వంటింట్లో ప్రయోగాలు చేసి చాలా కాలమైంది. ఏదన్నా చేద్దామని బుధ్ధి పుట్టింది. నాకు రకరకాల రైస్ వెరైటీస్, బిర్యానీలూ చేయటం, తినటం కూడా ఇష్టం. దంపుడు బియ్యం తినటం మొదలెట్టాకా రైస్ వెరైటీస్ చెయ్యటమే తగ్గింది. సరే ఓ రోజుకి ఎక్సెప్షన్ అనేసుకుని అప్పుడప్పుడూ ప్రయోగాలు చేస్తూంటాను. ఆ క్రమంలో మొన్నొక రోజున చేసినదే "మెంతికూర, పనీర్ రైస్". ఇది నాకు ఒక ఫ్రెండ్ చెప్పింది. నేనూ ఇదే మొదటిసారి వండటం. నాకయితే బానే వచ్చింది.
కావాల్సిన పదార్ధాలు:
బియ్యం ఒక గ్లాస్
మెంతికూర రెండు కట్టలు(మీడియం సైజ్)
పనీర్ వంద గ్రాములు(ఇష్టముంటే 150gms కూడా వాడుకోవచ్చు.)
పచ్చిమిర్చి రెండు
అల్లం రెడంగుళాలు ముక్క
కొత్తిమీర ఒక చిన్న కట్ట
పుదీనా ఒక చిన్న కట్ట
పుల్లపెరుగు రెండు కప్పులు
అల్లం,వెల్లుల్లిపేస్ట్ రెండు స్పూన్లు
బిరియానీ మసాలా పౌడర్ ఒక స్పూన్ ( బిరియానీ పౌడర్ బదులు నేను "ప్రియబిరియానీ పేస్ట్" వాడుతూ ఉంటాను. ఆ టేస్ట్ బాగుంటుంది. ఇందులో ప్రయత్నించవచ్చు.)
నెయ్యి మూడు పెద్ద చెంచాలు
ఉల్లిపాయ ఒకటి(పెద్దది)
టమాటా ఒకటి(పెద్దది)
కొద్దిగా నూనె
ఉప్పు తగినంత
తయారీ:
* మెంతి, కొత్తిమీర, పుదీనా ఆకులు కాడలు లేకుండా తీసేసి కడిగి పెట్టుకోవాలి. కొత్తిమీర, పుదీనా ఆకులు గ్రైండ్ చేసుకుని ఉంచుకోవాలి.
* అల్లం,పచ్చిమిర్చి చీలికల్లాగ తరిగి ఉంచుకోవాలి. ఉల్లిపాయ.టమాటా కూడా తరిగి ఉంచుకోవాలి.
* చిలికిన పెరుగులో ఉప్పు, పసుపు, ఒక చెంచా అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి చిన్నగా తరుక్కున్న పనీర్ ముక్కలు అందులో వేయాలి. ఆ ముక్కలను అలా ఓ అరగంట పాటు నానబెట్టాలి.
* బిరియానీ రైస్ కాస్త నెయ్యి వేసి వండేసి, ఉప్పు కలిపేసి పొడిగా ఆరబెట్టుకోవాలి.
* ఒక పేన్ లో కానీ పెద్ద మూకుడులో కానీ నెయ్యి లేక నూనె వేసి మిర్చి, తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వలి. తరువాత ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లో వేయాలి. తరువాత కడిగి ఉంచుకున్న మెంతిఆకు అందులో వేయాలి. మాడకుండా కలుపుతూ ఉండాలి. మెంతిఆకు వేగాకా అందులో నానబెట్టిన పనీర్ ముక్కలు, బిరియానీ మసాల పౌడర్, గ్రైండ్ చేసుకుని ఉంచిన కొత్తిమీర-పుదీనా పేస్ట్, కావాలంటే ఒక చెంచా కారం వేసి అందులో ఒక గ్లాస్ నీళ్ళు పోసి బాగా మగ్గనివ్వాలి.
* పైన మిశ్రమం దగ్గర పడినట్లుగా అనిపించాకా ఇందాకా పొడిపొడిగా పెట్టుకున్న రైస్ అందులో కలపాలి. టేస్ట్ చూసి కావాలంటే, ఉప్పు కారాలు కలుపుకోవచ్చు. మిగిలిన నెయ్యి కూడా అందులో కలిపేయాలి.
* ఒక ఐదు పది నిమిషాలు మొత్తం రైస్ ను పొయ్యి మీడ లో ప్లేమ్ లో ఉంచి ఆ తరువాత దింపుకోవాలి. కొత్తిమీర, కాస్త గ్రేట్ చేసిన పనీర్ తో డేకరేట్ చేసి సర్వ్ చెయ్యాలి.
* ఇందులోకి మామూలుగా బిరియాలీల్లోకి చేసుకునే ఉల్లిపాయ,పెరుగు రైతా బాగుంటుంది. అందులో ఒక కేరెట్ కూడా గ్రేట్ చేసుకుని కలిపితే బాగుంటుంది.
* ఇది రెగులర్ బిరియానీ టైప్ కాదు కాబట్టి వెరైటీగా ఉంటుంది. పైన ఫోటోలో నేను చేసినది మామూలు బియ్యంతోనే. బాస్మతీ రైస్ తో అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది.