మజ్జిగపులుసును కొందరు "మజ్జిగ చారు" అనీ, కొందరు "చల్ల పులుసు" అని కూడా అంటారు. మేము "మజ్జిగ పులుసు" అంటాం. పుల్లటి పెరుగులో కానీ, తాజా పెరుగులో కానీ కాస్తంత శనగపిండి కలిపి మజ్జిగ పులుసు చేస్తారు. ఒకట్రెండు రోజుల పెరుగు కాస్త కాస్త మిగిలిపోతే, అంతా కలిపి మా ఇంట్లో అమ్మ "మజ్జిగ పులుసు" చేసేది. మరీ పులుపు మాకు ఇష్టం ఉండదు కాబట్టి కాసిని పాలు కలిపేది. మజ్జిగ మరీ పాతది కాకుండా ఉంటేనే దీని రుచి బాగుంటుంది. మా ఇంటిపక్కన కొన్నాళ్ళు గుజరాతీవాళ్ళు ఉన్నారు. వాళ్ళూ కూడా మజ్జిగపులుసు చేసేవారు. "కడీ" అంటారు వాళ్ళు. కానీ దాంట్లోనూ బెల్లం వేసేవారు. (వాళ్ళన్నింటిలోనూ, పప్పులో కూడా తీపి వేస్తారు.) మనవైపు నాకు తెలిసీ మజ్జిగపులుసులో తీపి ఎవరం వేసుకోము.
మజ్జిగపులుసులో రకాలు ఉన్నాయి :
* చిన్నఉల్లిపాయలతో(సాంబారు ఉల్లిపాయలు)
* ఆనపకాయ ముక్కలు, కేరెట్, ములక్కాడ తో
* అల్లం, ధనియాల పొడీ, కొబ్బరి పేస్ట్ తో
* పెసర ఉండలతో
* బచ్చలి ఆకుతో
* పాలకూర ఆకుతో
* ఏమీ వెయ్యకుండా ఉత్తదే.
* నేను బేబీ పొటాటోస్, ఉల్లిపాయలు వేసి కూడా చేస్తూంటాను.
* కొందరు బంగాళాదుంప బజ్జీలు, లేదా వేరే రకం బజ్జీలుగా చేసుకుని మజ్జిగపులుసులో వేస్కుంటారు.
మామూలు విధానం:
* ఒక గ్లాసు పెరుగుకి రెండు గ్లాసుల నీళ్ళు పోసి, ఉప్పు వేసి బాగా చిలుక్కోవాలి.
* శనగపిండి రెండు చెంచాలు, పావు చెంచా పసుపు ఆ చిలికిన మజ్జిగలో వేసి మళ్ళీ కాస్తంత చిలకాలి.
* ఇప్పుడీ మజ్జిగను మందపాటి గిన్నెలో లేదా మూకుడులో పోసి స్టౌ మీద పెట్టి, బాగా మరిగించాలి.
* మధ్య మధ్య కలపకపోతే అడుగంటి, మాడిపోతుంది.
* కాస్తంత కొత్తిమీర, సన్నగా పొడుగ్గా చీలికలు చేసిన ఒకటి రెండు పచ్చిమిరపకాయలు కూడా వేయాలి.
* దింపే ముందు మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కర్వేపాకు వేసి పోపు పెట్టాలి.
ఆకుకూరలు,కూరలతో:
బచ్చలి, పాలకూర మొదలైన వాటితో చేయాలంటే ముందర వాటిని సగం ఉడికించుకుని తరువాత మజ్జిగపులుసులో వెయ్యాలి. కూర ముక్కలతో చేసేది కూడా అంతే. ముందు ఉల్లిపాయ, కేరెట్, ములక్కాడ, ఆనపకాయ చిన్నచిన్న ముక్కలు చేసి, ఉడికించి తరువాత ఉడికే మజ్జిగపులుసులో వెయ్యాలి.
అల్లం, ధనియాల పొడీ, కొబ్బరి పేస్ట్ తో:
ఒక అంగుళం అల్లం ముక్క, పచ్చి ధనియాల పొడి ఒక చెంచా, రెండు చెంచాల ఫ్రెష్ కొబ్బరి కలిపి గ్రైండ్ చేసేసి అది పైన రాసిన మాములు మజ్జిగపులుసు ఉడుకుతున్నప్పుడు వేయాలి. దీని రుచి చాలా బాగుంటుంది. దీనిలో ఏ ముక్కలూ వేయకపోయినా బాగుంటుంది.
పెసర ఉండలతో:
* టీ గ్లాసులో 3/4 పెసరపప్పు ఓ గంట ముందు నానబెట్టాలి.
* పెసరపప్పు నానాకా, నీళ్ళు పూర్తిగా ఓడ్చేసి కాస్త ఉప్పు, పచ్చిమిర్చి(మీ టేస్టుకి తగినంత), కాస్త ఇంగువ కలిపి గ్రైండ్ చేసుకోవాలి. దీనినే పెసరపప్పు పచ్చడి అంటారు. వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే భలే ఉంటుంది.
* పైన రాసిన మామూలు మజ్జిగ పులుసు విధానం ప్రకారం మజ్జిగపులుసు చేసేసి, అది మరుగుతూండగా ఈ పెసరపప్పు ముద్దని ఒక గిన్నెలో తీసుకుని, కాస్త కాస్త చప్పున (పుణుకులపిండి నూనెలో వేసినట్లుగా) మరుగుతున్న పులుసులో వదలాలి. చేతి మీద వేడి పులుసు చిందకుండా జాగ్రత్త పడాలి మరి. ఈ పెసర పచ్చడి పులుసులో వెయ్యగానే ఉండలుగా ఎలా మారుతోంది? అని చిన్నప్పుడు ఆసక్తిగా ఉండేది చూట్టానికి.
* మరుగుతున్న పులుసులో ఈ పెసర ముద్దలు వెయ్యగానే గట్టిగా ఉండల్లా మారిపోతాయి. మరి కొంచెం సేపు మరగనిచ్చాకా దింపేసుకోవటమే.
నేనైతే తొందరగా ఐపోతుందని సెనగపిండి బజ్జలు వేస్తాను. చాలా రుచిగా ఉంటాయి. ఎప్పుడైనా పెరుగు కాస్త పుల్లగా ఉందంటే ఆరోజు మజ్జిగ పులుసు చేయాల్సిందే. ఈ మధ్యే కొన్ని కూరగాయలు వేసి మజ్జిగ పులుసు చేసాను.
త్రుష్ణ గారు మజ్జిగ పులుసు నా ఆల్ టైం ఫేవరెట్..వారానికి ఒకరోజు మా ఇంట్లొ తప్పనిసరిగా చేస్తారు..మీరు చెప్పిన అన్ని కాంబినేషన్స్ బాగున్నాయి..వంకాయ ముక్కలతో కూడా బాగుంటుంది..
"అయితే మా బామ్మల తరం నుండి శనగపిండి విడిగా నీళ్ళలొ కలిపి మరుగుతున్న పులుసులో కలుపుతారు.." ..గుంటూర్ వాళ్లం కదా కాస్త కారం ఎక్కువ తింటాం.అందుకని అల్లంతో పాటు పచ్చి మిర్చి కూడా కలిపి పేస్ట్ చేసి కలుపుతారు..మీ రెసీప్స్ ఎప్పటిలాగే అదిరాయి..
@జ్యోతి: మా అత్తగారు ఎప్పుడు మజ్జిగపులుసు చేసినా ఆలూ బజ్జీలు వేస్తూంటారు. ధన్యవాదాలు.
@నైమిష్: వంకాయ కూడా వేస్తారండొయ్. మీరు రాస్తే గుర్తువచ్చింది. మా అమ్మ కుడా సనగపిండి అలానే కలుపుతుంది. నేను మాత్రం ఇలా మజ్జిగతో పాటూ చిలికేస్తాను.
ధన్యవాదాలు.
త్రుష్ణ గారు వీకెండ్ వస్తుంది..మరో మంచి వంటకం మాకోసం అందిస్తారని ఎదురుచూస్తూ..
@నైమిష్: చాలా థాంక్స్ అండి. కొంచెం బిజీగా ఉన్నాను. పొద్దున్నలోపు వీలైతే ట్రై చేస్తాను. చాలా ఉన్నాయి లైనులో రాయాల్సినవి..:)
mee blog chala bagundi
@srinivas g s: thanks for the visit.
trushna garu ma maamma garu kandipappu sanagapappu pesarapappu komchem biyyam annii oka gantapina nanapetti allam pachchi mirchi koddiga jeelakarra okati rendu miriyalato meetaga rubbi a undalu vestaru maku adi chala istam avida majjiga pulusu ma intlo andariki favourite nenu ekkuvaga alage chestuntanu
@sujata:బావుందండి ఈ రెసిపీ. ఈసారి ట్రై చేస్తాను. నేను మామూలు మజ్జిగపులుసు(వితవుట్ పెసర ఉండలు) కూరముక్కలు వేసి చేసేప్పుడు చేసేప్పుడు అల్లం, ధనియాలు కలిపి గ్రైండ్ చేసి వేస్తానండి.
thank you.