాలోనే కాదండీ ఉత్తరాంధ్రలో కూడా కందబచ్చలి కూర పెళ్ళిళ్ళలో 95% ఉంటుంది. పసపొట్టు కూర, కంద బచ్చలి సర్వసాధారణం.

    నాకు చాలా ఇష్టమైన కూర.


  22. తృష్ణ Says:
    December 3, 2010 at 2:31 PM

    @ఆ.సౌమ్య:అవునాండీ? మా జిల్లాలో వండుతారని నాకు తెలిసింది చెప్పానండి. అంతే...:)


  23. కొత్త పాళీ Says:
    December 3, 2010 at 7:01 PM

    పద్మవల్లిగారు, ఆ లీడ్ ఇచ్చినందుకు నెనర్లు. కొన్నేళ్ళ కిందట సరిగ్గా ఆ పనే చేశాను, కానీ ఆ ఆకు తీవ్రమైన గమేక్సిన్ వాసన కొట్టి వొండిన పప్పు కూడా పారేశా. ఆ తరవాత మళ్ళీ ఎప్పుడూ కొనే సాహసం చెయ్యలేదు. ఇప్పుడేవన్నా పరిస్థితి మారిందేమో.


  24. Anonymous Says:
    December 3, 2010 at 9:21 PM

    తృష్ణ గారూ
    బచ్చలి పచ్చడి వినలేదండీ. ఎలా చెయ్యాలో చెప్తారా ప్లీజ్.

    కొత్తపాళీ గారూ, చెప్పడం మర్చి పోయాను.చైనీస్ గ్రోసరీ షాపులో విత్తనాలు కూడా ఉంటాయండీ. బచ్చలి, పొట్ల బీర, కాకర, తోటకూర, పొడుగు చిక్కుడు, మిర్చి అన్నీ ఉంటాయి. ఇల్లు కొన్న కొత్తలో ఇండియా కి వెళ్ళాక ముందు అక్కడే కొన్నాను విత్తనాలు అన్నీ. బీరకాయలు అయితే ఒకసారి ఒక్కోటీ మూడు అడుగుల పొడవు పైన వచ్చాయి, ఎంతో లేతగా కూడా ఉంటాయి పెద్దగ పెరిగినా సరే.

    పద్మవల్లి


  25. కొత్త పాళీ Says:
    December 4, 2010 at 7:56 PM

    @ Padmavalli ..
    Now you are really tempting me :)
    There are too many chinese/oriental grocery stores around. Could you point out which area? Which market - if you remember? Like, say - Troy, Farmington Hills, etc?


  26. Anonymous Says:
    December 5, 2010 at 9:09 PM

    kottapaali garu

    I used to live in TN for more than 10 years, but now I moved to VA. There indian vegetables are very very expensive in Indian grocery stores than the chinese stores, so we all used to buy from there. We never had any problem. infact they they are much fresh and get more variety there than in Indian stores. sorry that you had bad experience there. Only problem vegetarian people find there is initial strong smell from the different NV foods they carry. But people get used to it by the time.

    I don't have any idea in your area. But I have a friend there so I can find out and send you the mail from your blog.
    Hope you get some next year.


Post a Comment

« Newer Post Older Post »
"Health is Wealth."

ఇక్కడ వెతకండి..

'రుచి' చూసినవారు

పంచుకున్న రుచులు

  • ►  2015 (3)
    • ►  March (3)
  • ►  2014 (24)
    • ►  December (2)
    • ►  November (2)
    • ►  September (1)
    • ►  July (2)
    • ►  June (4)
    • ►  May (3)
    • ►  April (2)
    • ►  March (7)
    • ►  January (1)
  • ►  2013 (32)
    • ►  December (3)
    • ►  September (4)
    • ►  August (2)
    • ►  July (3)
    • ►  May (1)
    • ►  April (8)
    • ►  March (3)
    • ►  February (1)
    • ►  January (7)
  • ►  2012 (26)
    • ►  December (1)
    • ►  November (3)
    • ►  October (5)
    • ►  June (4)
    • ►  May (5)
    • ►  April (1)
    • ►  March (1)
    • ►  February (4)
    • ►  January (2)
  • ►  2011 (35)
    • ►  December (3)
    • ►  November (6)
    • ►  September (3)
    • ►  August (4)
    • ►  June (2)
    • ►  May (4)
    • ►  April (6)
    • ►  March (5)
    • ►  February (2)
  • ▼  2010 (14)
    • ▼  December (6)
      • మెంతికూర-పనీర్ రైస్
      • స్పాంజ్/స్టీం దోశ
      • శీతాకాలంలో బూడిదగుమ్మడి వడియాలు + అట్టు ?!
      • కాలీఫ్లవర్ ఆవకాయ
      • khakhra...a healthy snack !!
      • కంద బచ్చలి కూర
    • ►  September (4)
    • ►  August (1)
    • ►  June (3)

About

ఇవి కూడా నావే

  • తృష్ణ...
    ఒక కలయిక
    1 month ago
  • మనోనేత్రం
    Millet fest - 2015
    10 years ago
Powered by Blogger.

రుచులు - రకాలు

  • chutneys n పచ్చడ్స్ (19)
  • cooking tips (1)
  • experiments (10)
  • Kitchen Essentials (1)
  • pulses (3)
  • quick & easy (4)
  • recipe links (1)
  • rotis (2)
  • salads (7)
  • snacks n sweets (19)
  • soups and appetizers (2)
  • tiffins (24)
  • అట్లు - రకాలు (6)
  • ఊరగాయలు-రకాలు (12)
  • ఒడియాలు (3)
  • కూరలు (25)
  • చారులు రకాలు (1)
  • టీలు - రకాలు (1)
  • దోశలు రకాలు (7)
  • పప్పులు (4)
  • పులిహోర (4)
  • పులుసులు (2)
  • పెరుగు పచ్చడి (2)
  • మన పిండివంటలు (2)
  • రకరకాల పొడులు (2)
  • రైస్ వెరైటీస్ (6)
  • వేసవి పానీయాలు (7)

'రుచి' ఇష్టపడేవారు

Copyright (c) 2010 రుచి...the temptation. Design by Template Lite
Download Blogger Templates And Directory Submission.