skip to main | skip to sidebar

Pages

  • Home

రుచి...the temptation

"The best way to a man's heart is through his stomach."

ఆయిల్ ఫ్రీ పొంగడాలు

3:08 PM | Publish by తృష్ణ




వెయిట్ కాన్షియస్నెస్ కీ, ఆయిల్ ఫ్రీ డైట్ కీ ప్రాముఖ్యత పెరిగిపోతున్న ఈ రోజుల్లో, నూనె లేకుండా తినగలిగే స్నాక్స్ లో ఈ ఆయిల్ ఫ్రీ పొంగడాలు ఒకటి. చేసుకోవటం కూడా సులువు. ఇవి చేసుకోవటానికి షాపుల్లో ఇడ్లీ ప్లేట్ మాదిరిగా గుంటలు ఉండే నాన్స్టిక్ కడాయీ అమ్ముతారు.


వీటి తయారీకి ఫ్రెష్ గా రుబ్బుకున్న దోశ పిండిని వాడుకోవచ్చు. అప్పుడే రుబ్బిన పిండి కన్నా పిండి చివరికి వచ్చేసాకా కాస్త పుల్లబడుతుంది కదా అప్పుడు చేసుకున్నా రుచి బాగుంటుంది. దోశ పిండిలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం తురుము కలుపుకోవాలి. కేరెట్ ఇష్టముంటే తురుముకుని కూడా కలుపుకోవచ్చు. పొంగడాలను అందులోని గుంటలకు నూనె రాయవచ్చు, లేదా అస్సలు నూనె రాయకుండా కూడా చేసుకోవచ్చు. పొంగడాల ప్లేట్ లో పిండి ఇలా వేసుకోవాలి.



ఓ ఐదు నిమిషాలు మూత పెట్టి, తర్వాత పొంగడాల ప్లేట్ కొనేప్పుడు ఇచ్చే కోన్ లాంటి చెక్క గరిటెతో వాటిని రెండో వైపుకి తిప్పుకోవాలి. నాన్స్టిక్ కాబట్టి అడుగున ఆంటుకోవు. తేలికగా వెనక్కు తిరిగిపోతాయి.




మరో నాలుగైదు నిమిషాలు ఉంచాకా ఎర్రబడ్డాయి అనిపించాక స్టౌ ఆపేయాలి. ఆయిల్ ఫ్రీ పొంగడాలు రెడీ.



రెండవ రకం పొంగడాలు:

అర కప్పు సగ్గుబియ్యం,
ఒక కప్పు బియ్యం,
అర కప్పు మినపప్పు కూడా నానబెట్టి పొంగడాలకు పిండి రుబ్బుకోవచ్చు. ఈ పిండిలో కూడా పైన చెప్పినట్లు కొత్తిమీర, అల్లం, ఉల్లిపాయ,కేరెట్ అన్నీ వేసి చేసుకోవటమే.

Labels: snacks n sweets 4 comments

దబ్బకాయ ఊరగాయ

2:31 PM | Publish by తృష్ణ



దబ్బకాయ !! పేరులోనే గొప్ప ఫీల్ ఉంది కదా. మంచి పసుపు రంగులో చూడముచ్చటగా ఉంటుంది దబ్బకాయ. అందుకే మనుషుల రంగును చెప్పేప్పుడు "పచ్చగా దబ్బపండు ఛాయలో.." అని అంటూంటారు. దబ్బకాయతో పప్పు, పులిహోర, ఊరగాయ మొదలైనవి చేసుకుంటారు. అన్నీ బాగుంటాయి. జ్వరం వచ్చి తగ్గాకా ఆ చప్ప నోటికి అంత దబ్బకాయ అన్నం రుచి చూపిస్తే...లాలాజలం ఊరుతుంది. దబ్బ ఆకులు వేసవికాలం మజ్జిగలో వేసుకుని తాగితే ఆ మజ్జిగ రుచి అద్భుతం. మా కాకినాడ ఇంట్లో పనసచెట్టు తో పాటూ దబ్బచెట్టు కూడా ఉండేది. బోలెడు కాయలు కాసేది. పనసకాయలతో పాటూ దబ్బకాయలు, దబ్బ ఆకులు కూడా మాతో విజయవాడ వస్తూండేవి. చాలా మంది ముళ్ళ చెట్టు ఇంట్లో ఉండకూడదు కొట్టించెయ్యమని అనేవారు కాని మేము కొట్టించలేదు. ఎందువల్లో మేం స్కూల్లో ఉన్న రోజుల్లోనే ఆ దబ్బచెట్టు చచ్చిపోయింది..:((

సిటీల్లో దబ్బకాయలు అరుదుగా దొరుకుతాయి. ఆంధ్రాకి వచ్చాకా ఎక్కడా దొరకలేదు కానీ బొంబాయిలో ఓ షాపులో ప్రియా పచ్చళ్ళ వారి "Citron pickle"(దబ్బకాయఊరగాయ) దొరికేది మాకు. ఇప్పుడు వాటి సీజన్ అనుకుంటా క్రితం వారం మర్కెట్లో దొరికాయి. కాస్త రంగు తేలేదాకా ఆగి ఒక కాయతో పులిహోర, పప్పు చేసి, మరో కాయతో మొన్న ఊరగాయ పెట్టాను. ఇదే మొదటిసారి నేను పెట్టడం. ముక్కలింకా ఊరకపొయినా నిన్ననే వచ్చిన గెస్ట్ లకి భోజనంలో వడ్డించి బాగుందనిపించుకున్నా...:))




ఊరగాయ చేసే పధ్ధతి:

* ముందుగా ముక్కలు తరిగి ఉప్పు, కాస్త పసుపు వేసి కలిపి ఓ పూట ఎండలో పెట్టాలి. ఇలా



* తర్వాత ఒక మీడియం సైజు దబ్బకాయకు 100gms మెంతులు, 50gms ఆవాలు విడి విడిగా ఎర్రగా వేయించుకోవాలి. ఆవాలు నొక్కితే పొడి అవ్వాలి.అలా వేగాలి. అవి రెండూ కూడా చల్లారాకా విడి విడిగా మిక్సీ లో పొడి చేసి ఉంచుకోవాలి.

* తర్వాత ఒక చిన్న గ్లాసుడు (సుమారు వంద గ్రాములు) నూనె మూకుడులో పోసి పొయ్యిమీద కాగనివ్వలి. కాగిన నూనెలో పావు చెంచా ఇంగువ వేసి ఇంగువ నూనె కాగ నివ్వాలి.



* కాగిన ఇంగువ నూనెలో 125 gms ఎండు మిరపకాయ కారం వేసి నల్లబడకుండా వేగగానే స్టౌ ఆపేయాలి.


* మిక్సీ చేసుకున్న మెంతి పిండి, ఆవ పిండి, 125 gms ఉప్పు, ఒక పెద్ద చెంచా పసుపు పొయ్యి మీది కరమ్ ఉన్న మూకుడులో వేసి బాగా కలపాలి.



* ముక్కలు తరిగేప్పుడు బాగా పండిన దబ్బకాయలైతే రసం కారుతుంది. అది కూడా ఓ గిన్నెలో పోసి అట్టేపెట్టుకోవాలి. ఈ రసాన్ని ఇప్పుడు ఊరగాయ కలిపేప్పుడు అందులో పోసేయాలి.



* ఎండలో పెట్టిన దబ్బకాయ ముక్కలు (పొద్దుట ఎండలో పెట్టి సాయంత్రమో, మధ్యాన్నమో తీసేయచ్చు) పైన చేసుకున్న పిండిలో వేసి మళ్ళి స్టౌ వెలిగించి ఓ ఐదు నిమిషాలు కలుపుతు ఉంచాలి. దీన్ని మా ఇంట్లో పొక్కించటం అంటారు. (వేరే పేర్లు ఉన్నాయేమో తెలీదు).




* మరో పధ్ధతిలో ముక్కలు పొయ్యి మీద పెట్టకుండా రెండు రోజుల పాటు ఎండబెట్టి మాగాయకులాగ కూడా ఈ ఊరగాయ చేసుకోవచ్చు.



* మర్నాడు ఊరగాయలో ఊట ఎక్కువ రాకపోతే కాస్తంత నూనె పోసుకోవచ్చు. ఓ వారమైతే ముక్కలు బాగా ఊరి తినటానికి బాగుంటాయి. ఊరగాయ పెట్టిన మర్నాడు ముక్కలు రాకుండా పిండి వేసుకుని తినేయచ్చు. రుచి.... తిని చూడాల్సిందే !!

Labels: ఊరగాయలు-రకాలు 8 comments

mixed vegetable "కూటు"

1:18 PM | Publish by తృష్ణ


నాకు తెలిసీ "కూటు" అన్ని కూరలు కలిపి చేసుకోవచ్చు, లేక విడివిడిగా ఆనపకాయ, కేరెట్, గుమ్మడికాయ, కేబ్యేజ్ తో, బీట్ రూట్ తో, చౌ చౌ తో, బీన్స్ మొదలైన కూరలతో కూడా చేసుకోవచ్చు. రెండు మూడు రకాలుగా దీన్ని వండుకుంటారు.

* కొందరు శనగపప్పు, మినప్పప్పు, కొబ్బరి,ధనియాలు, మిరియాలు కలిపి వేయించి పొడి చేసి ఉడికిన కూరముక్కలు , పప్పు కలిపి చేస్తారు.

* కొందరు ఈ పొడి లోనే ఒక కొబ్బరి చిప్ప మొత్తం గ్రైండ్ చేసి పప్పు లేకుండా ఒట్టి కూరముక్కల్లో కలిపి వండుతారు.

* కొందరు కూరముక్కలు లేకుండా ఈ పొడిని ఒక్క పప్పులోనే కలిపి వండుతారు.

నేను నేర్చుకున్న mixed veg కూటు లో ingredients ఏంటంటే:

* రెండు చెంచల నూనెలో
* ఒక చెంచా శనగపప్పు
* ఒక చెంచా మినపప్పు
* మూడు నాలుగు ఎండు మిరపకాయలు
* 11/2 చెంచాల ధనియాలు
* చిన్న దాల్చిన చెక్క ముక్క
* ఒక చెంచా గసగసాలు
* (కొందరు ఒక చెంచా మిరియలు కూడా వేసుకుంటారు. నేను వెయ్యను)
* ఫ్రెష్ కొబ్బరి తురుము రెండు మూడు చెంచాలు లేదా చిన్న చిన్న కొబ్బరిముక్కలు పైన ఐటెమ్స్ తో కలిపి వేయించుకోవచ్చు.

____ పైన చెప్పిన ఐటెమ్స్ అన్నీ బాగా వేగాకా, చల్లార్చి పొడి కొట్టుకోవాలి.

* ముఖ్యమైన పాయింట్ ఏంటంటే కూటు కు ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా పొడి కొట్టుకుంటేనే రుచి బావుంటుంది.

చేసే విధానం:

* ఒక గ్లాసు కందిపప్పు (సుమారు 150gms) కాస్త పసుపు వేసి మెత్తగా ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకోవాలి.

* కేరెట్, బీన్స్, క్యేబేజ్, కాలీఫ్లవర్, చౌ చౌ, ఉంటే గుప్పెడు బఠాణీ మొదలైన కూరముక్కలు (300gms అంటే పప్పుకి డబుల్ క్వాంటిటి కూర ముక్కలు ఉండాలి ఎప్పుడూ) మరీ మెత్తగా కాకూండా ఉడికించికుని ఉంచాలి. (బంగాళా దుంప, వంకాయ కూడా కలుపుకోవచ్చు ఇష్టం ఉంటే)

* ఒక కడాయీ లో ఒక చెంచ నూనె వేసి అవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఇంగువ ,కర్వేపాకు పోపు వేయించాలి.

* వేగిన పోపులో ఉడికిన పప్పు, కూరముక్కలు, గ్రైండ్ చేసి ఉంచుకున్న మసాలా పొడి అన్నీ వేసి బాగా కలపాలి. కలిపేప్పుడు కూర ముక్కలు ముద్దగా అవ్వకుండా చూసుకోవాలి.

* ఒక ఐదు నిమిషాలు ఉంచాక స్టౌ ఆపేసి తరిగిన ఫ్రెష్ కొత్తిమీర కూటు పై చల్లి వడ్డించటమే.

* అన్నం లోకైతే మరి పల్చబడకుండా ఉంచేయాలి. చపాతిలోకో, దోశ లోకో అయితే ఉడికేప్పుడు కాస్త నీరు కలిపితే జారుగా బావుంటుంది.


Labels: కూరలు, పప్పులు 2 comments

బెంగుళూరు వంకాయ (chow chow) తో రకాలు...

2:56 PM | Publish by తృష్ణ



వంకాయతో ఏమాత్రం పోలిక లేని ఈ కూరను "బెంగుళూరు వంకాయ" అని ఎందుకు అంటారో అర్ధం కాదు...:( ఇది బెంగుళూరులో ఎక్కువగా దొరుకుతుందో ఏమో మరి. నార్త్ లో దీన్ని చౌ చౌ(chow chow) అని పిలుస్తారు. ఇంగ్లీష్ లో chayote అంటారు. చలికాలంలో ఎక్కువగా మార్కెట్లోకి వస్తాయి ఇవి. ఇక ఈ కూరతో అమ్మ "కూటు" మాత్రమే చేసేది. ఇదీ కర్ణాటక వంటకమే . చౌ చౌ మార్కెట్లో కొనేప్పుడు లేతవి చూసి కొనుక్కోవాలి. ముదిరిపోతే పీచు వచ్చేసి రుచి బాగుండదు.


ఇంట్లో బహుకొద్ది కూరలు తినేవాళ్ళతో ఈ వంటకం తినిపించటానికి నేను ఈ కూరతో కొన్ని ప్రయోగాలు చేసాను. అదృష్టం బాగుండి ఈ కూర నా కూరలమార్కెట్ లిస్ట్ లో ఏడ్ అయిపోయింది. తెలియనివాళ్ళకు ముందు ఇది ఎలా వండాలో చెప్తాను...చెక్కు తీసేసి మధ్యకు కోయాలి. అందులో మావిడికాయలోలాగ జీడి ఉంటుంది. అది తీసేయాలి. క్రింద ఫోటోలోకలాగ.
 

అలా జీడి తీసేసిన చౌ చౌ ని చిన్న చిన్న ముక్కలు చేసుకుని, ఎన్ని ముక్కలు ఉన్నాయో వాటికి సగం నీరు(ఉడికాకా వార్చాల్సిన అవసరం లేకుండా కొన్నే నీళ్ళన్నమాట) పోసి, కాస్తంత ఉప్పు వేసి ఒక్క విజిల్ వచ్చేలా కుక్కర్లో ఉడికించుకోవాలి. ముద్దయిపోతుందనిపిస్తే వీడిగా ఉడకపెట్టుకున్నా త్వరగా అయిపోతుంది. ఇలా ఉడకపెట్టుకున్న కూరముక్కలతో  నాలుగైదురకాల కూరలు వండుకోవచ్చు.


1) మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కర్వేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి ఉట్టిగా పోపు కూర వండుకోవచ్చు. ఆనపకాయ లాగ.




2) పోపు వేసాకా తురిమిన ఫ్రెష్ కొబ్బరి కూరలో వేసుకోవచ్చు. కొబ్బరి వేసే కూరల్లాగ.



3) పోపు కూర చల్లారాకా పచ్చి ఆవపొడి వేసి ఆవ కూరలా కూడా చేయవచ్చు.


4)పొపు వేసాకా దాంట్లోనే నూపొడి కారం ( నువ్వులు వేయించి, కారం కలిపి చేసిన పొడి) వేసుకోవచ్చు. ఇది పొయ్యి మీద ఉండగానే వేసుకోవచ్చు. క్రింద ఫోలోలా ఉంటుంది.
 
 
5) అన్ని కూరముక్కలతో కలిపి లేక ఒక్క చౌ చౌ తో కూటు చేసుకోవచ్చు. "కూటు" గురించి రేపు రాస్తాను.




chow chow పచ్చడి:

తరిగిన చౌ చౌ ముక్కలను కాస్త వేయించి, చింతపండు వేసి (ఆనపకాయముక్కలతో చేసినట్లుగానే) పచ్చడి చేసుకొవచ్చు.

-----------             --------------

* ముక్కలు ఉప్పు వేసి ఉడకఎట్టుకుని సలాడ్ లాగ కూడా తినవచ్చు.



ఈ బెంగుళూరు వంకాయ తినటం వల్ల ఉపయోగాలు ఇక్కడ చదవవచ్చు.

Labels: కూరలు 13 comments

పనసపొట్టు ఆవకూర

1:33 PM | Publish by తృష్ణ



మా కాకినాడ ఇంట్లో పేద్ద పనసచెట్టు ఉండేది. నిండా కాయలు, పిందెలతో చెట్టు కళకళాలాడుతూ ఉండేది. కాయ పండితే వంద తక్కువకాకుండా పనసతొనలు వచ్చేవి. అంత పెద్ద పెద్ద కాయలు కాసేది చెట్టు. విచిత్రం ఏంటంటే నాకు పనసతొనలు నచ్చేవి కాదు. వాటి వాసన కూడా గిట్టదు ఇప్పటికీ. కానీ పనసపొట్టు కూర మాత్రం తినేదాన్ని. మేం కాకినాడ నుండి విజయవాడ వచ్చేప్పుడల్లా చిన్న చిన్న కాయలు ఐదారు ఓ సంచీతో ఇచ్చేది మా నాన్నమ్మ. సామానుతో పాటూ ఈ సంచీ కూడా విజయవాడ వచ్చాకా కొందరికి మొత్తం కాయ, కొందరికి కొట్టిన పనసపొట్టూ పంచేవాళ్ళం. ఇప్పుడు బజార్లో పనసపొట్టు కొన్నప్పుడల్లా అవన్నీ గుర్తుకువస్తాయి.

చౌపాల్, రిలయన్స్, ఫ్రెష్ ఎట్ మొదలైన కూరలషాపుల్లో కొట్టిన పనసపొట్టు అమ్ముతారు. వీటిలో ఎక్కువ నిలవ ఉండటానికి ఉప్పు ఎక్కువ వేసేస్తారు కాబట్టి వండే ముందు రెండు మూడు సార్లు కడుక్కోవలసి ఉంటుంది. అలాకాకుండా బజార్లలో అరటిదూట, అరటి పూవ్వులు అమ్మేవాళ్ళు అమ్మే పనసపొట్టు ఫ్రెష్ గా ఉంటుంది. అందులో ఉప్పు ఉండదు. కానీ ఇలా అమ్మే చోట్లు చాలా అరుదుగా ఉంటుంటాయి. మొన్న అరటిదూట కొనటానికి వేళ్తే ఫ్రెష్ పనసపొట్టు దొరికింది. బాగానే కొట్టాడు. ఈ పనసపొట్టును సన్నగా కొట్టడం అనేది ఒక అద్భుతమైన కళ. కూర వండటం కూడా..:)

సరే ఇక ఆవ పెట్టిన పనసపొట్టు కూర చేసేసుకుందామా? ముందర బజార్లో కొన్న పనసపొట్టు ఒక్కసారి గబుక్కున కడిగేసుకుని వార్చేసుకోవాలి.

 
సుమారు ఓ పెద్దగ్లాసుడు పనసపొట్టుకు, నిమ్మకాయంత చింతపండు నానబెట్టుకుని రసం తీసి, ఈ పనసపొట్టు + చింతపండు రసం + బుల్లిగ్లాసుడు నీళ్ళు + తగినంత ఉప్పు + చిటికెడు పసుపు వేసి కుక్కర్లో కానీ విడిగా గిన్నెలో కానీ ఉడకపెట్టుకోవాలి.

విడిగా ఉడకపెట్టేట్లయితే కాసిన్ని నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి. కుక్కర్లో అయితే ఒక్క విజిల్ వస్తే చాలు. కొన్న పనసపొట్టులో పసుపు కలిపి అమ్ముతారు కాబట్టి ఇక పసుపు వేయక్కర్లేదు ఉడికేప్పుడు. కాయ దొరికి మనమే కొట్టుకుని వండేప్పుడు అయితే ఉడికేప్పుడు కాస్త పసుపు కూడా వేసుకోవాలి. ఉడికిన పొట్టులో నీళ్ళుంటే ఇలా వార్చేసుకోవాలి. ఉడికిన పనసపొట్టు మరీ ముద్దయిపోకుండా పొడిపొడిగా ఉండాలి.




కొంతమంది ఉడకపెట్టినతరువాత పోపు వేసేప్పుడు కూడా చింతపండు రసం వేసి కాసేపు పొయ్యిమీద మగ్గిస్తారు. అప్పుడు పోపు ఫ్రెష్నెస్ పోతుందని నేను ఉడికించేప్పుడే చింతపండు రసం వేసేస్తాను. చివరగా పోపులో వేస్తాను.


ఒక మూకుడులో మూడు చెంచాల నూనె వేసి, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, 3 ఎండుమిర్చి, 3 పచ్చి మిర్చి, కర్వేపాకు, కాస్త ఇంగువ వేసి పోపు పెట్టేసుకోవాలి. పొపులో చివరిగా 6,7 జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు వద్దనుకుంటే కాసిని వేరుశనగగుళ్ళు కూడా వేసుకోవచ్చు. వేగిన పోపులో వార్చి పెట్టి ఉంచుకున్న ఉడికిన పనసపొట్టు వేసి బాగా కలిపి రెండు నిమిషాల తరువాత ఆపేసుకోవాలి.


కూర చల్లారాకా పచ్చి ఆవపొడి ఒక ముప్పావు చెంచా(ఇది ఇది సుమారు ఓ పెద్దగ్లాసుడు పనసపొట్టుకు) అందులో వేసి బాగా కలుపుకోవాలి. నోరూరించే పనసపొట్టు కూర రెడీ !!

పనసపొట్టుకూరలోకి చిట్టొడియాలు కాంబినేషన్. (చిన్నగా పెట్టుకునే మినపఒడియాలు). కొన్నిచోట్ల ఈ ఒడియాలు వేయించి కూరలో కలిపేస్తారు కూడా.

అన్నంలోకే కాక, చపాతిల్లోకి కూడా ఈ కూర బావుంటుంది. టెస్టెడ్ & ట్రైడ్ అన్నమాట.

Labels: కూరలు 7 comments

అరటిపువ్వు పచ్చడి

11:30 AM | Publish by తృష్ణ



అరటిపువ్వులో vitamin E పుష్కలంగా ఉంటుంది. చాలా మంచిది. అరటిపువ్వు ముఫ్ఫై రోజులు వరుసగా వాడితే బ్లడ్ సుగర్ లెవెల్స్ తగ్గుతాయని క్రింద వెబ్సైట్ లో రాసాడు....వాడకం వల్ల శరీరానికి చేకూరే మరిన్ని లాభాల గురించీ ఇక్కడ చూడండి.


ఇదివరకూ అరటిపువ్వు వడలు గురించి రాసాను. ఇప్పుడు పచ్చడి చేస్కుందాo..

ముందుగా ఒక అరటిపువ్వు తీసుకుని, చేతికి కాస్త నూనె రాసుకుని(లేకపోతే వేళ్ళు నల్లగా అయిపోతాయి) ఆ పువ్వులో చివర ఉన్నవి వలుచుకోవాలి. ఆ తరువాత వాటిల్లోంచి క్రింద ఫోటోలో చూపించినవి తొలగించవలెను. లేకపోతే చేదు,వగరు కలగలిపి ఒక వింత టేస్టు వస్తుంది. అది మనం భరించలేము.





* ఆ తర్వాత వాటిని కాస్త ఉప్పు వేసి (క్రింద ఫోలోలాగ) రోటిలో కాస్తంత కచ్చాగా తొక్కుకోవాలి లేదా గ్రైండర్ లో ఒక్కసారి బర్రున తిప్పేసుకోవాలి.


* * ఆ తొక్కిన/గ్రైండ్ చేసిన పదార్ధాన్ని గట్టిగా పిండుకోవాలి. అలా చేయటం వల్ల వగరంతా పోతుందన్నమాట. పిండేసాకా క్రింద ఫోటోలోలా ఉంటుంది.


* అప్పుడొక ముద్ద రెడీ అవుతుంది. అదే మనకు కావాల్సిన పదార్ధం. ఆ ముద్దనే వడలకు, పచ్చడికీ, కూరకూ వాడతారు.



పచ్చడి విధానం:


* అర చెంచాఆవాలు, అర చెంచా మినప్పప్పు, కాస్త జీలకర్ర, కాస్త ఇంగువ,రెండు ఎండు మిరపకాయలు వేసి పోపు వేయించి పెట్టుకోవాలి.

* తర్వాత పైన చెప్పిన విధంగా పిండేసి పెట్టుకున్న ముద్దను రెండు చెంచల నూనెలో మాడకుండా 2,3mins వేయించాలి.

* వేయించిన ముద్దలో :

నానబెట్టిన (మీడియం సైజు నిమ్మకాయంత) చింతపండు,

తగినంత ఉప్పు(పైన పిండేందుడుకు కాస్త ఉప్పు వేసాం కాబట్టి తక్కువగానే వేసుకోవాలి)

రెండు పచ్చిమిర్చి, రెండు ఎండుమిర్చి (పోపుతో వేగినవి)

* పైనరాసినవన్నీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గిన్నెలోకి తీసాకా వేయించి ఉంచికున్న పోపు వేసి కలుపుకోవాలి.

* టేస్టీ టేస్టీ అరటిపువ్వు పచ్చడి రెడీ. అద్భుతమైన ఆ రుచి కోసం కొంచెం కష్టమైన విధానమే అయినా చేసేసుకోవాలి. తప్పదు మరి...:))





Labels: chutneys n పచ్చడ్స్ 3 comments
« Newer Posts Older Posts »
"Health is Wealth."

ఇక్కడ వెతకండి..

'రుచి' చూసినవారు

పంచుకున్న రుచులు

  • ►  2015 (3)
    • ►  March (3)
  • ►  2014 (24)
    • ►  December (2)
    • ►  November (2)
    • ►  September (1)
    • ►  July (2)
    • ►  June (4)
    • ►  May (3)
    • ►  April (2)
    • ►  March (7)
    • ►  January (1)
  • ►  2013 (32)
    • ►  December (3)
    • ►  September (4)
    • ►  August (2)
    • ►  July (3)
    • ►  May (1)
    • ►  April (8)
    • ►  March (3)
    • ►  February (1)
    • ►  January (7)
  • ►  2012 (26)
    • ►  December (1)
    • ►  November (3)
    • ►  October (5)
    • ►  June (4)
    • ►  May (5)
    • ►  April (1)
    • ►  March (1)
    • ►  February (4)
    • ►  January (2)
  • ▼  2011 (35)
    • ►  December (3)
    • ▼  November (6)
      • ఆయిల్ ఫ్రీ పొంగడాలు
      • దబ్బకాయ ఊరగాయ
      • mixed vegetable "కూటు"
      • బెంగుళూరు వంకాయ (chow chow) తో రకాలు...
      • పనసపొట్టు ఆవకూర
      • అరటిపువ్వు పచ్చడి
    • ►  September (3)
    • ►  August (4)
    • ►  June (2)
    • ►  May (4)
    • ►  April (6)
    • ►  March (5)
    • ►  February (2)
  • ►  2010 (14)
    • ►  December (6)
    • ►  September (4)
    • ►  August (1)
    • ►  June (3)

About

ఇవి కూడా నావే

  • తృష్ణ...
    OTT Entertainment - 3 : 8 వసంతాలు
    2 days ago
  • మనోనేత్రం
    Millet fest - 2015
    10 years ago
Powered by Blogger.

రుచులు - రకాలు

  • chutneys n పచ్చడ్స్ (19)
  • cooking tips (1)
  • experiments (10)
  • Kitchen Essentials (1)
  • pulses (3)
  • quick & easy (4)
  • recipe links (1)
  • rotis (2)
  • salads (7)
  • snacks n sweets (19)
  • soups and appetizers (2)
  • tiffins (24)
  • అట్లు - రకాలు (6)
  • ఊరగాయలు-రకాలు (12)
  • ఒడియాలు (3)
  • కూరలు (25)
  • చారులు రకాలు (1)
  • టీలు - రకాలు (1)
  • దోశలు రకాలు (7)
  • పప్పులు (4)
  • పులిహోర (4)
  • పులుసులు (2)
  • పెరుగు పచ్చడి (2)
  • మన పిండివంటలు (2)
  • రకరకాల పొడులు (2)
  • రైస్ వెరైటీస్ (6)
  • వేసవి పానీయాలు (7)

'రుచి' ఇష్టపడేవారు

Copyright (c) 2010 రుచి...the temptation. Design by Template Lite
Download Blogger Templates And Directory Submission.