ఫోటోలో సాంబార్లో ముక్కలేవి అని చూస్తున్నరా? ములక్కాడ, ఉల్లిపాయ, టమాటా, కేరెట్, ఆనపకాయ మొదలైన అన్ని ముక్కలు ఉన్నాయి. గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసరికీ అడుక్కి వెళ్ళిపోయాయి..:) అందుకే కనిపించటం లేదు.
వంటింట్లో పరిశోధనలు చేసే కాలేజీరోజుల్లో సాంబారు బాగా చెయ్యటానికి కొన్ని కిటుకులు నేర్చుకున్నా. ఆ తరువాత సాంబార్ పౌడర్ కూడా ఇంట్లోనే తయారుచేయటం తెల్సుకుని అదే పద్ధతి ఫాలో అయిపోయి ఘుమఘుమలాడే సాంబార్ రెడీ చేసేస్తూంటాను. నాకు సాంబార్ స్పెషలిస్ట్ అని పేరు కూడా ఉంది తెలుసా? నిఝంగా ! మరి మీరు ఇలా చేసేసి మీ ఇంట్లో మార్కులు కొట్టేయండి.
సాంబార్ పౌడర్ తయారీకి కావాల్సినవి:
ధనియాలు - 1 1/2 కప్పులు
శనగపప్పు - 3/4 కప్పు
మినప్పప్పు- 3/4 కప్పు
కందిపప్పు - 1/2 కప్పు
బియ్యం - 1/4 కప్పు
జీలకర్ర - 1 చెంచా
మెంతులు - 1 చెంచా
పసుపు - 1 1/2 చెంచా
మిరియాలు - 1 1/2 చెంచా
ఎండు కొబ్బరి - 1/2 కప్పు
* ముందుగా ఒక పొడి మూకుడులో ధనియాలు,జీలకర్ర ఎర్రగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
* తరువాత శనగపప్పు, కందిపప్పు, మినపప్పు, బియ్యం,మెంతులు, మిరియాలు కలిపి ఎర్రగా, మాడకుండా వేయించాలి.
* స్టౌ ఆపేసాకా వేడిమీద ఎండు కొబ్బరి పొడి, పసుపు వేసి బాగా కలిపిఉంచాలి.
* మొత్తం చల్లారాకా మెత్తగా గ్రైండ్ చేయాలి.
* ఈ పౌడర్ నెలరోజులు దాకా నిలవ ఉంటుంది. నేను నెలకోసారి ఈ పౌడర్ చేసుకుంటూ ఉంటాను.
* పప్పులన్నీ వేగడాన్ని బట్టి సాంబార్ రుచి ఆధారపడి ఉంటుంది. (ఆ వేగడాన్ని బట్టి నెలకో రుచి వస్తూంటుంది నా సాంబార్ కి.)
ఇది కాక మరొక ముఖ్యమైన టిప్ ఉంది. అది ఏంటంటే ఒక మీడియం సైజ్ టమాటా + ఉల్లిపాయ ముక్కలు తరిగి ఒక చెంచా నూనెలో మాడకుండా వేయించి, తాజా కొబ్బరి కోరు ఒకటి లేక రెండు చెంచాలు దాంట్లో కలిపి ఒక నిమిషం తరువాత దింపేసి దాన్ని మెత్తగా గ్రైండ్ చేసి మరుగుతున్న సాంబార్లో వేస్తే ఆ రుచి అద్భుతం.
మీ ఇంట్లో చేసాకా ఎలా వచ్చిందో చెప్పాలి మరి..
సూపరు టిప్స్ చెప్పారండీ..ఈసారి సాంబార్ పొడి ఇంట్లో చేసి చూస్తాను.
@ఆ.సౌమ్య:చాలా బాగా వస్తుందండి. మా అదివర్కూ మా పక్కింట్లో ఉండే మార్వాడీ వాళ్ళను భోజనానికి పిలిస్తే ఉత్తి సాంబారే (అన్నంలో కలుపుకోకుండా) బావుందని రెండేసి కప్పులు లాగించేసేవారు.
Thank you.
తృష్ణగారు!
ఈ పదార్థాలు చూస్తుంటే కన్నడ సాంబార్ పొడి లా ఉంది. కానీ ఇన్నాళ్ళు కొలతలు తెలీలేదు. కొలతలతో సహా ఇచ్చినందుకు వెరీ వెరీ థాంక్స్.
ఇప్పుడు కొన్ని సందేహాలు..
ఈ పొడి ని నీట్లో కలిపేసి ముక్కలేసి మరిగిస్తే చాలా.లేక కంది పప్పు ఉడికించి కలపాలా?
నీట్లో అయితే ఎన్ని కప్పులకి ఎన్ని స్పూన్లు?
కందిపప్పయితే ఎన్ని స్పూన్లెయ్యాలి.
మీరు ఫుటో లో పెట్టింది భలే టెంప్టింగా ఉంది.
అది ఎలా చేశారు? నీట్లోనా లేక కందిపప్పు తోనా?
అసలు, సాంబారు కి పులుసు కి తేడా ఎంటీ. అబ్బే ఏమీ లేదు . మాది రాయలసీమ.
మేం పులుసు నే సాంబారు అంటామన్నమాట. చింతపండు పులుసు వేసి చేస్తే పులుసు అంటారని , వెయ్యకుండా చేస్తే సాంబార్ అంటారని నాలో నేనే నమ్మకంగా అనేసుకున్నా. కాస్త డౌట్ క్లియర్ చెయ్యండి.
లాస్ట్ లో చెప్పిన టిప్పు(సుల్తాన్)సూపరు... మళ్ళీ థాంక్సులు
ఆర్ గారూ, మాకు తెలిసిన ఒక కన్నడా ఆంటీ చెప్పారండి ఇది. సాంబార్ ప్రోసీజర్ అంతా మామూలే. బయట కొన్న పొడి బదులు ఈ పొడి వాడటం అంతే. కందిపప్పు లేకుండా సాంబార్..... ఎలాగండీ? నే చేసినది కందిపప్పు ఉన్నదే. కండిపప్పు, ముక్కలు విడి విడిగా ఉడికించి, తరువాత చింతపండు రసం తీసుకుని కలిపి, ఇంట్లో చేసుకున్న సాంబార్ పౌడర్ కూడా కలిపి, లాస్ట్ లో నేను రాసిన ముద్ద కూడా కలిపి, పచ్చి మిర్చి చీలిక చేసి వేసి,కొత్తిమీర కూడా కలిపి మొత్తం బాగా మరిగించాలి. ఆఖరులో ఆవాలు,మెంతులు,ఇంగువ,ఎండు మిర్చి, కర్వేపాకు వేసి పోపు పెట్టుకోవాలి. అదన్నమాట.
ఇక సాంబారుకీ,పులుసుకీ తేడా ఏంటంటే, పులుసులో సాంబార్లో వేసినంత పప్పు వెయ్యరు. కొన్ని పులుసుల్లో అసలు పప్పే వెయ్యరు. చింతపండు పులుసు రెండిటిలోనూ ఉంటుంది. వాటి గురించి కూడా రాస్తానండి త్వరలో.
Thanks for the comment.
సాంబార్లో ధనియాలు, మిరియాలు వేస్తారా!? చారుపొడిలో వేస్తారని తెలుసు. పులుసు పొడి రాశాక, చారు పొడి రాయకపోవడం భావ్యం కాదు, రాసేయండి. తేడా ఏమిటో తెలుసుకోవాలని వుంది. పప్పులు వుండవు అనుకుంటా.. చారు అంటే కోస్తాంధ్ర చారులో పసులుతప్ప ఏమీ వుండదనుకుంటా. చారంటే రాయలసీమ చారే! కంది పప్పు, టమేటా, కొత్తిమిరి లేనిచారు చారు కాదని పాకపురాణంలో నలుడు, దమయంతికి వంటనేర్పేటప్పుడు గరిట తిప్పుతూ చెప్పాడంటారు, అయ్యుండచ్చు. :)
బాగున్నాయి టిప్స్ .
@snkr: నాకు తెలిసిన రకరకాల చారులు, పులుసులు - రకాలు అన్నీ వరుసగా వస్తాయండి...చూస్తూ ఉండాలి మరి..!
అయినా చారు లో చక్కగా చింతపండు, ఉప్పు, నాలుగు మిరియాలు, కొత్తిమీర వేసి మరిగించి ఇంగువ పోపు పెడితే ఏ చారుపొడీ అక్కర్లేదని నా వ్యక్తిగత అభిప్పిరాయం అండి...:)
ఊ...మా ఇంట్లో కూడా ఇదే రెసిపీ! ఎండుకొబ్బరి వేయను నేను. చివర్లో ఒక స్పూను పచ్చి కొబ్బరి తురుము వేస్తాను సాంబార్లో!
నేను నెలరోజులక్కూడా చేయను. ఎప్పటికప్పుడు రెండు స్పూన్ల చొప్పున చేసేసి ఫ్రెష్ గా వేసేస్తాను.
తృష్ణగారూ,
మీక్కాదనుకోండి...చూస్తన్న మరికొందరికి ఉపయోగపడొచ్చు...అదేంటంటే..సాంబారుచేస్తున్నప్పుడు ముక్కలు ఉడికాక, చింతపండు రసం చేర్చాక..ఉడికిన కందిపప్పు వేస్తాం కదా.ఆ ఉడికిన కందిపప్పు, పచ్చి కొబ్బరికోరు...ఇందాక మీరు చెప్పిన సాంబారుపొడిగానీ, బజారులోదొరికే సాంబారుపొడిగానీ రెండు పెద్దస్పూన్లు వేసి గ్రైండరులో కొంచెం జారుగా తిప్పి...ఉడుకుతున్నరసంలో పోసి ఒక్కఉడుకు వచ్చేవరకు ఉంచి..కొత్తిమీర వేసి దింపితే ఉంటుంది రుచీ.ఆహ్..అంటే పప్పు వేసామని తెలీకుండా చిక్కగా పులుసులో కలిసిపోతుందన్నమాట.
@సుధ: బావుందండి టిప్. పప్పు బద్దల్లా కన్నా కలిసిపోతేనే రుచి. కానీ పప్పు బాగా ఉడికాకా 'పావ్ భాజీ మేషర్'తో బాగా మేష్ చేసేస్తే గ్రైండ్ చేయాల్సిన అవసరం లేకుండానే పప్పు బాగా మెత్తగా అయిపోతుందండి.నేనలా చేస్తా..:)
ధన్యవాదాలు.
సుధ గారూ నేనెప్పుడు అలాగే చేస్తానండీ. పులుసులో పప్పుబద్దలు కనిపిస్తే నాకిష్టం ఉందదు. అందుకే ఉడికిన పప్పుని మిక్సీ లో ముద్ద చేసేసి అప్పుడు రసంలో పోస్తాను. మీరన్నట్టు ఆ రుచే వేరు...బలే ఉంటుంది. ఆ తరువాత కాస్త కొబ్బరికోరు, సాంబార్ పొడర్ తగిలిస్తే...ఇహ చెప్పక్కర్లేదు అమోఘంగా ఉంటుంది.
ఈసారి తృష్ణ గారు చెప్పిన సాంబార్ పొడర్ తయారుచేసి చూడాలి ఎలా ఉంటుందో!
తృష్ణ గారు.
థాంక్సండీ
మీరు చెప్పిన పొడి లో కంది పప్పు కలిపేసి ఉండడం వల్ల పప్పు తో కలిపి చెయ్యాలా అని అనుమానం వచ్చింది. మా అమ్మ లాంగ్ ట్రిప్పులు వెళ్ళేటప్పుడు పైన చెప్పిన పొడి చేసి పెట్టేసేవారు. మేము నీట్లో ముక్కలు కలిపి మరిగించుకొవడమే. రుచి మాత్రం అడక్కండి . :).
ఎం.టీ.ఆర్ వారి ఇన్స్టంట్ సాంబార్ పాకెట్ కూడా దొరికేది ఇలా. ఇప్పుడు తెలీదు మరి.
@ఆ.సౌమ్య,
@r ,
thank you..:)
@సుజాత: జవాబు మిస్సయ్యా...
అవును ఫ్రెష్ కొబ్బరి టేస్టే డిఫెరెంట్ గా ఉంటుంది. సాంబార్ పొడి చేసేప్పుడు ఎండుకొబ్బరి కలిపినా వండేప్పుడు ఫ్రెష్ కొబ్బరి ఇంట్లో ఉంటే వేస్తానండి నేను కూడా. సాంబారు పొడి, ఇంకా కూర పొడులూ అవీ ఎప్పటికప్పుడు చేసేంత ఓపిక నాకు లేదండి...:) అన్నీ నెలకోసారి చేసుకుని రెడీ టూ యూజ్ అని పెట్టేసుకుంటా...:)
ధన్యవాదాలు.
"నాకు సాంబార్ స్పెషలిస్ట్ అని పేరు కూడా ఉంది తెలుసా?"
మిరియాలు లేకుండా (నాకు మిరియాలు పడవు) చిన్న ఉల్లిపాయలు (ఇవి బోలెడు కావాలి), బంగాళా దుంప ముక్కలు, ములక్కాడలు వేసి ఘుమ ఘుమలాడే సాంబార్, దానికి తోడు ఆలూ ఫ్రై (ఇది కాంబినేషన్ కోసం చెప్పినది) చేసి పెడతానంటే చెప్పండి.
స్వాతి, నేను తక్షణం మీ ఇంటి ముందు ఉంటాం.
@శంకర్.ఎస్: పార్వతీపరమేశ్వరుల్లాగ మీరిద్దరూ వస్తానంటే వద్దంటానా చెప్పండి? ఎప్పుడొచ్చేది చెప్తే మిరియాల్లేకుండా మీకు నచ్చే సాంబారు రెడీ చేసి ఉంచుతాను. ఎప్పుడైనా రెడీ...:)
Thrushnagaru meeru cheppina vidhamgaane sambar podi chesanandi. bavundi.
thank you.