నిన్ననే నా కోసం కాలీఫ్లవర్ కూర చేసుకుంటూ కాసిని ముక్కలు పక్కన పెట్టాను నా మటుకు కాస్తంత ఆవకాయ చేసుకుందామని. ఇంట్లో ఎవరూ కాలీప్లవర్ గానీ, కాలీప్లవర్ ఆవకాయ గానీ తినరు మరి. ఇప్పుడిప్పుడే శ్రీవారికి, పాపకూ అలవాటు చేస్తున్నా. ఇంతకీ నోరూరించే బుల్లి డబ్బాడు కాలీఫ్లవర్ ఆవకాయ రెడీ చేసేసాను.
చాలామందికి తెలిసే ఉంటుంది. తెలీనివాళ్ళకు ఎలాగో చెప్పనా మరి..
(పదార్ధాల పాళ్ళు వేసే ముక్కలను బట్టి ఉంటుంది. అందుకని కొలత రాయటం లేదు.)
చిన్నగా తరిగిన కాలీఫ్లవర్ ముక్కలు
ఆవ పొడి, పచ్చికారం : సమానంగా
ఉప్పు పైవాటికి కాస్త తక్కువగా
నూనె తగినంత( మామూలుగా నేను వంటలోకి ఏ నూనె వాడినా టెంపరరీఆవకాయకు మాత్రం పప్పు నూనె వాడతాను. టేస్ట్ బాగుంటుంది అని)
ఒకటి, రెండు చెంచాల నిమ్మరసం(సగం పువ్వుకి ఒక నిమ్మకాయ చాలు)
ముందు ఆవ,కారం, ఉప్పు పొడివే బాగా కలుపుకోవాలి. తరువాత నూనె వేసి పిండి కలిసేలా కలుపుకోవాలి. తరువాత కాలీఫ్లవర్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. నిలవ ఉండటానికి నిమ్మరసం వాడతాం అన్నమాట. కొంతమంది కూర ముక్కలను ఆవకాయ కలిపే ముందు కొద్దిగా వేయిస్తారు. కానీ నాకు అలా నచ్చదు. త్వరగా ముక్కలు మెత్తగా అయిపోతాయి. నేనయితే పచ్చి ముక్కలతోనే ఆవకాయ పెడతాను. ఇది ఓ వారం రోజులకు సరిపడా అయితే బాగుంటుంది. అంతకన్నా ఎక్కువ నిలవ ఉంటే ముక్కలు బాగా మెత్తగా అయిపోయి టేస్ట్ కూడా మారిపోతుంది.
మీరు కూడా పెడతారా కాలీఫ్లవర్ ఆవకాయ? అయ్యో నేను న్యూ యియర్ సందర్భంగా చెప్దామనుకున్నానే? సరే సరే. థాంక్స్ ఫర్ షేరింగ్. నాకు శ్రమ తగ్గింది :)
"The best way to a man's heart is through his stomach."
ఇది మటుకూ బ్రిలియంటండీ. అంతే కాదు. వండే వాళ్ళెవరైనా గుర్తుంచుకోవాల్సింది మన ఆకలి ఎంతో ఎదుటి వాళ్ళదీ అంతే అని.