ఆదివారం పొద్దున్నే నాన్నకు ఫోన్ చేసి నాన్నా, పొద్దున్నే వడియాలు పెట్టేసా అని ఆనందంగా చెప్పా. "ఏమిటే శీతాకాలంలో వడియాలు పెట్టే మొహం నువ్వూనూ..ఎండేదే? అన్నారు నవ్వుతూ. "మా కొత్త ఇంట్లో మేడ మీద బోలెడు ఎండ. మీ మనవరాలు రోజూ అమ్మా బోలెడు ఎండ వస్తోందే. ఏవన్నా వడియాలు పెట్టుకుందాం అని ఒకటే గొడవ." అన్నాన్నేను. మొన్నటి దాకా అపార్ట్మెంట్లో ఎండ మొహం కూడా తెలియక ఆరేసిన బట్టలు రెండురోజులకు ఆరటమే తెలుసు మాకు. అలాంటిది ఒక్కసారిగా ఈ కొత్తింట్లో స్వచ్ఛమైన, సహజమైన, చుర్రుమనే ఎండను చూడగానే మా ప్రాణాలు కుదుటపడటమే కాక నాట్యం చేయటం కూడా మొదలెట్టాయి.
ఇక పక్క వీధిలోని కూరల కోట్లో బూడిదగుమ్మడికాయలు చూసినప్పటి నుంచీ మనసు అటే లాగటం మొదలెట్టింది. ఎప్పుడో కాలేజీలో ఉన్నప్పుడు పెంచిన బూడిదగుమ్మడి పాదు, పండించిన పంచిన గుమ్మడి కాయలు, పెట్టిన వడియాలు అన్నీ గుర్తుకొచ్చేసాయి. ఓ శుభ ముహుర్తాన వెళ్ళి బేరమాడి ఒక బుల్లి బూడిదగుమ్మడికాయ కొనేసాను. ఇక శనివారం రాత్రి ముక్కలు తరిగేసాను.
వాటిని ఉప్పేసి మూటగట్టి నీళ్ళబిందె క్రింద పెట్టాను. చిన్నప్పుడు అమ్మ అయితే రోలు క్రింద పెట్టేది. మినపప్పు నానబెట్టి ఉంచాను. ఆదివారం పొద్దుటే ఇంగువ, పచ్చిమిర్చి,ఉప్పు వేసి పప్పు గ్రైండ్ చేసి ముక్కల్లో కలిపేసాను. మినప్పిండి నేను ఎక్కువ కలపను. ఈ వడియాలు గుల్లగా ఉంటేనే టేస్ట్ బాగుంటాయి. అమ్మ కొన్ని పచ్చి మిరపకాయలతోనూ, కొన్ని పండు మిరపకాయలతోనూ కలిపి పెట్టేది.
ఇక ప్లేస్టిక్ కవర్ పెట్టుకెళ్ళి మాకోసమే అన్నట్లు డాబా మీద మధ్యలో ఉన్న సిమెంటు బెంచీ మీద వడియాలు నిర్విఘ్నంగా పెట్టేసాను. రెండు రోజుల్లో శుభ్రంగా వడియాలు రెడీ అయిపోతాయి.
ఇక కాస్తంత పిండి అట్టు వేసుకోవటానికి దాచాను. బూడిద గుమ్మడి వడియాలు నాకు చాలా ఇష్టం. అలానే ఈ వడియాల పిండితో వేసే అట్టు కూడా నాకు భలే ఇష్టం.అన్నం తినే ముందు వేడి వేడిగా వేసుకుంటే బాగుంటాయి.
ఇదిగో ఇలా ఒక బుల్లి అట్లు రెండు వచ్చాయి. వేస్తూ వేస్తూనే ఒకటి లాగించేసాను, పోటీకెవరూ లేరు కాబట్టి అన్నంలోకి ఒకటి వేసుకున్నా.
సూపరు..నోరూరించేస్తన్నై...అంత పెద్ద ముక్కలు కాకుండా సన్నగా తరిగి కాని,తురుము పట్టికాని చేస్తే చిన్నగా,గుల్లగా ఉండి ఇంకా అదిరిపోతాయ్..మేం ఏ మిర్చీ వెయ్యం..ః)
మీరు ప్లాస్టిక్ పైన పెట్టారు - పర్వాలేదాండీ!
వేయించిన గుమ్మడి వడియాలు మాత్రం ఫొటొ పెట్టకండి, నాకు నోరూరిపోతుంది.
@కౌటిల్య: మిర్చి వెయ్యరా? మరి చప్పగా ఉండవా?
అవి ఎండాకా చిన్నగానే అయిపోతాయండీ. అయినా అంత పెద్దవి తరిగితే అవి వేగినప్పుడు ఉబ్బినట్లయి ఇంకా పెద్దవి అవుతాయి కదాండీ..అది నాకు మరీ ఇష్టం. అందుకని అలా తరిగానన్నమాట.thankyou.
@అనిర్విన్: వడియాలు ప్లాస్టిక్ కవర్ పైన పెట్టడమే నాకు తెలుసండీ. అది మంచి ప్లాస్టిక్ కవరేలెండి. ఈ కొత్త డౌట్ సంగతి కనుక్కోవాలి అయితే.
వేయించాకా ఫోటో పెట్టను లెండి. నేను తినేస్తా కదా మిగలవు ఫోటో తియ్యటానికి...:)
thankyou.
చప్పగా ఏమీ ఉండవండీ...తగినంత ఉప్పు పడుతుందిగా...
కాని ఈ సారి అమ్మని, మీలా పెద్ద ముక్కలతో,మిర్చితో ట్రై చెయ్యమని చెప్పాలి...